ఇదివరకు పరిచయమైన పాట్రిక్ కర్రీని నిన్న మళ్ళీ కలుసుకున్నాను. చైనా వెళ్ళొచ్చానన్నాడు. ఎలా ఉందన్నాను. ‘బానే ఉంది కానీ, ఆ దేశానికి వెళ్ళడం చాలా కష్టమైన అనుభవమే’ అన్నాడు. ఆయనకి చైనాలోని జనసామాన్యం ప్రవర్తన నచ్చినట్టులేదు. వాళ్ళలోవాళ్ళు కూడా చాలా రూడ్ గా ప్రవర్తిస్తుంటారు అన్నాడు. ‘అధిక జనాభా ఉన్న నగరాల్లో, ఒత్తిడి విపరీతంగా ఉండే సామాజిక వాతావరణంలో అది సహజమే కదా’ అన్నాను. ‘అది వేరు, వీళ్ళలో సహజంగానే కొంత కఠినత్వం ఉంది’ అన్నాడు. ‘సామ్రాజ్యా’లంటే ఆయనకున్న ఏవగింపు అక్కడ మరింతగా ఫీలయ్యాడట.
‘చైనా అంటే మా భారతీయులకి కొంత భయం’ అన్నాను నవ్వుతూ. ‘మీరింకా పరవాలేదు, అంత జనాభా ఉన్నారు, ఏదోరకంగా ప్రతిఘటించగలరు. మేమేం చెయ్యగలం’ అన్నాడు ఆయన కూడా గట్టిగా నవ్వుతూ. ‘చైనాలోనే ఇబ్బంది పడితే మా భారతదేశం మాటేమిటి? చైనా వెళ్ళిందానికన్నా వెయ్యిరెట్లు శక్తీ, ఓపికా కావాలి మా దగ్గరకి రావాలంటే’ అన్నాను. అవునన్నాడు. ఆయన చైనా అనుభవాలు ఇక్కడ చూడొచ్చు.
ఇంకా జ్యోతిషం గురించీ మరికొన్ని విషయాలగురించీ కొంత ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. సమ్మోహనత్వం గురించి చాలా విస్తారమైన ఒక పుస్తకాన్ని ప్రస్తుతం వ్రాస్తూ ఉన్నాడట.
ఈ బ్లాక్ లో ఉన్న అందరూనూ అంటే, చీనా, కొరియా, జపాన్ తదితరులు స్వభావరీత్యా కఠినులు. ఇది వేల యేళ్ళుగా వాళ్ళ రక్తంలో ఇమిడిఉందని నా అనుకోలు. దానికి కారణం కన్ ఫ్యూషియనిజం కావచ్చునని నా ఊహ.
By: రవి on January 25, 2012
at 12:29 pm
రవి, కావొచ్చండీ. కన్ ఫ్యూషియనిజం గురించి నాకంతగా తెలియదు కానీ, తూర్పువాళ్ళల్లో వ్యక్తికన్నా ‘సమూహానికి’ ప్రాధాన్యత ఎక్కువ అనిపిస్తుంది. మన విషయంలో కూడా ఇప్పటికీ మనలో ‘వ్యక్తి’ కన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువ కనిపిస్తుంది. బహుశా చైనా విషయంలో సోకాల్డ్ ‘కమ్యూ/మావోయిజం’ వర్కౌటవుతూ ఉండడానికి ఇదో కారణం కావొచ్చును. నాకు పెద్దగా తెలియని విషయాలగురించి ఇంతకన్నా నేను మాట్లాడకూడదు లెండి.
By: nagamurali on January 26, 2012
at 10:37 am
మీరన్నది నిజం. వీటన్నిటికి మూలం కన్ ఫ్యూశియనిజం అనుకుంటున్నాను. మంచికో, చెడుకో, భారద్దేశం వేల యేళ్ళుగా ఆముష్మికానికిచ్చిన ప్రాధాన్యత ఐహికానికి ఇవ్వలేదు. వాదనలో తేడాలుండవచ్చు కానీ, బౌద్ధం, హిందూమతం, జైనం, సిక్ఖు మతం వీటన్నిటి మూల లక్ష్యం “ఏదో’ తెలియని విషయాన్ని అన్వేషించే ప్రయత్నంగా కనబడుతూంది.
అటు పశ్చిమంలో మాత్రం ఐహికానికి ప్రాధాన్యత.
కన్ ఫ్యూషియనిజం లో material comforts గురించి మాట్లాడకపోయినా, జీవితానికి ఏదో లక్ష్యం ఉందన్నట్టు, దానిని సాధించడానికి నియమబద్ధజీవితం అవసరమన్నట్టు, తద్వారా వచ్చే కీర్తి గొప్పదైనట్టు, ఇలాంటి మూలసూత్రాలు పేరుకున్నాయి. అవి ముదిరి సమాజప్రధాన్యత, perfectionism వగైరాలు వాళ్ళ జీవితంలో ముఖ్యస్థానం ఆక్రమించినట్టు నా అనుకోలు. కన్ఫ్యూషియనిజం, తావోయిజం గురించి, రెంటి భేదాల గురించి ఓషో చాలా గొప్పగా వివరించాడు.
By: రవి on January 27, 2012
at 1:35 pm