Posted by: nagamurali | March 2, 2009

అమ్మయ్య! బతికాను

‘అమ్మయ్య, బతికాను’ అన్న మాటని సంస్కృతంలో ఎలా అనొచ్చో తెలుసా? ‘హన్త, మాతః జీవామి’. అయితే ఇలా అనడం సంస్కృతానికి సహజమైన ప్రయోగం కాదుట. అచ్చ తెనుగు మాటని మక్కీకి మక్కీ సంస్కృతంలోకి అనువదించడమేనుట. అయితే ఈ మాటని భవభూతి తన ఉత్తర రామచరిత్రంలో ఒక పాత్ర నోట పలికిస్తాడు. దొరికాడు, మన తెలుగు ప్రయోగాన్ని వాడాడు కాబట్టి భవభూతి తెలుగువాడే అని సంబరపడతారు మన తెలుగువాళ్ళు.

డిగ్రీ చదువుతున్న రోజుల్లో భవభూతి ఉత్తర రామచరిత్రం చదవడానికి నాకు ప్రేరణ కలిగించింది ఆ నాటకం గురించి చదివిన కొన్ని ఉపన్యాసాలు. (ఉపన్యాసాలు చదవడం ఏమిటని అడక్కండి.) ఆ ఉపన్యాసాలు ఇచ్చినాయన ఈ ‘హన్త, మాతర్జీవామి’ అన్న మాట గురించి చెప్పి,  తెలుగులో తప్ప ఇతర భారతీయ భాషలు వేటిలోనూ ఈ ప్రయోగం లేదు, కాబట్టి భవభూతి మనవాడే అన్నారు. అలాగే భవభూతి ఉత్తర రామచరిత్రంలో గోదావరి నదిని గొప్ప ప్రేమతో ఎంతో అందంగా వర్ణిస్తాడు. దాన్నిబట్టి కూడా ఆయన తెలుగువాడని చెప్పవచ్చును అన్నారు. దానితో భవభూతి మన తెలుగువాడే అని మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. తర్వాత ఉత్తర రామచరిత్ర నాటకం చదివి అందులో ఈ ‘హన్త మాతర్జీవామి’ అన్న మాటలు ఎక్కడొస్తాయో తెలిసినప్పుడు చాలా ఆనందం కలిగింది.

నాటకంలో మరో చోట ఇంకొక పాత్ర లక్ష్మణుడి కొడుకు చంద్రకేతువుని ఉద్దేశించి, ‘కుమార లక్ష్మణస్యాపి పుత్రః’ అంటుంది. దానికి, ‘మన లక్ష్మణుడికి కూడా కొడుకా?’ అని మనసులోనే తెలుగులోకి అనువదించుకుని ఆనందపడ్డాను. ఆ మాట నాటకంలో ఏ పాత్ర అంటుందో ఇప్పుడు గుర్తు లేదు కానీ, ఆ పాత్ర దృష్టిలో లక్ష్మణుడంటే ముక్కుపచ్చలారని పసి బాలుడు. అటువంటి లక్ష్మణుడికి కూడా ఒక కొడుకు, వాడూ కుశలవుల్లాగే విల్లూ బాణాలూ పట్టుకుని యుద్ధానికి వచ్చేటంత మొనగాడూ అని తెలిసినప్పుడు వాత్సల్యపూరితమైన ఆశ్చర్యంతో అనుకునే మాట అది.

ఉత్తర రామచరిత్రంలో ఉండే గొప్ప లక్షణమే అది అని నాకు అనిపించింది. ఏమిటంటే, రామాయణ పాత్రలపట్ల ఎంతో ప్రేమ కలిగిన కవీ, పాఠకులూ ఆ పాత్రలతో మమేకమైపోయి, వాళ్ళతో కలిసి తామూ సంభాషిస్తూ, ఆయా సన్నివేశాల్లో పాలు పంచుకున్న అనుభూతి కలుగుతుంది నాటకం చదువుతున్నంతసేపూ. ఎంతో ఆత్మీయంగా ఉంటాయి ఆ సంభాషణలు. మొదటి అంకంలో రాముడి గూఢచారి రాముణ్ణి ‘రామభద్రా’ అని పిలిచి, నాలిక్కరుచుకుని, మహారాజా అంటాడు. పాపం చిన్నతనం నుంచీ  ‘రామయ్యా’ అని ప్రేమగా పిలవడం అలవాటైనవాడికి కొత్తగా రాజైన రాముణ్ణి మహారాజా అని సంబోధించడం కొత్తగా ఉంటుంది. అప్పుడు రాముడు అతణ్ణి ‘నన్ను మహారాజా అని పిలవకు, రామభద్రా అనే పిలు’ అని కోరుతాడు. ఇటువంటి ఉదాహరణలు ఒకటా, రెండా… ఇంతకీ అసలు విషయానికొస్తే..

ఈమధ్య భవభూతి విశేషాలు మళ్ళీ చదువుతుంటే ఆయన మహారాష్ట్రుడు గానీ, ఆంధ్రుడు కానీ కావచ్చని తెలిసింది. ఉత్తర రామచరిత్రకి వ్యాఖ్యానం రాసిన పండితులు అందులో ద్రావిడ భాషా ప్రయోగాలు ఉన్నాయని పేర్కొన్నారట. ‘అమ్మయ్య బతికాను’ అన్న మాట ద్రావిడ భాషా ప్రయోగమని వాళ్ళన్నారు గానీ, ఖచ్చితంగా తెలుగు ప్రయోగమే అని అనలేదు. అంతే కాక భవభూతి కృష్ణ యజుర్వేద తైత్తరీయ శాఖకి చెందినవాడు, కాశ్యప గోత్రుడు. ఈ శాఖీయులు మహారాష్ట్రులూ ఉన్నారు, ఆంధ్రులూ ఉన్నారు. ఉదుంబర అనే పేరు గల బ్రాహ్మణులకు చెందినవాడిని అని కూడా భవభూతి చెప్పుకున్నాడు. ఈ ఉదుంబర అన్నది ఇంటిపేరు కావచ్చనీ, ఇంటి పేర్లుండడం మహారాష్ట్రుల్లో లేదు కాబట్టి భవభూతి తెలుగువాడే అయి ఉండవచ్చనీ కూడా ఒక అభిప్రాయం.

భవభూతి విదర్భ దేశంలోని పద్మపురానికి చెందినవాడు. క్రీ.శ. 680-750 ప్రాంతం వాడు. విదర్భ ఆంధ్ర సరిహద్దుల్లోనే ఉన్నదనీ, ఆ కాలంలో అక్కడ అనేకమంది తెలుగు పండిత కవులు స్థిరపడి ఉండవచ్చనీ కాబట్టి భవభూతి తత్పూర్వమెప్పుడో అక్కడ స్థిరపడిన ఆంధ్రుల సంతతివాడై కూడా ఉండవచ్చనీ మరొక అభిప్రాయం. ఏది ఏమైనా మొత్తానికి ఆయన తెలుగువాడే అని ఒకసారి మనం అనేసుకుంటే ఆ ప్రేమతో అయినా ఉత్తర రామచరిత్రం చదవడానికి ప్రేరణ కలుగుతుందేమో!!

‘భవభూతి’ అన్నది ఆయన అసలు పేరు కాకపోవచ్చు. అసలు పేరు శ్రీకంఠుడు అని కొందరు అభిప్రాయపడితే, కొందరు అది కేవలం బిరుదు కావచ్చనీ అంటారు. ఆయన తండ్రి పేరు నీలకంఠుడు. తల్లి పేరు జాతుకర్ణి. మరికొన్ని విశేషాలు మిగతా టపాల్లో.

తెలుగు నుడికారాల్ని సంస్కృతంలోకి మక్కీకి మక్కీ అనువదించడం అంటే నాకు భైరవద్వీపం సినిమాలో కామెడీ గుర్తు వస్తుంది. అందులో అడవిపాలు అనడానికి ‘అరణ్య క్షీరం’ అనీ, పెళ్ళి కొడుకులు అనడానికి ‘వివాహ పుత్రులు’ అనీ ఇంకా ఏవేవో అంటారు.


Responses

  1. భవభూతి తెలుగు వాడు అని “నిడదవోలు వెంకటరావు” గారో, “వేదం” వారో ఓ వ్యాసం వ్రాశారు. డిజిటల్ లైబ్రరీలో, ఒకానొక భారతి సంచిక లో మొన్నే చూసాను. సరిగ్గా గుర్తు లేదు. ఏ సంచిక అని.

    “ఉదుంబర” అంటే మేడి చెట్టు అనుకుంటాను.

  2. చాలా ఆసక్తికరంగా ఉంది ఈ పరిశోధన. కవులు ప్రవర చెప్పుకుంటారు గదా. భవభూతి వివరంగా ప్రవర చెప్పుకోలేదేమో!

    ఇంతకీ “అమ్మయ్య బతికాను” అని ఎవరు ఏ సందర్భంలో అనుకున్నారు?

  3. ఇక్కడ ఓ మారు చూడండి.

  4. రవి గారూ, లంకె ఇచ్చినందుకు నెనర్లు. కానీ అక్కడ పదహారు పేజీలే ఉన్నాయి. వ్యాసం అసంపూర్తిగానే దొరికింది.

    చదువరి గారూ, ఇప్పుడే ఓసారి ఉత్తరరామచరిత్రం తిరగేశాను. నేను చెప్పిన రెండు మాటలూ ద్వితీయాంకంలో ఒకళ్ళన్నవే. మొత్తం డైలాగు ఇదీ – ‘కుమార లక్ష్మణస్యాపి పుత్ర:! హన్త మాతర్జీవామి‘.

    ప్రథమాంకంలో సీతని రాముడు పరిత్యజిస్తాడు. ఆ తర్వాత జరిగిన కథని వాసన్తీ అనే వనదేవతకి, ఆత్రేయి అనబడే వాల్మీకి శిష్యురాలు చెప్తుంది. వాసన్తి పంచవటీ ప్రాంతపు వనదేవత. సీతకి వనవాస సమయంలో స్నేహితురాలు.

    ఆమె ఆత్రేయి ద్వారా – వాల్మీకి లవకుశులనే ఎవరో ఇద్దరు దివ్య బాలకుల్ని పెంచుతున్నారనీ, రామాయణం రాస్తున్నారనీ, రాముడు అశ్వమేధం చేస్తున్నాడనీ, యాగాశ్వాన్ని రక్షిస్తూ చంద్రకేతువు వెళ్తున్నాడనీ – తెలుసుకుంటుంది. చంద్రకేతువు లక్ష్మణుడి కొడుకు అని తెలిసి ఆశ్చర్యపోయి ‘అమ్మయ్యో, బతికాను’ అంటుంది.

  5. నేను చాలా పెద్ద వ్యాసం ఊహించుకుని మొదలుపెట్టాను. అర్దాంతరంగా ఆగిపోయింది అనిపించింది చదువుతూంటే. మిగతా ఉత్తరరామచరిత్రపు భాగాలు ఎప్పుడు వ్రాస్తున్నారు?

    పాత్రలతో మమేకమైపోయేలా సంభాషణలన్నీ అనుభవింపజేసేలా ఉందీ అంటే ఆ రచన రససిద్ధిని కలిగించడంలో సఫలమైందనే కదండీ. ఉత్తరరామచరిత్రానికి ఆ లక్షణాలన్నీ చక్కగా ఉండబట్టే కదా భవభూతికి సంస్కృతసారస్వతంలో శాశ్వతస్థానం దొరికినదీ?!

  6. ఉత్తరరామచరితంలో ఆవుమాంసాన్ని ఎడాపెడా తిన్నాడని చెప్పడానికి భవభూతి “మడమడాయితః” అనే ప్రయోగం చేశాడు. దాన్ని బట్టి కూడా ఆయన తెలుగువాడేమోననిపిస్తుంది.

  7. రాఘవ గారూ, రససిద్ధి అన్న మాటకి నిర్వచనం లాంటిది ఉత్తర రామచరిత్రం. దాని గురించి వ్యాసాలు రాయాలంటే మళ్ళీ మొత్తం అంతా సమగ్రంగా చదివి, ఇంకా ఎన్నో గ్రంధాలు, వ్యాఖ్యానాలు చదివితేగానీ తృప్తికరమైన వ్యాసం రాదు. అందుకని ప్రస్తుతానికి వ్యాసం రాసే పని పెట్టుకోలేదు.

    తాడేపల్లి గారూ, ఈ ‘మడమడాయితం’ అన్న ప్రయోగం నాకు గుర్తు ఉంది. అయితే గోవుని ఆశ్రమానికి విచ్చేసిన అతిథుల నిమిత్తం ‘మడమడాయించారు’ అన్న విధంగా ఆ ప్రయోగం ఉందని గుర్తు. మొట్టమొదట నాటకం చదివిన చిన్నతనంలో ‘ఆధునిక’ రచనలతో పరిచయం తక్కువ ఉండడం వల్ల ఈ మాట చదివి కొంచం షాకయ్యాను.

  8. నాగమురళి-గారు: ఇంద్రగంటి వారి పూర్తి వ్యాసం నేను జర్మనీ చేరగానే పంపుతాను. (రవి గారు పేర్కున్న ఆ సంచిక నాకు విలువైనది. ఎందుకంటే అక్కడ నాలుగో పేజీలో వున్న ప్రకటన :-) ఆ ప్రకటనని మొన్నీమధ్యే ఒక చిన్న వ్యాసంలో ఉదహరించాను కూడా! నాకు తెలుగు పాటల చరిత్ర చెప్పడంలో ఇలాంటి ప్రకటనలే చాలా సహాయపడుతున్నాయి.)

    నాకు సంస్కృతం రాదు కాబట్టి తెలుగు, జర్మన్, ఆంగ్ల అనువాదాల మీదే ఆధారపడతాను. ఈ మధ్యే షెల్డన్ పాలాక్ (Sheldon Pollock) ఉత్తరరామ చరితాన్ని కొత్తగా అనువదించాడు (Clay-series). ఈ క్లే సిరీస్ ని వీలైతే ఒకసారి చూడండి. సంస్కృత/ప్రాకృత సాహిత్యాన్నంతటినీ అనువదింపించే బృహత్ కార్యాక్రమం. అసలు పాఠాన్ని కూడా ఇస్తారు, ఒక్క అనువాదమే కాదు!

    అసలు విషయానికొస్తే, భవభూతి తెలుగువాడు అనే వాదన్ని, జరిగిన చర్చల్ని మొత్తాన్ని క్రోడీకరించి ఇంగ్లీషులోకి అనువదించి చేర్చి ఒక చోట పెడితే బాగుండునని ఎప్పటినుండో అనుకుంటున్నాను. చేయగలమా! :) నాకు తెలిసినంతలో “academic literature” లో ఈ “తెలుగు వాదం” గురించి కనిపించదు.

    – శ్రీనివాస్

  9. శ్రీనివాస్ గారూ, మీ కామెంటుకి చాలా చాలా థాంకులు.


Leave a response

Your response:

Categories