గత రెండు నెలలుగా రోజూ కొన్ని శ్లోకాలచొప్పున సుందరకాండ చదువుతూ ఉన్నాను. ఎన్నో విశేషాలు… అన్నీ రాయాలంటే కుదరదుగా…
—
త్రిజటా స్వప్నవృత్తాంతంలో ఎక్కువభాగం ప్రక్షిప్తమే. ఆ సర్గ తర్వాతి సర్గ సరిగ్గా అతకలేదు. బహుశా అక్కడ కొంతభాగం లుప్తమై ఉండవచ్చు.
—
సంస్కృతంలో మాట్లాడాలా మానవభాషలో మాట్లాడాలా అన్న హనుమంతుడి డైలమాకి నవ్వొచ్చింది ఓ చోట.
అహంత్వతితనుశ్చైవ వానరశ్చ విశేషతః
వాచం చోదాహరిష్యామి మానుషీమిహ సంస్కృతామ్ ||
యదివాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతామ్
రావణం మన్యమానాం మాం సీతా భీతా భవిష్యతి ||
వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణం
అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ ||
‘నేనేమో చిన్న రూపంలో ఉన్నాను. పైగా వానరుణ్ణి. చక్కగా సంస్కరించబడిన మానవభాషలో (సంస్కృతంలో) మాట్లాడతాను. కానీ, బ్రాహ్మణుడికి మల్లే సంస్కృతంలో మాట్లాడితే రావణుడనుకొని సీతమ్మ భయపడుతుంది. వానరుడేమిటి, ఈ భాష ఏమిటి అనుకోవచ్చు. కాబట్టి అర్థవంతమైన మాటలని (మామూలు) మనుషులభాషలోనే మాట్లాడాలి.’
ఇక్కడ చెప్తున్నది ‘సంస్కరించబడిన భాష’ గురించే కానీ, అది మనం ఎరిగిన సంస్కృతమో కాదో. పోనీ సంస్కృతమే అనుకుంటే, తర్వాత మాట్లాడిన ‘మనుషుల భాష’ ఏమిటో? అబ్బ, ఎవరైనా చెప్పగలిగితే ఎంత బాగుణ్ణూ??
—
ఇవాళ బాగా నచ్చిన ఓ శ్లోకం.
కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే
ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి ||
కల్యాణీ ఇయం లౌకికీ గాథా – శుభకరమైన ఈ లోకోక్తి
మే ప్రతిభాతి బత – నాకు తోస్తోంది, కద/అయ్యో!!
జీవంతమ్ నరమ్ – జీవిస్తూ ఉన్న మనిషికి
వర్షశతాదపి – వందేళ్ళకైనా
ఆనందః ఏతి – సంతోషం కలుగుతుంది.
‘ఏదో సామెత చెప్పినట్టు, బతుకుని నెట్టుకొస్తూ ఉన్న మానవుడికి ఎప్పటికో అప్పటికి, అది వందేళ్ళకైనా సరే, ఆనందం అన్నది కలగకుండా ఉండదు కదా.’ అని అంటుంది సీతాదేవి, హనుమంతుడి చల్లటి మాటలు విని.
—
కాళిదాసూ ఇలాగే అన్నాడు , ‘కస్యైకాన్తమ్ సుఖముపనతమ్, దుఃఖమేకాన్తతోవా’ అని. కేవలమూ సుఖమే గాని, కేవలమూ దుఃఖమే గాని అనుభవించింది ఎవడు? ‘నీచైర్గచ్ఛత్యుపరి చ దశా చక్రనేమి క్రమేణ’. బండి చక్రంలోని ఆకుల్లాగా మన స్థితి ఓసారి పైకీ, ఓసారి కిందికీ పోతూ ఉంటుంది.
ఎవరితో, ఎ సమయం లో ఎట్లాంటి భాషలో మాట్లాడాలో దీన్ని బట్టి వాల్మీకి తెలియజేస్తున్నాడను కోవచ్చాంటారా? నేర్చుకోవడానికి చాలా విషయాలే వున్నాయి వాల్మీకి రామాయణం లో !
కాకుంటే వాల్మీకి కాలం లోనే , సామాన్య సంస్కృతం, ‘గ్రాంధిక’ (ద్విజాతీయ) సంస్కృతం ఉండేదేమో ?
చీర్స్
జిలెబి.
By: Zilebi on December 2, 2011
at 7:02 pm
జిలేబి గారు, సంస్కృతమంటేనే సంస్కరించబడిన భాష అని అర్థం. అది కేవలం మర్యాదస్తులు ’నేర్చుకుని’ మాట్లాడే భాష. సమకాలీన సామాన్య భాషని సంస్కరిస్తే అది సంస్కృతమైంది. ఆ సామాన్య భాష ’ప్రాకృతం’. కానీ మళ్ళీ ప్రాకృతాల్లో చాలా రకాలు ఉన్నాయి.
సంస్కృతం అసలంటూ ఎప్పుడైనా ప్రజలకి మాతృభాషగా ఉండేదా అన్నది నాకొక సందేహం. శ్రీ పుల్లెల రామచంద్రుడుగారిని ఓసారి ఈ ప్రశ్న అడిగితే ఉండేదనే చెప్పవచ్చు అన్నారు.
By: nagamurali on December 3, 2011
at 2:30 am
ఒకప్పుడు తెలుగు గ్రాంథికం గుఱించి కూడా ఇదే సంశయాన్ని వెలిబుచ్చారు వ్యావహారికవాదులు. భాషలో ఏ ఒక్క మూలకాన్నీ మానవులు అనుకుని (conscious గా) కల్పించజాలరనేది దృష్టిలో ఉంచుకుంటే ఇవన్నీ ఒకప్పుడు వాడుకలో ఉన్నాయనే అనిపిస్తుంది.
సంస్కృతంలోంచే ఇన్ని ఆధునిక భాషలు ప్రభవించడాన్ని బట్టి చూస్తే అది కోట్లాదిమంది యొక్క వ్యవహారంలో ఒకప్పుడు సహస్రాబ్దుల పాటు నలిగిన భాష అని తెలుస్తూనే ఉంది. కానీ దాని Exact spoken form ఏంటో ఈనాడు మనకి తెలీదు. మనం ఊహించలేం. మనకు వాస్తవంగా అందింది ఒక క్లిష్టమైన పండిత మేధావుల శైలి మాత్రమే. వాళ్ళు దాన్ని వ్రాతలో అలా మార్చారు. ఈరోజు మనం మాట్లాడదామంటే ఆ పండితశైలి తప్ప వేఱే గత్యంతరం లేకుండా పోయింది. “ఎంత గొప్ప ప్రౌఢ పదప్రయోగానికైనా ఒకప్పటి పామరజన వాడుకే మూలం” అంటాడొక పాశ్చాత్యపండితుడు.
అయితే సంస్కృతం దేవతల భాష అనీ, అది వేలాది ఏండ్లపాటు మార్పులేకుండా ఒకేలా మాట్లాడబడిందనే సిద్ధాంతాన్ని మాత్రం నేను ససేమిరా విశ్వసించను. నా అభిప్రాయంలో ఆ భాష గత యుగప్రళయానికి ముందు (ఇప్పటి ఇంగ్లీషు మాదిరి) అంతర్జాతీయభాషగా ఉండేది. ఆనాటి కంప్యూటర్లలోనూ, ఇతరప్రసారసాధనాల్లోనూ, విమానాది ప్రయాణసాధనాల్లోనూ సంస్కృతమే వాడేవారు కావచ్చు. ఆ తరువాత అది ఇండియాలో మాత్రమే మిగిలింది. ఎందుకంటే మిగతా జనాభా మొత్తం చావగా మిగిలినవాళ్ళు వేదఋషులే. ప్రళయం తరువాత వాళ్ళ సాహిత్యం కొంత మిగిలింది. అయితే ఈ వేదఋషులనబడేవాళ్ళదఱూ ఇండియావాళ్ళు కారు. వాళ్ళల్లో కొందఱు యూరోపియన్లు కూడా ఉన్నారు. గతప్రళయానికి ముందు దీని లిపి బ్రాహ్మి గానీ దేవనాగరి గానీ కాదని నా ఊహ. ఈనాటి రోమన్ (ఇంగ్లీషు) మాదిరి అక్షరాల్ని పక్కపక్కన వ్రాసే లిపి ఏదో వాడేవారనుకుంటా.
By: తాడేపల్లి on December 4, 2011
at 5:10 am
తాడేపల్లి గారు, సవివరమైన మీ కామెంటుకి ధన్యవాదాలు.
By: nagamurali on December 5, 2011
at 6:18 am
నాగమురళిగారు,
మీరు సంస్కృతం దేవభాష అనే దృష్టితో ఆలోచించడం వల్ల మీకక్కడ భావం సరిగా అర్థం కాలేదేమో. ఇంటర్నెట్లో వాల్మీకి రామాయణ శ్లోకాల ఇంగ్లుషు అనువాదం చదివితే నాకర్థమైనది – హనుమంతుని సంశయం సంస్కృతంలో మాట్లాడాలా మానవభాషలో మాట్లాడాలా అన్నది కాదు. తాను వానరరూపంలో ఉండి మానవభాష అయిన సంస్కృతంలో (పైగా అది ద్విజుల భాష) మాట్లాడితే సీత నమ్ముతుందా? రావణుడే అనుకుంటుందేమో? కాని, చక్కని మానవభాషలో మాట్లాడితే కాని సీతకి ఓదార్పు, మనస్థైర్యం కలగదు. ఎలా?
ఇదీ హనుమంతుని డైలమా అని నాకు అర్థమయింది.
అతితనుః అన్న పదానికి చాలా చిన్న శరీరమని అక్కడ ఇంగ్లీషు అనువాదంలో ఇచ్చారు. అతి అన్నదానికి అతి చిన్న అన్న అర్థం ఎలా వస్తుంది అన్న అనుమానం ఉన్నా, ఆ అర్థమే ఉచితమనిపిస్తోంది.
By: కామేశ్వరరావు on December 6, 2011
at 1:49 pm
కామేశ్వరరావు గారు, మీరన్నది నిజమే. ఈ శ్లోకాలకి నేను అనువాదం చదవలేదు, నేను చదువుతున్న వావిళ్ళవారి పుస్తకంలో తెలుగు అనువాదం కూడా ఉన్నప్పటికీ.
. ఇక్కడ ’తను’ అంటే శరీరం అన్న అర్థం తీసుకోకూడదు, నా పొరపాటే. ’తను’ అంటే సన్నని, చిన్నని అన్న అర్థాలు ఉన్నాయి. (తన్వీ, తనుతర, తనుమధ్య మొదలైన పదాలున్నాయి కదా…) బ్లాగు పోస్టులో దీన్ని సరిచేస్తాను.
మీరు చదివిన ఇంగ్లీషు అనువాదం ఇదే అనుకుంటున్నాను: http://www.valmikiramayan.net/sundara/sarga30/sundara_30_frame.htm). ఇది మీరు చెప్పిన అర్థాన్నే ఇస్తున్నట్టనిపిస్తోంది.
కానీ వావిళ్ళవారి అనువాదంలో నేను చెప్పినట్టే ఉంది. కోతి సంస్కృతంలో మాట్లాడడం ఏమిటని ఆవిడ అనుమానపడుతుంది, కాబట్టి ’సాధారణ మనుషుల భాషలోనే’ మాట్లాడాలి, సంస్కృతంలో మాట్లాడకూడదని ఆయన అనుకున్నాడని రాశారు.
కానీ మీరన్నదీ సమంజసంగానే ఉంది. వావిళ్ళవారి అనువాదంలో చెప్పినదీ నాకు సమంజసంగానే తోస్తోంది.
నా పైత్యం జోడించి ఇంకొంచం ఆలోచిస్తే… హనుమంతుడు గొప్ప సంస్కృతపండితుడు కదా. ఆయన మొదట రాముణ్ణి కూడా బ్రాహ్మణ వేషంలో కలిసి సంస్కృతంలో మాట్లాడాడు కదా. బహుశా ఆ సందర్భంలో కూడా తన రూపానికీ, భాషకీ మధ్య తేడా వస్తుందనే బ్రాహ్మణవేషంలోకి మారాడేమో?? ఇక్కడా అదే డైలమా వచ్చి ఈసారి వేషానికి బదులు భాష మార్చుకున్నాడేమో??
నేను ’సంస్కృతామ్ వాచం’ అంటే సంస్కరించబడిన భాష (శిష్టుల/నాగరికుల భాష) అని మాత్రమే అర్థం తీసుకున్నాను. నిజానికి సంస్కృతమంటే అదే అర్థమైనా…
By: nagamurali on December 6, 2011
at 3:36 pm
అవును నేను చదివిన అనువాదం అదే. తన్వి, తనుమధ్య పదాలు గుర్తుకు రాలేదు!
విశ్వనాథవారు కల్పవృక్షంలో హనుమంతుడు సీతతో ప్రాకృతంలో (అదీ “మైథిలీ” ప్రాకృతంలో!) మాట్లాడినట్టుగా చెప్పారు:
తనర సంస్కృతమున వినిపింతునన్నను
పృథ్వితనయ సంశయింపవచ్చు
భాష సంస్కృతంబు బ్రాహ్మణభాష యీ
రాక్షసేశ్వరుండు బ్రాహ్మణుండు
చేకొని నేను చెప్పునది చెప్పగ యోగ్యతమంబు మైథిలీ
ప్రాకృతమద్ది మానవులభాష యయోధ్యకు జుట్టుపట్ల నీ
ప్రాకృతభాషయే మివుల వాడుకనున్నది దాని విన్నచో
శ్రీకమలాయతాక్షి యగు సీత మనస్సు ప్రసన్నమయ్యెడిన్
By: కామేశ్వరరావు on December 6, 2011
at 4:22 pm
కామేశ్వరరావు గారు, చాలా కృతజ్ఞతలండీ. మీ పుణ్యమాని విశ్వనాధవారి పద్యాలు కూడా తెలిశాయి. ఆయన స్వేచ్ఛగా మైథిలీ ప్రాకృతమనేశారు. గొడవే లేదు.
By: nagamurali on December 6, 2011
at 4:33 pm
ఇక్కడ మీ బ్లాగ్ లో సంస్కృతమా, మానవ భాషా అని సంవాదం జరుగుతోంది. అక్కడ శంకరాభరణం మాష్టారు బ్లాగు లో గ్రాంధికమా, వ్యావహారికమా అని సంభాషణ జరుగుతోంది.
మొత్తం మీద మన కాలం లో గ్రాంధికమా వ్యావహారికమా అన్న సంశయం వచ్చినట్టే , వారికాలం లో హనుమంతులవారికి సంసృతమా వ్యావహారికమా అన్న సందేహం వచ్చి నది ఏమో అని వాల్మీకి వారే సందేహం పడ్డారేమో !
దీనికి మరో కోణం , బొందలపాటి గారి బ్లాగు లో ఆస్తికత్వానికి , నాస్తికత్వానికి సంవాదం జరుగుతోంది. విశేషమేమిటంటే అన్నీ ఒకే కాలం లో జరగడం !
చీర్స్
జిలేబి.
By: Zilebi on December 6, 2011
at 9:03 pm