చట్టబద్ధమైన హెచ్చరిక – అవతార్ సినిమా అభిమానులు ఈ టపాని చదవనవసరం లేదు.
—
అవతార్ ఒక అద్భుతం. అందులో సందేహం లేదు.
నేను ఈ జన్మలో క్రియేటివ్ గా ఏమీ రాయలేను. అందులోనూ సందేహం లేదని అవతార్ చూశాక నాకు ధ్రువపడింది. ఎందుకంటే అంత అద్భుతమైన సినిమాలోనూ నాకు భరించలేనంత పెద్ద పెద్ద రంధ్రాలు కనిపించాయి కాబట్టి.
కానీ అంత పెద్ద స్టేట్ మెంటు అవసరం లేదు లెండి. ఎందుకంటే అవతార్ ఒక పిల్లల సినిమా. బుర్ర పెట్టి చూడ్డానికి తీసింది కాదు. ఎవరో ఈమధ్య దేనిగురించో అన్నారు, ‘అర్థం చేసుకోకూడదు, అనుభవించాలి’ అని. కానీ ఆ సంగతి సినిమా అయ్యేదాకా నాకు పూర్తిగా వెలగలేదు. ఓ అరగంట సినిమా అయ్యాకా మాత్రం కొద్దిగా తెలిసింది, ఇది బుర్ర పెట్టి చూసే సినిమా కాదులే అని. కాబట్టి ఓ పక్క సినిమాని ఎంజాయ్ చేస్తూనే మరో పక్క దాంట్లోని రంధ్రాల్ని లెక్కపెడుతూ నవ్వుకుంటూనే ఉన్నాను. ఈ సినిమాకి ఆస్కార్ ఇవ్వకపోవడం చాలా సమంజసమే అని కూడా ఆఖర్న అనిపించింది.
ఈ సినిమా గురించి కొన్ని ఆలోచనలు.
* ఇది వరకు చానల్ 4 లో అనుకుంటా ఒక డాక్యుమెంటరీ వచ్చింది. (డిస్కవరీ చానల్ వాళ్ళు తీసిన, Alien Planet, కావచ్చు బహుశా). భూమిని పోలిన కొన్ని ఇతర గ్రహాలనీ, వాటి మీద ఉండే వైవిధ్యభరితమైన భౌతిక పరిస్థితుల్నీ ఊహించి, ఆ పరిస్థితులకి అనుగుణంగా పరిణామం చెందే జీవరాసులు ఎలా ఉండచ్చు అన్న ఊహకి రూపకల్పన చేస్తారు ఆ డాక్యుమెంటరీలో. గాలిలో తేలియాడే తిమింగలాల్లాంటి జీవులు, విచిత్రమైన చెట్లూ ఇంకా అనేక వింతలతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ డాక్యుమెంటరీ. అందులో చూసిన కొన్ని భాగాలు ఇంకా గ్రాండ్ స్కేల్లో చూస్తున్నట్టనిపించింది అవతార్ చూస్తుంటే.
* అలాగే అమెజాన్ అడవుల్లో అతి పురాతనమైన తెగవాళ్ళు జీవిస్తున్నట్టు, వాళ్ళ ఫొటోలతో సహా న్యూస్ వచ్చింది కొన్నేళ్ళ క్రితం. http://www.guardian.co.uk/world/2008/may/30/brazil.conservation. అవతార్ చూస్తుంటే ఇది కూడా గుర్తొచ్చింది.
* ఈ సినిమా కథ విషయంలో మొదట ఫార్ములాకి డిసైడయ్యి, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుకున్నారని నాకు గట్టిగా అనిపించింది. మరీ రొడ్డకొట్టుడు ఫార్ములా కాదు కానీ, వెస్టర్న్ పబ్లిక్ సెంటిమెంట్లని చక్కగా వండి, వార్చి, వడ్డించిన కథ. ఇందులో స్టీరియో టైప్ కేరెక్టర్లని, ముఖ్యంగా స్టీరియోటైప్ అన్న పదానికి నిర్వచనంలా ఉన్న విలన్ గాణ్ణి చూస్తే ఒళ్ళు మండింది.
* జేమ్స్ కెమరూన్ లాంటి డైరెక్టర్లు సైన్సు ఫిక్షన్లో పుట్టి పెరిగారు, నిజమే. కాని వాళ్ళు నిజం సైన్సు పుస్తకాలు జీవితంలో ఒకటైనా చదివి ఉంటారా అని గట్టి సందేహం కలిగింది. (నేనేదో పెద్ద చదివేశానని కాదు లెండి). ఎందుకంటే నాకు బాగా కడుపులో తిప్పేసిన విషయం ఒకటుంది ఇందులో. ఒకటి కాదు, ఛా……లా…. ఉన్నాయి, మచ్చుకి ఒకటి. ఈ పండోరా గ్రహం మీద జీవులకి తోకలుంటాయి. ఆ తోకలకి USB Drives ఉంటాయి – బయొలాజికల్ డ్రైవులే లెండి. హీరోగాడు తోక విప్పి తన డ్రైవు ఓపెన్ చేస్తాడు. ముళ్ళు ముళ్ళులా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి తాను మచ్చిక చేసుకోవాల్సిన గుర్రం తోకకి ఉన్న డ్రైవుకి తగిలిస్తాడు. అంతే, ఆ పళంగా ఇద్దరికీ ఒక bond ఏర్పడిపోయి ఆ గుర్రం వీడికి మచ్చికైపోతుంది. మరి ఈ జీవులకి ఇటువంటి adaptations ఎలా ఇవాల్వ్ అయ్యాయో, ఎందుకు అయ్యాయో, వాటి survival value ఏమిటో మనకి అర్థం కాదు. గుర్రాలకీ, ఎగిరే డైనోసార్లకీ ఈ డ్రైవులు ఎందుకు ఉన్నాయిరా అంటే ఈ నావీ గాళ్ళ చేత మచ్చిక చేయించుకోడానికే అన్నమాట. అది చూశాకా Richard Dawkins రాసిన The Blind Watchmaker పుస్తకంలో డార్విన్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏడుపొచ్చింది – ‘If horses ever develop saddles, it immediately falsifies my theory of natural selection’. (ఇవే మాటలు కాదు, ఇంచుమించుగా ఇలాగే అంటాడు). ఈ వాక్యం మీకు అర్థం కాకపోతే మీరు తప్పకుండా The Blind Watchmaker పుస్తకం చదవాల్సిందే. (Jesus Loves You అన్నట్టుగా నేను Darwin Loves You, Read this book అంటున్నాను – సిగ్గు లేకుండా).
* ఈ సినిమాలో నావీ గాళ్ళందరూ నీలమేఘశ్యాములు, ఆజానుబాహులు, అరవింద దళాయతాక్షులు, పీన వక్షులు, తనుమధ్యులు – వీళ్ళ అద్రుష్టం కూలా, ఒక్కళ్ళకీ జిమ్ముకెళ్ళాల్సిన పని లేదు. బానపొట్టలు కలికానిక్కూడా కనబడవ్.
* సినిమాలో హీరో గాడూ, వాడి అవతారం – ఒకడు పడుకుంటేనే మరోడు లేస్తాడు. ఒకే ఆత్మ వాళ్ళోకీ, వీళ్ళోకీ దూరుతూ ఉంటుంది అనుకోవాలి మనం. పరకాయ ప్రవేశం అన్నమాట. హీరో గాడి మెదడులోని డేటాని అవతారం మెదడులోకి కాపీ చేశాక ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు అవుతారు కానీ ఒకడు పడుకుంటే మరోడు లేవడమేంటి? లేకపోతే అవతార్ మెదడులో హార్డ్ డిస్కు లేదా? RAM ఒకటే ఉందా? వీడు పడుకుంటే, వీడి బ్రెయిన్ సెర్వర్ లాగా అవతార్ మెదడు workstation లాగా పనిచెయ్యాలా? వీళ్ళు స్విచ్చాపేస్తే అవతార్ గాడి మెదడు పడుకుంటుందా? స్విచ్చాపేస్తే ఆగిపోవాలి కానీ పడుకోడమేంటీ? అసలీ కథ రాసినవాడికి మెదడుందా? ఒక వాక్యం రాయాలంటేనే ఎవడేమనుకుంటాడో అని మథనపడిపోతాం కదా (నేను), మరి ఇంత ఘోరమైన తప్పులు సినిమాలుగా తీసేస్తే జనాలు నవ్వుకుంటారని వాళ్ళకి అనిపించదేమో!! అందుకే అనుకుంటాను నాలాంటి వాళ్ళు ఎప్పటికీ క్రియేటివ్ రైటర్సు కాలేరని.
* సినిమాలో కెల్లా చెత్తాతి చెత్త – క్లైమాక్సు. ఎకనామిక్సు గురించి గానీ, మిలటరీ గురించి గానీ, పోలిటిక్సు గురించి గానీ, అసలు బేసిగ్గా మనుషులు, మనుషుల్లాంటివాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో కొద్దిపాటి అయిడియా కూడా లేని పసివాళ్ళు మాత్రమే ఎంజాయ్ చెయ్యగల క్లైమాక్సు. Of course, technically it is a marvel.
* ఇంక మిగతా సినిమా అంతా ‘New Age Crap’. క్షమించాలి, నేను మామూలుగా ఇంత సినికల్ గా ఉండను. కానీ అద్భుతమైన సినిమా చూసిన అనుభూతి ఒకవైపు, వెర్రి మొర్రి కథని జీర్ణం చేసుకోలేని అసమర్థత ఒకవైపు. ఏం చెయ్యను. కొన్నాళ్ళు దొండకాయలు గట్టిగా తినాలి కాబోలు – భారవి లాగా. కథ మీకు తెలియకపోతే నాకు ఇంకో టపాకి సరుకు దొరికినట్టే.
అవతారం బ్రహ్మాండం అని అనలేదు మీరు.. ఎందుకైనా మంచిది మీ జాగర్తలో మీరుండండి! తక్కువలో తక్కువగా మీకు సినిమా ఎలా చూడాలో తెలీదని చెప్పేస్తారు. సర్లెండి ఈ అవతారం గొడవ ఎలాగన్నా ఉండనీండి.. నేను మాత్రం మీ దొండకాయల కథ కోసం ఎదురు చూస్తాను.
మీ గత టపాలో మన బ్లాగు మన అవతారం అన్నట్టుగా రాసారు కదా -బాగుంది.
By: చదువరి on March 28, 2010
at 2:17 pm
దొండకాయల కథ నాకు తెలియదు మీరే చెప్పాలి।
ఇలాంటి సినిమాలు వ్రాయడానికే కాదు చూడడానికి కూడా క్రియేటివిటీ వుండాలి।
వీడు పడుకోవడం వాడు లేవడం గుఱించి నేను ఎలా క్రియేటివ్ గా సర్ది చెప్పుకున్నానంటే, వీడి బుఱ్ఱలో తయారైన వైరు లెస్సు సిగ్నలు వీళ్ళ సర్వర్ నుండి ఆకాశంలోని ఉపగ్రహాలకు మళ్ళి, అక్కడి నుండి అవతారానికి అందుతాయని। అంటే పాండోరా మొత్తం వీళ్లు పాండోరానెట్ తో ఆకళించివున్నారు।
- నేను వవతరంగంలో వ్రాసినట్టు ఇది ముమ్మాటికీ పీలుగుడ్డు సినిమానే। నిజ్జంగా మన మానవులకే అలాంటి ఘనులు దొరికితే, ఊరుకుంటామా। అదీ ఆటవీకులు వున్నప్రాంతంలో। మనమైతే సింపుల్గా ఆ పాండోరాలో నాలుగు అణుబాంబులు పాడేస్తాము, అవి పేలి, ఎంచక్కా ఘనిజాలన్నీ అంతరాళంలో తేలుతుంటే, పోగుఁజేసుకుని వస్తాము।
By: రాకేశ్వర రావు on March 29, 2010
at 4:43 am
అన్నట్టు సైన్సు ఫిక్షను – అటు సైన్సూ కానిది ఇటు ఫిక్షనూ కానిది – ఒక పెద్ద కొజ్జాక్రియేటివిటీలాంటిది। ఈ పోలిక చేసినందుకు కొజ్జాలకు నేను క్షంతవ్యుడనైవున్నాను। ఇది వ్రాయడానికి క్రియేటివిటీ కాదు, పూర్తిగా సిగ్గూనిజాయితీలేనిదనం కావాలి।
By: రాకేశ్వర రావు on March 29, 2010
at 4:46 am
చదువరి గారూ, నెనర్లు. దొండకాయల కథ బాగా చిన్నది. దానికి కొంచం చిలవలు పలవలు చేర్చి రాయడానికి ప్రయత్నిస్తాను.
రాకేశ్వరా, మీ కామెంటుకి భలే నవ్వొచ్చింది. సైన్సు ఫిక్షన్ లో కొంచం సైన్సునీ, ఫిక్షన్ నీ జాగర్తగా బాలన్స్ చేసి రాస్తే బానే ఉంటుంది. ఎటొచ్చీ ఫిక్షన్ సైన్సుని మింగేస్తే దానికి అర్థం లేకుండా పోతుంది. అంతకంటే మాయమంత్రాల ఫిక్షనే బెటరు.
By: nagamurali on March 29, 2010
at 8:50 am
హమ్మయ్య. ఈ సినిమాను విమర్శించేవాళ్ళు ఒకరు దొరికారు. జేమ్స్ కామెరూన్ తనకున్న పేరును కాస్త leverage తీసుకున్నాడని నాకనిపించింది, ఈ సినిమా చూసిన తర్వాత.
ఒకచోట పడుకుని మరొకడు లేవడం విచిత్రంగా అనిపించింది. వాడి మెదడును ప్రాసెస్ చేస్తారు, బానే ఉంది. వాడి శరీర ధర్మాలు, స్నానం, శంకలు ఎలా తీర్చుకుంటాడు?
By: రవి on March 29, 2010
at 2:34 pm
ఇదేం కోయిన్సిడెన్సు!!! మొన్న రవితో పాటు “ఏం మాయ చేసావె” చూశాను. నిన్న మీతో అవతార్ చూశాను! నేనూ మీలాగే ఒక్కణ్ణే వెళ్ళాను కూడా
అయినా మా ఆవిడ పెద్ద పట్టించుకోదు కాబట్టి (సినిమాల గురించి, నా గురించి కాదు
ధైర్యంగా వెళ్ళినట్టు చెప్పేసాను.
మీరు సినిమాలు గురించి ఇంతలా ఆలోచిస్తూ చూస్తారా! అయినా అవతార్ సైన్సు ఫిక్షన్ మూవీ అని ఎందుకనుకోవాలి. మన జానపద చిత్రాల్లా ఏదో ఫేంటసీ సినిమా అనుకుంటే పోలా!
By: కామేశ్వర రావు on March 29, 2010
at 3:09 pm
రవిగారూ, ఆ ఇప్పుడు గుర్తొచ్చింది. మీరూ అవతార్ గురించి రాశారు కదూ. అప్పుడు బ్లాగులో చదివాను. కానీ సినిమా చూడకుండా కామెంటడం ఎందుకని ఊరుకున్నాను. ఇప్పుడే ఆ టపాలో కామెంట్లు మళ్ళీ చూశాను. మీరు సినిమా పేద్ద గొప్పగా లేదంటే చాలామందే బాధపడ్డట్టున్నారు.
By: nagamurali on March 29, 2010
at 3:10 pm
కామేశ్వరరావు గారూ, భలే ఉందండీ కోయిన్సిడెన్సు!
అవతార్ సైన్సు ఫిక్షన్ మూవీ కాదనడం కష్టం. అందులో హీరో మంత్రాలు చదివి పరకాయప్రవేశం చేసుంటే నేను నిజంగానే మెచ్చుకుని ఆనందించి ఉండేవాణ్ణి. ఇలా వంకలు పెట్టేవాణ్ణి కాదు.
సినిమా చూస్తుంటే నా బుర్ర భయంకరంగా పనిచేస్తుంది – అందులో ఏదో విధంగా ఇన్ వాల్వ్ అవుదామని. Logic అక్కరలేదు కానీ, ఒక consistency and feel లేకపోతే మాత్రం నాకు చాలా కష్టం. Inglorious Basterds లో లాజిక్కు ఏమీ ఉండదు. నిజానికది totally absurd story. కానీ నాకు ఎంత భీభత్సంగా నచ్చిందంటే ‘సినిమా’ అన్న అనుభూతి నాకు పరిపూర్ణంగా దక్కింది అందులో.
(‘తా వలచింది రంభ’ అని ఊరికే అన్నారా??
)
By: nagamurali on March 29, 2010
at 3:22 pm
కామెంటిన తర్వాత కూడా మీ అనుమానాల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను.
హీరో అవతారంలోకి పరకాయ ప్రవేశం గురించి. బహుశా నాకనిపించిందేమిటంటే, ఆ అవతారం ఒక రోబోట్ మాత్రమే, బయలాజికల్ రోబోట్ అనుకోవచ్చేమో. ఉన్నది ఒకటే మెదడు, RAM, హర్డ్ డిస్కు అన్నీ, హీరో గారి మెదడే. రాకేశ్వరగారు అన్నట్టు, ఈ మెదడు ద్వారా పంపే సిగ్నల్సు ఆధారంగా ఆ అవతారం కదిలేది.
ఇక తోకల గురించి. వాటి survival value గురించి సినిమాలో చూపించడం మరీ అంతవసరమంటారా? నాకు సినిమా చూస్తున్నప్పుడే వచ్చిన ఆలోచన, They might be the organs of their mating!
By: కామేశ్వర రావు on March 29, 2010
at 4:43 pm
ఐతే మీరు కూడా అవతార్ చూసి అనుభవించారన్న మాట
చిన్న సవరణ ఏమిటంటే కనెక్టివిటీ కోసం నావీలు (ఇంకా నయం మరైనర్లు కాదు!) ఉపయోగించేది జడ, తోక కాదు. ఇది తోకల్ని మరీ అనవసరం చేసేసింది.
మీ పబ్లిక్ కన్ఫెషన్ ఐడియా బాగుంది
By: చంద్ర మోహన్ on March 29, 2010
at 5:03 pm
కామేశ్వర రావు గారూ,
మీకొచ్చిన అయిడియాలు నాకూ వచ్చాయి. కానీ అప్పుడు మరీ దారుణం అయిపోతుంది కదా. అంటే హీరో గారి అవతారం కాస్తా టెర్మినేటర్ అయి కూచుంటుంది. హీరోయిన్ కాస్తా రోబోతో మేటింగ్ చేసినట్టవుతుంది. (రోబో శరీరంతోటే అనుకోండి, మనసు హీరో గారిది కదా!!) అంతకన్నా దారుణం ఏంటంటే సినిమా ఆఖర్న పండోరా గ్రహ-మాత (చెట్టు) ప్రభావం వల్ల హీరోగారి శరీరంలోంచి ఆత్మ కాస్తా శాశ్వతంగా అవతారంలోకి ప్రవేశించేసింది కదా – అదెల్లా కుదుర్తుంది సిగ్నల్సు లేకుండా??
ఇంక తోకలే మేటింగ్ ఆర్గాన్లు అనుకుంటే – రామ, రామ – గుర్రాలతోనూ, డైనోసార్లతోనూ బాండింగ్ కదండీ. మళ్ళీ హీరోయిన్ తో కూడా మేటింగ్ అయినట్టు చూపించాడు. అప్పుడు అంతకన్నా భయంకరమైన కామెడీ మరోటి ఉండదు.
By: nagamurali on March 29, 2010
at 5:05 pm
చంద్రమోహన్ గారూ,
అవునండోయ్, సినిమా చూసినప్పుడు నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయింది, అది జడా, తోకా అని. జడైతే ఏంటి, తోకైతే ఏంటి, నేను దానికి పెట్టిన పేరు మాత్రం USB Drive.
By: nagamurali on March 29, 2010
at 5:10 pm
మీకు సినిమా చూడ్డం తెలీదు
సినిమాని సినిమాలా చూడాలి గానీ ఏదన్నా హార్వర్డు సైన్సు విడియోలా చూస్తారేంటీ?
ఈ ఘోర తప్పిదానికి వరస్సగా ఐదు కొత్త తెలుగు సినిమాలు చూడాలని పాపపరిహారం విధిస్తున్నాను!
By: కొత్తపాళీ on March 29, 2010
at 6:16 pm
కొత్తపాళీ గారూ, తప్పదంటారా? దొండకాయలు మాత్రం తింటే చాలదా? తెలుగు సినిమాలు చూడాల్సిందేనా? పోనీ ఆ అయిదు సినిమాల్లో బాలయ్య బాబు సినిమాలు లేకుండా చూసుకోవచ్చంటారా?
By: nagamurali on March 29, 2010
at 6:23 pm
ఏమి ఏమేమి మన బాలయ్య బాబు సినిమా చూడకుండా తప్పించుకోజుస్తారా. అసలు జన్మ జన్మల పాపానికి శిక్ష అంటే అదే కదా. కానివ్వండి దీని నుంచి మినహాయింపు లేదు.
మీ బ్లాగ్ బాగుంది.
By: శ్రీవాసుకి on April 3, 2010
at 12:14 pm