ప్రచారసభ వాళ్ళ పరిక్షల్లో ఒకదానిలో లెటర్ రైటింగ్ ఉండేది. వార్తాపత్రిక ఎడిటర్ కి లెటర్ రాయమనో, హాస్టల్లో ఉండి చదువుకుంటూ నాన్నకి డబ్బు పంపమని రాయమనో పాఠాలు ఉండేవి. నేనోసారి ఇంట్లో పోస్టు కార్డు తీసుకొచ్చి, దానిమీద నాన్నకి డబ్బు పంపమని ఉత్తరం హిందీలో రాసేసి పోస్టు చేసేశా. మర్నాడు ఆయన పోస్టు తీసుకుని, హిందీలో కార్డు వచ్చిందేమిటా, నార్తు నుంచి మనకి ఎవరు రాస్తారబ్బా అని ఆశ్చర్యపడుతూ కూడబలుక్కుని ఆ ఉత్తరం చదువుకున్నారు. నేను ఒకటే నవ్వు. విషయం అర్థమయ్యాకా ఆయన నవ్వుకుంటూనే నన్ను కూకలేశారు. ఈ సంగతి తరవాత మా హిందీ టీచరు గారికి కూడా తెలిసి చాలా సంతోషించారు.
నేను మెల్లిమెల్లిగా ఒక్కో పరిక్షా పాసైపోవడం మొదలుపెట్టాను. ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రభాష, ప్రవేశిక కూడా అయిపోయింది. అన్నీ అత్తెసరు మార్కులే. ఏదో ముక్కునపట్టి రాసెయ్యడమే. మరీ అధ్వాన్నంగా ఇంత తక్కువ మార్కుల్తో పాసవ్వడమేమిటి అని మా టీచరు గారు అడిగేవారు కాదు. పాపం చిన్నపిల్లాడు, క్లాసు పాఠాల్తో బిజీగా ఉండి కూడా ఈ పరిక్షలు పాసవుతున్నాడు, పోనీలే అని వదిలేసేవారు.
మా నాన్నగారి కొలీగ్సు కొంతమందికి నన్ను చూస్తే సరదాగా ఉండేది. నేను హిందీ ట్యూషన్ కి వెడుతూ దారిలో కనిపిస్తే నవ్వుతూ వచ్చీ రాని హిందీలో పలకరించేవారు. ఒకసారి ఒకాయన సాయంత్రం మా ఇంటికి వచ్చారు. కరెంటు పోయింది. కొవ్వొత్తులు పెట్టుకుని అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆయన జోకులేస్తూ నన్ను హిందీలో మాట్లాడమన్నారు. నేను నదురూ బెదురూ లేకుండా కన్యాశుల్కంలో వెంకటేశంలా నా నోటికొచ్చిన హిందీ ముక్కలన్నీ వాగేశా. అప్పుడాయన, ‘ఒరే, నేను ఎప్పుడైనా ఉత్తరాదికి వెళ్ళాననుకో. అర్జెంటుగా ఒకటికి వచ్చిందనుకో. ఎక్కడికి వెళ్ళాలో ఏమని అడగాల్రా?’ అని అడిగారు. నేను తడుముకోకుండా ‘మూత్ర విసర్జన్ కే లియే కహా జానా హై?’ అని అడగాలండీ అని చెప్పేశా. ఆయన ఘొల్లుమని ఒకటే నవ్వు. ‘మరీ అంత గ్రాంథికంలో మాట్లాడితే ఎలాగరా?’ అన్నారు.
ప్రతీ ఆర్నెల్లకీ ఒక్కో పరిక్ష పాసవుతూ విశారద పూర్వార్థ, ఉత్తరార్థ కూడా పూర్తి చేసేశా. విశారద పూర్తయితే సర్టిఫికెట్టుతో పాటూ ఒక శాలువా కూడా పంపారు ప్రచారసభ వాళ్ళు. అప్పటికి నేనింకా తొమ్మిదోక్లాసు మొదట్లో ఉన్నాను. విశారద పాఠాలూ గట్రా చూస్తే చాలా ఎక్కువ స్టాండర్డ్ లోనే ఉండేవి. తులసీ రామాయణంలో భాగాలు, పాత నాటకాలు, కవిత్వాలు, సాహిత్య చరిత్ర, నవల్లు గట్రా గట్రా అన్నీ ఎలా మానేజ్ చేసి పాసయ్యానో తల్చుకుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అత్తెసరు మార్కులు తెచ్చుకోడానికి ఏవో కొన్ని వ్యాసాలు మాత్రం ముక్కున పెట్టేసి రాసేసేవాణ్ణి.
నాకున్న కాస్త హిందీ జ్ఞానం పుణ్యమా అని రామాయణ్, మహాభారత్ ఇంకా కొన్ని హిందీ సీరియల్సూ చాలామటుకు అర్థం చేసుకుంటూనే చూసేవాణ్ణి. వాటిల్లో డైలాగులు మా క్లాసులో ఫ్రెండ్సు దగ్గర చెప్తూ ఉండేవాణ్ణి.
తొమ్మిదో క్లాసుకొచ్చాకా ప్రవీణ్ పరిక్షకి పాఠాలు మొదలయ్యాయి. ఇది కూడా రెండు భాగాలు- పూర్వార్థ, ఉత్తరార్థ అని. పూర్వార్థ లో పాఠాలు బీయే స్టాండర్డ్ లో ఉండేవి. ఏవేవో వ్యాసాలు, సాహిత్య చరిత్రా గట్రా, గట్రా. అవన్నీ బోరుకొట్టి చిరాకు పుట్టింది. పదోక్లాసులో హిందీ పరిక్షలు రాయద్దు అని మా టీచరుగారూ, ఇంట్లోవాళ్ళు కూడా డిసైడ్ చేసేశారు. మా టీచరు గారి ఉద్దేశ్యమేమిటంటే, తొమ్మిదో క్లాసు పూర్తయ్యి, పదికి వచ్చేసరికి ప్రవీణ్ పూర్తి చేయించేస్తే, మెల్లిగా ఏ ఇంటరో అయ్యాకా సాహిత్యరత్న పరిక్షకి కట్టిద్దామని. దానితరవాత పండిట్ ట్రైనింగైపోయి టీచరుగా సెటిలైపోవచ్చు.
నాకు మాత్రం ప్రవీణ్ పరిక్షకి పూర్తిగా విసుగొచ్చేసింది. ఈసారి ఎలాగైనా సరే ఫెయిలైపోవాలని నిశ్చయించుకున్నాను. కానీ రెండు ఆటంకాలు ఉన్నాయి. మరీ అధ్వాన్నంగా అన్ని పేపర్లలోనూ ఫెయిలైతే పరువు తక్కువ. అదొక్కటే కాదు, మా పక్క వీధిలో, వేరే కాన్వెంట్లో నా క్లాసే చదువుతున్న ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వేరే టిచరుగారి దగ్గర హిందీ ట్యూషన్ కి వెడుతూ నాతో సమానంగా పరిక్షలు రాసి పాసైపోతూ ఉండేది. ఆ అమ్మాయి కూడా నాతోపాటు ప్రవీణ్ పూర్వార్థ పరిక్ష రాస్తోంది. నేను ఫెయిలయ్యి, ఆ అమ్మాయి పాసైతే మనకి ఇంకా పరువు తక్కువ. ఎలాగరా భగవంతుడా అనుకున్నాను. నా అదృష్టం పండి, సరిగ్గా పరిక్షల సమయంలో ఆ అమ్మాయికి ఏదో ఫంక్షనై పరిక్షలు రాయలేదు. నేను మనసులోనే ఎగిరి గంతేశాను. ‘భగవంతుడా, అన్ని పేపర్లూ పాసై, ఒక్క పేపర్లో మాత్రం కొద్ది మార్కుల తేడాతో ఫెయిలైపోయేలా చెయ్యి’ అని గట్టిగా దణ్ణం పెట్టుకుని యథాశక్తి అలాగే ఫెయిలయ్యే విధంగా పరిక్షలు రాశాను.
రిజల్టు చూస్తే ఏముంది? అన్ని పేపర్లూ పాస్. ఒక్క కష్టమైన పేపర్లో మాత్రం నాలుగైదు మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్. నేను మహా ఆనందించాను, గొడవ వదిలింది అని. రిజల్టు తెలిశాకా మా టీచరు గారి రియాక్షన్ ఇప్పటికీ నాకు గుర్తే. పాపం చాలా బాధ పడ్డారు. ‘అయ్యో, చాలా కొద్దిలో పోయిందే’ అని చాలా సార్లు అన్నారు. ఇప్పటికీ ఆ సందర్భంలో ఆవిడ పడిన బాధ తల్చుకుంటే మనసు కలుక్కుమంటుంది.
తరవాత మళ్ళీ ఎప్పుడూ హిందీ జోలికి పోలేదు. టెన్తు పాసయ్యాకా, ఇంటర్లో మా నాన్న హిందీ తీసుకోమని అన్నారు. నేను మొదట హిందీకి అప్లై చేసినా, మార్కులు బాగా వస్తాయి అని స్నేహితులు చెప్పడంతో వెంఠనే సంస్కృతానికి మారిపోయా. నా జీవితంలో నేను చేసిన ఉత్తమోత్తమమైన పనుల్లో అది ఒకటి. సంస్కృతం లెక్చరరు గారు పాఠం చాలా చాదస్తంగా ప్రతీ పదానికీ విశేషాలన్నీ విడమర్చి పాఠం చెప్పేవారు. దానితో అంతకు ముందు ఒక్క ముక్క పరిచయం లేకపోయినా నాకు సంస్కృతం ఆరోప్రాణమై కూర్చుంది. అందులో పెద్ద సాధించిందేమీ లేదుగానీ, అప్పుడు చదువుకున్న నాలుగు ముక్కలకీ, ఇప్పటికి కూడా అపారమైన ఆత్మ సంతృప్తీ, ఆనందమూ మాత్రం మిగిలినై.
ఇంటర్లో నాకు ఒకతను (వేరే ఊరినుంచి వచ్చాడు లెండి) పరిచయమయ్యాడు. వాడు హిందీ తీసుకున్నాడు. వాడిక్కూడా నాలాగే మిడి మిడి జ్ఞానమేగానీ పండితుళ్ళా కనపడేవాడు కాదు. ఓసారి వాడితో మాటల సందర్భంలో హిందీ పరిక్షల గురించి వచ్చింది. విషయం తెలిసి షాకయ్యాను. వాడు టెన్తు క్లాసులోనే సాహిత్యరత్న పాసయ్యాడట. వాడి ఫొటో పేపర్లో వేశార్ట. ఆ పేపర్ కటింగ్ కూడా తీసుకొచ్చి నాకు చూపించాడు. అన్ని పరిక్షలు ఎలా పాసయ్యావురా, అని అడిగాను. ‘పాసయ్యాం, బాబూ. ఎలా అని అడక్కు. ఏదో ముక్కునపెట్టి రాసేశాం, పాసైపోయాం, అంతే,’ అన్నాడు. అప్పుడనిపించింది, నేను సాహిత్యరత్న పాసైనా వీడి లెవెల్లోనే ఉండేవాణ్ణి అన్నమాట అని.
తరవాత పై చదువులకి హైదరాబాదు వచ్చాకా తెలిసింది, మనకి తెలిసిన హిందీ బయట ప్రపంచంలో చిల్లిగవ్వకి మారదు అని. నేను మాట్లాడితే మా ఫ్రెండ్సంతా పగలబడి నవ్వేవారు. క్షణక్షణం సినిమాలో శ్రీదేవి ఆటోవాలాతో ‘యే బహుత్ అన్యాయ్ హై’ అంటుంది. అలాగే ఉండేది నా హిందీ కూడా. దానితో మన హిందీకి కొంత కామెడీ వేల్యూ ఉంది అని అర్థమయ్యింది. అప్పట్నించీ ఎప్పుడేనా కామెడీ కోసం మాట్లాడ్డమే తప్ప హిందీ జోలికే పోను. అసలు నాకు ఆ భాష మీద ఆసక్తే లేకపోవడం వల్ల కనీసం నేర్చుకున్నది కొద్దిగా ఇంప్రువ్ చేసుకుందాం అని కూడా అనిపించదు. ఈమధ్య ఏదో టపాకి కామెంట్లు చూస్తూ రానారే గారు అన్న మాటలు చూశాను. ఆయనలాగే నాకు కూడా చిన్నతనంలో కొంచం బలవంతంగా రుద్దబడింది కాబట్టి ఇప్పటికీ ఆ భాషమీద కోపం పోలేదు.
మా ఆవిడ ఇలాంటి బాధలేమీ పడకుండానే కేవలం టీవీ చూసి హిందీ చక్కగా నేర్చుకుంది. తనకి హిందీ సినిమాలన్నా, సీరియల్సన్నా ఇష్టం. ఎప్పుడేనా బోరు కొట్టినప్పుడు కాస్త కామెడీకోసం నన్ను హిందీలో మాట్లాడమంటూ ఉంటుంది. నేను మాట్లాడుతుంటే తెగ నవ్వుతుంది. ఓసారి తను ఒక్కతీ ఇండియాకి వెళ్తోంది. బొంబాయిలో దిగి ఫ్లయిటు మారాలి. అక్కడ లగేజీకి ఎవర్నైనా హెల్పు అడగాలి అంటే ఏమని అడగను అంది, నేనేమంటానో చూద్దామని. ‘భాయీ సాబ్, భాయీ సాబ్, థోడా సహాయ్ కరో’ అని అడుగు అని చెప్పాను.
(అయిపోయింది)
By: వికటకవి on July 3, 2008
at 2:33 pm
बहुत अछा है!
By: కె.మహేష్ కుమార్ on July 3, 2008
at 3:41 pm
@ వికటకవి .. అద్వానీ సింధీ వాడు ఆయనకి ఎంత హిందీ వొచ్చో డౌటే.

@ మహేశ్ .. ఛా కి వొత్తుండాలి!
@ చాలా బావుంది మీ హిందీ ప్రహసనం, నాగమురళీ. పరిక్షలు రాయడానికి అక్కడ సెంటర్లో ఉండే విచిత్ర పరిస్థితులు చెప్పడం మరిచిపోయారు. మా నాయన గారు అచ్చ తమిళులు. ఆయన కొత్త భాష నేర్చుకోవాలి అనే కోరికతో తన నలభయ్యో యేట అక్షరాలతో మొదలు పెట్టి హిందీ నేర్చుకున్నారు. క్రమేణా ఒక్కొక్కటే పరీక్షలు పేసవుతూ వచ్చారు. ఆయన ఉత్తరాదికి వెళ్ళొచ్చిన గుర్తు లేదు నాకు కానీ హిందీ పాఠశాల వార్షికోత్సవాలకీ దానికీ హిందీలో ఉపన్యాసం ఇచ్చేవారు. ఇంటరు పిల్లలకి హిందీ ట్యూషను చెప్పేవారు (ఆయన వృత్తి రీత్యా బోటనీ మేస్టారు). పనిలో పనిగా మా అందరికీ కూడా నేర్పించారు. నేను ప్రాథమిక, ఆయన ప్రవీన ఉత్తరార్ధమూ ఒకే సారి రాశాము. ఆ రిజల్టు వచ్చి ఇద్దరమూ పాసయ్యామని తెలిసిన కొద్ది రోజులకే అకస్మాత్తుగా తెలియని సుస్తీ చేసి పోయారాయన.
By: కొత్తపాళీ on July 3, 2008
at 4:20 pm
వికటకవి గారూ, హైదరాబాదీ హిందీ గురించి మీరన్నది చాలా కరెక్టు. కొంతమంది మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన మా స్నేహితులు/కొలీగ్సు కూడా అలాగే అభిప్రాయపడేవారు.
మహేశ్ గారూ, నెనర్లు.
కొత్తపాళీ గారూ, హిందీ పరిక్షల సెంటర్లలో జరిగే విషయాలు/వ్యవహారాల గురించి రాయాలంటే చాలా ఉంది, ఎందుకులే అని వదిలేశాను. మీ నాన్నగారు ఆ వయసులో కొత్త భాష నేర్చుకుని పరిక్షలు రాశారంటే చాలా ఆశ్చర్యమనిపించింది. చాలా చిన్న వయసులోనే పరమపదించినట్టున్నారు ఆయన.
By: nagamurali on July 3, 2008
at 7:15 pm
मुजे भि “बहुत अछा है! “
By: Shankar Reddy on July 4, 2008
at 3:13 am
చాలా, చాలా, చాలా బావుంది.
ఓ విషయం గమనిస్తూ వస్తున్నాను. నా జీవితంలో అనుభవాలు, అభిప్రాయాలు మీకు సరిగ్గా కాంట్రస్టింగ్ గా ఉంటున్నాయి.
ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది.
నేను సంస్కృతం ఒకటవ తరగతి నుండీ 12 వరకు చదువుకున్నాను. ఐతే ఇప్పుడు ఏమీ గుర్తు లేదు. హిందీ అంతా జనగణ మన రాసి పాస్ అయాను. ఐతే, ఇప్పుడు హిందీలో ధారాళంగా మాట్లాడగలను. మీ హిందీ (గ్రాంధికం) కాదు లెండి .
By: రవి on July 8, 2008
at 12:41 pm
శంకర్ రెడ్డి గారూ, నెనర్లు.
రవి గారూ, ధన్యవాదాలు. బహుశా నా చిన్నతనంలో హిందీకి బదులు సంస్కృతం అదే విధంగా రుద్దబడి ఉంటే నేను తప్పకుండా హిందీకి బదులు సంస్కృతాన్ని ద్వేషించి ఉండేవాడిని. చిన్న వయసులో ఎక్కువ భారం మోపే చదువులు అంటే నాకు చాలా చిరాకు. హిందీ ఒకటే కాదు, చిన్నతనంలో నేర్చుకున్న అన్ని సబ్జక్టులూ ముక్కునపట్టి నేర్చుకున్నవే. ఆసక్తి కొద్దీ అడిగి తెలుసుకున్నవి ఏవీ లేవు.
డార్విన్ పరిణామ సిద్ధాంతం గురించి మొదటగా ఎనిమిదో క్లాసులోనో, తొమ్మిదో క్లాసులోనో చదివాం. అప్పట్లో దాన్ని అసలు పట్టించుకోనే లేదు. అయిదారు సంవత్సరాల క్రితం స్టీవెన్ పింకర్ పుస్తకాలతో ప్రేమలో పడ్డాక, ఆ సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని బలీయమైన కోరిక పుట్టి, రిచర్డ్ డాకిన్స్ రాసిన పుస్తకాలు చదివి, అర్థం చేసుకున్నాను. అసలు పిల్లలకి పదిహేనో యేడు వచ్చేవరకూ కథల పుస్తకాలు, సరదా విషయాల రూపంలో విషయ పరిజ్ఞానాన్ని పెంచే పుస్తకాలూ ఇవ్వడం తప్ప స్కూల్లో పాఠాలు రుద్దించడం దండగ అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
మన అనుభవాలూ, అభిప్రాయాలూ కాంట్రాస్టింగ్ గా ఉండడం నాకూ చాలా ఆసక్తికరంగానే ఉంది. అయితే నాకున్న అనుభవాల ‘విస్తృతి’ తక్కువ. పుస్తకాలు కూడా నేను కొన్ని ‘రకాల’మీదే ఆసక్తి పెట్టి మిగతావాటిని నిర్లక్ష్యం చెయ్యడం జరిగీంది. నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయని, మరీ అజ్ఞానంలో ఉన్నానేమో అనీ ఈమధ్య గట్టిగా అనిపిస్తోంది.
By: nagamurali on July 8, 2008
at 1:11 pm
భలే ఉంది మీ హిందీ ప్రహసనం. చిన్నప్పటి నుంచీ హిందీ సబ్జెక్టుగా ఉండడం మూలాన, హాస్టల్లో దోస్తుల వలన మంచి హిందీ మాట్లాడడం అలవాటయింది (లక్కీగా హై. లో ఉన్నా ఉర్దూ హిందీ రాలేదు)
By: ప్రవీణ్ గార్లపాటి on July 8, 2008
at 5:17 pm
@ప్రవీణ్ .. ఉర్దూ చాలా అందమైన భాష. ఉదాహరణకి పాత హిందీ సినిమా పాటల్లో 80% మాటలు ఉర్దూ నే అంటే అతిశయోక్తి కాదేమో. హైదరాబాదు వీధుల్లో మాట్లాడేది అదొక స్థానిక భాష. ఉర్దూ హిందీ కాదు. చక్కటి ఉర్దూ హైదరాబాదులో ఏ కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉంటుంది.
By: కొత్తపాళీ on July 8, 2008
at 8:51 pm
నాగ మురళి గారూ,
నాకు సంస్కృతం అంటే ప్రత్యేకమైన ద్వేషం అనేదేమీ లేదు. నిజానికి అదో అందమైన భాష.It has got a strange depth. అయితే, అదో దేవ భాష. సంస్కృతంలో ఏమి చెప్పినా గొప్ప అనే కుహనా సాంస్కృతిక వాదమంటే కాస్త చికాకు. దీనికి కొన్ని బలీయమైన కారణాలు (నా పర్సనల్ లైఫ్ లో జరిగినవి కూడా).
కొత్తపాళీ గారూ, ఉర్దూ చాలా సుందరమైనది. ఇది అరబిక్ కి దగ్గరగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను. అరబిక్ చాలా ఫ్రీ ఫ్లోయింగ్ భాష. చాలా సరళంగా ఉంటుంది. మనం వింటుంటేనే తెలుస్తుంది.
By: రవి on July 9, 2008
at 5:11 am
లేదు రవి గారూ, నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు. సంస్కృతమంటే నాకు చాలా ప్రేమ ఉన్నప్పటికీ మీరు చెప్పిన కుహనా సాంస్కృతిక వాదమంటే నాకూ చిరాకే. దాన్ని ఒక ‘క్లాసికల్ లాంగ్వేజ్’ గా మాత్రమే అభిమానిస్తాను. అందులో ఉన్నదంతా గొప్ప అని గానీ, దాని కన్నా గొప్ప భాష లేదు అని గానీ అనుకోను. కానీ ఆ భాషా మాధుర్యం మాత్రం నన్ను చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అంతే.
By: nagamurali on July 9, 2008
at 5:37 am
బాగుందండీ మీ హింది అభాయసం! మీ ఆవిడే కాదు, నేనూ ఇంకా చాలా చాలా మంది దూరదస్శన్ సహాయంతో హిందీ నేర్చుకున్న వాళ్ళమే! ఏ స్కూల్లోనూ హిందీ ని హిందీ లాగా చెప్పరు. టీచర్లకే అది పెద్ద తలనొప్పిగా తోస్తే పిల్లలకెందుకు తోచదు?. చాలా మంది హింది టీచర్లు స్కేలుతో రాసిన దాన్ని కొల్చి మార్కులు వేస్తారనే కంప్లైంట్ ఉంది.
ఇక హైదరాబాదు హిం దీ ని అసలు హిందీ అనే పిలవలేము! హింది ఉర్దు, పార్సి, తెలుగు అన్నిటి సమ్మిళితం!
కానీ ఉర్దూ మధురమైన భాషండీ! ఉర్దూ కవులకు కూడా భావుకత, సున్నితమైన హాస్య ధోరణి ఎక్కువగా ఉంటాయి చూడండి(గాలిబ్ లాగా). కానీ లిపి చూసి, నేరుచుకోవాలంటే భయమేస్తుంది!
By: సుజాత(మనసులో మాట) on July 9, 2008
at 6:06 am
అభాయసం కాదు! అభ్యాసం అని ఉండాలి! అచ్చుతప్పు.
By: సుజాత(మనసులో మాట) on July 9, 2008
at 6:08 am
శ్రీ దేవి డైలాగు సూపర్. అయ్యో! నాకు క్షణ క్షణం చూడాలనిపిస్తుంది. మీ మూడు టపాలూ.. ఇప్పుడే చదివాను. నేను హిందీ, పంజాబీ, హర్యానవీ మానెజ్ చెసేస్తాను గానీ.. ఇక్యావన్.. చత్తీస్, ఉనత్తీస్.. అంటే మాత్రం తెల్ల మొహం వేస్తాను. నెంబర్లు మాత్రం కాస్త తడుముకుంటెనే గానీ అర్ధం కావు.
ఇంకా.. అనుకోకుండా ఒక రోజు లో కూడా.. ట్యూషన్ మేష్టారు ‘ఏ బచ్చా .. లుచ్చా ; అర్ధ్ నహీ హోతా ? ” అని తిడతాడు. అది కూడా నాకు నచ్చుతుంది.
By: sujata on July 10, 2008
at 3:55 pm