Posted by: nagamurali | May 1, 2009

విశ్వదర్శనం – కొన్ని జ్ఞాపకాలూ, ఆలోచనలూ – 4

‘సైంటిఫిక్ అండ్ మెడికల్ నెట్వర్కు వాళ్ళు స్పినోజా ‘పాన్ థీయిజం’ మీద లెక్చరు ఏర్పాటు చేస్తున్నారు. వెళ్దామా?’ అన్నాడు పెద్దాయన ఒకసారి. తప్పకుండా వెళ్దామని ఉత్సాహం చూపించాను. ఆ లెక్చరిచ్చేది ఎవరో అమెరికా నుంచి వచ్చిన యూనివర్శిటీ ప్రొఫెసర్ ట. వెళ్దామంటే వెళ్దామని అనుకున్నాం. ఆరోజు సాయంత్రం ఇంటినుంచి బయల్దేరి విక్టోరియా స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ ఒక కెఫె లో కూర్చుని నాకోసం ఎదురు చూస్తానన్నాడాయన. వెళ్ళేసరికి అప్పటికే కూర్చుని కాఫీ తాగుతూ ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అక్కణ్ణించి బయల్దేరి లెక్చరు హాలు ఉన్న పేటకి (నార్తు లండన్) వెళ్ళాం. ఇంకా టైము కాలేదని మళ్ళీ ఓ కప్పు కాఫీ తాగాం. తర్వాత లెక్చరు హాల్లోకి వెళ్ళాం. అప్పటికి చాలామందే జనాలు వచ్చారు. చిన్న హాలే. పెద్దాయన తనకి పరిచయస్తులైన ఓ నలుగురైదుగురు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశాడు. వాళ్ళలో ఒకాయన ఫిలాసఫీ లెక్చరరు. ఇంకొకావిడ ఎవరో గుర్తు లేదు. ఆవిడ తల్లి కూడా వచ్చింది, రిటైర్డు టీచరు. అక్కడ తినుబండారాలు, వైన్ గట్రా అన్నీ ఉన్నాయి. కొంచం పబ్బు/పార్టీ వాతావరణం లాగే ఉంది గానీ, ఫిలాసఫీ లెక్చరు వాతావరణం లేదు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాకా నెట్వర్కువాళ్ళకి డొనేషను ఇవ్వమని అభ్యర్థిస్తూ ఒకావిడ వచ్చింది. నేనో అయిదు రూపాయలు, ఆయనో అయిదు రూపాయలు సమర్పించుకున్నాం.

ఆర్గనైజర్ ఒకావిడ వైన్ గ్లాసు పుచ్చుకుని లేచి నిలబడింది. ప్రొఫెసర్ గారి పరిచయం చెప్పి, ‘నేనెరిగినంతలో చాలా స్పష్టమైన ఆలోచనలు కలిగిన, ఎంత క్లిష్టమైన విషయాన్నైనా స్పష్టంగా, సరళంగా వివరించగలిగిన వ్యక్తి మన ప్రొఫెసర్ గారు’ అని చెప్పి పొగిడింది. ప్రొఫెసర్ గారు లేచి నిలబడ్డాడు. లాప్ టాప్ తీశాడు. ప్రొజెక్టరు సరి చేస్తున్నాడు. ‘ఈ బోడి సరంజామా అంతా అవసరమా? ఇలాంటి లెక్చర్లు బ్లాక్ బోర్డు, చాక్పీసు కూడా అవసరం లేకుండా ప్రతిరోజూ ఇచ్చేదాన్ని నేను’ అని ఆ రిటైర్డు టీచరు నాదగ్గర గొణిగింది. లైట్లార్పేశారు. జనాలు కిక్కురుమనకుండా కూర్చున్నారు.

‘అసలీ ప్రొఫెసర్ గారు అమెరికా నుంచి వచ్చింది ఈ లెక్చరివ్వడానికేనా, లేకపోతే గర్ల్ ఫ్రెండుతో ఊరు చూడ్డానికొచ్చి ఖాళీగా ఉన్నటైములో మనకి లెక్చరిచ్చేస్తున్నాడా’ అని ఆలోచిస్తున్నాను నేను. ‘ఏదేమైనా అమెరికా వాడు. ఏదో యూనివర్శిటీలో ప్రొఫెసరు. అమ్మో, ఏం చెప్తాడో! అసలే చెప్పబోయేది స్పినోజా గురించి. పాన్ థీయిజం అంటే అంతా “మన” ఫిలాసఫీయే కదా. చూద్దాం ఏం చెప్తాడో’ అని పాపం కుతూహలపడిపోతోంది మనస్సు. ఇంతలో ప్రొఫెసర్ గారు పవర్ పాయింట్ స్లైడ్లు వేస్తూ ఉపన్యాసం మొదలెట్టాడు. మూడే ముక్కల్లో ఆ ఉపన్యాసం యొక్క సారాంశం ఇదీ -

‘దుష్ట మానవజాతి వల్ల భూగోళం వేడెక్కిపోతోంది. దీని గురించి ఏదో ఒకటి చెయ్యాలి. మతాలు – అనగా క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలు – ఈ విషయం గురించి మూసుక్కూర్చున్నై. “పాన్ థీయిజం” అనగా యావత్ప్రపంచాన్నీ దైవస్వరూపంగా భావించడం. ఆ సిద్ధాంతం నుండి మతబోధకులు – అనగా ఫాదరీలు, ముల్లాలు, రబై (rabbi)లు – స్ఫూర్తి పొంది, మానవజాతిని జాగృతం చేసి, భూగోళాన్ని చల్లబరచాలి.’

లెక్చరు ఒక పది నిమిషాలు గడిచేసరికే పరమ నాసిరకంగా ఉందని నాకు అర్థమైపోయింది. చుట్టూ కూర్చున్న ఇంగ్లీషోళ్లని గమనించడం మొదలెట్టాను. కత్తులు సానబెడుతున్న శబ్దం ఎక్కడో వినిపిస్తోంది. ‘లెక్చరు పూర్తవ్వనీరా నా సామిరంగా, అప్పుడొస్తుంది మజా’ అనుకున్నాను. లెక్చరయ్యాకా ‘శ్రోతల ప్రశ్నలు – ప్రొఫెసర్ గారి సమాధానాలు’ అన్న కార్యక్రమం కూడా ఉంది మరి.

ఇంకా లెక్చరు పూర్తి కానేలేదు. పెద్దాయన ధడాల్న లేచాడు. చర,చర తలుపు దగ్గరకి నడిచాడు. ‘నువ్వొస్తున్నావా, రావట్లేదా? ఈ దరిద్రపు లెక్చరు వింటూ ఇంకా ఎందుకక్కడ కూర్చున్నావ్?’ అని ఆయన చూపు నన్ను కసుర్తోంది. నేను గబగబా లేచి తలుపు దగ్గరకి నడిచాను. పెద్దాయన వెనకాల ఆయన స్నేహితులు ముగ్గురు లేచి నాతోపాటూ బయటకి వచ్చేశారు. మేము కోట్లేసుకుని బయటకి ఇంకా పూర్తిగా అడుగు పెట్టనేలేదు. పెద్దాయన సిగరెట్టు ముట్టించాడు. తిట్ల దండకం అందుకున్నాడు. ఇంక ఆ ప్రొఫెసర్ని తిట్టాడు చూడండీ, దాంతస్సాదియ్యా! లెక్చరు సంగతి దేవుడెరుగు, ఆ రోజు సాయంత్రం నాకు నిజమైన ఎంటర్టయిన్మెంటు ఆ తిట్లే.

ఆ ప్రొఫెసర్నీ, ఆయన పన్చేసే యూనివర్శిటీని, ఆ ప్రొఫెసర్ చేత లెక్చరిప్పించిన సైంటిఫిక్ అండ్ మెడికల్ నెట్వర్కు వాళ్ళనీ, ఆ ప్రొఫెసర్ని కన్న పాపానికి అమెరికా సంయుక్తరాష్ట్రాల్నీ కలిపి ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా, ఇంగ్లీషువాళ్ళు మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన బూతుల్నీ, సాహిత్యకారుడిగా తాను సొంతంగా కనిపెట్టిన బూతుల్నీ ఉపయోగించి విచ్చలవిడిగా తిట్టి, తిట్టి వదిలిపెట్టాడు. ఫ్రాయిడ్ సిద్ధాంతాల్ని తిట్లుగా కూడా ఉపయోగించొచ్చని నాకు అనాడే తెలిసింది. ‘అసలిట్లాంటి ప్రొఫెసర్లని నేనెందుక్కన్నాను? కంటే కన్నాను, వాళ్ళకి ఫిలాసఫీ డిగ్రీలిచ్చి, అచ్చోసి ఈ ప్రపంచం మీదకి ఎందుకు వదిలిపెట్టేస్తున్నాను’ అని ఆ ప్రొఫెసర్ గారి మాతృభూమి సిగ్గుతో కుమిలిపోయేలా కడిగిపారేశాడు.

అమెరికాలో విద్యాప్రమాణాలు ఎంత ఘోరంగా తయారయ్యాయో, ‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్టు’ ఇట్లాంటి ప్రొఫెసర్లు దేశాలమీద పడి యూనివర్శిటీల్ని ఎల్లా భ్రష్టు పట్టించేస్తున్నారో వర్ణించి, వర్ణించి తిట్టాడు. మేం అయిదుగురం కలిసి ఒకే కార్లో వెళ్ళాం. ఇంటికి వెడుతున్నంతసేపూ తిడుతూనే ఉన్నాడు. ఆయన ఫ్రెండ్సంతా కూడా వంత పాడుతూ తెగ తిడుతూనే ఉన్నారు. ‘మనం ఇద్దరం కలిసి ఈ బోడి లెక్చరు కోసం పది రూపాయలు వదుల్చుకున్నాం’ అని ఆయన నా దగ్గర చాలా విచారించాడు. అసలిట్లాంటి నాసిరకం లెక్చరుకి నన్ను తీసుకెళ్ళినందుకు తెగ బాధపడిపోయాడు.

మొత్తానికి ఇంటికెళ్ళి నవ్వుకుంటూ పడుకున్నాను. మర్నాడే ఈమెయిల్ చేశాడు, అలాంటి లెక్చరుకి నన్ను తీసుకెళ్ళినందుకు మళ్ళీ సారీ చెప్తూ. అంతేకాదు, ఆ రోజు రాత్రే సైంటిఫిక్ అండ్ మెడికల్ నెట్వర్కు వాళ్ళకి ఘాటైన పదజాలంతో మెయిల్ చేశాట్ట. ‘మీ ప్రమాణాలు ఘోరంగా తయారయ్యాయి, ఇట్లాంటి సజ్జునా లెక్చర్లివ్వడానికి తీసుకొచ్చేది?’ అని నెట్వర్కువాళ్ళని కడిగిపారేశాట్ట. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుసుకున్నప్పుడు, ‘లండన్ లో ఊరికి ఉత్తరాన ఉండేవాళ్ళందరూ ఆ ప్రొఫెసర్ గారి లెక్చరు విని ఆనందించగలిగే పిచ్చోళ్ళని, ఊరికి దక్షిణాన మాత్రమే మనలాంటి ఆలోచనాపరులూ, బుద్దిమంతులూ ఉంటారనీ’ జోకులేశాడు.

మొత్తానికి అదీ ‘పాన్ థీయిజం’ గురించిన లెక్చరు కథ. తర్వాత కాలంలో ఇంతకన్నా నాసిరకం లెక్చర్లు ఒకట్రెండు విన్నప్పటికీ (ఫ్రీగానే లెండి, నాసిరకం లెక్చర్లకోసం తర్వాతెప్పుడూ డబ్బులు ఇవ్వలేదు), ఇంగ్లండులో ఈ ‘మొదటి అనుభవం’ మాత్రం గుర్తుండిపోయింది.


Responses

  1. అక్కడే ఉపన్యాసం అంతా వినో వినకుండానో ఆ అమెరికా ప్రొఫెసర్ ని కడిగి పారెయ్యొచ్చుగా? వాణ్ణి వదిలేసి మిగిలిన స్నేహితుల దగ్గిర నాలుక దురద తీర్చుకోవటం దేనికీ? నాకైతే నచ్చలేదండి ఈ పద్ధతి. అందులోనూ డబ్బులిచ్చి తలనెప్పి కొనుక్కున్నాక. ఆ పాంథీయిజం మీద “పాన్” నోట్లోంచి “తీ”సి ఉమ్మెయ్యాల్సింది. ఏదైనా నీళ్ళు అమెరికా లోంచి తీసి శంఖంలో పోస్తే గానీ తీర్థం అవదనే మొత్తం ప్రపంచం అంతా మోసపోయేది.

    అన్నట్టు 5 రూపాయలు అన్నారే? లండన్లో కూడా రూపాయలు తీసుకుంటారా? కరక్ట్ చేయండి. తప్పుగా అన్నానా? అయితే ఏమనుకోకండి ఆటల్లో అరటిపండు. ఓకే? ;-)

  2. నాకూ మొనామధ్య ఓ టెక్నికల్ సెమినార్ (3G) లో ఓ అమెరికా వాడు తగిలాడు. పొట్ట చీలిస్తే అక్షరం ముక్క లేదు. సూటు బూటు మాత్రం చక్కగా తొడిగాడు. ఓ పవర్ పాయింటు తెచ్చుకున్నాడు. లాప్ టాప్ ను సరి చేస్తూ ఓ పది నిముషాలు, ఇంట్రోడక్షను మరో ఇరవై నిముషాలు, ఆ తర్వాత కాఫీ, బిస్కట్లు..ఓ గంట సెషన్ లో పదిహేను నిముషాలు మిగుల్చుకున్నాడు.

    ఆ సెషను పరమ చెత్త. డవుటడిగితే, నాకు అమెరికా లో డెవలప్ మెంట్ తప్ప ఇండియా సంగతి తెలీదంటాడు. అదే చెప్పమంటే, పూర్తిగా చెప్పటం మన స్కోప్ కాదంటాడు. బండ బూతులు తిట్టించుకున్నాడు మాతో…బాగా నవ్వుకున్నాం ఆ రోజు.

  3. సామాన్యుడు గారూ: మరీ ఉపన్యాసం మధ్యలోనే ఆపి ప్రొఫెసర్ గార్ని ఉతికి ఆరెయ్యాలంటే బాగోదు కదండీ!! అదీగాకపోయినా ప్రశ్న – జవాబుల కార్య్రక్రమంలో ఆయన్ని మిగతా జనాలు చీల్చి చెండాడి ఉంటారనే నా అనుమానం. కానీ అందాకా ఉండనివ్వకుండానే పెద్దాయన మమ్మల్ని లాక్కెళ్ళిపోయాడు.
    నేను తెలుగులో మాట్లాడేప్పుడూ, రాసేటప్పుడూ ఇక్కడి కరెన్సీని కూడా రూపాయలు అనే వ్యవహరిస్తాను – సరదాకి.

    రవి గారూ, అయితే మీరూ నాలాగే బలయ్యారన్నమాట. కనీసం ఆ సెమినార్ కోసం మీరు డబ్బులు ఏమీ వదుల్చుకోలేదని ఆశిస్తాను. :-)

  4. “ఇంగ్లీషువాళ్ళు మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన బూతుల్నీ, సాహిత్యకారుడిగా తాను సొంతంగా కనిపెట్టిన బూతుల్నీ ఉపయోగించి విచ్చలవిడిగా తిట్టి”

    ఇంగ్లీషు వాళ్ళ తిట్లు చాలా అద్భుతం గా ఉంటాయి, కొన్నిసార్లు అస్సలు తిట్టినట్లు ఉండదు. sarcasm లో బ్రిటీషు వారి తర్వాతే ఎవరైనా :)

    ఉదాహరణకి, క్రింది వీడియో లో, బైబిల్ లోని కొన్ని తిక్క వియాలని ఏకేస్తాడు చూడండి ఒకతను, die hard christian zealot అయినా నవ్వి తీరాల్సిందే!!

  5. మీరు జంగ్ చదివేవుంటారుగా. మా మిత్రుడు ఒకడున్నాడు ఆమెరకలో… వాడూ ఫిలాసఫీనీ ఈ మూల నుండి ఆ మూలకు తిరగవేశాడంట. మాట్లాడితే జంగ్ అనేవాడు.

    వాడూ నేను కలసి ప్రపంచం మీద ర్యాంటేవాళ్ళం. అది దరిద్రం అంటే ఇది దరిద్రం అని. వాడు ఇంచక్కా మీ వూళ్ళో వ్యవసాయం చేసుకోవచ్చుగా అనేవాడు.

    మొత్తానికి కాండిడేటు నాలానే చివరకు భక్తిమార్గం పట్టాడు. ప్రస్తుతం వాడి విశ్వవిద్యాలయంలో భక్తి యోగ క్లబ్బు నడుపుతున్నట్టున్నాడు.
    భాగవతం చదువుకుంటూ.

    -
    బాలరాజు అని ఒక మేధవి వున్నారు తోటి నవతరంగుడు – మొన్నే మా వూరొస్తే కలసి గర్జనల గురించి మాట్లడుకున్నాం. ఆయన లండనులోనే వుండేవాడు. మళ్ళీ అక్కడికే వస్తాడనుకుంట. వచ్చేడట్టుంటే పరిచయం చేస్తాను. అయనా ఒక రకమైన తత్వవేత్త.

    -రా.రా

  6. యోగి: చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. ఈ వారమంతా ఊపిరి సలపని పని. మంచి లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు చాలా వయసు వచ్చేవరకు ఇంగ్లీషులో బూతులు తెలియవు. చదువు పూర్తవుతున్న సమయంలో ఇంగ్లీషు నవల్లు చదవడం అలవాటు చేసుకుందామని బ్రిటిష్ లైబ్రరీకి పోయి ఏ నవల కనిపిస్తే అది తెచ్చి చదివేవాణ్ణి. ఒక నవల్లో తనకి గుండె జబ్బు వచ్చింది అనడానికి ఒక రచయిత ’bu****ed heart’ అని రాస్తే, అది నిజంగానే ఏదో heart condition కాబోలు అని చాలా కాలంపాటు అనుకున్నాను. ఇంగ్లండు వచ్చాకా ఇక్కడ విచ్చలవిడిగా వాడే పదం అది అని తెలిసాకా నా అమాయకత్వానికి నాకే నవ్వొచ్చింది.

    రాకేశ్వరా: జంగ్ అనకూడదండీ, యుంగ్ అనాలి. అవును ఆయన ఫిలాసఫీ/సైకాలజీ చదివి ఆ ’మత్తు’లో కొన్నాళ్ళు ఉండిపోయాను నేనూను. ఇప్పుడు ఫిలాసఫీల ‘మత్తు’ చాలామటుకు దిగిపోయిందిలెండి. నిండా మునిగాను కదా సంసారంలో! :-)

    తప్పకుండా మీ స్నేహితుణ్ణి పరిచయం చెయ్యండి. నెనర్లు.

  7. Continental J = Y కదా మరచిపోయాను. మావాడు జంగ్ జంగ్ అనేసరికి నేను జంగ్ అనడం మొదలు పెట్టాను.

    Show me a sane man and I will cure him for you.
    - కాఃల్ గుస్తావ్ యుంగ్


Leave a response

Your response:

Categories