Posted by: nagamurali | December 4, 2008

ఇన్ని రాశుల యునికి

సుమారొక పది సంవత్సరాల క్రితం శృతిలయలు సినిమాలోని ‘ఇన్ని రాశులయునికి’ అన్న కీర్తనని వింటుంటే ఒక ఆలోచన కలిగింది. ఇవాళ ఆ పాట వింటుంటే మళ్ళీ ఆ పాత ఆలోచన గుర్తు వచ్చింది.

ఈ పాటలో రాశుల పేర్లన్నీ వస్తాయి. కానీ ఒక క్రమ పద్ధతిలో రావు. రాశిచక్రంలో రాశుల క్రమం ఇలా ఉంటుంది -

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.

అయితే ఈ పాటలో రాశులన్నీ జంటలు జంటలుగా ఈ క్రమంలో వినిపిస్తాయి.

ధనుస్సు-మీనం

కుంభం-సింహం

మకరం-కన్య

తుల-వృశ్చికం

వృషభం-కర్కాటకం

మేషం-మిథునం

ఏ విధంగా చూసినా అన్నమాచార్యుడు ఈ క్రమంలో రాశుల్ని ఎందుకు ఉటంకించాడో అర్థం కాలేదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఈ పాటలో బహుశా ఏదన్నా జ్యోతిష సూత్రమో/రహస్యమో సూచించబడుతోందేమో అని.

కొంచం ఆలోచిస్తే ఈ పాటలో ‘కూటమి కలిగిన రాశులు’, అంటే వివాహాది విషయాల్లో ‘మైత్రి’ (Compatibility) కలిగిన రాశుల గురించి చెప్పబడి ఉండవచ్చు అనిపించింది. బహుశా అన్నమాచార్యులకి తెలిసిన జ్యోతిషం ప్రకారం పైన చెప్పబడిన జంటల్లోని రాశులు ఒకదానికొకటి మైత్రి కలిగినవి అయి ఉండవచ్చు.

మరి ఏదైనా ప్రాచీన జ్యోతిష గ్రంధంలో కూడా ఇదే క్రమంలో రాశుల మధ్య మైత్రి చెప్పబడి ఉన్నదేమో నాకు తెలియదు. పెద్దలెవర్నైనా కనుక్కోవాలి. బ్లాగు మిత్రులకెరికైనా తెలిస్తే కొంచం చెప్పండి.


Responses

  1. నాకిష్టమైన కీర్తనల్లో ఇది ఒకటి. ఈ పాటలో వచ్చే వరస జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఉండొచ్చనే మీ ఆలోచన బావుంది. కానీ ఈ శృంగార కీర్తనలో అన్నమయ్య శాస్త్ర ప్రకారం కంటే, నాయికను పైనుంచి క్రిందకు వర్ణించటానికి, ఆఖరున నాయకునితో జంట కట్టించటానికి ఆ వరుస వాడాడని నా అనుమానం.

    ఇంతక ముందొకసారి నేను ఈ వరుసని గమనిస్తే నాకు పెద్ద క్రమం కనిపించలేదు. మొదటి నాలుగు పై నుంచి క్రిందకి వర్ణించుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది (ధనస్సు-కనుబొమ్మలు, మీనం-కళ్ళు, కుంభం-చన్నులు, సింహం-నడుము). మిగతావి మొత్తం శరీర లక్షణం చెప్పినట్టు ఉంటాయి కానీ మధ్యలో పెదాల(మేషం) వర్ణన ఉంటుంది. కాబట్టి ఈ రకమైన గ్రూపింగ్ కూడా కాదు. కాకపోతే అన్నమయ్య కీర్తనల్లో, ముఖ్యంగా శృంగార కీర్తనల్లో వేంకటేశ్వర స్వామి ప్రస్తావన చివరి చరణంలో నాయికా నాయకులను కలుపుతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశిని చివరి చరణానికి అట్టిపెట్టాడని అనిపిస్తుంది.

    నాకున్న అతికొద్దిపాటి పాశ్చాత్య జ్యోతిష్యశాస్త్ర పరిజ్ఞానం ప్రకారం కూడా ఈ రాశుల మధ్య పెద్ద మైత్రి ఉన్నట్టు కనిపించట్లేదు. కాకుంటే ఈ విషయంలో నా పరిజ్ఞానం స్వల్పం కాబట్టి మీ ముందు కుప్పిగంతులు వేయలేను. జ్యోతిష్య శాస్త్రంలో అప్పటికి, ఇప్పటికి భారీ మార్పు వచ్చుంటుందని అనుకోను. అందులో లేని క్రమాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నామేమో.

  2. చైతన్యకృష్ణ గారూ, మీరన్నది చాలా సమంజసంగానే అనిపిస్తూంది. శరీర వర్ణన మాత్రమే అనుకుంటే రాశుల గ్రూపింగ్ మొత్తంగా సరిపోకపోయినా, చాలా మటుకు కుదురుతోంది. అయితే ఆ దృష్టితో చూస్తే మాత్రం ఈ పాటలో ఉండే జ్యోతిషం నేతి బీరకాయలో నెయ్యి లాగే కనిపిస్తోంది. కేవలం రాశుల symbols ని మాత్రమే తీసుకుని పాటగా కూర్చినట్టుగా ఉంది.

    జ్యోతిష పరిజ్ఞానం ప్రకారం రాశుల మైత్రి ఉందేమో అని ఊహించడంలో మాత్రం మీరన్నట్టుగానే నేను లేని క్రమాన్ని చూడడానికి ప్రయత్నించాను బహుశా.

  3. మరో ముఖ్యమైన కోణము జ్యోతిష విశేషాలకంటే పాటకి యతి ప్రాసలు ముఖ్యం. అవి ఎబ్బెట్టుగా కాకుండా సహజంగా అమరేట్టు ఉండడం అన్నమయ్య పదాల్లో ఒక గొప్ప లక్షణం. అందుకోసం కూడా ఆ పాటలోని క్రమం అలా ఏర్పడి ఉండే అవకాశం ఉంది.

  4. అసందర్భమైనా ఓ విషయం. చాలా కాలం క్రితం ఆంధ్రప్రభలో కరుణశ్రీ గారు, “ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబుపై పాదాబ్ఝంబులపై కపోలతటిపై….” అన్న ఓ పద్యంలో లక్ష్మీ దేవి వర్ణన వరుస క్రమాన్ని గురించి ప్రస్తావించారు. అంటే, మొదట కొప్పు, తనువు, ఆ తర్వాత భుజాలపై ఉన్న ఉత్తరీయం …ఈ వరుస క్రమానికి అర్థం ఏమిటి అని. నాకు ఆయన చెప్పిన సమాధానం పూర్తిగా గుర్తులేదు కానీ, ఆయన ఉద్దేశ్యం ప్రకారం అదో శృంగార వర్ణన.

    అన్నమయ్య ఈ కృతి కి ఉద్దేశ్యం కూడా చైతన్య కృష్ణ గారన్నట్టు శృంగార పరంగానే ఉండవచ్చునేమో.

    ఈ కృతి నాకు కూడా చాలా ఇష్టం.

  5. కొత్తపాళీ గారూ, రవి గారూ – నెనర్లు. మీరు చెప్పిన విషయాలు కూడా చాలా సమంజసంగా ఉన్నాయి.

  6. నాకు కూడా చాలా ఇష్టమైన పాట ఇది. సినిమాలో విన్నతరవాతే, ఇతర ప్రైవేటు ఆల్బం లలో వినటం జరిగింది. ఎన్ని ఆ తరువాత విన్నా సినిమాలోని గీతమే ఒక పురా పరిమళం లా గుభాళిస్తూనే ఉంది. బహుసా మామ విద్వత్తేమో.

    పాటపై విశ్లేషణ బాగా జరిగింది.
    మంచి విషయాలు తెలిసినయ్

  7. జ్యోతిషానికీ ఈ పాటకీ సంబంధమేమిటో తెలియదు కాని, నాకు కూడ చైతన్యకృష్ణగారు అన్నట్టుగానే తోస్తోంది.


Leave a response

Your response:

Categories