స తప్త కార్తస్వర భాస్వరాంబర: కఠోర తారాధిప లాంఛనచ్ఛవి:
విదిద్యుతే బాడబజాతవేదస: శిఖాభిరాశ్లిష్ట ఇవాంభసాం నిధి: ||
కఠోర తారాధిప = పున్నమి చంద్రుని యొక్క
లాంఛనచ్ఛవి: = మచ్చ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్నవాడు,
తప్త కార్తస్వర భాస్వర అంబర: = కాల్చి శుద్ధి చేయబడిన బంగారము వలె ప్రకాశిస్తున్న బట్టలు కలిగినవాడూ అయిన
స: = అతడు (శ్రీకృష్ణుడు)
బాడబ జాతవేదస: = బడబాగ్ని యొక్క
శిఖాభి: = శిఖలచేత
ఆశ్లిష్ట: = ఆవరించబడిన
అంభసాం నిధి: ఇవ = సముద్రుని వలె
విదిద్యుతే = శోభించెను.
(ఇవాళ గుర్తొస్తున్న శ్లోకం. మాఘ కావ్యం, మొదటి సర్గ.)
చాలా బాగుందండి! ‘మాఘో సంతి త్రయోగుణా:’ అన్న మాట గుర్తొచ్చింది. ఎందుకో మాఘం చదవలేదు నేను ఇంత వరకూ. కఠోర తారాధిప అన్న మాట వింతగా ఉంది ఎందుకో. కాళిదాసు చంద్రుని వర్ణించడానికి ఇంత కటువైన పదం వాడగలడా!
మీ బిజీ బిజీ దినచర్య లోనుండి కొంత సమయం కేటాయించి ఇలాంటి శ్లోకాలను పరిచయం చేస్తుండండి మాకు.
By: చంద్ర మోహన్ on October 29, 2008
at 5:34 pm
చంద్రమోహన్ గారూ, నెనర్లు. నేను కూడా మాఘం మొదటి పది సర్గలే చదివాను. మీరు ఇంతవరకూ చదవకపోతే, మొదటి నాలుగు సర్గలూ మాత్రం చదివి తీరాలి. నాకూ అవి చదివాకనే ‘మాఘే సంతి త్రయోగుణా:’ అన్న మాట ఎందుకంటారో తెలిసొచ్చింది. నాలుగో సర్గ నుంచీ కవిత్వం చాలా ప్రౌఢంగా/కఠినంగా మారిపోయి, నాకు అందనంత ఎత్తులో నడిచిపోయింది. కానీ, ఒకటి – మూడు సర్గలు చదవడం వల్ల మాత్రం నా సంస్కృత సాహిత్య పిపాసకి సార్థకత కలిగినంతగా అనుభూతి పొందాను.
By: nagamurali on October 29, 2008
at 7:05 pm
బాడబజాతవేదసః – జాతవేదసః అంటే జాతవేదసుడైన అగ్ని (జాతవేదసే సునవామ సోమ మరాతీయ తోయనిదహాతి వేదః….ఋగ్వేదం)కదా..బాడబజాతవేదసః లో బాడబ అన్నది విశేషణం కావాలి కదా…కాస్త వివరించగలరు.
నేనూ మాఘం చదవుకోలేదు. తిరుమల రామ చంద్ర గారు మాఘుని జ్యోతిశ్శాస్త్ర పాండిత్యం మీద శిశుపాల వధం లో కొన్ని ఘట్టాలను ఉదహరిస్తూ ఓ అద్భుతమైన వ్యాసం రాసారు.
6 వ సర్గ అత్యద్భుతం అని ఓ చాటు పుస్తకంలో చూశాను.
By: రవి on October 30, 2008
at 5:36 am
రవి గారూ, అవునండీ, ఇక్కడ బాడబ (వాడవ అని కూడా రాస్తారు) అంటే విశేషణమే. జాతవేదసుడంటే అగ్ని. బాడబ జాతవేదసుడంటే, బడబాగ్ని. సముద్రంలోపల అగ్ని ఉంటుందనీ, దాన్ని బడబాగ్ని అంటారనీ మీకు తెలుసు కదా.
మాఘంలో నాలుగో సర్గ నుంచీ మరీ ప్రౌఢంగా ఉండడంతో తర్వాతి సర్గల్లోని విశేషాలు నాకు ఎక్కువ బుర్రలో నిలబడలేదు. ఎనిమిదో సర్గ లోనో, తొమ్మిదో సర్గలోనో ఒక చంద్రోదయ వర్ణన శ్లోకం మాత్రం గుర్తుండిపోయింది. అలాగే ఆ సర్గల్లోంచి నేను పొందిన మరొక ప్రేరణ ఏమిటంటే, మా అమ్మాయికి ఒక పేరు సంపాదించడం. నేను మాఘం చదివింది 2001 లో. అప్పటికి కనీసం భవిష్యత్తులో పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. అయినా ఒక శ్లోకంలో ఒక అందమైన పదం కనిపిస్తే, భవిష్యత్తులో నాకో కూతురు పుడితే, దానికీ పేరు పెట్టాలి అనుకున్నాను. 2007 లో అమ్మాయి పుట్టడం, దానికదే పేరు పెట్టడం జరిగింది – రాగమిత అని. అంటే ప్రియురాలు అని అర్థం.
మాఘం నేను డైరెక్టుగా మల్లినాథ సూరి వ్యాఖ్యానం తీసుకుని చదివాను. పెద్దలెవరి దగ్గరైనా చదువుకుని ఉంటే ఇంకా బాగా ఆస్వాదించి ఉండేవాడిని. ఇంకా చాలా విశేషాలు కూడా తెలిసేవి. రెండో సర్గలో రాజనీతి గురించిన విశేషాలు చాలా గొప్పగా ఉంటాయి. జ్యోతిషానికి సంబంధించినంత వరకు, ఒక శ్లోకం నాకు గుర్తు ఉంది. దాన్ని ఇప్పుడే మరొక టపాగా రాసేస్తా. తిరుమల రామచంద్ర గారి వ్యాసం సంపాదించి చదవాలి. కాళిదాసు కూడా తన కావ్యాల్లో జ్యోతిష విశేషాలు అనేకం రాశాడని ఒక వ్యాసం చదివాను చిన్నప్పుడు. దాని విశేషాలు కూడా వీలు వెంబడి రాస్తాను.
By: nagamurali on October 30, 2008
at 5:57 am
[...] మేఘ దూతం , భవభూతి ఉత్తర రామచరితం, మాఘం ఉటంకిస్తూ వ్యాఖ్యానించడం, పైగా [...]
By: పొద్దు » Blog Archive » నాగమురళి బ్లాగు - సమీక్ష on January 15, 2009
at 8:03 am