Posted by: nagamurali | November 14, 2009

పునః స్వాగతం

“మా వియ్యంకుడు ఎంత గొప్పవాడు! ఎంత మంచి మనసు ఆయనది! ఎంత స్నేహంగా ఉండేవాడు! సంతోషమే మూర్తీభవించినట్టుగా ఉండేవాడు కాదూ! మా జీవితఫలం ఆయన. నా శరీరమూ, జీవమూ ఈ రెంటికన్నా నాకు ఆయనే ప్రియతముడు. ఆ మహారాజు, ఆ శ్రీమంతుడు, ఆయనే మాకు అన్నీ కదా.”

“మా వియ్యపురాలికీ, వియ్యంకుడికీ మధ్యన ఏదైనా ఒక వ్యవహారం రహస్యంగా నడిచిందంటే వాళ్ళిద్దరూ మళ్ళీ వేరు వేరుగా నన్నే పిలిచి చెప్పుకునేవారు కదా. వాళ్ళిద్దరికీ ఒకళ్ళమీద ఒకళ్ళకి కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా నేనే సంధానం నడపాల్సొచ్చేది కదా. అయ్యో, ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే హృదయం దహించుకుపోతూంది”.

స సంబంధీ శ్లాఘ్యః ప్రియసుహృదసౌ తచ్చ హృదయం
స చానన్దః సాక్షాదపి చ నిఖిలం జీవితఫలం
శరీరం జీవో వా యదధికమతో2న్యత్ ప్రియతరం
మహారాజః శ్రీమాన్ కిమపి మమ నాసీత్ దశరథః ||

యదస్యాః పత్యుర్వా రహసి పరమన్త్రాయితమభూత్
అభూవం దంపత్యోః పృథగహముపాలమ్భ విషయః
ప్రసాదే కోపే వా తదను మదధీనో విధిరభూత్
అలం వా తత్స్మృత్వా దహతి యదవస్కన్ద్య హృదయమ్ ||

గత రెణ్ణెల్లుగా బ్లాగు మీద శీతకన్నేసేసా. ఖాళీ లేకపోవడమే మఖ్య కారణం. ఇవాళ కొంచం తీరిక చిక్కితే మళ్ళీ ఏదన్నా చెయ్యి చేసుకుందాం అనిపించింది. ఎదురుగుండా ఉత్తరామ చరిత్రమ్ పుస్తకం కనిపిస్తే తెరిచి చూశాను. జనకమహారాజు తన గోడు వెళ్ళబోసుకుంటూ కనిపించాడు. ఉత్తరరామచరిత్రంలో చాలా ఘట్టాలు ఎంతో నోస్టాల్జిక్ గా ఉంటాయి. రామాయణ పాత్రలు మనతో ఆత్మీయంగా సంభాషిస్తూ ఉంటాయి. జనకుడు, కౌసల్యా, అరుంధతీ వాల్మీకి ఆశ్రమంలో కలుసుకుంటారు. “మూర్తీభవించిన మహోత్సవం” లాగా ఉండే ఒకప్పటి కౌసల్యాదేవి ప్రస్తుతస్థితి చూసి బాధపడుతూ జనకుడు అంటున్న మాటలివి.


Responses

  1. కదా! పౌరాణికులకీ నాస్టాల్జియా తప్పలేదన్న మాట. మీరప్పుడప్పుడూ ఇలా తీరిక చేసుకుంటూ ఉండడం చాలా అవసరం. లేకపోతే మేమూ నాస్టాల్జియాలోకి వెళ్ళిపోతాం! :)

  2. కొత్తపాళీ గారూ, నెనర్లు. తప్పకుండా తీరిక చేసుకుని రాస్తూ ఉంటాను. ఇప్పుడు అందుబాటులో చాలా పుస్తకాలే ఉన్నాయి. బోల్డంత మేతా, నెమరు వేసుకోడానికీ బ్లాగు. ఇంకేం కావాలి చెప్పండి!

  3. నెమరు వేయండి మరి :)

  4. మీ పునరాగమనానికి స్వాగతం!

    జనకుడి హృదయవేదన ప్రతిఫలించిన శ్లోకం గురించి బాగా రాశారు.

    నాగ మురళి గారూ, ఇది మూడోసారండీ, కామెంట్ రాయటానికి ప్రయత్నించడం…. ఈ పోస్టుకి! మీకు నా వ్యాఖ్య ఎందుకు చేరటం లేదూ? అన్నట్టు మీ ఈ మెయిల్ ఏమిటో కాస్త చెప్పండీ.

  5. ఉత్తర రామచరితం, రూపకం కావడం కూడా ఈ నోస్టాల్జియాకు ఒకింత కారణమా అని నాకొక చిన్న అనుమానం. రూపకాలన్నీ దృశ్య, శ్రవ్య ప్రధానాలు కాబట్టి, శ్లోకాల అల్లికలో అలంకార, భావ సౌందర్యాలతో బాటు, దృశ్య ప్రాధాన్యతను కూడా కవి విపులీకరించాలి. ఆ ప్రయత్నంలో కాస్త అదనపు హంగులు కూర్చడం కద్దు. ఇక్కడ వినిపించే నోస్టాల్జియా అలాంటిదే కావచ్చునని నా ఊహ.

    ఉదాహరణకు, ఇదే కావ్యమయి ఉంటే, ఈ సన్నివేశంలో వాల్మీకి ఆశ్రమాన్ని, జనకుడు, కౌసల్యల ఆంగికాన్ని, కౌసల్య వేదనను, జనకుని మనసులో వెలితిని, విపులంగా వివరించి ఉండే అవకాశం ఉందని నా ఊహ. ఇది రూపకం అవడంతో, వారందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నట్టూ, ఆ మాటలప్రసక్తిలో జనక మహారాజు తన ఆత్మీయతను ఈ శ్లోకం ద్వారా వెల్లడించినట్టూ కవి సృష్టి జరిగిందన్నట్టు నా భావన.

  6. రవి గారూ, మీ కామెంటుకి గొప్ప ఆనందం కలిగింది. మీరన్నది సమంజసమే అనిపిస్తోంది. నావీ కొన్ని ఆలోచనలు.

    పద్య కావ్యాల్లో కూడా చాలా ఆత్మీయమైన సంభాషణలు రాయవచ్చు గానీ, వాటిల్లో చిన్న,చిన్న సంభాషణలు సాధ్యం కావు. పొడుగాటి సంభాషణలే రాయాలి. వాటిలో మళ్ళీ మంచి అలంకారాలు పడాలి. రామానందసాగర్ సీరియల్సులో లాగా ఒకడు మాట్లాడుతూనే ఉండాలి, మరోడు వింటూనే ఉండాలి. అందుకే (నేను చదివిన) కావ్యాల్లో చాలామటుకు ఒక సర్గలో రెండు సంభాషణలే ఉంటాయి. ఒక పాత్ర సగం సర్గ వరకూ ఏకధాటిగా మాట్లాడేస్తే, రెండో పాత్ర మిగతా సగం అంతా సమాధానం చెప్తూ పోతుంది. అవి కూడా ఎంతో గొప్పగా రాయొచ్చనుకోండి. మాఘం మొదటి సర్గలో నారదుడు శ్రీ కృష్ణుడి సభకి వచ్చినప్పుడు శ్రీ కృష్ణుడు పడిన ఆనందం, ఆయన నారదుణ్ణి సంభావించిన తీరూ, మాట్లాడిన మాటలూ నేనెప్పటికీ మర్చిపోలేను.

    నాటకంలో మాత్రమే చిన్న, చిన్న సంభాషణలూ, అచ్చమైన వ్యావహారికంలోని సొగసులూ సాధ్యమౌతాయి. ఎక్కువ పాత్రలు ఒకే సన్నివేశంలో పాలు పంచుకోగలుగుతాయి. పద్య కావ్యంలో కథ మరీ సీక్వెన్షియల్ గా, ఏకసూత్రంగా ఉండాలి. నాటకంలో అయితే మంచి వైవిధ్యంతో కథని అల్లిక చెయ్యవచ్చు.

    నా అభిప్రాయం ప్రకారం ’ఉత్తర రామ చరిత్రం’ – ఒక రామాయణ పిపాసి, రామాయణాన్ని ఒక కొత్త సంవిధానంలో ఆస్వాదించడం కోసం కూర్చినది. అందులోని చాలా ఘట్టాల్లో రామాయణ పాత్రలే రామాయణ ఘట్టాల్ని నెమరు వేసుకుంటూ అనుభూతి పొందడం కనిపిస్తుంది.

    అది ఎలాగంటే ఒక సినిమా హిట్టయ్యాకా ఆ సినిమావాళ్ళని ఇంటర్వ్యూ చేసే ప్రోగ్రాంసు ఈ రోజుల్లో టీవీల్లో చాలా ఎక్కువ కదా. ఆ ప్రోగ్రామ్సులో మనం ఆ సినిమాలోని కొన్ని మంచి ఘట్టాలు చూసుకుంటూ, ఆ దర్శకుడూ, నటుల అంతరంగాన్ని తెలుసుకుంటూ పొందే అనుభూతి లాంటిది, ఈ ఉత్తర రామాయణం చదవడం. రామాయణాన్ని మొదట బాగా ఆస్వాదించినవాళ్ళే దాన్ని బాగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు.


Leave a response

Your response:

Categories