
చాలా పుస్తకాలు మనం చదివి పక్కన పడేస్తాము. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదు. కానీ అరుదుగా కొన్ని పుస్తకాలు చాలా ఎక్కువ ఆలోచింపజేస్తాయి. అవి రేకెత్తించే ఆలోచనలు సంవత్సరాలతరబడి వెంటాడతాయి. నేను గతవారమే చదవడం పూర్తిచేసిన Astrology, Science and Culture: Pulling Down the Moon అన్న పుస్తకం ఈ రెండవ కోవకి చెందుతుంది. ఈ పుస్తకాన్ని నేనిప్పుడు సమీక్షించబోవడం లేదు. దాన్ని చదివాక ముసిరిన అనేక ఆలోచనల్లో కొన్నిటిని అక్షరబద్ధం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను, అంతే.
(ఈ పుస్తక రచయితల్లో ఒకడైన పాట్రిక్ కర్రీని కొద్ది నెలల క్రితం నేను కలుసుకుని మాట్లాడాను. నా (అతి) ఉత్సాహపూర్వకమైన సంభాషణకి ఫలితంగా ఆయన నాకీ పుస్తకాన్ని బహుకరించాడు. పాట్రిక్ యూకేలోని విశ్వవిద్యాలయాల్లో Cultural Astronomy and Divination అన్న సబ్జక్టుల్లో ఆచార్యుడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాశ్చాత్య జ్యోతిష్కులతో అతనికి గట్టి పరిచయాలున్నాయి.)
ఆంత్రొపాలజీని ప్రాతిపదికగా తీసుకుని జ్యోతిషంయొక్క మూలాల చర్చతో ఈ పుస్తకం ప్రారంభమౌతుంది. ఆధునిక చరిత్రకారుల ప్రకారం జ్యోతిషం క్రీస్తు పూర్వం మూడవ సహస్రాబ్దంలో మెసపొటోమియాలో పుట్టింది. కానీ జ్యోతిషం చరిత్రకు పూర్వం నాటిదనీ, క్రీ.పూ ముప్ఫైవేల యేళ్ళకి పూర్వంనాటి ఆదిమ మానవుల సంస్కృతిలో కూడా చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని నిర్మితమైన జ్యోతిషానికి సంబంధించిన ఆధారాలు కనిపిస్తాయనీ ఈ పుస్తకం వివరిస్తుంది. అనేక ప్రాచీన సంస్కృతుల పురాణ గాధల్నీ, వాటి మధ్య సామ్యాన్నీ కూడా కొన్ని అధ్యాయాల్లో ఈ పుస్తకం వివరిస్తుంది.
ప్రాచీన మానవులు తమను తాము ఒక సజీవ ప్రపంచంలో భాగాలుగా గుర్తించుకున్నారు. వాళ్ళ ప్రపంచంలో సజీవం కానిదేమీ లేదు. నింగీ, నేలా, రాయీ, రప్పా, గాలీ, నిప్పూ, జంతువులూ, పర్వతాలూ, అడవులూ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు – అన్నీ వాళ్ళకి సజీవాలే. వాటిలోనే వాళ్ళు దేవతలనీ, కంటికి కనిపించని దివ్య జీవుల్నీ, దుష్టజీవుల్నీ దర్శించారు. వాటితో నిరంతర సంభాషణ సాగించారు. తమకి ఆపదలు కలక్కుండా ఉండడానికి ఆ జీవుల్ని ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నించారు. ఆయా దేవతలకి ఆగ్రహం కలక్కుండా, వారి సంకల్పాన్ని తెలుసుకుని, వారి అనుమతితో ప్రవర్తించడం వాళ్ళకి ప్రథమ కర్తవ్యం. వాళ్ళు ఏ పని చెయ్యాలన్నా దానికి దేవతల ఆనుకూల్యతని తెలుసుకోడానికీ, సంపాదించడానికీ ప్రయత్నించారు. దానికోసమై ఎన్నో క్రతువులు ఏర్పడ్డాయి. ప్రపంచంలో ఏ మూల పరిశీలించినా ప్రాచీన మానవ సంస్కృతి ఈ తీరుగానే కనిపిస్తుంది.
ఆ విధంగా దేవతల సంకల్పమేమిటో తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే ‘దైవజ్ఞత’ (Divination) అయింది. దానికోసం పుట్టిన నానావిధాల క్రతువుల్లో భాగమే జ్యోతిషం. కాబట్టి ప్రస్తుత జ్యోతిషానికి అసలు రూపం దైవజ్ఞత. దాని అసలు ఉద్దేశ్యం దైవ సంకల్పాన్ని తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తించడం. దాన్ని ఉపయోగించి భవిష్యత్తు తెలుసుకోడంలాంటివి తర్వాత జరిగిన ‘ఆధునిక’ పరిణామాలు.
తమ చుట్టూ ఉన్న ప్రపంచం సజీవమైనదనీ, అనేక సజీవమైన శక్తులతో నిండి ఉన్నదనీ భావించి వాటితో ఒక సంభాషణ పూర్వకమైన మన: స్థితిని కలిగి ఉండడాన్ని రచయితలు ‘సమ్మోహిత స్థితి’ (Enchantment) గా పేర్కొన్నారు.
అయితే గత రెండు వేల యేళ్ళుగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఏకేశ్వరోపాసనా మతాలు (క్రైస్తవం, ఇస్లాం మొదలైనవి) అనేక దేవతల స్థానంలో ఒకే దేముణ్ణి స్థిరపరచి, వాటికి నచ్చని గందరగోళాన్ని తొలగించి, ఒకే రకపు ఆలోచనావిధాన్ని (totalitarian, absolutist ideas) విశ్వవ్యాప్తం చెయ్యడానికి ప్రయత్నించాయి. చాలామటుకు సఫలీకృతమయ్యాయి కూడా.
గత మూడు, నాలుగు వందల యేళ్ళుగా ప్రాచుర్యంలోకి వచ్చిన సైన్సు కూడా ఈ మతాలవంటిదే అని రచయిత అభిప్రాయపడతాడు. సైన్సు ఒక స్థిరమైన దృక్కోణాన్ని ప్రతిపాదించి, ప్రస్తుత సమాజం మీద పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. తాను నిర్మించిన చట్రంలో ఇమిడేదే పనికొచ్చేదనీ, సత్యమనీ భావించింది. ఏకేశ్వరోపాసనా మతాలతో సహా తన చట్రంలో ఇమడనివాటిని అన్నిటినీ తిరస్కరించింది.
‘సమ్మోహిత స్థితి’లో ఒక సజీవ ప్రపంచంలో అనంత వైవిధ్యంగల శక్తులతో సంభాషిస్తూ, సహజీవనం చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఒకే చట్రంలో ఇరుక్కుని తమ సమ్మోహిత స్థితిని కోల్పోవడాన్ని రచయిత ‘విమోహిత స్థితి’ (Disenchantment) అని పేర్కొంటాడు.
పురాతన సమ్మోహిత స్థితిలో ‘దైవజ్ఞత’గా ఉండిన జ్యోతిష్యం ఏకేశ్వరోపాసనా మతాల తాకిడిలో ఏ విధంగా మార్పు చెందిందో, తర్వాత సైన్సు యొక్క ముట్టడిని తట్టుకోడానికి తన రూపాలు ఎలా మార్చుకొన్నదో రచయిత అద్భుతంగా వివరిస్తాడు. (ఈ పుస్తకం పాశ్చాత్య జ్యోతిష సాంప్రదాయాల గురించి, వాటి చరిత్ర గురించీ మాత్రమే చర్చిస్తుంది.) సైన్సు ప్రతిపాదించిన చట్రంలో ఇరుక్కుంటే జ్యోతిషానికి అంతిమంగా మరణమే గతి అనీ, ఆ చట్రంలోంచి బయటపడి తన మూలాల్ని తాను తెలుసుకోవాలనీ కూడా అంటాడు.
అంతే కాక ఆఖరి అధ్యాయాల్లో కొన్ని అసాధారణ విషయాలు ప్రకటిస్తాడు. మానవ శిశువులపైన అతి సూక్ష్మ పరిశీలనతో కూడిన అధ్యయనాలవల్ల తేలుతున్నదేమిటంటే, ఆ శిశువులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సజీవమైనదిగా భావించి దానితో తమ ప్రవర్తన ద్వారా సంభాషిస్తుంటారు. అంటే, మానవులంతా పుట్టుకతో, ప్రాథమికంగా సమ్మోహితులుగానే ఉంటారు. ఎదిగే కొద్దీ సామాజిక పరిస్థితుల ప్రభావంతో విమోహితులౌతారు.
మన మెదడులోని ఎడమ భాగం తార్కిక ఆలోచనలనీ, కుడి భాగం కవితాత్మక, మార్మిక, ఆధ్యాత్మిక భావనలనీ పరిపాలిస్తాయి. జ్యోతిషం లేక దైవజ్ఞత యొక్క వినియోగం తార్కికమైన ఆలోచనా క్రమంతో ప్రారంభమై, కవితాత్మక, మార్మిక భావనల్లోకి అప్రయత్నంగా పరిణమిస్తుంది. కాబట్టి సైన్సు సిద్ధాంతాల తార్కిక చట్రాల్లోకి జ్యోతిషాన్ని నిబద్ధించడం సాధ్యం కాదు.
——
ఇంకా అనేకానేక విషయాలని వివరించే ఈ పుస్తకం సాధారణ పాఠకులకోసం ఉద్దేశించబడిందని నాకు అనిపించలేదు. తేలికగా నడవదు. ఈ పుస్తకం నాలో అనేక రకాల ఆలోచనల్ని రేకెత్తించింది. వాటిలో కొన్ని -
1. మానవ స్వభావం సిద్ధాంతాల చట్రాలకి లొంగేది కాదు. సైన్సు, కమ్యూనిజం, ఇంకా ఇతర సామాజిక, తాత్త్విక, మత సిద్ధాంతాల కళ్ళజోళ్ళలోంచి చూసి మనుషుల్ని అంచనా వెయ్యడానికీ, నియంత్రించడానికీ ప్రయత్నిస్తున్నాము అంటే, వాళ్ళ స్వభావంలోని కొన్ని మౌలిక భాగాల్ని తిరస్కరిస్తున్నాము అన్నమాట.
2. రిచర్డు డాకిన్సు Unweaving the Rainbow అని ఒక పుస్తకం రాశాడు. దేముడు లేడనీ, ఆత్మ లేదనీ, మనుషుల స్వభావాన్నీ, పరిణామాన్నీ ప్రకృతి వరణ సిద్ధాంతం సంపూర్ణంగా వివరిస్తుందనీ డాకిన్సు రాసిన పుస్తకాలు చదివి, స్కూల్లో చదివే ఒక అమ్మాయి, ‘అయితే నా జీవితానికొక పరమార్థమంటూ ఏమీ లేదా’ అని తన టీచరు దగ్గర ఏడ్చిందట. ఆ సంగతి తెలిసి, చలించిపోయి, దానికి సమాధానంగా ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు. మతాన్ని తొలగించి వెయ్యడానికి సైన్సు ప్రయత్నిస్తుంది. మతాన్ని తొలగిస్తే వచ్చే శూన్యాన్ని‘ శాస్త్రీయ పద్ధతుల్లో ప్రకృతిని పరిశీలించడం ద్వారా కలిగే సంభ్రమాశ్చర్యాలతో’ భర్తీ చెయ్యడానికి డాకిన్సు చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. ‘మతం స్థానాన్ని సైన్సుతో భర్తీ చెయ్యడం సాధ్యమేనంటావా?’ అని ఫిలాసఫీలో పీ హెచ్ డీ చేసిన ఒక ఇంగ్లీషు మిత్రుణ్ణి అడిగాను. ‘అసాధ్యం’ అన్నాడు. డాకిన్సు పొరపడుతున్నాడనీ, సైన్సు, మతమూ వేర్వేరు స్వభావాలు కలిగినవనీ, ఒకదానితో మరొకదాన్ని భర్తీ చెయ్యడం ఎన్నటికీ కుదరదనీ అతను అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని కొంతమంది విశదంగా పుస్తకాల్లో రాశారని కూడా అతను చెప్పాడు గానీ, ఇంతవరకు వాటిని చదవడం నాకు కుదరలేదు. పాట్రిక్ రాసిన ఈ పుస్తకం ఈ విషయాన్ని నాకు మళ్ళీ గుర్తు చేసింది.
3. సైన్సుని ఆధారంగా చేసుకొని దేముడు లేడని పదే పదే బోధించడం, బ్రహ్మచర్యం పాటించండని పదే పదే మొత్తుకునే మతగురువుల ప్రయత్నంలాంటిదే అని నా అభిప్రాయం. అమాయకంగా ఆ మాటలు నమ్మేవాళ్ళు కూడా ఏదో ఒక బలహీన క్షణంలో తిరుగుబాటు చేస్తారు. మౌలికమైన మానసికావసరాల్ని అణచివేస్తే, ఎప్పుడో ఒకప్పుడు మనస్సు తిరుగుబాటు చేస్తుంది. డాకిన్సు రాసిన God Delusion పుస్తకంలో ఒక ఉదాహరణ ఉంటుంది. బ్రహ్మాండంగా చదువుకుని, సైంటిస్టుగా తన కెరీర్ ని ప్రారంభించిన ఒకాయన తన చిన్నప్పటి మత నమ్మకాలకీ, సైన్సులో చదువుకున్నదానికీ మధ్య విపరీతమైన మానసిక సంఘర్షణని అనుభవించి, చివరికి తన కెరీర్ నీ, డిగ్రీలనీ పరిత్యజించి, తిరుగుబాటు చేసి, మతవిషయాలవైపు మళ్ళుతాడు. డాకిన్సు అతని గురించి చెప్పి, అతను సైన్సుకి బదులుగా మతాన్ని పూర్తిగా పరిత్యజించి ఉంటే బాగుండేదని బాధ పడతాడు.
4. తార్కిక ఆలోచనల కోసం సైన్సు గురువులు ఎంత ప్రచారం చేసినా, మాట్లాడే జంతువుల కథలూ, హారీ పోటర్ మాయ-మంత్రాల కథలూ, సినిమాలూ విశేషంగా ప్రజల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి.
5. తమ పురాతన సంస్కృతుల్ని పూర్తిగా దూరం చేసుకున్న ఆధునిక సమాజాలు విసుగు చెంది, ఒక సజీవ ప్రపంచంలో భాగం కావడానికీ, మళ్ళీ సమ్మోహితులు కావడానికీ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కొత్త మతాలు పుడుతూనే ఉంటాయి. ఇలా కొత్తగా పుట్టుకొచ్చే భావజాలాలు ప్రస్తుతం ఆధిపత్యం వహించిన totalitarian భావజాలాలతో సంఘర్షణ చెందుతాయి. చైనాలో Falun Gong ను అణచివెయ్యడానికి జరిగిన ప్రయత్నాలు దీనికి ఒక ఉదాహరణ. (http://en.wikipedia.org/wiki/Falun_Gong, http://en.wikipedia.org/wiki/Persecution_of_Falun_Gong)
6. భారతదేశం చరిత్రలో – పురాతన వైదిక మతపు సమ్మోహనత్వాన్నీ, ఆ తర్వాతి సమాజాలమీద వేర్వేరు భావ జాలాల ప్రభావాల్నీ, సంఘర్షణల్నీ పరిశీలిస్తూ ఉంటే గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. Totalitarian భావజాలాలు భారతదేశంలో ఎన్నడూ పూర్తిగా వేళ్ళూనుకొనలేకపోయాయి. ఇప్పటికీ భారతంలో చాలా భాగం pluralism, సమ్మోహనత్వం సజీవంగానే ఉన్నాయి.
ఇలా ఎన్నో తలాతోకా లేని, అర్థం పర్థం లేని ఆలోచనలు…
!
By: chavakiran on January 22, 2009
at 4:31 am
మనిషి అతి సహజంగా పుట్టుకతోనే సమ్మోహితుడు. అలా ఉండడనికే ఇష్టపడతాడు కూడా. అతడికి వున్న తార్కిక జ్ఞానం (అది కూడా సహజమయినదే) ప్రతీ అంశానికి రెండు ప్రక్కలా ఆలోచించకుండా వుండనివ్వదు. ఆ విధంగా పుట్టిందే సైన్స్. కాని, ప్రఖ్యాత సైంటిస్టుల జీవిత కధలు చదివితే వారు తమ చివరి రోజులలో ఆస్తిక వాదానికే మొగ్గు చూపి, సైన్స్ యొక్క ఆఖరి అంశం దేవుడె అనె అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సైన్స్ ఎక్కడ అంతమవుతుందో మతం అక్కడ ప్రారంభమవుతుంది అని ఒక ప్రఖ్యాత వ్యక్తి చెప్పినట్టు గుర్తు (ఆయనెవరో నాకు గుర్తు లేదు).
By: Jagadeesh Reddy on January 22, 2009
at 3:31 pm
A wonderful review.Thaks for sharing it.Mee review chadivaaka Naa medaduloni kudi bhaagam vuthejithamai marintha samartnavanthanga pani cheyadam modalu pettindi.
By: Sarath on January 24, 2009
at 8:37 am
శేషశాయి ఒంగోలు
–భాగ్యనగరం నుంచి
మనిషికి మనసు చెప్పెదే కాక మరేదొ ఉందంతే . ఆ తపన ఆగదు.
By: శేషశాయి ఒంగోలు,భాగ్యనగరం on January 24, 2009
at 5:13 pm
చావా కిరణ్ గారూ – ధన్యవాదాలు.
జగదీశ్ గారూ – బాగా చెప్పారు, ధన్యవాదాలు.
శరత్, శేషశాయి – ధన్యవాదాలు.
By: nagamurali on January 24, 2009
at 9:18 pm
బాగుంది వ్యాసం.
నేను A brief history of time చదివాను. చాలా బాగుంది.
అందులో చివరకు, ఫిజిక్సు తనకు ఏమీ రాదు అని ఒప్పుకుంటున్నట్టు అనిపించింది.
ఎమోషన్ అనేది లేకపోవడం సైన్సులోని పెద్ద లోపం.
By: రాకేశ్వర రావు on January 25, 2009
at 2:09 pm
ఈ టపా చదివాక నాలో కూడా ఏవేవో ఆలోచనలు చెలరేగేయి కాని, వాటినిక్కడ పెట్టాలనిపించ లేదు. రాకేశ్వరగారి వ్యాఖ్య చూసాక మరి ఆగలేకపోయాను
రాకేశ్వరగారు, మీరన్నట్టు ఎమోషన్ లేకపోవడం సైన్సు లోపం అని నేననుకోనండి. అది దాని పరిమితి అనుకోవచ్చు. అదే దాని బలం కూడా. సైన్సు శక్తినీ పరిమితినీ తెలుసుకొని దాన్ని తగిన విధంగా వాడుకోవలసిన బాధ్యత మనిషిది. అలా చెయ్యకపోతే ఆ లోపం మానవునిదే అవుతుంది.
మతమూ, సైన్సూ వేరువేరు స్వభావాలు కలిగినవనీ, ఒకదాన్ని ఒకటి భర్తీ చెయ్యలేదనీ అన్న నాగమురళిగారి మిత్రునితో కూడా నేను ఏకీభవించ లేను. ఈ రెంటిని వేర్వేరుగా చూడ్డం ఒకానొక దశలో బలంగా ఏర్పడిన దృక్పథం. ఇప్పుడది క్రమంగా మారుతున్న సూచనలున్నాయి (కొన్ని విషయాల్లో). ఇక్కడ “మతం” అన్నది చాలా విస్తృతమైన పదం. ఇందులో ఒకవైపు తాత్త్విక చింతన మరోవైపు ప్రాపంచిక దృక్పథం రెండూ ఉంటాయి. వీటన్నిటినీ ఒక్క “సైన్సు”తో పోల్చడం అంత సమంజసం కాదు. రిచర్డు డాకిన్సు లాంటి వారు ప్రచారం చేస్తున్నది కూడా ఒక “మతమే”. అది సైన్సు మీద ఆధారపడిన మతం. అంచేత దాన్ని ఇతర మతాలతో పోల్చి, అది ఎంతవరకూ సమగ్రమైనది, మనిషికి అవసరమైనదీ అని విశ్లేషించడం సమంజసం.
ప్రస్తుత మానవునికి సైన్సు అవసరం తిరుగులేనిది. అయితే దానికి పరిమితులున్నాయి. కొంతమందికి సైన్సుకున్న పరిమితులకు లోబడే, తమ జీవితంలో పరిపూర్ణతని అన్వేషించుకుంటూ వెళతారు. మరి కొంతమంది ఆ ఖాళీని ఇతర మతాలతో పూరించుకొనే ప్రయత్నం చేస్తారు. సరే మరికొందరికి అసలా ఖాళీల సంగతే పట్టదు!
సైన్సు తన ఖాళీలని పూరించుకోడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో తన పరిధిని విస్తృతపరుచుకొని, ఇప్పుడు సైన్సు పరిధిలోలేని విషయాలని కూడా కలుపుకోవలసి వస్తే రావచ్చు, రాకపోనూ వచ్చు! శాస్త్రవేత్తకి open mind ఉంటుంది, అతను నిరంతర అన్వేషి. సైన్సు మీద ఆధారపడిన మత ప్రచారకులకి అది ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతానికి ఇక్కడాపుతాను…
By: కామేశ్వర రావు on January 25, 2009
at 5:54 pm
రాకేశ్వరా, మీ కామెంటుకి నెనర్లు.
కామేశ్వరరావు గారూ, మీ అభిప్రాయాలతో నేను చాలామటుకు ఏకీభవిస్తాను. అయితే, వీలునిబట్టి మీరన్న ఈ క్రింది మాటల్ని ఇంకొంచం వివరిస్తే బాగుంటుంది.
’ఈ రెంటిని వేర్వేరుగా చూడ్డం ఒకానొక దశలో బలంగా ఏర్పడిన దృక్పథం. ఇప్పుడది క్రమంగా మారుతున్న సూచనలున్నాయి (కొన్ని విషయాల్లో).’
By: nagamurali on January 25, 2009
at 6:40 pm
చాలా బాగా వ్రాశారు. ఇప్పటి దాక నేను జ్యోతిష శాస్త్రం ఒక ‘ఎమ్పిరికల్’ సైన్సు అని అనుకునేవాడిని.
By: kowsik on January 31, 2009
at 2:47 am
కౌశిక్ గారూ, మీ కామెంటుకి ధన్యవాదాలు.
By: nagamurali on February 3, 2009
at 2:02 pm
[...] కొంత ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. సమ్మోహనత్వం గురించి చాలా విస్తారమైన ఒక [...]
By: చైనా « Naga Murali’s Blog on January 25, 2012
at 12:13 pm