అథేదం రక్షోభిః కనక హరిణచ్ఛద్మవిధినా
తథా వృత్తం పాపైర్వ్యథయతి యథా క్షాళితమపి
జనస్థానే శూన్యే వికలకరణైరార్యచరితైః
అపి గ్రావా రోదితి అపి దళతి వజ్రస్య హృదయమ్ ||
‘పాపాత్ములైన రాక్షసులు బంగారు లేడి మాయని కల్పించి జనస్థానంలో మనం లేకుండా ఉన్నప్పుడు చేసిన వృత్తాంతమిది. కడిగివెయ్యబడినప్పటికీ ఇప్పటికీ వ్యథ కలిగిస్తూనే ఉన్నది. దుఃఖంతో చేష్టలుడిగిన పూజ్యుని (రాముడి) వృత్తాంతం విన్నప్పుడు వజ్రసమానమైన హృదయం కూడా బ్రద్దలవుతుంది. రాయి కూడా ఏడుస్తుంది.’
ఉత్తర రామచరిత్రం మొదటి అంకంలోని ఒక శ్లోకమిది. రాముడి పట్టాభిషేకం తర్వాత సీత, రాముడు, లక్ష్మణుడు తమ వనవాస సమయంలోని ఘట్టాల్ని చిత్రించిన చిత్రపటాల ప్రదర్శనని చూస్తూ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఉంటారు. (మనం హాలీడే నుంచి వచ్చాకా ఫొటోలు చూసుకున్నట్టు.) ఆ సందర్బంలో లక్ష్మణుడన్న మాటలివి. ఈ శ్లోకంలో ‘అపి గ్రావా రోదితి, అపి దళతి వజ్రస్య హృదయం’ అన్నమాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
గోవర్ధనాచార్యుడనే ఆయన పై శ్లోకాన్ని ఉద్దేశించి, భవభూతి గురించి ఇలా అన్నాడుట -
భవభూతేః సంబంధాత్ భూధరభూరేవ భారతీ భాతి
ఏతత్కృత కారుణ్యే కిమన్యథా రోదితి గ్రావా ||
‘భవభూతి సంబంధం చేత సరస్వతీ దేవి కూడా కొండకి పుట్టినదానిలాగే తోస్తుంది. లేకపోతే ఆయన చిత్రించిన కారుణ్యంలో రాయి ఎందుకు ఏడుస్తుంది?’
ఈ శ్లోకం నాకు తెలుసు కానీ గోవర్ధనాచార్యుడు ఎవరు, ఏ సందర్భంలో ఎందుకలా అన్నాడో తెలియదు. ఈ శ్లోకంలో ఉన్నది అధిక్షేపమా లేక పొగడ్తా అన్నది కూడా తెలియదు. తెలిసిన పెద్దలెవర్నైనా వివరించమని ప్రార్థన.
మంచి శ్లోకం పరిచయం చేసారు.ధన్యవాదాలు.
By: mallina rao on March 7, 2009
at 11:31 pm
VERY GOOD
By: VENU on March 8, 2009
at 12:02 pm
CHAALAA BAAGUNDI
By: VANI on March 8, 2009
at 12:04 pm
mallina rao gaaru, VENU gaaru and VANI garu: మీ కామెంట్లకి ధన్యవాదాలు.
By: nagamurali on March 9, 2009
at 10:59 am
గోవర్ధనాచార్యులెవరో తెలియదు. ఇప్పుడు చదివే వఱకూ ఆయన చెప్పిన పద్యం అంతకన్నా అసలే తెలియదు. చూడబోతే ఆయన సదభిప్రాయంతోనే చెప్పినట్టుందండీ, ఎత్తిపొడుపులా అనిపించడం లేదు.
భవభూతి వలన వాణి ఱాతిలా ప్రకాశిస్తోంది. లేకుంటే ప్రస్తుత కారుణ్యమునందు ఱాయి వేరేటందుకు ఎందుకు రోదిస్తుంది?
“మనం ఱాళ్లు కరగడం అన్నదాన్ని సాధారణంగా వినం, అలాంటిది ఱాయే ఏడుస్తోందీ అంటే… సరస్వతిని ఱాతిలో కూడా చొప్పించి ఱాతికి హృదయాన్నిచ్చి భావావిష్కారం చేయడం వల్లనే కదా” అని ఆ గోవర్ధనాచార్యుల అభిప్రాయమై ఉంటుందని నా ఊహ.
By: రాఘవ on March 10, 2009
at 1:43 pm
రాఘవ గారూ, మీరన్నదీ సమంజసంగానే అనిపిస్తోంది. మీకు అవకాశం దొరికినప్పుడు ఇంకా ఎవర్నైనా కనుక్కుంటే వాళ్ళు కూడా ఏమన్నారో తెలియజేయండి.
By: nagamurali on March 10, 2009
at 3:22 pm
భలే శ్లోకాన్ని గురించి పరిచయం చేసారండి!
గోవర్ధనాచార్యులు రచించిన ఆర్యసప్తశతిలోని శ్లోకం అది. దాని వ్యాఖ్యానం ఇక్కడ చదవొచ్చు:
http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0083/453first=1last=288barcode=1990160083448
పేజీ నెంబరు 21.
అందులో ప్రస్తావించబడిన శ్లోకం:
తపస్వి కాంగతోవస్థాం ఇతి స్మేరాననావివ
గిరిజాయాస్తనౌ వందే భవభూతిసితాననౌ
భవభూతికి ఆ పేరు యీ శ్లోకం వల్లనే వచ్చిందని ఒక కథ.
ఇచ్చిన లంకెలోని వ్యాఖ్యానం కూడా సంస్కృతంలోనే ఉంది కాబట్టి నాకు పెద్దగా అర్థం కాలేదు. దాన్ని చదివి మాకందరికీ తెలుగులో వివరించే బాధ్యత మీదే, అలాగే పై శ్లోకం గురించి కూడా
By: కామేశ్వర రావు on March 16, 2009
at 4:01 pm
కామేశ్వరరావుగారూ, మీరు ఇచ్చిన లంకె సరిగా పనిజేయడంలేదు. ఒక్క సారి చూస్తారూ?
తపస్వి కాంగతోవస్థాం ఇతి స్మేరాననావివ
గిరిజాయాస్తనౌ వందే భవభూతిసితాననౌ
ఈ శ్లోకంలో ఆననౌ అన్న ప్రయోగం వ్యాకరణపరంగా దోషం. ఆనన శబ్దానికి ఆననే అని వాడాలి. భవ భూతి రెండూ శివుడి పేర్లే. భవస్య సితాననమ్ చ భూతేః సితాననమ్ చ భవభూతిసితాననే. ప్రస్తుతానికి అననౌ సరైనదే అని సరిపెట్టుకుంటే…
తపస్వి (తపించుచున్న) గిరిజాయాః (గిరిజయొక్క) తనౌ (తనువునందు) కాం (ఏ) అవస్థాం (అవస్థను) గతః (పొంది) స్మేర ఆననౌ ఇవ (నవ్వుచున్న ముఖద్వయమువలె) ఇతి (అని) [స్తః (ఉన్నవో)] తాభ్యాం (ఆ) భవభూతిసితాననాభ్యాం (భవభూతుల శ్వేతముఖద్వయమునకు) వన్దే (నమస్కరించుచున్నాను)
విభక్తి మార్చినా కూడ శ్లోకం అసంపూర్ణంగానే ఉంది అనిపిస్తోంది. దీనికి ముందు వెనకలు తెలిస్తే ఏమైనా అర్థం చేసుకోవచ్చండీ.
By: రాఘవ on April 6, 2009
at 1:49 pm
ముందుగా కామేశ్వరరావుగారికి – మీరిచ్చిన లింకు పని చెయ్యడం లేదు. మీరు పెట్టిన కామెంటు వెంటనే చూశాను గానీ తీరిగ్గా సమాధానమిద్దామనుకుని ఆగాను. ఈలోగా ఉద్యోగంలోనూ, వ్యక్తిగతంగానూ కొంచం పనులు ఎక్కువైపోయి ఈమధ్య బ్లాగుల జోలికే రావడం కుదరలేదు.
రాఘవ గారూ – ఈ శ్లోకానికి అన్వయంలో మీరు పొరపడ్డారనిపిస్తూంది. నేను వ్యక్తిగతంగా మీకు ఒక వేగు పంపుతాను. ఈ శ్లోకం గురించి బ్లాగులో చర్చించదలచుకోలేదు.
By: nagamurali on April 6, 2009
at 3:11 pm
నేరుగా పుస్తకంలో పేజీకి లింకిచ్చాను. అది పనిచెయ్యటం లేదని చూసుకోలేదు. ఈ లంకె పనిచేస్తోందనుకుంటాను:
http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0083/453first=1last=288barcode=1990160083448
ఇందులో 21 పేజీలో చూడండి.
రాఘవగారు, ఈ లింకులో “సితాననౌ” అనే ఉందండి మరి. ఇందులో పూర్తి శ్లోకం లేదు, ఈ శ్లోకం మా మామగారు చెప్పగా నేను రాసుకున్నాను.
By: కామేశ్వర రావు on April 7, 2009
at 4:33 am
క్షమించాలి. పై లింకు కూడా పనిచేయ్యటం లేదు. పోస్టు చేసేసరికి అసలు URLలో ఉన్న “&” ఎగిరిపోతున్నాయి.
ఈ మారు మళ్ళీ ప్రయత్నిస్తున్నాను:
http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0083/453&first=1&last=288&barcode=1990160083448
By: కామేశ్వర రావు on April 7, 2009
at 4:48 am
కామేశ్వరరావు గారూ, లంకె ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ శ్లోక వివరణ చదివాను. కొంచం దూరాన్వయాలు ఉన్నాయి (సంస్కృతంతో వచ్చిన చిక్కే అది) గానీ, ఇక్కడ ’భూధరభువు’ అంటే పర్వతరాజ పుత్రి, పార్వతి అని అర్థం ఇచ్చారు. భవభూతి (ఈశ్వరుని విభూతి) సంబంధం చేత సరస్వతి కూడా పార్వతిలాగే భాసిస్తోంది. లేకపోతే, ఆయన కల్పించిన కారుణ్యంలో రాయి ఎందుకు ఏడుస్తుంది? (రాళ్ళు పర్వతాలకి సంబంధించినవి. పర్వతం శివునికి మామగారు. ఆ సంబంధంచేత రాయి కూడా ఏడుస్తోందని ఒక వివరణ.)
అదలా ఉంచితే, మరొక ప్రసిద్ధమైన సూక్తి, ’వాణీ బాణో బభూవ’ అన్నది కూడా దీని తర్వాత శ్లోకంలోదని తెలిసింది. చాలా మంచి లంకె ఇచ్చారు. నిదానంగా చదువుతాను.
రాఘవ గారూ, ’భవభూతి సితాననౌ’ శ్లోకానికి పాఠాంతరాలు ఉన్నాయి. కామేశ్వరరావుగారు ఇచ్చిన లంకెలోనే ఒక పాఠాంతరం కనిపిస్తుంది. ఇక నేను ఇదివరకెప్పుడో ’వందే భవభూతి సమాహితౌ’ అని చదివిన గుర్తు.
By: nagamurali on April 7, 2009
at 9:46 am
ఈ శ్లోకం నాకు తెలీదుగానీ, ఇదే విషయం మీద చిన్నప్పుడు బట్టీ పెట్టిన మరో శ్లోకం, మీ అనుమతితో చెప్పాలని కోరికగా వుంది.
అసంభవం హేమ మృగస్య జన్మ
తధాపి రామో లులుభే మృగాయ
ప్రాయః సమాపన్న విపత్తికాలే
ధీయోపి పుంసాం నలినీ భవంతి
ఇది సుభాషితమని తెలుస్తోంది. తాత్పర్యం చెప్పబూనే కుప్పిగంతులు వెయ్యను.
By: చిన్నమయ్య on April 10, 2009
at 7:55 pm
చిన్నమయ్య గారూ, నా అనుమతి ఎందుకండీ. నిరభ్యంతరంగా చెప్పచ్చు ఇలాంటి విశేషాలు మా అందరికీ. శ్లోకం చాలా బాగుంది కానీ, ఇది రాముడి కన్నా సీతకే ఎక్కువ వర్తిస్తుందేమో!! ఎందుకంటే కాంచన మృగం గురించి ’లోభ’పడ్డది సీత కదా.
By: nagamurali on April 10, 2009
at 8:35 pm