Posted by: nagamurali | December 7, 2008

నాకు పరిచయమైన కొందరు అసాధారణ వ్యక్తులు – 4

(సమయాభావం వల్ల ఈ టపాల పరంపర వారం, వారం కొనసాగించలేకపోతున్నాను. నెలకొకటైనా రాయడానికి ప్రయత్నిస్తాను. పాతవి ఇక్కడ చూడండి: 0, 1, 2, 3.)

ఆర్. ఎం. చల్లా

అప్పుడు నేను బీ.ఎస్సీ రెండో సంవత్సరం పరిక్షలు రాశాకా వేసవి సెలవల్లో ఒక వారం మా బంధువులింట్లో గడపడానికి రాజమండ్రి వెడుతున్నాను. మా నాన్నగారు నాకో ఎడ్రసు చేతికిచ్చి, ‘ఒరే, ఆర్. ఎం. చల్లా గారని మనవాళ్ళ ఇంటికి నాలుగు వీధుల అవతల ఉంటారు. ఒకసారి వెళ్ళి ఆయన్ని కలు’ అని చెప్పారు. పెద్దగా వివరాలేమీ చెప్పలేదు. అనేక భాషల్లో పండితుడని మాత్రమే చెప్పారు.

నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఓ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బయల్దేరి అడ్రసు వెతుక్కుంటూ చల్లాగారి ఇంటికి వెళ్ళాను. పెద్ద తోట లాంటి ఆవరణ మధ్యలో ఉన్న ఓ పాతకాలం నాటి డాబా ఇల్లు. కిందకి వెళ్ళి తలుపు కొట్టాను. ఒక పెద్దావిడ తలుపు తీశారు. ‘ఆర్. ఎం. చల్లా గారిని కలవడానికి వచ్చానండీ’ అని చెప్పాను. ‘పైన ఉంటారు, వెళ్ళండి’ అని చెప్పారు. డాబా మీదకి వెడితే అక్కడొక గది. తలుపు తట్టాను. చొక్కా లేకుండా, పైజమా మాత్రం వేసుకుని, వెండి జుట్టు, వెండి మీసాలు, పొడుగైన, దృఢమైన, ఎర్రటి దేహంతో చలాకీగా ఉన్న ఒక పెద్దాయన తలుపు తీశారు. లాహిరీ మహాశయుల ఫొటోని గుర్తుకు తెచ్చే రూపం. (అన్నట్టు ఇందాకా కింద తలుపు కొట్టినప్పుడు, ఇదే పెద్దాయన ఫొటో ఒకటి వాళ్ళ గోడకి తగిలించి ఉండడం చూశాను. అచ్చంగా లాహిరీ మహాశయుల్లాగానే పద్మాసనం వేసుకుని యోగ ముద్రలో తీయించుకున్న ఫొటో అది.)

‘ఏం కావాలి?’ అన్నారు. ‘నేను ఫలానా వారబ్బాయినండీ. మా నాన్నగారు మిమ్మల్ని కలవమన్నారు. మీతో ఊరికెనే మాట్లాడాలని వచ్చాను’ అన్నాను. ఆయన, ‘ఇప్పుడు నేను సైగల్ పాటలు వింటున్నాను. మీరు సాయంత్రం నాలుగు గంటలకి రండి. ఈలోగా ఇదిగో ఈ పుస్తకం చదివి రండి’ అని లోపలికి వెళ్ళి ఒక ఇరవై పేజీల చిన్న పుస్తకం ఒకటి తీసుకువచ్చి ఇచ్చారు. అది ఆయన జీవితం గురించి ఆయన శిష్యులో, అభిమానులో ఎవరో పరిచయం చేస్తూ ఇంగ్లీషులో రాసిన చిన్న పుస్తకం. నేను వెంటనే ఇంటికి వెళ్ళి సాయంత్రంలోగా ఆ పుస్తకం చదివేశాను. మొదటి పేజీలో సూటు వేసుకున్న చల్లాగారి ఫొటో ఒకటి ఉంది. ఆయన జన్మ తేదీని బట్టి ఆయన వయసు అప్పటికి డెబ్భై దాటింది అని తెలిసింది. ఆయన పూర్తిపేరు చల్లా రాధాకృష్ణ మూర్తి. ఆ పుస్తకం మొదలవ్వడమే ’He was born with a silver spoon’ అని మొదలౌతుంది. చల్లా గారు బహుభాషా కోవిదుడనీ, ముఖ్యంగా ఆంగ్లంలోనూ, సంస్కృతంలోనూ, వేదంలోనూ విశేషమైన ప్రతిభాపాటవాలు కలిగినవారనీ, గొప్ప కవి కూడాననీ, ఇంగ్లీషు కవిత్వంలో అంతర్జాతీయ బహుమతులు పొందారనీ అర్థమైంది. ఆయన గ్రీకు, లాటిన్ భాషలు కూడా నేర్చుకున్నారట.

సాయంత్రం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన నాకోసం తయారుగా ఉన్నారు. నేను సంభాషణ ప్రారంభించడమే ‘మా father’ అని మొదలు పెట్టాను. ఆయన నన్ను ఆ వాక్యం పూర్తి చెయ్యనివ్వకుండానే ఆపి, ’మాట్లాడితే పూర్తిగా ఇంగ్లీషులో మాట్లాడాలి. లేకపోతే పూర్తిగా తెలుగులో మాట్లాడాలి. ఇలా తెలుగూ, ఇంగ్లీషూ సగం, సగం మాట్లాడకూడదు. మా నాన్నగారు అనాలి’ అన్నారు. ’అయితే కొంచం సేపు పూర్తిగా ఇంగ్లీషులోనూ, కొంచం సేపు పూర్తిగా తెలుగులోనూ మాట్లాడవచ్చా’ అని అడిగాను. ’అలాగే’ అన్నారు. మా సంభాషణ ఎక్కువ తెలుగులోనూ, కొంత ఇంగ్లీషులోనూ, కొద్ది వాక్యాలు సంస్కృతంలోనూ జరిగింది. (అప్పట్లో సంస్కృత సంభాషణోద్యమం పట్ల నాకు ఆసక్తి ఉండేది.) మొదట నాగురించి నేను ఇంగ్లీషులో పరిచయం చేసుకున్నాను. నా ఆసక్తులూ, అభిరుచులూ చెప్పి, నేను చాలా అంతర్ముఖుణ్ణి అన్నాను (అప్పట్లో అది నిజమే). ‘Introvert’ అన్నది చాలా మంచి పదం అన్నారాయన. నేను చెప్పినది అంతా శ్రద్ధగా విన్నారు. కొన్ని చోట్ల పదాలు ఎలా పలకాలో నిర్మొహమాటంగా సరిచేశారు. ఇంగ్లీషు ఉచ్చారణ గురించి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఎంతో చలాకీగా సరదాగా మాట్లాడారు. చిన్నపిల్లలకి క్లాసులో పాఠాలు చెప్తున్న ధోరణిలో నన్ను కొన్ని పదాలు పలకమన్నారు. అవి సరిగ్గా పలికితే Congratulations చెప్పేవారు. ‘Pronunciation’ spelling చెప్పండి అన్నారు. నేను సరిగ్గా చెబితే గట్టిగా నవ్వి, Congratulations అన్నారు. ఇంగ్లీషు చదువుకునేటప్పుడు Pronunciation కూడా ఇచ్చిన డిక్షనరీ దగ్గర పెట్టుకుని ప్రతి పదాన్నీ ఎలా పలకాలో నేర్చుకోవాలి అని చెప్పారు. మనవాళ్ళు ఇంగ్లీషులో చేసే తప్పుల గురించి చెప్పారు. నన్ను మొదట్లో బహువచనంలో సంబోధించినా తర్వాత నువ్వు/బాబూ అనే పిలిచారు.

Giving someone the boot అన్న idiom గురించి చెప్తూ, తానొక ప్రసిద్ధుడైన వ్యక్తి రాసిన పుస్తకాన్ని review చేస్తూ ఏకిపారేశాననీ, అతను ఒక పత్రికకి ఎడిటర్ గా వచ్చి, He gave me the boot అని చెప్పి నవ్వారు. మీకు ఇవన్నీ నేర్చుకోడానికి కావలసిన ప్రేరణా, స్ఫూర్తీ చిన్నతనంలో ఎల్లా కలిగాయి అని అడిగాను. దానికి ఆయన ప్రత్యేకమైన కారణాలు ఏమీ చెప్పలేదు. చిన్నతనంలో తనకి పాఠాలు చెప్పిన మేష్టర్లు చాలా పద్ధతిగా చెప్పారనీ, ఆ పద్ధతినే తాను అనుసరిస్తూ నేర్చుకున్నాననీ అన్నారు. అలాగే రేడియోలో బీబీసీ విని కూడా ఇంగ్లీషు చాలా నేర్చుకున్నానని అన్నారు. ఆయన కుటుంబ విశేషాలు కొన్ని చెబుతూ తాను అతి చిన్న వయసులోనే Great Grandfather అయ్యాననీ అన్నారు. (ఈ విషయం రికార్డుల్లోకి ఎక్కిందని ఆయన అన్నట్టు కూడా లీలగా గుర్తు). వాళ్ళ ఇంటిలో అబ్బాయిలకి పదిహేడవ ఏటనే వివాహం చెయ్యడం పరిపాటి అనీ, అందుకే అది సాధ్యపడిందనీ అన్నారు.

తర్వాత సంభాషణ సంస్కృతం మీదకి మళ్ళింది. మనవాళ్ళు సంస్కృతంలో స్తోత్రాలు చదివేటప్పుడు చేసే కొన్ని తప్పుల గురించి చెప్పారు. (నేనిదివరకు ఒక టపాలో రాశాను.) గురవే నమ: అనడానికి గురువే నమ: అంటారనీ, లలితా సహస్రంలో ‘భవదా వసుధా వృష్టి:’ అంటారనీ, ‘భవ దావ సుధావృష్టి:’ అనాలనీ, శ్రద్ధ పెట్టాలనీ చెప్పారు. సంధులగురించి కొన్ని విశేషాలు చెప్పారు. తర్వాత భగవద్గీతలోని ప్రసిద్ధమైన ‘యోగ: కర్మసు కౌశలం’ అన్న మాట చెప్పి, దాన్ని యథాతథంగా, ‘పనులు చేసుకోవడంలో కౌశలం కలిగి ఉండడమే యోగము’ అని కొందరు వ్యాఖ్యానిస్తారనీ, కానీ దానిని ‘కర్మసు యోగ: కౌశలం’ అని అన్వయించాలనీ (అంటే పనులు చేసుకుంటూ కూడా యోగ స్థితిలో ఉండడమే నేర్పరితనం) అన్నారు. అలాగే మరొక ప్రసిద్ధుడైన మహానుభావుడు ఒక వేద సూక్తానికి వ్యాఖ్యానం రాశారనీ, ఆ సూక్తంలో ఒక అక్షరదోషంతో అచ్చు వేయబడిన ప్రతిని తీసుకుని, ఆ అక్షరదోషంతో కూడిన పదాన్నే సవ్యమైన పదంగా భావించి వివరణ రాశారనీ చెప్పారు.

నా సంభాషణలో జ్యోతిషం నాకు చాలా ఆసక్తికరమైన అంశమని చెప్పగానే, ‘జ్యోతిషం శాస్త్రీయమేనా?’ అని అడిగారు. అప్పటికి బాగా కుర్రతనం వల్ల నాకు ఉత్సాహం ఎక్కువ మోతాదులోనే ఉండేది. ‘జ్యోతిషం శాస్త్రీయమనే నా అభిప్రాయం’ అని చెప్పాను. ‘అయితే మరి సూర్యుడు, చంద్రుడు గ్రహాలు కావు కదా, రాహు కేతువులు కూడా గ్రహాలు కావు కదా, మరి వాటిల్ని జ్యోతిషం గ్రహాలుగా ఎందుకు భావిస్తుంది?’ అని అడిగారు. ‘గ్రాహయతీతి గ్రహ:’ అని చెప్పి, ‘జీవులపైన ప్రభావం చూపేదాన్ని గ్రహము అంటారని, ఆ రకంగా చూస్తే సూర్య, చంద్ర, రాహు, కేతువుల్ని గ్రహాలనడంలో తప్పేమీ లేద’ని నేను అన్నాను. నా సమాధానానికి ఆయన సంతృప్తి పడ్డారు. ‘జ్యోతిషం నిజమని నువ్వు నాకు శాస్త్రీయంగా ఋజువు చెయ్యగలవా?’ అని అడిగారు. ‘చెయ్యగలను. మీ జాతకం వివరాలు ఇస్తే, జరగబోయే ఏదైనా ఒక సంఘటనని ముందుగానే నేను సూచిస్తే జ్యోతిషం శాస్త్రీయమని ఒప్పుకుంటారా?’ అని అడిగాను. (చెప్పాను కదా, కుర్రతనమని!!). ఆయన వెంటనే ఒక కాగితం మీద అయన జన్మ తేదీ, సమయం, పుట్టిన ప్రదేశం వివరాలు రాసి ఇచ్చారు. మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా ఒక prediction చెప్తానని అన్నాను.

ఆయనకి ఇంగ్లీషు కవిత్వంలో వచ్చిన అంతర్జాతీయ బహుమతి పత్రాన్ని ఒకదాన్ని నాకు చూపించారు. ఈమధ్యకాలంలో తాను పూర్తిగా ఒక recluse అయిపోయాననీ, జనాలెవరూ తనజోలికి రావడం లేదనీ ఆయన అన్నారు. తర్వాత ఆలోచిస్తే అందుకు కారణాలు అర్థమయ్యాయి. మరీ ఉపాధ్యాయుడిలాగా సంభాషణల్లో నిర్మొహమాటంగా వ్యాకరణ దోషాలూ, ఉచ్చారణ దోషాలూ చూపించి సరిచేస్తుంటే ఎంతటివాడికైనా ఆయన జోలికి వెళ్ళడానికి భయం వెయ్యదూ?? ‘ధిషణహంకార బ్రాహ్మీయమూర్తు’లంటే అందరికీ మనసులో ఇష్టంగానూ, గౌరవంగానే ఉంటుందిగానీ, దగ్గరికెళ్ళడానికి చాలామంది తమ అజ్ఞానం గుర్తొచ్చి భయపడతారు. ఎంత ప్రత్యక్ష దైవమైనా సూర్యుడికి దూరంనుంచే నమస్కారం చేస్తాం గానీ, కళ్ళెత్తి చూడగలమా ఎవరమైనా?

సుమారు ఒక రెండు గంటల సంభాషణ తర్వాత నేను సెలవు తీసుకున్నాను. ఆయన ఆదరంగా నన్ను కౌగలించుకుని అభినందించారు. నేను మా ఊరు వెళ్ళినతర్వాత ఒకరోజు మా నాన్నగారికి టైప్ రైటర్ తో టైపు చేసిన ఒక పోస్టు కార్డు వచ్చింది, చల్లా గారి సంతకంతో. ఆయన తన ఉత్తర ప్రత్యుత్తరాలకి ఎక్కువ పోస్టు కార్డులే వాడతారనీ, తానే సొంతంగా టైపు చేస్తారనీ మా నాన్నగారు అన్నారు. ఆ కార్డులో మా నాన్నగారికి, ’మీ అబ్బాయిని పరిచయం చెయ్యడం ద్వారా, ఈ కాలపు యువతరం మీద నాకొక సదభిప్రాయాన్ని కలిగించినందుకు మీకు నా ధన్యవాదాలు’ అని చల్లాగారు రాశారు. చాలా ఆనందం కలిగింది.

కొన్ని నెలల తర్వాత మా నాన్నగారితో కలిసి రాజమండ్రి వెళ్ళినప్పుడు మళ్ళీ చల్లాగారిని కలుసుకున్నాం. నేను ఆయన జాతకం తీసి, కొన్ని గడిచిన సంఘటనలు చెప్పాను. ‘మీరు ఫలానా సమయంలో విదేశయానం చేశారా?’ అని అడిగాను. ‘ఆ యేడాది కాదు కానీ, మరుసటి యేడాది ఇంచుమించు అదే సమయంలో అమెరికా వెళ్ళాను’ అని చెప్పారు. అలాగే మరికొన్ని సంఘటనలు చెప్తే చాలామటుకు తప్పయ్యాయి. ఆయన గట్టిగా నవ్వి, ’మరి ఇంకా జ్యోతిషం శాస్త్రీయమే అని నమ్ముతున్నావా?’ అని అన్నారు. నేను కొంచం మొండిగా, ‘అవునండీ నమ్ముతున్నాను’ అన్నాను. దానికాయన ఆకాశం నుంచి రాలే ఉల్కల గురించిన శాస్త్రీయ విషయమేదో చెప్పి, ‘ఆ ఉల్క ఎలా ప్రవర్తిస్తుందంటే, ఏదో ఒకరకంగా తన అస్తిత్వం నిలబెట్టుకోడానికి దానికి ఒక Will to survive ఉందా అనిపిస్తుంది.’ అన్నారు. నేను నిర్మొహమాటంగా, నవ్వుతూనే, ‘అవునండీ, నాకు కూడా జ్యోతిషం గురించి ఒక Will to survive ఉంది. ఇంతకు ముందు చెప్పినవి వదిలెయ్యండి. ఇది మట్టుకు జరుగుతుందేమో చూడండి’ అని చెప్పి, ఒక కాగితం మీద, ‘You may receive an award in May next year’ అని రాసి ఇచ్చాను. నేను ‘You may receive’ అని గోపి లాగా రాశానని ఆయన నవ్వారు. అంతే కాకుండా, ‘అవార్డు రావాలంటే ఏదో ఒకదానిమీద కృషి చేస్తూ ఉండాలి. ప్రస్తుతం నేను ఏ విషయం మీదా కృషి చెయ్యడం లేదు కదా, ఎవార్డు ఎలా వస్తుంది?’ అని నవ్వారు. నేను చూద్దాం అన్నట్టుగా అని ఊరుకున్నాను.

మా నాన్నగారు ఆయనకి తాను ఒక కవి రాసిన తెలుగు కవితల్ని ఇంగ్లీషులోకి అనువదిస్తున్నాను అని చెప్పారు. చల్లాగారికి అనువాద సాహిత్యం మీద అంత సదభిప్రాయం ఉన్నట్టు లేదు. అది కేవలం ‘labour of love’ అవుతుందే తప్ప అనువాదంలో అసలు భావాన్ని పట్టుకోవడం జరగదనీ, ఇంకా అనువాదాల గురించి చాలా విశేషాలేవో చెప్పి మా నాన్నగారిని చాలా నిరుత్సాహపరిచారు. యథాప్రకారంగా ఉపాధ్యాయుడి పాత్ర తీసుకుని మా నాన్నగారికి కూడా నాకు లాగానే కొన్ని ఇంగ్లీషు పాఠాలు చెప్పారు. ఆయన సొంతంగా రాసిన ఇంగ్లీషు కవితలు కొన్ని అద్భుతమైన ఉచ్చారణతో చదివి వినిపించారు. ఆ దెబ్బతో మా నాన్నగారు జడుసుకోవడం, తాను చేస్తున్న అనువాదాన్ని అర్థంతరంగా నిలిపెయ్యడం, ఆ అనువాదం కోసం అభ్యర్థించిన కవి నిరాశతో అలమటించడం నాకు బాగా గుర్తు. (ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులూ భౌతికంగా లేరు కాబట్టి స్వేచ్ఛ తీసుకుని ఉన్నదున్నట్టు రాశాను. ఇలా రాసినందుకు ఎక్కడున్నా వాళ్ళు నన్ను క్షమించాలి!!)

ఆ తర్వాత నాకు మళ్ళీ ఎప్పుడూ చల్లాగారిని కలిసే అవకాశం దొరకలేదు. అయితే ఆశ్చర్యకరంగా మరుసటి యేడు జూన్ నెలలో మా నాన్నగారికి మళ్ళీ టైప్ చేసిన కార్డు ఒకటి వచ్చింది. ‘జ్యోతిషం ఒక ఖచ్చితమైన శాస్త్రమే అని నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది. ఈ విషయాన్ని నాకు ఋజువు చేసినందుకు మీ అబ్బాయికి నా అభినందనలు తెలియజేయండి. మే నెలలో ఒక ఎవార్డు కోసం నా పేరు పరిశీలింపబడడం జరిగింది. ఆ ఎవార్డు  నాకు రాలేదు. అందుచేత మీ అబ్బాయి ముందు జాగ్రత్తగా You ‘may’ receive అని వ్రాయడం కూడా నాకు సమంజసమనిపిస్తోంది.’ అని చల్లాగారు రాశారు. ఆ ఉత్తరం చదివి నేను బతుకుజీవుడా అనుకున్నాను. నిజానికి నా లెక్కలు తప్పాయనీ, నేను చెప్పినది జరగకపోవచ్చనీ నేను అనుకున్నాను. అప్పటి నుంచీ మళ్ళీ ఎప్పుడూ అటువంటి సవాళ్ళ జోలికి పోలేదు.

ఏది ఏమైనా నేను చల్లాగారితో గడిపిన సమయం నాలుగు గంటలకన్నా ఎక్కువ ఉండదు. అయినా ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిత్వం ఆయనది. వయసులో ఎంత పెద్దవారైనా, ఆయన కుర్రతనపు చలాకీతనం, భాషలపట్లా సాహిత్యం పట్లా ఆయన ఖచ్చితత్వం, పెర్ఫక్షనిజం నాకు ఎంతో ఉత్సాహాన్నీ, ఆసక్తినీ కలిగించాయి. కత్తి మీద సామే అయినా అటువంటి పెద్దవాళ్ళ దగ్గర శిష్యుడిగా కుదురుకునే అవకాశం నాకు చిక్కలేదని ఇప్పటికీ బాధ పడుతూనే ఊంటాను. ఆయన సాహిత్యంలోనూ, ఇతర రంగాల్లోనూ చేసిన కృషి గురించి ప్రస్తుతానికి నాకు తెలిసినది శూన్యం. ఆయన గుర్రపు స్వారీ మొదలైన వ్యాయామాలు కూడా చేసేవారు అని విన్నట్టో/చదివినట్టో గుర్తు. వేగంగా ఒక చిన్న సైకిల్ తొక్కుతూ రాజమండ్రి రోడ్ల మీద వెళ్తుండేవారు.  మన బ్లాగు మిత్రుల్లో ఎవరికైనా ఆయన గురించి ఇంకా వివరంగా తెలిస్తే, ఆ విశేషాలతో ఒక వ్యాసం రాస్తే బాగుంటుంది. నాకు అవకాశం దొరికినప్పుడు చల్లాగారితో పరిచయం ఉన్న పెద్దల్ని కలిసినప్పుడు ఇంకా వివరాలు సేకరిస్తాను.

(నా బ్లాగుతో కొత్తగా పరిచయమైన మిత్రుల కోసం: నాకు జ్యోతిషంతో పరిచయం ఉన్నమాట నిజమేగానీ, నేను జ్యోతిష్కుణ్ణి కాను. జ్యోతిషం గురించి నేను తెలుసుకున్న విషయాలూ, నా అనుభవాలూ, అభిప్రాయాలూ ‘ఈమాట’లో నాలుగు వ్యాసాలుగా ఇక్కడ చదవవచ్చు.
మొదటి భాగం
రెండవ భాగం
మూడవ భాగం
నాలుగవ భాగం)


Responses

  1. బాబూ, నా జాతకం కాస్త చెప్పి పెట్టండి (పోనీ ఆ కుర్రతనం ని తెచ్చుకునైనా)

    చాలా అదృష్టవంతులండీ! అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నారు. అయినా మాది కూడ కొంచెం అదృష్టమేలెండి. ఆ సంఘటనలన్నీ కళ్ళముందు కదలాడినట్టుగా వ్రాస్తున్నారు.

    మంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలతో…

  2. mIdi chaalaa adrustajaatakamamdee.lEkuMTE amta goppavyaktulatO saannihityalabhimchatam durlabham amdariki

  3. ధీరోదాత్త వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

  4. అయ్యా , నా పేరు బల్ల సుధీర్ బాబు, నాకు ఈ జాతకాలమీద నమ్మకం వుందనీ చెప్పలెను , లెక లెదనీ చెప్పలెను , కానీ మీవంటి వారి దగ్గర ఒకసారి జాతకం చూపించుకొవాలని చాలా చాలా ఉబలాటం నాకు వుంది , కాబట్టి దయచెసి నాజాతకాన్ని ఒకసారి విస్లెషించి , నాకు ఉద్యొగం ఎప్పుదు వస్తుందొ , వివాహం ఎప్పుడు , ఎవరితొ జరుగుతుందొ చెప్పగలరు

  5. కృష్ణమోహన్ గారూ, ఒకసారి చేతులు కాలాక మళ్ళీ కాల్చుకోడానికి ధైర్యం చాలదండీ. మీ కామెంటుకి ధన్యవాదాలు.

    దుర్గేశ్వర గారూ, నెనర్లు. మీరన్నట్టుగానే ఈ విషయంలో మాత్రం నేను అదృష్టవంతుణ్ణే. నేను కలుసుకున్న వ్యక్తులు అందరి గురించీ బ్లాగులో రాయలేను కానీ, ఏదో పుణ్య విశేషం చేత కొద్దిమంది మహానుభావులతో సాన్నిహిత్యం కలగడం, వాళ్ళు ప్రేమకి పాత్రుణ్ణి కావడం జరిగింది.

    విజయమోహన్ గారూ, నెనర్లు.

    సుధీర్ గారూ, క్షమించాలి. మిమ్మల్ని నిరాశ పరచక తప్పడం లేదు. నా ప్రస్తుత ఆలోచనా విధానానికి జాతకాలు చెప్పడం సరిపడదు. మీరు వేరెవరైనా జ్యోతిష్కుల్ని సంప్రదించడమే మంచిది.

  6. “ఎంత ప్రత్యక్ష దైవమైనా సూర్యుడికి దూరంనుంచే నమస్కారం చేస్తాం గానీ, కళ్ళెత్తి చూడగలమా ఎవరమైనా?” – చాలా బాగా చెప్పారు.

    మీరు కలిసిన అసాధారణ వ్యక్తుల గురించి చదువుతుంటే, పరమహంస యోగానంద తన ఆత్మ కథలో తను కలిసిన వివిధ యోగుల్ని గురించి చెప్పినవి గుర్తుకొస్తున్నాయి. “The Guru will come, when the student is ready”, అని లిండా గుడ్‍మెన్ ఒక టిబెటిన్ సామెత చెప్తుంది. ఇలాంటి వారెవరు మనకు తగలరేమిటి చెప్మా అనుకుంటాను అప్పుడప్పుడు. May be the student is not ready yet.

  7. గొప్ప వ్యక్తి గురించిన విషయాలు చాలా ఆశక్తి కరంగా చెప్పారు.

  8. చైతన్య కృష్ణ గారూ, మీ కామెంటుకి నెనర్లు. అవును, సమయం వచ్చినప్పుడు మన గురువు మనల్ని వెతుక్కుంటూ వస్తారనే కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెప్తాయి. వేచి ఉందాం. :-)

    బాబా గారూ, ధన్యవాదాలు.

  9. ౧ లాహిరి మహాశయుడి గురించి నాకింతకు మునుపు తెలియదు (నేనెంత అజ్ఞానిని!) ఛాయాచిత్రం మాత్రం చూసిన గురుతు.
    ౨ మాట్లాడితే పూర్తిగా తెలుగులో లేదా పూర్తిగా ఆంగ్లంలో మాట్లాడాలి. ఆచరణలో కొంచెం కష్టమైనా మంచి సలహా.
    ౩ యోగః కర్మసు కౌశలం… ఆగండాగండి. శఙ్కరభాష్యం చూసేదాక నేనేమీ చెప్పలేను దీని గురించి.
    ౪ భౌతికంగా లేరు కాబట్టి ధైర్యం చేసి వ్రాసాను అన్నారే, ఆ ముగ్గురూ (మీ నాన్నగారితో కలిపి) భౌతికంగా మనలో మనతో ఉన్నా ఏమీ అనుకునేవారు కాదు, పైపెచ్చు ఇంకా సంతోషించేవారే.
    ౫ గ్రాహయతీతి గ్రహః — నాకు జ్యోతిషంలో అఇఉణ్ ఋఌక్ లు కూడా రావు. కాని నాకు ఈ వ్యుత్పత్తి నచ్చింది, ఒక సందేహం తొలగింది. ఈ వ్యుత్పత్తి ఎక్కడ ఇచ్చారండీ? అది చదువుతాను, సరిపోతుంది.

  10. రాఘవ గారూ, మీ కామెంటుకి నెనర్లు.

    ౩. ఈ శ్లోకానికి శంకర భాష్యం ఇప్పుడే ఒకసారి చూశాను. చర్చించే సాహసం చెయ్యలేను. మీరూ చూడండి: http://www.sankara.iitk.ac.in/gitaindex.htm

    ౪. అవును, సంతోషించే ఉండేవారు.

    ౫. చాలా ఏళ్ళ క్రితం జ్యోతిర్విద్య అని ఒక తెలుగు పుస్తకం చదివాను. (ఈ పుస్తకం మీరు చదవాలనుకుంటే, వివరాలు వ్యక్తిగతంగా తెలియజేస్తాను.) అందులో ఈ వ్యుత్పత్తి చదివినట్టు గుర్తు. నాకీ వ్యుత్పత్తి తప్పేమో అని ఒక అనుమానం. నివృత్తి చేసుకోవడం ఇంకా కుదరలేదు. మీరు వేరే ఎక్కడైనా రిఫర్ చేస్తే, ఇది తప్పైతే నాకు తెలియజేయండి.

  11. ౩ చాల చక్కగా చెప్పారు కదండీ ఆదిశఙ్కరులు… :)

    స్వధర్మాఖ్యేషు కర్మసు వర్తమానస్య యా సిద్ధ్యసిద్ధ్యోః సమత్వబుద్ధిః (దీనికి కొంచెం ముందుగా “సమత్వబుద్ధియోగాయ” అని చెప్పియుండటం చేత సమత్వబుద్ధిని పొందటం యోగమని తీసికొంటే) తత్ కౌశలం కుశలభావః౹ తద్ధి కౌశలం యత్ బన్ధనస్వభావాన్యపి కర్మాణి సమత్వబుద్ధ్యా స్వభావాన్నివర్తన్తే౹ తస్మాత్సమత్వబుద్ధియుక్తో భవ త్వమ్౹

  12. చాలా అదృష్టవంతులు మీరు, అంతంత గొప్ప వాళ్ళ సాంగత్యం లభించింది
    ఇంకా చెప్పండి సార్

  13. బాటసారి గారూ, కృతజ్ఞతలు. సమయం చిక్కినప్పుడు ఇటువంటి టపాలు ఇంకా రాస్తాను.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.