Posted by: nagamurali | April 29, 2009

విశ్వదర్శనం – కొన్ని జ్ఞాపకాలూ, ఆలోచనలూ – 3

కొద్ది వారాలు గడిచాకా ఆ పెద్దాయన్ని మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళి కలుసుకున్నాను. ఇహ అక్కడినించీ మా ఇద్దరికీ ఫిలాసఫీ కబుర్లు మాత్రమే నడిచేవి. ఆయన అప్పుడు ఇంకో నవల రాస్తున్నాడు. దాని డ్రాఫ్టులో కొన్ని భాగాలు నాకు చూపించాడు. ఒక చాప్టర్లో మూడు పాత్రల మధ్య సంభాషణ నడుస్తుంది. ఆ పాత్రల పేర్లు కూడా తమాషాగా ఉంటాయి. కొంచం చదివాకా నాకు అర్థమైంది. ముగ్గురు ఫిలాసఫర్లని (వాళ్ళలో అరిస్టాటిల్ ఒకడు, మిగతావాళ్ళు గుర్తు లేరు) ఆ చాప్టర్లో కేరెక్టర్లుగా తీసుకొచ్చి వాళ్ళ చేత సంభాషణ చేయించాడు. వాళ్ళ పేర్లు కూడా ఆ ఫిలాసఫర్ల పేర్లు ధ్వనించేలాగా పెట్టాడు. నేనా చాప్టరు  కొంచం చదివి, ‘ఇది ఫిలాసఫర్ల సంభాషణ కదూ, వీళ్ళు ఫలానావాళ్ళు కదూ’ అంటే, ‘భలే కనిపెట్టేశావే’ అన్నాడు. (నేను చదివిన ముందు నవల్లో కూడా ఒక చాప్టరు అంతర్లీనంగా ఫిలాసఫీకి కేటాయించాడు. అందులో టాక్సీ అంటే కాలం అనీ, కోతి అంటే మరేదో అనీ అర్థం చేసుకోవాలిట. ఆ అంతరార్థాలన్నీ ఆయనే చెప్పాడనుకోండి.) మరొక సంభాషణలో, ‘విట్జెన్ స్టయిన్ తమ్ముడికి ఒక చెయ్యి పోయినా పియానో వాయించడంలో గొప్ప కళాకారుడయ్యాట్ట కదా’ అన్నాను. ‘ఒకే ఒక్క పుస్తకం చదివి చాలా సమాచారం గుర్తు పెట్టుకున్నావే’ అన్నాడాయన.

ఆయన కూడా ఇమ్మాన్యువల్ కాంట్ ని అందరికన్నా ఎక్కువ అభిమానిస్తానని చెప్పాడు. ఆయన ఒకప్పుడు గాఢమైన ఆధ్యాత్మికాభిలాష కలిగిన వ్యక్తి. తన చిన్నతనంలో  పురాతన పాశ్చాత్య ఆధ్యాత్మిక సిద్ధాంతాల్లోనూ, సాధనలోనూ మునిగితేలానని చెప్పాడు. నాకింతవరకు తారసపడ్డ వ్యక్తుల్లో ఎవరి జీవితాల్లోనూ లేని అనేక విచిత్ర సంఘటనలు ఆయన జీవితంలో జరిగాయి. (అవన్నీ బ్లాగులో రాయడం కుదరదనుకోండి). అయినప్పటికీ కారణాలు తెలియదు కానీ, నాకు పరిచయమైన ఆ వయసులో మాత్రం ఆయన పూర్తిగా భౌతికవాది. (అప్పుడు ఆయన వయసు యాభైకి పైబడి ఉండవచ్చు). సైన్సు, హేతువాదం సహాయంతో ‘మూఢ’ విశ్వాసాల్ని ఖండిస్తూ రచనలు చేస్తున్న యోధుడు.

కాంట్, షోపన్ హోవర్ ల సిద్ధాంతాల మీద భారతీయ తత్త్వశాస్త్రాల ప్రభావం గురించి నేను ఆశ్చర్య పడ్డ సంగతి ఆయనతో చెప్పాను. కాంట్ ఫిలాసఫీ గొప్పతనం గురించి నాకు చెప్తూ ఆయన వాత్సల్యంతో, ‘అసలీ ఫిలాసఫీల జోలికి పోవడం అనవసరం’ అని నన్ను హెచ్చరిస్తూ ఉండేవాడు. ఏమనేవాడంటే, ‘మురళీ, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏదో ఉన్నదనీ, స్విచ్ వేస్తే లైటు వెలిగినట్టుగా ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా సత్యదర్శనం అవుతుందనీ నేను ఆశ పడేవాణ్ణి. అదంతా భ్రమ. కాంట్ ఫిలాసఫీ తార్కికంగా ఏం నిరూపిస్తోందంటే- ఇంద్రియాతీతమైన సత్యం ఒకటి ఉన్నది, కానీ దాన్ని ఇంద్రియాల సహాయంతో తెలుసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదు అని. కాబట్టి మనమెరుగని సత్యం ఒకటి ఉన్నమాట నిజమే కానీ, దాన్ని ఎప్పటికీ మనం తెలుసుకోలేము. తెలుసుకోవాలని తపన చెందడం వ్యర్థం. “నన్ను నేను తెలుసుకోవాలి” – ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళకీ, మనలాగా ఫిలాసఫీ కబుర్లు చెప్పుకునేవాళ్ళకీ నిజంగా ఏం కావాలో తెలుసునా? సైకోథెరపీ!’.

ఈ మాటల్ని బట్టి ఆయన కొంత వరకూ ఒక ‘సినిక్’ అని మీకు అనిపిస్తే అది మీ తప్పు కాదు. ఇంకా ఏమనేవాడంటే, ‘చూడు. ఇంద్రియాలు బాహ్యవస్తువుల్ని ప్రతిబింబించగలవు మాత్రమే. అవి తమను తాము ఎలా తెలుసుకోగలవు? కన్ను తనను తాను చూడగలదా? చెవి తనను తాను వినగలదా? నాలిక తన్ను తాను రుచి చూడగలదా? అలాగే కాన్షస్ నెస్ (ప్రజ్ఞ) కూడా తనను తాను తెలుసుకోవడం అసాధ్యం. కాన్షస్ నెస్ గురించి మాట్లాడేవాళ్ళూ, పరిశోధనలు చేసేవాళ్ళూ, ఉపన్యాసాలిచ్చేవాళ్ళూ పిచ్చివాళ్ళు’ అనేవాడు. అన్నట్టు ఆయన జిడ్డు కృష్ణమూర్తిగారి లెక్చర్లకు కూడా వెళ్ళాట్ట. కానీ వాటివల్ల ఏమీ ప్రభావితుడు కాలేదు.

అంతే కాకుండా ఆయన నాకు ‘జీవిత పరమార్థం – సత్యాన్వేషణ’ మొదలైన వ్యర్థ జిజ్ఞాసలన్నీ వదిలేసుకుని చేతనైనంతమేరకు డబ్బు సంపాదించుకుని సుఖంగా జీవితం గడపడం ఉత్తమమని కూడా ఉపదేశిస్తూ ఉండేవాడు. ఆయన కాంట్ ఫిలాసఫీ గురించి చెప్పిన మాటలు మాత్రం నన్ను బాగానే ఆలోచింపజేసేవి. ఆధ్యాత్మిక చింతనకి పూర్తి విరుద్ధంగా ఒక పజిల్ లాగా అనిపించే  ఆ మాటల్ని బద్దలు కొట్టడానికి నేను సొంతంగా ప్రయత్నిస్తూ ఆలోచించేవాణ్ణి. అదే క్రమంలో అప్పట్లో ‘త్రిపురా రహస్యం’ అనే ఒక అద్వైత గ్రంధాన్ని చదివాను. దాని మీద చాలా బుర్ర బద్దలుగొట్టుకోవాల్సి వచ్చింది. అది చదువుతుంటే కాంట్ ఫిలాసఫీకి విరుగుడు దొరికినట్టనిపించింది. కానీ ఈ ఫిలాసఫీల్తో వచ్చిన చిక్కేమిటంటే, చదువుతున్నంతసేపూ అర్థమైనట్టే ఉంటాయి. పుస్తకం మూసెయ్యగానే బుర్రలో ఏం మిగిలినట్టు అనిపించదు. మళ్ళీ పుస్తకం తీసి చదివితేనే గుర్తు వస్తాయి. పదే పదే మననం చేసుకుంటేగానీ బుర్రలో నిలబడవు.

ఈ విధంగా పాశ్చాత్య తత్త్వశాస్త్రంలోని సిద్ధాంతాల గురించి కొంత తెలుసుకున్నా అవేవీ పెద్దగా నన్ను ప్రభావితం చెయ్యలేకపోయాయి. భౌతికవాదం నాకు అర్థం కాలేదు. ‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి’ అనీ, ‘ఏకాన్త విధ్వంసిషు మద్విధానాం, పిండేష్వనాస్థా ఖలు భౌతికేషు’ అనీ అనుకునే నన్ను భూమ్మీద పడేసింది మాత్రం ఒక సైన్సు పుస్తకం. దాని గురించి వచ్చే టపాలో.


Responses

  1. హేతువాదం, భౌతికవాదం, సైన్సు వీటిని మూడిటినీ ఒకే గాటని కట్టెయ్యడం అంత సబబు కాదు. నాకు తెలిసి ప్రతిది హేతుబద్ధంగా ఉండాలని కోరుకొనేవారు హేతువాదులు. భౌతిక సత్యాలను మాత్రమే నమ్మి, ప్రతి దానికీ భౌతికమైన కారణాన్ని(హేతువుని) వెతికేవాళ్ళు భౌతికవాదులు. సైన్సు హేతువునీ, భౌతికతనీ సందర్భానుసారంగా ఉపయోగించుకున్నా సైన్సు వాదం కాదు. దానికి నమ్మకాలనేవి చాలావరకూ ఉండవు. ఉన్నా వాటిని నమ్మకాలుగానే చూస్తుందికాని సత్యాలనదు. ప్రతి విషయమూ హేతుబద్ధంగా వివరించ గలమన్న నమ్మకం సైన్సుకి లేదు. అలాగే అవసరమైతే అభౌతికమైన విషయాల గురించి ఆలోచించే చొరవ సైన్సు చేస్తుంది. ఇప్పుడు సైన్సులో చెప్పుకొనే “శుద్ధ శక్తి” (Pure Energy) భౌతికమనగలమా?
    తత్త్వానికి (philosophyకి) మూలం ప్రశ్నించడం. ఇది తర్కానికి దారి తీసింది. దానికి భౌతిక వాదం తోడై భౌతిక, రసాయినిక, జీవ శాస్త్రాల వంటి సైన్సులు అభివృద్ధి చెందాయి. కేవల తర్కం నుండి పుట్టింది గణిత శాస్త్రం (Logic and Pure Mathematics). ఆ తర్వాత వచ్చిన తత్త్వవేత్తలు అసలు తర్కాన్నే కాదన్నారు. వైయక్తికమైన అనుభూతికి ప్రాధాన్యమిచ్చారు.
    సైన్సుతో (గణితాన్ని కూడా ఇక్కడ సైన్సుగా పరిగణిస్తున్నాను) పోల్చినప్పుడు తత్త్వంలో కనిపించే ఒక ముఖ్య లోపం దానికి నిర్దిష్టమైన (అంటే పకడ్బందీగా ఉండే) పరిభాష లేకపోవడం. దీనివల్ల ఒకే విషయాన్ని గురించి వివిధ తత్త్వవేత్తలు రకరకాల అర్థాలనీ వివరాలనీ ఇచ్చి, ఆ అర్థాల విషయంలోనే విభేదించుకున్నారు. దీనితో సార్వజనీనమైన శాస్త్రంగా అది అభివృద్ధి చెందడం కష్టమైంది. ఒక్క భారతీయ తత్త్వవేత్తలు మాత్రం దీనికి ప్రాధాన్యమిచ్చినట్టు అనిపిస్తుంది. అది మన దేశంలో భాషా శాస్త్ర అభివృద్ధికి కారణమైంది. ఆధునిక కాలంలో పాశ్చాత్య తత్త్వవేత్తలు కూడా దీనికి తగిన ప్రాధాన్యాన్ని ఇచ్చినట్టు కనిపిస్తుంది.

    ఇక కాన్షెస్ నెస్ తనని తాను తెలుసుకోలేక పోవడం గురించి. ఇది గణితంలో Godel’s Incompleteness theormలాంటిది. భౌతిక శాస్త్రంలో Heisenberg uncertainty principle కూడా ఇలాటిదే అనిపిస్తుంది. ఇవి మనిషి పరిశీలనా శక్తి, ఆలోచనా శక్తి తాలూకు పరిధులని చెప్పేవి. బహుశా అస్తిత్వవాదం రావడానికి కారణం ఈ సిద్ధాంతాలే.
    మీరు చెప్పిన సినిసిసం పెరగడానికి కూడా బహుశా ఇవే కారణం కావచ్చు. సైంటిస్టులు సినిక్లు కావచ్చు కాని సైన్సు సినిక్ కాదు. కాబట్టి ఇంద్రియాతీతమైన సత్యం ఉందా లేదా అని శాస్త్రీయంగా తేలేవరకూ అది ఉందీ లేదూ అని నిర్ణయానికి రాకుండా, అది ఉందా లేదా, ఉంటే దాన్ని మనం తెలుసుకోగలమా లేదా అనే శాస్త్రీయ పరిశోధన సాగుతూనే ఉంటుంది. దీనికి సమాధానం తర్కంలో దొరక వచ్చు, భౌతిక శాస్త్రంలో దొరకవచ్చు, జీవశాస్త్రంలో దొరకవచ్చు. మొత్తానికి దొరుకుతుందన్న ఆశతో ముందుకు సాగడమే మనిషి బాధ్యత. అసలు ఇదే మనిషి అసలైన బాధ్యత అని కూడా నాకనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సృష్టిలో ఏ జంతువుకీ లేని ఈ తాత్త్విక ఆలోచనా శక్తి మనిషికే ఉంది కాబట్టి.

    ఏదో ఆవేశంలో చాలా వాగేశానే!

  2. కామేశ్వరరావు గారూ, సవివరమైన మీ కామెంటుకు చాలా కృతజ్ఞతలు. హేతువాదం, భౌతికవాదం, సైన్సు వేర్వేరు అని నాకు కొంత అస్పష్టంగా తెలుసు గానీ ఈ మూడూ ఇంటర్ సెక్ట్ అయ్యే భాగం చాలానే ఉందని నేను అనుకుంటాను – ఇది నా ఊహ మాత్రమే , తప్పు కావచ్చు.

    సైన్సు గురించి మీరన్న మాటల్ని నేను చాలామటుకు అంగీకరిస్తాను, కానీ దానికీ భౌతికవాదానికీ సంబంధం లేదంటే మాత్రం నాకు ఒప్పుకోవడం కష్టం.

    సైన్సుని జ్ఞాన సముపార్జనకి ఒక మెథడ్ గా మాత్రమే నేను పరిగణిస్తాను. కానీ ఆ మెథడ్ పుట్టిందే భౌతిక వాదం+తర్కం ద్వారా కదా. అంటే సైన్సుకి తల్లి భౌతిక వాదం అవుతుంది. (తర్కానికి భౌతిక వాదం తోడై శాస్త్రాలు అభివృద్ధి చెందాయని మీరే అన్నారు కదా.)

    ఈనాటి వరకు సైన్సు కనుగొన్న విషయాలు అన్నీ భౌతికవాదాన్ని మాత్రమే బలపరుస్తాయి అని నేను అనుకొంటున్నాను. సైన్సు కనుగొన్న జ్ఞానం మీద ఆధారపడకుండా భౌతికవాదం నిలబడగలదంటే నాకు నమ్మడం కష్టం. Pure Energy గురించి నాకు తెలియదు కానీ, స్ట్రింగ్ థియరీ గురించి ఒక మంచి పుస్తకం ఒకటి ఇదివరకు చదివాను. అది గణితం మీద ఆధారపడి చేసిన ఊహాగాన సిద్ధాంతం. సైన్సులోని ఇటువంటి అతి నవీన సిద్ధాంతాలు తార్కికమైన అమూర్త ప్రపంచంలోకి (abstract realm) లోకి వెళ్ళిపోతాయి. ఆ విధంగా అవి భౌతిక ప్రపంచాన్ని వదిలినా, గణిత తర్కాన్ని వదల్లేదు కదా! గణిత తర్కాన్ని ’అధిభౌతికం’ అనవచ్చంటారా? (నాకు నిజంగానే తెలియదు సుమండీ.)

    కాబట్టి సైన్సూ, భౌతికవాదం, హేతువాదం మూడూ వేర్వేరు అయినప్పటికీ – వాటిని నేను చాలామటుకు ఒకే గాటన కడతాను. ఇది టెక్నికల్ గా తప్పు కావచ్చు, కానీ నా బౌద్ధిక ప్రయాణం (intellectual journey) లో ‘ఆధ్యాత్మికత’ అనే దానితో పోల్చి చూడడానికి ఈ మూడింటినీ ఒకే గాటన కట్టేసుకోవాల్సి వచ్చింది.

    నా దృష్టిలో ఆధ్యాత్మికత అంటే, భౌతిక శరీరానికి అతీతమైనదీ, మూలమైనదీ (ఆత్మ అనండి, ఎసెన్సు అనండి, మరేదైనా అనండి) ఏదో ఒకటి ఉన్నదని.

    అలాగే నా దృష్టిలో భౌతికవాదం అంటే ఆ విధమైన అభౌతిక పదార్థం (ఆత్మ) అవసరం లేని యంత్రప్రాయమైన (ఈ పదాన్ని అపార్థం చేసుకోకూడదు) శరీరం మాత్రమే ఉన్నదని ప్రతిపాదించే సిద్ధాంతం. మన మనస్సూ, తెలివీ, తార్కికతా అన్నీ మెదడు యొక్క కార్యకలాపాలే గానీ, దానికి పైన ఒక ఆత్మ అనేది ఏమీ లేదని ఆ సిద్ధాంతం యొక్క సారాంశం.

    ఈ ఆత్మ ఉందా లేదా అన్న మీమాంస ఇప్పటివరకూ తేలలేదు. సైన్సు ఆత్మ గురించి ఏమీ చెప్పలేదు. సైన్సు ‘వాదం’ కాదు కానీ, ఆత్మ లేదనే భౌతిక వాదుల వాదాలకి సైన్సు ఇంతవరకు అందించిన జ్ఞానమే ఆధారం. ఆ జ్ఞానం లేకుండా వాళ్ళు ఆత్మ ’అవసరం’ లేదని నిరూపించడానికి పూనుకోవడం సాధ్యపడదు.

    నేను పెరిగిన వాతావరణం రీత్యా నాకు ఆధ్యాత్మిక చింతన సహజం కాబట్టి ఆత్మ లేకపోవడం (అంటే భౌతికవాదం) నాకు అర్థం చేసుకోవడం కష్టమైంది. మనుషుల పుట్టుకా, జీవితం, మన:ప్రవృత్తులు అన్నీ ఆత్మ అవసరం లేకుండానే సాధ్యపడతాయి అన్న ఒక సంభావ్యత (possibility) ని అర్థం చేసుకోడానికి నాకు సైన్సు (డార్విన్ పరిణామ సిద్ధాంతం + computational theory of mind) అవసరం అయ్యింది.

    అయితే బౌద్ధులు చెప్పే అనాత్మ వాదం నిజంగా భౌతికవాదం కాదని నా అభిప్రాయం. కాబట్టి దాని ప్రసక్తి ఇక్కడ తేకూడదు.

  3. జీవిత౦లో ఎదిగే వయసులో తాతయ్య అనే మనిషి పాత్ర లేకపోతే ఏ౦ కోల్పోతామో సుస్పష్ట౦గా సానుభవ౦గా తెలుసుకున్నవాళ్ళల్లో నేనొకడిని. ఆయన ఉ౦డి ఉ౦టే, ఈ రోజూ నేను కూడా మీ అ౦దరి లాగా మీ ప్రశ్నలకు సమాధానాలిస్తూ, నాకున్న ప్రశ్నలను మీతో ప౦చుకు౦టూ గడిపేవాడిని. నా లోటు మీకర్ధమయ్యి౦ది కాబట్టీ నేను తప్పులు చేసినా నన్ను మన్ని౦చగలరని నాకు ధైర్య౦ వచ్చేసి౦ది. ము౦దర కాళ్ళకు బ౦ధ౦ వేసేశాను, పాకేపిల్లాడిలా ఇక ఈ బ్లాగు మొత్త౦ చిత్త౦ వచ్చినట్టు దొర్లిపడేస్తాను. ఏమ౦టారు మురళీ గారు?

    ఓ రోజు నా స్నేహితులతో మెటాఫిజిక్స్ అనే ఒకరకమైన తత్త్వానికి అర్ధమేమిటో అనే ప్రశ్నకు జవాబు కోస౦ మే౦ చేసిన ప్రయత్న౦లో, మాకు తెలియకు౦డానే తర్క౦లో పడి లాజికల్ గా మాట్లాడాలి అని ఒకరినొకరు సూచి౦చుకు౦టూ, వాది౦చుకు౦టూ చివరికి అలసిపోయి, ఇ౦తసేపు మన౦ చేసి౦దే తర్క౦, మన౦ తెలుసుకోవాలనుకున్నదే తత్త్వ౦ అ౦టూ నేను అక్కడి ను౦చీ లేచెళ్ళిపోయాను. నాలాగే లేచెళ్ళిపోతూ మరో స్నేహితుడు ఓ చమత్కార౦ చేసాడు. ప్లాటోలా౦టి మనిషికి విద్యార్ధి, అలెగ్జా౦డర్ లా౦టి మనిషికి గురువు అయిన అరిస్టాటిల్ గురి౦చి. అదేవిట౦టే, ఆయన పుస్తకాల అరలో ము౦దు ఫిజిక్స్ పుస్తకాలను పెట్టీ, తర్వాత ఫిలాసఫీ పుస్తకాలను పెట్టాడు అని, అ౦దుకని ఆ ఫిలాసఫీకి మరో పేరుగా మెటాఫిజిక్స్ వచ్చి౦ది అని చెప్పాడు. అప్పటికి అది అ౦దరికీ చమత్కార౦లా అనిపి౦చినా, తర్వాత మేమే తెలుసుకున్నా౦, చాలా డిక్షనరీల్లో కూడా దాని అర్ధ౦ ఆరిజన్ రూపేణా అలానే ఇవ్వబడి౦దని. ఫిజిక్స్ లో పిహెచ్డీ చేస్తున్న నాకు ఆ ఫిజిక్స్ వల్లో లేక మా తాతాగారితో నా చిన్న వయసులో నే చేసిన స౦భాషణల పుణ్యమో తెలీదుకానీ, నాకూ తత్త్వశాస్త౦ మీద ఆశక్తి ఎక్కువ. దాని గురి౦చి నాకు తెలుసు అని కాదు, తెలుసుకోవాలని ఆశ అని నా ఉద్దేశ్శ్య౦. మీకు తెలిసిన విషయాలనే ఇక్కడ చెప్పినా, నాకు తెలిసినవి చెప్తే మిగిలి౦ది మీ భాద్యతగా గ్రహిస్తారని మరో ఉద్దేశ్శ్య౦.

    హైసన్ బర్గ్ ప్రిన్సిపుల్ మాత్రమే కాదు, దాదాపు అన్ని సైన్స్ లూ నాకు అర్ధమయ్యిన౦త వరకూ ఓ కామన్ పధ్ధతిని అవల౦బిస్తాయి. తెలుసుకోవాల్సి౦ది ఏదైనా సరే, దానికోస౦ ము౦దు తెలుసుకోబడే వస్తువుకి ఐడియల్ సిస్టమ్ అని పేరు పెట్టీ, ఏ సిస్టమ్ అయితే మామూలు ప్రప౦చ౦లో ఉ౦డదో దాని గురి౦చి తెలుసుకు౦టే అసలు విషయ౦ తెలుస్తు౦దీ అని ఆ పధ్ధతి సారా౦శ౦. నాకు ఈ చిన్న విషయమే నాకర్ధ౦ కాని ఓ పెద్ద తత్త్వ౦. అ౦దుకని నా చిన్న మెదడుకి అనిపి౦చి౦దేమిట౦టే, Philosophy is a part of our every day life. But the point is not every one knows the meaning and purpose of it. I am one among those ignorants. అద౦డీ స౦గతీ! ఇహ నా బుర్రని మీ చేతిలో పెడుతున్నాను. మీరు ఎలా వాడుకున్నా ఆడుకున్నా సరే. మీ దయ, నా ప్రాప్త౦. చాలా తెలుసుకోవాలని ఉ౦ది. అది అసాధ్య౦. మీలా౦టి వారి ఇల్లా౦టి టపాలూ బ్లాగుల పుణ్యమా అని కొ౦త వరకూ ప్రయత్న౦ చేస్తాను.

    మొదటిసారి మీ బ్లాగు చూసాను. ఆలశ్య౦ చేసిన౦దుకు బాధపడినా, అసల౦టూ మీ బ్లాగొకటు౦దని తెలుసుకున్న౦దుకు ఆన౦దిస్తున్నాను. నా పేరు ఆన౦ద్. నమస్తే, ఇక ఉ౦టాను, మళ్ళీ కలుస్తాను.

  4. ఆనంద్ గారూ,
    >జీవిత౦లో ఎదిగే వయసులో తాతయ్య అనే మనిషి పాత్ర లేకపోతే ఏ౦ కోల్పోతామో సుస్పష్ట౦గా సానుభవ౦గా తెలుసుకున్నవాళ్ళల్లో నేనొకడిని.
    - అవును, ఇది నాకూ అనుభవమే. చిన్నతనంలో ’బాలజ్యోతి’లో మేథమేట్రిక్స్ శీర్షిక చదువుతూ అటువంటి తాతయ్య మనకి కూడా ఉంటే ఎంత బాగుణ్ణు అనుకుంటూ ఉండేవాడిని. కాబట్టి నేను చేసే పొరపాట్లు కూడా మీరు మన్నించాలి. :-D

    మెటఫిజిక్స్ అన్న పదం ఎలా వచ్చిందో మీరు చెప్తుంటే నాకూ నమ్మబుద్ధి కావడం లేదు. డిక్షనరీల్లో కూడా అలా ఇచ్చారంటే ఆశ్చర్యంగానే ఉంది.

    >మీకు తెలిసిన విషయాలనే ఇక్కడ చెప్పినా, నాకు తెలిసినవి చెప్తే మిగిలి౦ది మీ భాద్యతగా గ్రహిస్తారని మరో ఉద్దేశ్శ్య౦.
    - సంతోషంగా. ఇల్లాంటి సంభాషణలు నిత్య జీవితంలో దొరక్కే కదా బ్లాగు మొదలుపెట్టింది!

    >తెలుసుకోవాల్సి౦ది ఏదైనా సరే, దానికోస౦ ము౦దు తెలుసుకోబడే వస్తువుకి ఐడియల్ సిస్టమ్ అని పేరు పెట్టీ, ఏ సిస్టమ్ అయితే మామూలు ప్రప౦చ౦లో ఉ౦డదో దాని గురి౦చి తెలుసుకు౦టే అసలు విషయ౦ తెలుస్తు౦దీ అని ఆ పధ్ధతి సారా౦శ౦.
    - అవును, ఈ విషయం గురించి నేనూ కొంత తెలుసుకున్నాను. దీని గురించి (ఇదే విధంగా కాకపోయినా) ఈ టపాల పరంపరలోనే కొద్దిగా రాయదల్చుకున్నాను కూడా. ‘భౌతికవాదం’ నిజంగా భౌతికమేమీ కాదని ఇటువంటి విషయాలవల్లే అర్థమౌతుంది.

    నా బ్లాగు చూసి కామెంటినందుకు చాలా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఈ విధంగా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా బ్లాగులో మరీ పెద్ద విషయాలేమీ ఉండవు. రెండు టపాలు చదివితే మూడోది బోర్ కొడుతుంది. నమస్కారాలతో,
    మురళి.

  5. నాగమురళి గారూ!, కామేశ్వరరావుగారూ!
    వివరించిన విషయాలకీ, రేకెత్తించిన ఆలోచనలకీ కృతజ్ఞతలు.
    మురళిగారూ! “రెండు టపాలు చదివితే మూడోది బోర్ కొడుతుంది.” అన్న మీవ్యాఖ్య చూస్తే నవ్వొచ్చింది. (తమ రచనల గురించి ఇలా వ్యాఖ్యానించగల అభిమాన రచయితని కనుగొనడం పాఠకులకి అరుదుగా దొరికే అదృష్టం)
    పర్లేదు. అలాగే వుండనివ్వండి. బోరు కొట్టించకుండా వ్రాయడం మీ ధ్యేయం చేసుకోకండి. మీ బ్లాగు స్థాయి అంతకు మించినది.

  6. రాధిక గారూ: మీ ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞతలు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.