పరేతభర్తుర్మహిషో2మునా ధను
ర్విధాతుముత్ఖాత విషాణమండలః
హృతే2పి భారే మహతస్త్రపాభరాత్
ఉవాహ దుఃఖేన సదా నతం శిరః ||
సంస్కృతసాహిత్యంలో హాస్యం పాళ్ళు తక్కువ అని ఒక అభియోగం ఉంది. నాకు మాత్రం సున్నితమైన హాస్యం అడపాదడపా సంస్కృత కావ్యాల్లో కనిపిస్తూనే ఉంటుంది. పైన చెప్పిన శ్లోకం చూడండి. దాని అర్థం ఏమిటంటే -
ఒక మొనగాడున్నాడు. వాడికి యముడి దున్నపోతుని చూస్తే, దాని కొమ్ములతో విల్లు తయారు చేయించుకోవాలని కోరిక కలిగింది. అంతే, ఆ పళంగా దాని కొమ్ముల్ని పీకి తన కోరిక చెల్లించుకున్నాడు. పాపం ఆ దున్నపోతుకి తల మీద బరువు దిగి సుఖంగానే ఉంది గానీ, ఎంత అవమానం!! ‘యముడి మహిషపు లోహఘంటలు మబ్బు చాటున ఖణేల్మన్నాయ్’ అని జనాలు దాన్ని తల్చుకుని భయపడ్డం మానేసి నవ్వుకోడం మొదలెట్టారు. ఆ అవమాన భారం భరించలేనంతగా అనిపించసాగింది. సిగ్గుతోటీ, దుఃఖంతోటీ ఇంక తల పైకి ఎత్తడమే మానేసింది.
ఇంతకీ ఆ మొనగాడు ఎవరయ్యా అంటే, రావణాసురుడు. ఈ శ్లోకం మాఘకావ్యం (శిశుపాల వధం) మొదటి సర్గలోది. రావణుడి ‘లీలలు’ అన్నీ చాలా హాస్యంగా వర్ణిస్తాడు అందులో.
ఆగండాగండి, అర్థాలు వినకుండా పారిపోదామనే! అలా కుదరదు.
పరేత భర్త – ప్రేతాలకి అధిపతి, యముడు
పరేత భర్తుః మహిషః – యముడి మహిషం
అమునా – అతని చేత (రావణుని చేత)
ధనుః విధాతుం – ధనుస్సు తయారు చేసుకోడానికి
ఉత్ఖాత విషాణ మండలః – పెరుకబడిన కొమ్ముల సమూహం(జంట) కలిగినదై
భారే హృతే అపి – బరువు తొలగిపోయినప్పటికీ
మహతః త్రపా భరాత్ – గొప్పదైన సిగ్గు యొక్క బరువుచేత
దుఃఖేన – దుఃఖం చేత
సదా నతం శిరః – ఎల్లప్పుడూ వంచిన శిరస్సును
ఉవాహ – వహించెను.
అలాగే సముద్రుణ్ణి మూర్ఛరోగిగా అభివర్ణిస్తాడు మాఘుడు మూడో సర్గలో. దాని గురించి ఇక్కడ చూడండి.
ఈ శ్లోకానికి భైరవభట్ల కామేశ్వరరావు గారు చేసిన తెలుగు అనువాదం -
యముని దున్న కొమ్ము లా రావాణుడు బట్టి
విల్లు జేయనెంచి విరిచె నంత
దాని తలను బరువు తగ్గిపోయెను గాని
సిగ్గు బరువు మించి శిరసు వంచె||
అర్ధాలతో సహా వివరించినందుకు ధన్యవాదాలు.
By: మురళి on June 2, 2009
at 11:19 am
బాగుంది. ఈ కొమ్ములు విరిగిన మహిషం కథ నేనింతకు ముందెప్పుడూ వినలేదు.
సంస్కృతంలో హాస్యం లేదని ఎవరంటారు? మోటు కామెడీకి అలవాటు పడిన చెవులకు ఆ సున్నితత్వం తాకదంతే.
ప్రియుడు ప్రేయసితో బ్రతిమాలుతాడు : ” ముంచమానం దినం ప్రాప్తం” అని
మానం = కోపాన్ని
ముంచ = విడిచిపెట్టు
దినం ప్రాప్తం = పొద్దు పొడిచే వేళైంది
అలకలో ఉన్న ప్రేయసి ఆ మాటలు అర్థం కానట్లు నటిస్తూ ఇలా అంటుంది : “నేహ నందీ హరాంతికే”
నందీ = నంది
న+ఇహ = ఇక్కడ లేదు
హరాంతికే = శివుని దగ్గర ఉంది .
నేనడిందేమిటి? ఈవిడ చెప్పేదేమిటి అని ఆశ్చర్యపోతాడు ప్రియుడు. నంది ఎక్కడినుండి వచ్చింది?
ప్రాప్తం = దొరికినటువంటి
నందినం = నందిని
ముంచమా = విడిచిపెట్టవద్దు.
పదాల విరుపులతో పెడార్థాలు తీసే ప్రేయసి జాణతనంలో ఎంత హాస్య చమత్కారాలు చూపించారు!
By: చంద్ర మోహన్ on June 2, 2009
at 4:19 pm
మురళి గారు, నెనర్లు.
చంద్రమోహన్ గారూ, మీరు చెప్పిన సంగతి చాలా బాగుంది. ఎందులోది? (అది చదివితే జయదేవుడి అష్టపదిలో ‘ముంచ మయి మానం అనిదానం’ గుర్తొచ్చింది.)
ఇక మహిషం కథకొస్తే అది కేవలం మాఘుడి ఊహ అని నా అభిప్రాయం.
By: nagamurali on June 3, 2009
at 4:39 am
యముని దున్న కొమ్ము లా రావాణుడు బట్టి
విల్లు జేయనెంచి విరిచె నంత
దాని తలను బరువు తగ్గిపోయెను గాని
సిగ్గు బరువు మించి శిరసు వంచె
By: కామేశ్వర రావు on June 3, 2009
at 3:46 pm
నాగ మురళి గారూ,
అది ఎక్కడ చదివానో జ్ఞాపకం లేదు. ఆ మాటలు యథాలాపంగా గుర్తొచ్చి చెప్పానంతే.
కామేశ్వర రావు గారూ,
చాలా చక్కని అనువాదం!
By: చంద్ర మోహన్ on June 3, 2009
at 4:57 pm
కామేశ్వరరావు గారూ, చాలా చక్కగా అనువాదం చేశారు. మీకు చాలా చాలా థాంకులు. అయితే ఇంకా నాకు నచ్చిన శ్లోకాలన్నీ బ్లాగులో రాస్తూ ఉంటా. మీరు అనువాదం చేసి పెట్టాలి.
ఇంకో చిన్న మాట. మాఘుడి శ్లోకం కఠినమైన పదాలతో ప్రౌఢంగా ఉంటే, మీరు తెలుగులో రాసినది చాలా సరళంగా, హృద్యంగా ఉంది. తెలుగుకీ సంస్కృతానికీ మంచి కాంట్రాస్టు చూపించేలా రాశారు మీరు. అద్భుతం.
By: nagamurali on June 4, 2009
at 8:51 am
> సంస్కృతసాహిత్యంలో హాస్యం పాళ్ళు తక్కువ అని ఒక అభియోగం ఉంది.
ఈ పుస్తకం మీకు నచ్చవచ్చు
: Laughing matters – Comic tradition in India; Lee Siegel; Univ. of Chicago press, 1987.
Siegel is a trained Sanskritist.
– శ్రీనివాస్
By: పరుచూరి శ్రీనివాస్ on June 4, 2009
at 8:33 pm
baaga cheppavu muraLi.
By: ragamanzari on June 10, 2009
at 4:32 pm