కొన్ని రోజుల క్రితం సినిమాల్లోని రొమాంటిక్ సన్నివేశాల గురించి ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే ఈ శ్లోకం గుర్తు వచ్చింది.
కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాత్
అవిరళిత కపోలం జల్పతో రక్రమేణ
అశిథిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో:
అవిదిత గతయామా రాత్రిరేవ వ్యరంసీత్ ||
‘వాళ్ళిద్దరూ సాయంత్రం పూట ఒకళ్ళ చెంపలు ఒకళ్ళకి ఆనించి ఒక క్రమం లేకుండా ప్రేమతో ఏవేవో ఊసులాడుకుంటుండేవారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరికీ సమయమే తెలిసేది కాదు. అలా, అలా మాటల్లోనే రాత్రి మొత్తం గడిచిపోయేది’.
భవభూతి రాసిన ‘ఉత్తర రామచరిత్రం’లోనిదీ ప్రసిద్ధమైన శ్లోకం. సీతారాములు తమ వనవాసపు రోజుల్ని గుర్తు చేసుకుంటూ అనుకున్న మాటలు.
సంస్కృత సాహిత్యం పట్ల ఏ కొంచం ఆసక్తి ఉన్నవారికైనా తప్పకుండా భవభూతి రాసిన ఉత్తర రామచరిత్రం గురించి తెలిసే ఉంటుంది. సంస్కృత నాటక సాహిత్యంలోనే దీన్ని అత్యుత్తమమైన నాటకంగా పేర్కొనవచ్చు. (నా అభిప్రాయం ప్రకారం ప్రప్రంచ నాటక సాహిత్యంలోనే ఈ నాటకానికి చాలా గొప్ప స్థానం ఉంటుంది). ఈ ఒక్క నాటకం వల్లనే భవభూతి కాళిదాసాదుల్ని మించిన కీర్తిని గడించుకున్నాడు. శాశ్వతంగా భారతీయుల హృదయాల్లో నిలిచిపోయాడు.
పై శ్లోకం మీద ప్రేమతో కొంతమంది ఒక కథ కూడా చెప్తారు. మొదట భవభూతి ఈ శ్లోకానికి ఆఖరి పాదంలో ‘రాత్రిరేవం వ్యరంసీత్’ అని రాశాట్ట. అంటే, రాత్రి అంతా ఈ విధంగా గడిచిపోయిందని అర్థం. రాసి, మిత్రుడైన కాళిదాసుకి శ్లోకాన్ని వినిపించాడట. (ఇద్దరూ సమకాలికులు కారు. ఇది వట్టి కట్టుకథ.)
కాళిదాసు విని, ‘రాత్రిరేవం లో అనుస్వారాన్ని తీసెయ్యవయ్యా’ అని సలహా ఇచ్చాట్ట. అంటే అప్పుడు అది ‘రాత్రిరేవ’ అవుతుంది. మాట్లాడుకుంటూ ఉండగా రాత్రే గడిచిపోయింది అని ఇంకా అందమైన అర్థం వస్తుంది. భలే, అనుకున్నార్ట మిత్రులిద్దరూను.
భవభూతి రాసిన మరికొన్ని శ్లోకాలు వచ్చే టపాల్లో పరిచయం చేస్తాను.
(ఈ సంవత్సరమంతా సంస్కృత సాహిత్యం గురించే బ్లాగుతానేమో – చదువుతున్న, చదవబోతున్న పుస్తకాల ప్రభావంతో.)
బాగు బాగు. ఈ శ్లోకాన్ని గురించి కొన్నేళ్ళ క్రితం రచ్చబండ యాహూగ్రూపులో ఎవరో పెద్దలు సవివరంగా చెప్పగా విన్నాను.
By: కొత్తపాళీ on February 28, 2009
at 10:17 pm
పొద్దున లేవగానే ఈ రసగుళిక !
ఇంకొక్క ధూర్జటి పద్యమూ చూశాను. ఆ ధూర్జటి పద్యం గురించి వీలున్నప్పుడు బ్లాగుతాను.
By: రవి on March 1, 2009
at 2:03 am
thanks:)
By: vamsi on March 1, 2009
at 5:57 am
బాగుంది శ్లోకం. పిట్టకథ కూడా. కాకపోతే, ఒక చిన్న కాంప్లిమెంటు. కమర్షియల్ రచయితగా ఎదిగే లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి శ్లోకాలు ఇంతకు ముందు రాసినప్పుడు ఒక కాళిదాసు శ్లోకమనీ గట్రా టపా శీర్షికలు పెట్టడం నుంచీ, ఒక రొమాంటిక్ సన్నివేశం అని ఈ టపాకి శీర్షిక పెట్టడం దాకా… ఊ… మురళీగారూ, అదరహో… ఇంక తగ్గకండి….
By: చివుకుల కృష్ణమోహన్ on March 1, 2009
at 7:38 am
కొత్తపాళీ గారు, నెనర్లు. రచ్చబండలో మీరు చెప్పిన పోస్టు దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను.
రవి గారూ, నెనర్లు. ధూర్జటి పద్యం గురించి మీ టపా కోసం ఎదురు చూస్తాను.
మొత్తానికి కొంచం డెవలప్మెంట్ ఉందంటారు. Thank you.
వంశీ గారూ, నెనర్లు.
కృష్ణమోహన్ గారూ –
By: nagamurali on March 1, 2009
at 8:26 am
నాగమురళి-గారు,
రచ్చబండలో చర్చ యిక్కడ:
http://groups.yahoo.com/group/racchabanda/message/16107
For a detailed (and theoretical) discussion, see: Velcheru Narayana Rao and David Shulman’s “A poem at the right moment”, 1998. A book, I am sure, you’d certainly enjoy.
Regards,
Sreenivas
By: పరుచూరి శ్రీనివాస్ on March 1, 2009
at 11:10 am
శ్రీనివాస్ గారూ, లంకె ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. రచ్చబండలో వేలూరి గారి వ్యాసం (వ్యాసం అనొచ్చా?) చాలా బాగుంది. నాకు ‘సున్నం’ కథ తెలియదు. కాళిదాసు, భవభూతుల ‘అణా’ కథ లాగే ఉంది.
By: nagamurali on March 1, 2009
at 1:05 pm
Just passing by.Btw, your website have great content!
_________________________________
Making Money $150 An Hour
By: Mike on March 1, 2009
at 4:20 pm
“ఈ సంవత్సరమంతా సంస్కృత సాహిత్యం గురించే బ్లాగుతానేమో – చదువుతున్న, చదవబోతున్న పుస్తకాల ప్రభావంతో”
ఇకనేం, ఈ ఏడాది మా పంటపండిందన్న మాట!
మంచి శ్లోకాన్ని మళ్ళీ గుర్తుచేసారు. ఇది చదవగానే రచ్చబండలో వేలూరివారి వివరణ నేను చేసిన అనువాద ప్రయత్నం రెండూ గుర్తుకొచ్చాయి. చూస్తే కిందన ఆ లంకెకూడా ఉండనే ఉంది!
సరే, ఇక మీరు వివరించే ప్రతి శ్లోకాన్నీ నేను తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేస్తాను (అనువాదయోగ్యమైతేనే!).
By: కామేశ్వర రావు on March 2, 2009
at 7:49 pm
కామేశ్వరరావు గారూ, మీ కామెంటుకి చాలా చాలా సంతోషం కలిగింది. ఇంక నాకు ఇష్టమైన శ్లోకాలన్నిటినీ మీచేత తెలుగులోకి అనువదింపచేసుకోవచ్చన్నమాట…
By: nagamurali on March 2, 2009
at 8:24 pm
ఇంతకీ ఏయే పుస్తకాలు చదువుతున్నారో ఏయే పుస్తకాలు చదవబోతున్నారో కూడా చెప్పచ్చు కదండీ?
By: రాఘవ on March 4, 2009
at 12:57 pm
నాగ మురళి గారు, మీ బ్లాగులొ విషయాలు బావున్నాయి, అప్రతిహతంగా కొనసాగుతూనే ఉండండి.
మీ
ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)
By: ఈగ హనుమాన్ on March 16, 2009
at 5:20 am