(చిన్నప్పుడు బాలజ్యోతిలో చదివిన మహీధర నళినీమోహన్ గారి కథ ఆధారంగా.)
అనగా అనగా ఒక మహా పండితుడు. ఆయనకొక పుత్రుడు. అతను అక్షరాలా పండిత పుత్రుడు. పేరు మల్లినాథుడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తండ్రి గారాబంగా పెంచాడు. దాంతో మల్లినాథుడు చదువుకి మొండికేసి అక్షరమ్ముక్క కూడా నేర్చుకోకుండా అల్లరి చిల్లరగా పెరిగాడు. పెళ్ళీడు వచ్చింది. వేరే ఊరిలోని పండిత కుటుంబంలోని పిల్లని తెచ్చి పెళ్ళి చేశారు. తండ్రిగారి కీర్తి తప్ప కుమారుడి ప్రతిభ గురించి తెలియక ఆ పిల్ల కుటుంబం పెళ్ళికి ఒప్పుకుంది. మధ్యలో మసిపూసి మారేడుకాయ చేసే పేరయ్యలు ఉండనే ఉంటారుగా.
పెళ్ళి తంతులు పూర్తయ్యాకా అత్తవారి ఇంటికి వెళ్ళాడు మల్లినాథుడు. వెళ్ళే ముందే కొడుక్కి కొన్నిజాగ్రత్తలు చెప్పాడు తండ్రి. ‘ఒరే అబ్బాయీ, మీ మామగారూ, బావ మరుదులూ అంతా మంచి పండితులు. నువ్వు వెళ్ళగానే వాళ్ళ గ్రంథాలూ అవీ చూపించి గోష్టి మొదలుపెడతారు. సాధ్యమైనంతవరకూ తప్పించుకో. ఏదైనా పుస్తకం చూపిస్తే, “గ్రంథకర్త ఎవరూ? ఈ భాష్యకారుడితో మాకు కొన్ని విభేదాలు ఉన్నాయి”, ఇలా ఏదో దబాయించు సుమా’ అని సలహా ఇచ్చాడు.
మనవాడికి అత్తవారి ఇంటిలో రాచమర్యాదలు జరుగుతున్నాయి. అంత పెద్ద పండితుడి కొడుకు వచ్చాడని ఊరు ఊరంతా వచ్చి చూసి వెడుతోంది. మల్లినాథుడి భార్యకి గర్వంగా ఉంది. మల్లినాథుడు ఏవో పనులు కల్పించుకుని చర్చాగోష్టుల ప్రసక్తి రానియ్యకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సాప్ట్ వేర్ ఇంజనీరుకి పెళ్ళయి, సాప్ట్ వేర్లో పని చేస్తున్న బావమరుదులు ఉంటే ఊరుకుంటారా? ‘బావా, జావా’ అంటూ ఏవో కబుర్లు మొదలుపెట్టరూ! అలాగే మల్లినాథుణ్ణి కూడా బలవంతాన అతని బావమరుదులు వాళ్ళ పుస్తకాల గదిలోకి లాక్కెళ్ళి వాళ్ళ పుస్తకాలు అన్నీ చూపిస్తున్నారు. మనవాడు, ‘ఇలాంటి చచ్చు పుస్తకాలు మేం చాలా చూశాం లేమ్మా’ అన్నట్టుగా పోజిచ్చి ఏదో దబాయిస్తున్నాడు. వాళ్ళావిడ కూడా సరదాపడి వచ్చి అక్కడే కూర్చుని అంతా వింటోంది.
మల్లినాథుడు వాళ్ళ అలమారులో ఏదో దుక్కలాటి పుస్తకం కనపడితే దాన్ని తీసి, ‘ఇది ఏ గ్రంథం?’ అని అడిగాడు. ‘అది అలిఖితం’ అన్నారు బావమరుదులు. ‘అలాగా, ఎవరు రాశారు?’ అన్నాడు. వాళ్ళు గొల్లున నవ్వారు. ఇతనికి ఏమీ తెలియదని వాళ్ళకీ, అతని భార్యకీ అనుమానం వచ్చింది.
మర్నాడు పొద్దున్న అతని మామగారు పిలిచి, ‘నాయనా, పూజకి వేళవుతోంది. ఏమైనా పూలు తీసుకురా’ అని పంపించారు. (నేనైతే, ‘అల్లుడికి పని చెప్పడమేమిటండీ, ఠాట్’ అని ఎగిరేసి సైలెంటుగా ఇంటికొచ్చేద్దును.) పాపం ఆ వెర్రివాడు ఊళ్ళోకి పోయి ఎదురుగా ఎర్రటి పూల చెట్టు ఒకటి కనబడితే, దాన్ని ఎక్కి బోలెడన్ని పూలు కోసుకుని తీసుకువచ్చాడు. తీరా చూస్తే అవి మోదుగ చెట్టు పూలు. పూజలకి పనికిరావు. బావగారి నిర్వాకం చూసి బావమరుదులు పడీ, పడీ నవ్వారు. మామగారు తెల్లబోయాడు.
అప్పుడు మల్లినాథుడి భార్య (ఆవిడ కూడా మంచి జావా ప్రోగ్రామరే) మొగుణ్ణి చూసి ఒక శ్లోకం చెప్పిందిట.
రూప యౌవన సంపన్నం
గుణ శీల సమన్వితం
విద్యాహీనం న శోభన్తే
పాలాశ కుసుమం యథా||
ఒక మనిషి మంచి అందగాడు కావచ్చు, వయసులో ఉండి ఉండవచ్చు. మంచి గుణాలూ, సత్ప్రవర్తనా కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ అతనికి జావా రాకపోతే ఆ గుణాలేమీ శోభించవు- మోదుగ చెట్టు పువ్వుల్లాగా. (మోదుగ చెట్టు పూలు కూడా ఎర్రగా బాగుంటాయి, కానీ వాసన ఉండదుట.)
దాంతో మల్లినాథుడికి అహం దెబ్బతింది. వెంటనే అదే క్షణంలో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళడం, వెళ్ళడం నవద్వీపం వెళ్ళిపోయాడు. పన్నెండేళ్ళు ఇల్లూ, ఒళ్ళూ మర్చిపోయి కఠోర శ్రమ చేసి మహా సంస్కృత పండితుడయ్యాడు. గెడ్డాలు పెరిగిపోయి సన్యాసి రూపం వచ్చింది. చదువు పూర్తయ్యాకా మళ్ళీ అత్తవారి ఊరు వెళ్ళాడు. తిన్నగా అత్తవారి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు.
ఎవరో మహా తేజస్వి మన ఇంటికి పిలకుండానే వచ్చాడని సంబరపడి అతని అత్తా, మామగారూ ఇంట్లోకి రమ్మని సపర్యలు చేసి భోజనానికి కూర్చోమన్నారు. అతని భార్యే వడ్డన మొదలు పెట్టింది. పాపం శోకం మూర్తీభవించినట్టుగా ఉందామె. పరధ్యానంగా ఉంది. చారు వడ్డించింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు మల్లినాథుడు. వెంటనే ఒక శ్లోకం చెప్పాడు -
చారు చారు సమాయుక్తం
హింగు జీర సమన్వితం
లవణ హీనం న శోభన్తే
పాలాశ కుసుమం యథా ||
‘చారు చాలా అందంగా ఇంగువ, జీలకర్రలతో కలిపి చెయ్యబడింది. కానీ ఉప్పు లేకుండా అవేవీ శోభించవు – మోదుగచెట్టు పువ్వుల్లాగే’ అని ఆ శ్లోకానికి అర్థం. మల్లినాథుడి భార్యకి దిమ్మతిరిగింది. తేరిపార చూసి, గెడ్డం వెనకాల ఉన్నది తన భర్తే అని గ్రహించింది. ఆవిడ ఆనందానికి అవధుల్లేవు.
మల్లినాథుడు మన తెలుగువాడే. సంస్కృత మహాకావ్యాలకి ఆయన రాసిన వ్యాఖ్యలు జగత్ప్రసిద్ధాలు. ‘మాఘే, మేఘే గతం వయ:’ అని ఆయన చెప్పుకున్నాడుట. అంటే, మాఘ కావ్యానికీ, మేఘ కావ్యానికీ (మాఘుడు రాసిన శిశుపాలవధకీ, కాళిదాసు రాసిన మేఘసందేశానికీ) వ్యాఖ్య రాయడంలో తన వయస్సు అంతా అయిపోయిందని దాని భావం.
(కోలాచల మల్లినాథ సూరి వంశంలో పుట్టిన ఒకాయన్ని నా అదృష్టం కొద్దీ కలుసుకోగలిగాను. ఆయనా గొప్ప పండితుడే. తెలుగు భాషా, సాహిత్యాల్లో అంతర్జాలంలో ఆయన చేస్తున్న కృషి అందరికీ తెలిసినదే.)
నాగ మురళి గారూ , మల్లినాథ సూరి గురించి ప్రాచుర్యంలో ఉన్న మంచి కథ గుర్తు చేశారు. నళినీ మోహన్ గారి కథను అక్కడక్కడా మీరు ‘జావా భాషా సమన్వితం’ చేసినట్టున్నారు. అలాంటప్పుడు నళినీ మోహన్ గారి కథ ఆధారం అనుండాల్సింది కదా?
By: వేణు on June 30, 2009
at 12:44 am
బావుంది. ఎన్నో నెలలుగా వెతుకుతున్నాను ఈ కథ కోసం.ఈ కథ దూరదర్శన్ ఎపిసోడ్ గా వచ్చింది, చాలా యేళ్ళకు ముందు.
అవును. ఇప్పుడు బాలజ్యోతి కథ ఎలా దొరికింది మీకు?
By: రవి on June 30, 2009
at 2:48 am
మల్లినాథసూరి గురించి చెప్పిన నాగమురళిగారికి, వారికి ఉప్పందించిన రవిగారికి ధన్యవాదాలు. ఇంగువా జీలకర్రతో పోపు (తాలింపు) పెట్టిన “చారు” అంటే వాళ్ళు ఖచ్చితంగా తెలుగువాళ్ళే అవ్వాలి మరి!
ఇంతకీ అతని వంశస్థుడు ఎవరో చెప్పనే లేదు?
By: కామేశ్వర రావు on June 30, 2009
at 3:38 am
కామేశ్వర్రావు గారు, చారు, తెలుగు వాళ్ళది కాదు, కన్నడిగులదట. ఈ విషయం తిరుమల రామచంద్ర గారు, “నుడి నానుడి” లో వివరంగా చెబుతారు.
By: రవి on June 30, 2009
at 4:00 am
వేణు గారూ, అవును నళినీ మోహన్ గారి కథ ఆధారంగా నా పైత్యం మిళాయించి సొంతంగానే ఈ కథ చెప్పాను. మీరన్నట్టుగా ’ఆధారం’ అని మారుస్తున్నాను.
రవి గారూ, బాలజ్యోతి కథ దొరకలేదండీ. నాకు గుర్తు ఉన్న కథనే సొంతంగా రాశాను.
కామేశ్వరరావు గారూ, ఎవరో కాదు. కొలిచాల సురేశ్ గారు.
రవి, అవునా, చారు మనది కాదా? హతవిధీ, ఎంత దుర్వార్త విన్నాను ఇవాళ!!
By: nagamurali on June 30, 2009
at 5:51 am
ఆ చారు గురించి రాద్దామనే ఈ శ్లోకం గురించి వెతికింది. ఎప్పుడైనా మూడొచ్చినప్పుడు చారు గురించి వాగుతాను లెండి.
By: రవి on June 30, 2009
at 6:34 am
రవి గారి ఉప్పులేని ఇంగువ పోపు చారు ఘాటు ఇక్కడిదాకా లాక్కొచ్చిందండీ నాగమురళి గారూ!
మొత్తానికి మల్లినాథ సూరిని, వాళ్లావిడను కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని చేసి వదిలి పెట్టారు.ఈ కథ చదివిన గుర్తుంది. ఇలాంటి కథలన్నీ మీరు ఎలాగోలా మీ బ్లాగులోనే వారానికోటి పోస్టు చెయ్యకూడదూ, ఎంచక్కా బైండు చేయించుకుంటాము పాత చందమామలల్లే!
By: సుజాత on June 30, 2009
at 8:23 am
సుజాత గారూ, మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. తప్పకుండా గుర్తు వచ్చినప్పుడు రాస్తూ ఉంటానండీ. కానీ మహీధర వారు మాత్రం అద్భుతమైన కథలు రాసేవారు. (ఆయన తన సొంత కల్పనలు కూడా ఆ కథల్లో చక్కగా జోడించేవారు.) ఆయన కథలన్నీ ఒక పుస్తకంగా వచ్చాయో లేదో. సాహిత్యాభిమానులెవరైనా తప్పకుండా పూనుకుని చెయ్యవలసిన పని అది.
మహీధరవారు రాసిన కథే మరొకటి ‘శ్రీ రఘురామ చారు తులసీ దళ దామ’ పద్యానికి ‘చారు’ తో అర్థం చెప్పినది ఒకటి చదివాను. దీనికి ఒరిజినల్ చిలకమర్తి వారి ’గణపతి’ లోనిది.
By: nagamurali on June 30, 2009
at 11:44 am
రవిగారు,
కన్నడంలోనూ అది “చారే”నా? “సారు” కాదా?
మురళిగారు,
మరొకరిప్పుడే మరో హింటిస్తే తెలిసింది అది సురేశ్ గారని! ఇంటిపేరు పోలికని గుర్తించలేకపోయాను!
By: కామేశ్వర రావు on June 30, 2009
at 3:01 pm
కన్నడం లో అది మీరన్నట్టు “సారు”. కన్నడ, తెలుగు మూలాలు ఒకటే కదండి. ఈ పదం “జాఱు” నుంచి వచ్చి, తెలుగులో “చారు”, ఇప్పటి కన్నడంలో “సారు” గా మారాయని అని రామచంద్ర గారి ఊహ.
డీటయిల్ గా (వీలు దొరికితే) ఈ రోజు రాత్రి బ్లాగుతాను.
By: రవి on July 1, 2009
at 5:16 am
>ఆయన కథలన్నీ ఒక పుస్తకంగా వచ్చాయో లేదో. సాహిత్యాభిమానులెవరైనా తప్పకుండా పూనుకుని చెయ్యవలసిన పని అది.
కొన్ని కథలు తరతరాల కథలు అనే పేరుతో అచ్చయ్యాయి. విశాలాంధ్ర వారి ప్రచురణ అనుకుంటా.
By: Srinivas on July 1, 2009
at 8:06 am
అవును కన్నడంలోని “స” తెలుగులో దంత్య చ అయ్యుంటుంది. తమిళంలోకూడా కొన్ని పదాలిలాగే ఉంటాయి.
శ్లోకంలో ఉన్నది “చారు” కాబట్టి తెలుగువాళ్ళే అయ్యుండాలన్నాను.
బ్లాగులో మీరు పెట్టే చారు రుచిచూడ్డం కోసం ఎదురుచూస్తూ ఉంటాను
By: కామేశ్వర రావు on July 1, 2009
at 3:32 pm
ఇందాక “చారు చారు” శ్లోకం, దీక్షగా చూస్తుంటే ఒక అనుమానం బయటపడింది.
మొదటి, రెండవ, ఆఖరు పాదాల్లో 8 అక్షరాలున్నాయి. కానీ 3 వ పాదంలో 9 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ పద్యం అనుష్టుప్ చందస్సయితే, 3 వ పాదంలో చందో భంగం కాదా?
(పాదానికి 8 అక్షరాలు, ప్రతి పాదంలో 5 వ అక్షరం హ్రస్వమ్ – ఇది అనుష్టుప్ చందస్సు అని లీలగా గుర్తు)
ఎవరైనా విశదీకరిస్తే బావుంటుంది.
By: రవి on July 2, 2009
at 4:50 am
రవి గారూ, మీరన్నది కరక్టే. ఇందులో ఛందస్సు తప్పినట్టుగానే ఉంది. కానీ ఇటువంటి చాటువుల్లో ఛందస్సు వెదకడం అనవసరం అనుకుంటాను. ఇవి ఎవరో కల్పించిన కథలు అయి ఉంటాయి. తరతరాలుగా నిల్చిపోయాయి.
ఇందులో చాఱు అన్న తెలుగుపదం సంస్కృత శ్లోకంలో ఇమడదు. ‘చారు, చారు’ అన్న రెండు పదాలకీ సంస్కృతార్థంలో ‘అందమైన’ అని అర్థం చెప్పుకుంటే అసలు ఈ శ్లోకంలో కర్త అయిన చాఱు మిగలదు.
ఈ కథ రాసే ముందు మొదటి శ్లోకానికి కూడా అన్వయం చూసుకోడానికి నేను కొంత కష్టపడ్డాను. అన్వయం ‘సరిపెట్టుకోవాల్సి’ వస్తోంది తప్ప పెర్ఫెక్టుగా లేదు.
By: nagamurali on July 2, 2009
at 9:11 am
అవును, “చారు చారు” అంటే అందమైన అనే చెప్పుకోవాలి. అప్పుడు మీరన్నట్టు కర్త మిగలదు. కాకపోతే చెప్పినాయన తెలుగాయన, పైగా వాళ్ళాయన కాబట్టి రెండవ “చారు” ను వాళ్ళావిడ “చాఱు” అని ఆవిడ సరిపెట్టుకుని ఉండాలి.
ఇవి కల్పిత కథలు కావచ్చు. లేదా మరో పాసిబిలిటీ- “లవణం” బదులు ఉప్పు సమానార్థకంలో మరో పదమేదైనా ఉండి ఉండవచ్చు.
By: రవి on July 2, 2009
at 9:34 am
వారం రోజులై బ్లాగులు చూడడం లేదు. ఎన్ని మంచి పోస్టులో! మల్లినాథ సూరి కథ నేనెప్పుడూ వినలేదు. కాళిదాసు కథలాంటిదే ఆయన వ్యాఖ్యాతకు కూడా ఉండడం యాదృచ్ఛికమేనా, తరువాతి తరంవారి అందమైన కల్పనా!
నళినీ మోహన్ గారి మంచి కథలు కొన్ని ‘తరతరాల కథలు’ అన్న పేర ముద్రితమయింది. నా దగ్గరా ఒక ప్రతి ఉంది. కానీ అందులో ఈ కథ లేదు.
మంచి కథ పరిచయం చేసినందుకు నెనర్లు.
By: చంద్ర మోహన్ on July 2, 2009
at 4:03 pm
సరీగ్గా నేను అనుకున్నదే చంద్రమోహన్ గారూ అన్నారు. అచ్చంగా కాళిదాసు కథలాగానే ఉంది. ఆయనకి అస్తికశ్చిద్వాగ్విషయః ఈయనకి పాలాశకుసుమం యథా. బావుంది, బావుంది.
మఱొక విషయం. కొంచెం అసంబద్ధంగా అనిపించవచ్చు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి…
సింగభూపాలుడి కొలువులో ఉన్న మల్లినాథ సూరి పంచకావ్యాలకి వ్యాఖ్యానం వ్రాయడం చూచి, శ్రీనాథుడి చేత నైషధాన్ని ఆంధ్రీకరింపజేసియుంటాడు మామిడి సింగనామాత్యుడు (ఆంధ్రనైషధకృతిభర్త) అని దివాకర్ల వేంకటావధాని వారి ఉవాచ.
By: రాఘవ on July 3, 2009
at 6:29 am
రాఘవ గారు,
దివాకర్ల వేంకటావధాని గారి అభిప్రాయం సరిగా తోచడం లేదు. మల్లినాథ సూరి వ్రాసినవి వ్యాఖ్యానాలు మాత్రమే. శ్రీనాధునిది మూలనుసారంగా సాగినా ఒక స్వతంత్ర్యమైన తెలుగు రచన. ఒకరు కేవలం పండితుడు, మరొకరు పండిత కవి. నా ఉద్దేశ్యంలో శ్రీనాధుడు నైషధం మీది ప్రీతి తోనే అనువదించి ఉండాలి. పుస్తకం దగ్గర పెట్టుకొని కృతిభర్తను అన్వేషించి, దొరకగానే అవతారికను మార్చి అంకితం ఇచ్చేసి ఉండాలి.
By: చంద్ర మోహన్ on July 4, 2009
at 4:10 am
ఇక్కడ ఓ లుక్కెయ్యండి.
పాలాశకుసుమం అంటే జిల్లేడు పూవా?
By: రవి on July 14, 2009
at 9:18 am
శ్రీ శాస్త్రి గారు రాసిన ఆ కథ కింద ఇదివరకు నేను రాసిన కామెంటు కూడా ఉండేది. ఆ సైటులోంచి నా యూజర్ అయిడీ డిలీట్ చేశాకా కామెంటు కూడా పోయింది.
పాలాశ కుసుమం అంటే జిల్లేడు పువ్వు కాదు. మోదుగ చెట్టు యొక్క పువ్వు. పలాశ చెట్టు శాస్త్రీయ నామం: Butea Frondosa. (డిక్షనరీలో చూశాను లెండి.). ఈ పేరుతో గూగిలిస్తే మోదుగ చెట్టు బొమ్మలూ, వివరాలూ చాలా దొరుకుతున్నాయి.
By: nagamurali on July 14, 2009
at 9:30 am
ఎవరో ఇప్పుడు సరిగా గుర్తుకు రావటం లేదు కాని నన్ను గూరించి సంభోదిస్తూ “మల్లినాథ ” అని చమత్కరించారు. అప్పుడు నా ఛాతీ రెండంగుళాలకు పైగా పెరగటం నా కిప్పటికీ గుర్తే అంత పెద్ద మహానుభావునితో నా ఇంటిపేరు మూలంగా ఫ్రశంస కురిపించినందుకు. కాని అలా కామెంటిన వారిని గుర్తుపెట్టుకోలేకపోయిన నా మతిమఱపుకు నాకు బాధగా ఉంది.
By: నరసింహారావు మల్లిన on June 18, 2010
at 1:17 pm
నరసింహారావు గారూ, అవునండీ ‘మల్లిన’ ఉంది కదా, మీలో ఒక మూడు పాళ్ళు మల్లినాథుడు ఉన్నట్టే.
By: nagamurali on June 19, 2010
at 7:05 am