Posted by: nagamurali | November 22, 2008

నా బ్లాగు మొదటి పుట్టినరోజు

ఇవాళ నా బ్లాగు మొదటి పుట్టినరోజు. ఇంతవరకు 88 టపాలు రాశాను. (దీనితో కలిపి 89.) వచ్చిన కామెంట్లు 525.

గత సంవత్సరంలో నాకు ఎంతో సంతోషం కలిగించిన విషయాల్లో బ్లాగు రాయడం ఒకటి. కొందరు మంచి మిత్రుల్ని సంపాదించుకోవడం, కొత్త విషయాలు ఎన్నో తెలుసుకోవడం జరిగింది. కొందరు మిత్రుల బ్లాగుల నుంచి ఎంతో స్ఫూర్తి పొందడం కూడా జరిగింది.

బ్లాగు రాయాలని అంతకు ముందు ఒకటి రెండేళ్ళుగా కోరిక ఉన్నా, బద్ధకిస్తూనే కాలం గడిపేశాను. గత ఏడాది ఇదే రోజు హఠాత్తుగా ఆఫీసులో ఒక బలహీన క్షణంలో, ఆవేశంతో బ్లాగు ప్రారంభించెయ్యడం జరిగింది. అయితే అప్పటికి కూడలి గురించి గానీ, మిగతా తెలుగు బ్లాగుల గురించి కానీ తెలియదు. బ్లాగు ఇంగ్లీషులోనే రాద్దామనుకున్నాను. అయితే బ్లాగుల గురించి గూగిలిస్తూ పోతే తెలుగు బ్లాగుల విషయాలు తెలిశాయి. లేఖిని ఉపయోగించి తెలుగులో రాయడం మొదలెట్టా. తర్వాత నా బ్లాగుని కూడలిలో చేర్చాక అందరితోనూ మెల్లగా పరిచయం అయింది.

బ్లాగు రాయక మునుపు నా మనసులో మెదిలే ఆలోచనలు వ్యక్తం చెయ్యడానికీ, సహృదయులతో చర్చించడానికీ అవకాశం లేక ప్రవాస జీవితం చాలా ఒంటరిగానే అనిపించేది. ఇప్పుడా లోటు చాలామటుకు తీరింది. కొన్ని కొన్ని టపాలకి మిత్రుల కామెంట్లు చూస్తే ఎంతో ఉత్సాహం కలుగుతుంటుంది.

కొత్తపాళీగారి ప్రేరణతో ఎన్నో సంవత్సరాలుగా జ్యోతిషం గురించి పేరుకుపోయిన ఆలోచనలన్నిటినీ ఒక క్రమంలో పెట్టుకుని ఈమాట జాలపత్రికలో నాలుగు వ్యాసాలుగా రాయడం గొప్ప అనుభవం. నేను రాసిన మొదటి సీరియస్ రచన అది. (సీరియస్ రచనగా దాన్ని భావించచ్చో లేదో నాకింకా అనుమానమే). దానివల్ల కలిగిన పరిచయాలు ఎంతో విలువైనవీ, ఎన్నటికీ మరువలేనివి.

రాసిన టపాలన్నీ సంతృప్తినే ఇచ్చాయి. ఒకటి రెండు టపాలు రాసి ఉండాల్సింది కాదనీ, కొన్ని చర్చల్లో తలదూర్చకుండా ఉండి ఉంటే బాగుండేదనీ అనిపించినా, వాటివల్ల కూడా ఎంతో నేర్చుకోవడం జరిగింది. ఎవరైనా మిత్రుల్ని నేను నొప్పించి ఉంటే మాత్రం మళ్ళీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నా.

నేను చాలా బద్ధకస్తుణ్ణి. గత ఏడాది ఇదే రోజు ఎన్నుకున్న బ్లాగు టెంప్లేట్ ని ఇంతవరకూ మార్చలేదు. మార్చాలని కోరిక ఉన్నా బద్ధకం. టపాల్ని ఇంకా సరిగ్గా ఆర్గనైజ్ చెయ్యాలి. దానికీ  బద్ధకమే. రాయాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సీరియస్ రచనలు కూడా చెయ్యాలి. టైము లేదని వంక పెట్టుకుంటూ కాలం గడిపేస్తుంటాను.

వచ్చే ఏడాది ఇంకా బాగా రాయడానికి కృషి చెయ్యాలనీ, బ్లాగు మిత్రుల్లో వీలైనంతమందిని వ్యక్తిగతంగా కలుసుకోవాలనీ, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనీ, చదవాలనీ ఆశిస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలూ నాకెంతో ఉత్సాహాన్నీ, తృప్తినీ, సంతోషాన్నీ ఇచ్చాయి. అందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి.

సంసార కటు వృక్షస్య ద్వే ఫలే హ్యమృతోపమే,

సుభాషిత రసాస్వాద: సంగతి: సుజనే జనే ||


Responses

  1. మురళి గారూ,

    మీ బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ….మంచి మంచి టపా లతో అలరిస్తారని ఆకాంక్షిస్తూ..

    /ఉమాశంకర్

  2. అభినందనలు, నెలకు సగటున 8 టపాలు రాసారన్నమాట, త్వరలో సెంచురీ కొట్టేయండి, ప్రత్యేకించి జోతిషం మీది వ్యాసాలు బాగున్నాయి, అయినా ఇంకా రాయక మిగిలిపోయిందేమొ అన్నట్లుగా ముగించేసారు.

  3. మీ బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు

  4. నాగమురళి గారు చక్కటి పోస్టులు అందిస్తున్న మీ బ్లాగుకు ప్రధమ జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే మున్ముందు మరిన్ని మంచి పోస్టులతో దిగ్విజయంగా బ్లాగుని నిర్వహిస్తారని ఆశిస్తున్నాను.

  5. మీ బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు

  6. అభినందనలు అందుకోండి

  7. మీ బ్లాగుకి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు. మీ నుంచి ఈ సంవత్సరంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇలాగే ప్రయాణం కొనసాగిస్తూ పదండి.

  8. మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు మురళి గారు. ఈ సవత్సరం మీరు అనుకున్నట్లు గా మరిన్ని మంచి టపాలు వ్రాసి అందరి అదరాభిమానాలని మరింతగా సొంతం చేసుకోవాలని కోరుకుంటూన్నాను.

  9. అభినందనలు మురళీ గారు,నాకు మనస్ఫూర్తిగా నచ్చిన తెలుగు బ్లాగుల్లో మీదొకటి!మీ వల్ల నేను చాలా మందిమి లాభపడ్డాం,మీరు మరిన్ని సమున్నత శిఖరాలు అధిరోహించాలని నా హృదయపూర్వక ఆకాంక్ష.

  10. abhinamdanalu

  11. అభినందనలు

  12. ఉమాశంకర్ గారూ, నరేంద్రభాస్కర్ గారూ, గంగాభవాని గారూ, శ్రీధర్ గారూ, రాధిక గారూ, కృష్ణమోహన్ గారూ, వేణూ శ్రీకాంత్ గారూ, రాజేంద్ర గారూ, దుర్గేశ్వర గారూ, చావాకిరణ్ గారూ – అందరికీ నా కృతజ్ఞతలు.

  13. అభినందనలు

  14. శుభాకాంక్షలు..ఇంక ఎన్నో మంచి బ్లాగులు రాయాలని కోరుకుంటూ..

  15. అభినందనలు

  16. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఇంకా ముందుకు సాగగలరనీ ఆశిస్తూ

  17. అందరూ అభినందనలు చెప్పేశారు కాబట్టి నేను కాసిని అక్షింతలు వేస్తాను.
    భాష మీద ఇంత మంచి పట్టు ఉన్న మీరు కూడా ఇలా “జరుగుడు” గా రాయడం అస్సలు బాగా లేదు. :(
    పోన్లెండి, ఇవ్వాళ్టికి మటుకు అది మీ బ్లాగుకి దిష్టిచుక్క అనుకుంటాను.

    “గత ఏడాది ఇదే రోజు హఠాత్తుగా ఆఫీసులో ఒక బలహీన క్షణంలో, ఆవేశంతో బ్లాగు ప్రారంభించెయ్యడం”
    మీకు ఇటువంటి బలహీన క్షణాలు మరిన్ని ప్రాప్తమవ్వాలనీ, తద్వారా మీరు మంచి కథలూ కబుర్లూ, ఇంకా ఇతర మంచి పనులూ చేపట్టి పూర్తిచెయ్యాలనీ కోరుకుంటున్నాను.

    ఈమాటలో జ్యోతిషం పై నాగమురళి గారి నాలుగు వ్యాసాలు ఇక్కడ చదవచ్చు.
    మొదటిభాగం

    రెండోభాగం

    మూడోభాగం

    నాలుగోభాగం

  18. ఏఁడాదిలోఁ ఎనభైఎనిమిది టాపాలా? చాలా బాగా బ్లాగుతున్నట్లే మీరు. అదీ క్వాలిటీ లాసు లేకుండా. బ్లాగుతల్లి మిమ్మలి చల్లగా చూస్తాది :)

    మీ టపా చూసాక గుర్తుకువచ్చింది. నేను బ్లాగు మొదలు పెట్టి మూఁడేండ్లయ్యింది, ఇందులో నరవైయ్యాఱు టపాలు చేశాను. నెలకి ఒకటిన్నర చొప్పున :)

  19. పుట్టినరోజు శుభాకాంక్షలు నాగమురళి గారి బ్లాగుకు!

  20. శుభాకాంక్షలు నాగమురళి గారూ,

    మీ బ్లాగునుండి స్ఫూర్తిని పొందిన వారిలో నేనూ ఒకణ్ణి. మీ బ్లాగులోని వైవిధ్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది నాకు. మంచి బ్లాగులకు ప్రమాణం మీ బ్లాగే అని నేను భావిస్తాను.

    శతమానం భవతి… మీ బ్లాగుకు!

  21. మహేష్, pappu, పూర్ణిమ గారు, మాలతి గారు: కృతజ్ఞతలు.

    కొత్తపాళీ గారు: మీరన్నది నిజమే. ఈ టపా ఇంకా బాగా రాయాలనే గత వారం నుంచీ అనుకుంటున్నాను. కానీ గత వారం, ఈ వీకెండూ మా ఇంట్లో అతిథులు. బ్రమ్మాండమైన కాలక్షేపాలు నడుస్తుంటే, మధ్యలో ఓ పావుగంట దొరకబుచ్చుకుని గబ గబా రాయాల్సొచ్చింది. అందుకే అంతకన్నా బాగా రాయలేకపోయాను. ఈమాట వ్యాసాల లంకెలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ కామెంటుకి మరోసారి కృతజ్ఞతలు.

    రాకేశ్వరా: నెనర్లు. మీరింకా ఎక్కువగా రాయాలని ఎదురుచూసేవాళ్ళలో నేనొకణ్ణి.

    సుజాత గారూ: నెనర్లు.

  22. చంద్రమోహన్ గారూ, చాలా కృతజ్ఞతలు.

  23. happy birthday to your beautiful blog.

  24. నాగ మురళి గారు, శుభాకాంక్షలు.

    మీ బ్లాగులు నచ్చాయని, మీరు నాకు స్పూర్తి అని ఏవేవో రాయాలనుకున్నా. అయితే, వూరికే ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక రాయలేదు :-) .

  25. రవి గారూ, Thank you very much.

  26. అంతర్జాలమహత్సముద్రలహరీపర్యాకులాన్ధ్రాభిధాం
    వాణీం జాలజనాశ్రయా మహరహ స్సంసేవయన్తం త్వయి౹
    భూయాల్లాభమభీప్సితార్థఫలసిద్ధిర్వైభవం బ్లాగ్స్థలి
    యస్మాన్నో భవతా లభేచ్చ చతురా వ్యాసావళీ శోభనా౹౹

    నా చేతఁ మొత్తానికి నొక శ్లోకము గూడ వ్రాయించారు గదా! :)

  27. రాఘవ గారూ: ధన్యోస్మి… మీ శ్లోకం చాలా బాగుంది.

  28. కాస్త ఆలస్యంగానైనా పుట్టినరోజు శుభాకాంక్షలు..

  29. జ్యోతి గారూ, నెనర్లు.


Leave a response

Your response:

Categories