Posted by: nagamurali | December 4, 2008

రాఘవ గారు రాసిన సంస్కృత పద్యం

నా బ్లాగు పుట్టినరోజు టపాలో రాఘవ గారు అభినందిస్తూ రాసిన పద్యం.

అంతర్జాలమహత్సముద్రలహరీపర్యాకులాన్ధ్రాభిధాం

వాణీం జాలజనాశ్రయా మహరహ స్సంసేవయన్తం త్వయి

భూయాల్లాభమభీప్సితార్థఫలసిద్ధిర్వైభవం బ్లాగ్స్థలి

యస్మాన్నో భవతా లభేచ్చ చతురా వ్యాసావళీ శోభనా౹౹

రాఘవ గారూ, మళ్ళీ మరోసారి నా కృతజ్ఞతలు, అభినందనలు.


Responses

  1. :)

  2. రాఘవ/మురళి గారు, పై శ్లోకం లో కొన్ని సందేహాలు.

    అంతర్జాల….పర్యాకులాంధ్రాభిదాం : అంతర్జాలమనే గొప్ప సముద్ర తరంగాలపై తేలియాడే ఆంధ్రులకు…ఈ అనువాదం సరియేనా? పర్యాకుల అన్న శబ్దానికి అర్థం ఏమిటి?

    3 వ పాదం లో బ్లాగ్స్ధలి – అంటే బ్లాగు స్థలి అని అర్థమా? అన్వయం చెప్పగలరు.

    4 వ పాదం – భవతా అంటే మీ వలన అని అర్థమా?”భవ” అన్నది ధాతువు కదా? భవతా అన్నది యే ల కారం? ధాతువు కాక శబ్ద రూపం కూడా “భవ” కు ఉందా?

    (అంతర్జాలమనే గొప్ప సముద్రపు అలలపై తేలియాడే ఆంధ్రులకు, వాణిని (సరస్వతిని), నెజ్జనులను, అహరహమూ సేవింపబడు నీవలన ఇంకను చక్కనివి, చతురములూ అయిన టపాలు మాకు లభింపబడుగాక. బ్లాగు స్థలికి గొప్ప లాభము, అభీప్సిత ఫల సిద్ధి, వైభవము (నీ వలన) కలుగు గాక!)

    ఈ అనువాదం సరియేనా? నా అఙ్ఞానం బయటపెట్టుకుంటున్నానా?

  3. రవి గారూ, నా అజ్ఞానం కూడా బయటపెట్టుకోనియ్యండి.. :-)

    ఈ పద్యం అర్థం చేసుకోడానికి నేను కూడా కొంచం కష్టపడ్డాను. నాకు తెలిసినంతమటుకు -
    ఆంధ్రాభిధాం వాణీం – అంటే ‘ఆంధ్ర సరస్వతి’ అని అర్థం చెప్పుకోవాలి. అభిధా అంటే పేరు అని అర్థం. ‘ఆంధ్రా’ అన్న పేరు కలిగిన సరస్వతి అన్నమాట.

    పర్యాకుల – అంటే వ్యాకులపాటు చెందిన అని అర్థం, కానీ, ఈ సందర్భంలో ‘నిండి ఉన్న’ అని కూడా చెప్పుకోవచ్చనుకుంటా.

    (Akula – confounded , confused , agitated , flurried ; confused (in order) , disordered; filled , full , overburdened with (instr. or generally in comp.) , eagerly occupied; n. a place crowded with people ; )

    బ్లాగ్ స్థలి – అంటే బ్లాగులో అనే అర్థం చెప్పుకోవాలి.

    భవతా – అంటే ’మీచేత’ (భవాన్ శబ్దమండీ).

    మొత్తంగా నేనర్థం చేసుకున్నది ఇదీ -

    అంతర్జాలమనే గొప్ప సముద్రపుటలలపైన నిండియున్న, నెజ్జనులను ఆశ్రయించి ఉన్న ఆంధ్ర సరస్వతిని ప్రతిరోజూ సేవిస్తున్న నీకు (నీయందు) లాభము, ఇష్ట కామ్యార్థ సిద్ధి (కోరిన కోరికలు ఫలించడము), వైభవము (కీర్తి) కలుగుగాక.
    తత్ఫలితంగా, బ్లాగులో మీచేత మాకు (న: – మాకు) చతురమైన, అందమైన వ్యాసాల సమూహము లభించుగాక. (ఇదే వాక్యాన్ని – ‘ఎందుకంటే, బ్లాగులో మీచేత మాకు చతురమైన, అందమైన వ్యాసాల సమూహము లభిస్తున్నది కాబట్టి’ – అని కూడా చెప్పుకోవచ్చేమో.)

    రాఘవ గారూ, ఇంక దీన్ని సరిచేయుట మీవంతు.

  4. అన్వయ మిలా చెప్పుకోవాలి—

    వాణీం బ్లాగ్ స్థలి అంతర్జాల మహత్ సముద్ర లహరీ పరి ఆకుల ఆన్ధ్ర అభిధాం జాలజన ఆశ్రయాం అహరహః సంసేవయన్తం త్వయి లాభం అభీప్సిత అర్థఫలసిద్ధిః వైభవం భూయాత్౹ యస్మాత్ నః భవతా చతురా చ శోభనా చ వ్యాసావళీ లభేత్౹

    తెలుగు భాషలోఁ బ్లాగు౹ కాని బ్లాగ్ అనునది యసలు పదము౹ సముద్రపదప్రయోగము జ్ఞానవిస్తృతికిఁ సూచిక౹ లహరీపదప్రయోగ మెడతెగకఁ సాగెడి పనులకుఁ సూచిక౹ పర్యాకుల యనగాఁ బాగుగ నిండియున్న౹ ఇక్కడ పర్యాకులశబ్దవశమునఁ శ్లేష ధ్వనించవచ్చు౹ కాని నా యుద్దేశ్యము శ్లేష గాదు౹ త్వయి బ్లాగ్ స్థలి లాభమభీప్సితార్థఫలసిద్ధిర్భూయాత్ యని కూడ నన్వయించుకొనవచ్చు౹

    బ్లా గను ప్రదేశమునందు నంతర్జాల మను గొప్ప సముద్రపుటలలతోఁ బాగుగ నిండియున్నదై జాలజనులకు నాశ్రయమైయున్న యాంధ్రభారతిని ననుదినముఁ జక్కగఁ సేవించు నీ యందు లాభాదులు కలుగునుగాక౹ తద్ద్వారా మాకు మీచేతఁ చతురములై సుందరములై యొప్పు వ్యాసములు లభించునుగాక౹

  5. [...] మంచి అభిరుచి గల బ్లాగరి స్పందిస్తే ఇలా [...]


Leave a response

Your response:

Categories