Posted by: nagamurali | August 5, 2009

ద్వితీయ విఘ్నం

ఓ శుక్రవారం సాయంత్రం మా ఇంట్లో సంభాషణ.

“ఈ వారం (వారం అంటే మా దృష్టిలో వీకెండే) ఫలానా వాళ్ళింటికెళ్దామా?”

“గత వారం ఆ పని మొదలెట్టాను కదా. ఈ వారం మళ్ళీ బ్రేకొచ్చెయ్యదూ. ద్వితీయ విఘ్నం కూడాను. (మా ఊళ్ళో చిన్నప్పుడు ఒక పని మొదలెట్టాకా రెండో రోజు ఆపెయ్యకూడదు, ద్వితీయ విఘ్నం, అనేవారు. అందుకే శనివారాలు బళ్ళో వెయ్యడం, కొత్త పని మొదలెట్టడంలాంటివి చేసేవారు కాదు.)”

“అలాగా, పోనీ పైవారం వెళ్దామా?”

“అప్పుడు తృతీయ విఘ్నం వస్తుంది. అది కూడా కుదరదు”

“మరి ఆ పై వారం?”

“చతుర్థ విఘ్నం”

“తర్వాత?”

“పంచమ విఘ్నం”

అలా సంభాషణ సాగి, సాగి, పంచదశ(15), షోడశ(16), సప్తదశ(17), అష్టాదశ(18), ఏకోనవింశతి(19), వింశతి(20), దాకా సాగింది. ఇంకక్కణ్ణించీ రేండమ్ గా అంకెలు మొదలయ్యాయి.

“పోనీ ఇప్పటి నుంచీ ముప్ఫై మూడో వారం?”

“అప్పుడు త్రయోత్రింశత్తమ విఘ్నం వస్తుంది”

“నలభై నాలుగు?”

“చతుశ్చత్వారింశత్తమ విఘ్నం”

“యాభై ఏడు?”

“సప్తపంచాశత్తమ విఘ్నం”

“డెబ్భై ఎనిమిది?”

“అష్టసప్తతితమ విఘ్నం”

“తొంభై నాలుగు?”

“చతుర్నవతితమ విఘ్నం”

“రెండొందల యాభై ఆరు?”

“షట్ పంచాశదధిక ద్విశతతమ విఘ్నం”

అక్కడికి ఇంక అవతలి పార్టీకి ఓపిక నశించింది. ప్రయుతాలూ, అర్బుదాల దాకా వెళ్లడానికి నేను సిద్ధమైపోయాను.

“నీ బోడి పాండిత్యం నా దగ్గర ప్రదర్శించే బదులు వాళ్ళింటికి రావడం ఇష్టం లేదని చెప్పొచ్చుగా?”

“ఇంతసేపూ పరీక్షించి ఇప్పుడు బోడి పాండిత్యం అంటావా?” అని ముక్తాయించాను నేనూను.


Responses

  1. చతుశ్చత్వారిగంశచ్చమే .. అష్టాచత్వారిగంశచ్చమే .. వాజస్చ ప్రసవచాపిజశ్చ .. etc. :)

  2. మొత్తానికి మీ సంబాషణ వల్ల రెండు విషయాలు తెలిసాయి.
    ఒకటి, సంస్కృతంలో సంఖ్యలని వెనకనుంచి (కుడినుంచి ఎడమకి) చెప్తారు.
    రెండు, మీ శ్రీమతిగారికి సహనం ఎక్కువ :-)

  3. :) ఐయామ్ టూ ఇంటెలిజెంట్ యూ నో….. మీకు వెళ్లడం ఇష్టలేదన్న సంగతి నేను మూడో వారానికే కనిపెట్టేశాను మరి!

  4. కొత్తపాళీ గారూ, నెనర్లు.
    కామేశ్వరరావు గారూ, అవునండీ. మీరు గమనించిన రెండు విషయాలూ కరక్టే.

    అరుణ గారూ, :-D .

  5. మురళీ బాగుంది. :-) .

    పరీక్షించేటప్పుడు కొత్తగా, వింత గా ఉంటుందేమో అని ఊహించి ఉండచ్చు. కానీ ఇంత తేలిగ్గా అంకెల్ని తిరగేసి (ఆపై కలిపేసి) చెప్పేస్తూంటే, ఇంక అందులో మజా అనిపించక నీ పాండిత్యాన్ని అలా అనేసి ఉండచ్చు.

    అందుకే సులువు గా చెప్పేయటం కాక, నాలా ఏం చెప్పినా క్లిష్టం గా, కాంప్లికేటెడ్ గా చెప్పెయ్యాలి. దెబ్బకి మళ్ళీ ఇంకొక కామెంటరు. ఒకవేళ ధైర్యం చేసి కామెంటినా.. మళ్ళీ ఇంకొక భాష్యం ఇస్తే సరి. దెబ్బకి రామలింగడి పిల్లి పరిస్థితే…(సరదాగా)

  6. సనత్, :-) . ఇంక అలాగే చెయ్యాలి.
    నన్ను కొన్ని కొన్ని ప్రశ్నలు అడగడం మా శ్రీమతి ఎప్పుడో మానేసింది, లాజిక్కులూ, ఉపన్యాసాలూ భరించలేక.

    పాపం, మనల్ని భరించేవాళ్ళ కన్నా తెనాలి రామలింగడి పిల్లే నయమేమో. దానికైతే పారిపోడానికైనా అవకాశం ఉంది. :-D

  7. నాగమురళి గారు,

    భలేవుంది మీ టెక్నిక్. ఐతే అందరికీ వర్కవుట్ అయ్యే అవకాశం లేదు. సంస్కృతంలో నాకు నచ్చనిది ఇదే. అంకెలు చెప్పడం ఇంత క్లిష్టంగా ఉంటే ఎలా! అంకెల విషయంలో మన ద్రవిడ భాషలు, ఇంగ్లీషు కొంత శాస్త్రీయంగా ఉన్నట్లు కనబడుతుంది. హిందీలో ఐతే వంద వరకూ ఒక్కో అంకెనూ విడిగా గుర్తుపెట్టుకోవలసిందే!

  8. “అందుకే సులువు గా చెప్పేయటం కాక, నాలా ఏం చెప్పినా క్లిష్టం గా, కాంప్లికేటెడ్ గా చెప్పెయ్యాలి. ”

    అలా చెప్పడంతో బాటు, అవతలి వారి వాదనలో కూడా బలం ఉందన్నట్లు పిక్చర్ ఇవ్వాలి. వాదనలో ఓడిపోతున్నాము అన్నప్పుడు భార్యా రత్నాలకు పాశుపతాస్త్రం లాంటి “కన్నీరు” గుర్తొచ్చేస్తుంది. దాన్ని ఎదుర్కోవడం మనవల్ల కాదు.

    అయినా ఇవన్నీ మందు కొట్టి భార్యకు తెలిసినప్పుడు, భార్యకు తెలీకుండా సినిమాలవీ చూసొచ్చినప్పుడు … ఇలాంటి సందర్భాల్లో పనికొస్తాయి లెండి.

  9. చంద్రమోహన్, మరి అందుకే కదండీ సంస్కృతం క్లిష్టమైన భాష అనేది. కనీసం అంకెలు చెప్పడంలో ఓ స్థిరమైన లాజిక్కు ఉంది. అది పట్టుకుంటే జాగ్రత్తగా ప్రతీ పెద్ద అంకెనీ compile చేసుకుంటూ చెప్పెయ్యొచ్చు. (మళ్ళీ అందులో సంధుల గురించి చూసుకోవాలి కూడాను.)

    నాకు అన్నిటికన్నా కష్టమైనవి ధాతువులు (క్రియలు). శబ్దాలు, సంధులు, సమాసాలు బానే మేనేజ్ చేస్తాను. ధాతువులు బాగా పట్టుబళ్ళేదు. అలాగే సంస్కృతంలో శబ్దాలకి స్త్రీ,పుం,నపుంసక లింగాలు గుర్తించడం కూడా తేలికేమీ కాదు. ’నామ లింగానుశాసనం’ మొత్తం బట్టీకొట్టాల్సిందే అనుకుంటా. :-(

    సంస్కృతం కన్నా క్లిష్టమైన భాషలు చాలా తక్కువేమో అనుకున్నాను. ఓ ఆఫ్రికన్ భాష గురించి The language instinct పుస్తకంలో చదివితే కళ్ళు తిరిగాయి. (అది ఆ తెగలో ప్రజలు ఇప్పటికీ మాట్లాడే భాష. సంస్కృతం ప్రస్తుతానికి క్లాసికల్ లాంగ్వేజ్ మాత్రమే కదా.) దానితో పోలిస్తే సంస్కృతం చాలా తేలిగ్గా అనిపించింది.

    రవి, బాగా చెప్పారు. :-D

  10. చంద్రమోహన్, హిందీ నేను విశారద పాసయినా ఇప్పటికీ నాకు అంకెలు చెప్పడం చేతకాదు. విశారద మౌఖిక పరిక్షలో నా హాల్ టికెట్ నెంబరు హిందీలో చెప్పమంటే ’తత్తత్తా, మెమ్మెమ్మే’ అనాల్సొచ్చింది. అయినా మిగతా అంతా బానే చేశాను కాబట్టి దయ తలచి పాస్ చేశారు.

  11. ఒక్క సారి అవకాశం ఉంటే గురు ముఖతః ధాతువులు నేర్చుకోండి. అలాగయితే సులభంగానే పట్టుబడవచ్చు అని అనుకుంటున్నాను.

    రాయటం వరకయితే , చైనా, జపనీసు భాషలు కష్టం. చైనాలో 10,000 కాంజి అక్షరాలు, జపనీసులో, కథకానా, హీరాగానా వదిలేసి 3000 అక్షరాలు ఉన్నాయి. అనేక అక్షరాలు పదాలుగా కూడా పనికొస్తాయి.

    నామలింగానుశాసనం అంటే గుర్తొచ్చింది. సంస్కృతం నేర్చుకొన్నేప్పుడు మొట్టమొదట “యస్య జ్ఞాన దయా సింధో” తోనే ఆరంభిస్తారు. సాధ్యమైనన్ని శ్లోకాలు వల్లె వేయిస్తారు. దానికి భయపడే, “యస్య జ్ఞాన దయా సింధు, గోడ దూకితే అదే సందు” అనే వాళ్ళు.

  12. రవి గారు, సంస్కృతం కొంత గురుముఖతః నేర్చుకునే అవకాశం తొందర్లోనే కలుగుతుందని ఆశ పడుతున్నాను.

    అవును, మాకీ మధ్య కొందరు చైనీయులతో స్నేహమైంది. వాళ్ల భాష గురించి తెలుసుకుంటుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది.

  13. అంకెల విషయంలో సంస్కృతానికి తాతల్లాంటి భాషలున్నాయి. ఫ్రెంచి భాషనే తీసుకొంటే ఎనభై అనడానికి Quatre vingt (కాత్ర వాంగ్) అంటారు. లిటరల్ గా నాలుగు ఇరవైలు అని దానర్థం. అక్కడినుండి నాలుగు ఇరవైల ఒకటి,… అలా తొంభై వచ్చేసరికి నాలుగిరవైల పది (quatre vingt dix) 99 కి నాలుగిరవైల పందొమ్మిది … అదీ వరస. జర్మన్ భాషలో కూడా సంస్కృతం లాగానే వెనకనుండి ముందుకు- ఐన్ ఉండ్ ద్రైట్సిష్ (ein und dreizich) అంటే 33, అలాగ. ఐతే ఈ వరస 99 వరకే. వందలు మామూలుగా ముందే వస్తాయి.

  14. నాకు కూడా చమకం చివరిలో చదివే అంకెలు గుర్తుకువచ్చాయి.

    అంటే ఇఱవై లోపు అంకెలు నాకు తెలుసు కానీ వాటి తరువాత వచ్చే ఏకోనవింశతి వింశతి చతుశ్చత్వారింశతి వంటి అంకెలని వాటి ముందు వచ్చే ద్వాదశి వంటి అంకెలు చూసి ఇవి కూడా అంకెలు కాబోలు అనుకున్నాను.

    సంస్కృతంలో అంకెలకూ ఇంత సీను వుందని నాకు తెలియదు. వింశతి అంటే వందలో ఐదో వంతనుకుంటగా. హిందీలో అంకెలనే తిట్టుకునేవాణ్ణి, ఆ తరువాత జెర్మను అంకెలూ అలాగే అఘోరించాయి. ఇప్పుడు సంస్కృతం. ఈ ద్రావిడప్రాణాయామానందం ఏమిటో..

    ఇప్పుడిప్పుడే సంస్కృతం నేర్చుకోవడం పునఃపునఃపునఃప్రారంభించాను. (హైదరాబాదు సంస్కృత ప్రచార సభ వారి కోర్సు మెటిరియల్ కొని).
    నన్నా దేఁవుఁడే కాపాడాలి.


Leave a response

Your response:

Categories