Posted by: nagamurali | June 26, 2008

నేను హిందీ నేర్చుకోవడం – 2

ఆ హిందీ టీచరు గారికి మా అమ్మమ్మ వయసు ఉంటుంది. మా అమ్మమ్మకి ఆవిడ స్నేహితురాలు కూడా. హిందీ పండిట్ గా పని చేసి రిటైరయ్యారు. చాలా మంచావిడ. పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవారు. ఆవిడ దగ్గరకి ఏడెనిమిదేళ్ళ పిల్లల దగ్గరనించీ నడివయస్కులదాకా అందరూ హిందీ నేర్చుకోడానికి వచ్చేవారు. ఎక్కువమంది మాత్రం హైస్కూలు పిల్లలు. ఆవిడ పిల్లలకి చాలా చనువు ఇచ్చేవారు. పాఠాల విషయంలో పెద్ద స్ట్రిక్టుగా, పద్ధతిగా ఉండేవారు కాదు. అదే నాకు అపకారం చేసింది.

ఆవిడని కూడా మా అమ్మమ్మలాగే ట్రీట్ చేసేవాడిని. ఆవిడ ఏదో చెప్తూ ఉండేవారు. నా కాలక్షేపం నేను చేసేస్తూ ఉండేవాడిని. ఎందుకో నాకు హిందీ మీద పెద్దగా ఆసక్తి కలగలేదు. అలా అని విముఖతా కలగలేదు. తేలికైన భాష, ఇదెంతలే అన్న భావమే ఉండేది. నేను ఊరికెనే కాలక్షేపం ఎక్కువ చేస్తున్నాను, దీనిమీద సరైన ఆసక్తి లేకుండా ఇలా రోజూ ఓ గంట వృధా చేసుకునే కంటే, ఏ ఆటలో ఆడుకుంటే ఉత్తమం అని ఆలోచించలేకపోయాను. అంత ఆలోచనకి అప్పటి నా వయసు చాలదు.

కొన్నేళ్ళ క్రితం లండన్ లో భారతీయ విద్యాభవన్ కి వెళ్ళి కొంత కాలం వేణువు నేర్చుకున్నాను. ప్రతీ ఆదివారం క్లాసు. చాలా చిన్న పిల్లలు కూడా క్లాసుకి వచ్చేవారు. అందులో ఒక తమిళుల కుర్రాడు. చాలా చిన్నవాడు. ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉంటుంది. వాణ్ణి చూస్తే, సరిగ్గా చిన్నప్పుడు నేను హిందీ ట్యూషన్ కి వెళ్ళడమే గుర్తు వచ్చేది. వాడికి నేర్చుకునేదాని మీద ఏమీ ఆసక్తి ఉన్నట్టు కనిపించదు. వాళ్ళ అమ్మా, నాన్నా పంపిస్తున్నారు కాబట్టి క్లాసుకి వచ్చేవాడు. మేష్టరు ఏదో చెప్పేవాడు. వాడు ఏదో వాయించేవాడు. సరిగ్గా వాయించు, హన్నా అంటే వెంటనే ఏడిచేవాడు. చాలా సేపు అలా కుమిలి, కుమిలి ఏడుస్తూనే ఉండేవాడు. తరవాత కాలక్షేపం చేసి వెళ్ళిపోయేవాడు. (నేను హిందీ ట్యూషన్ లో ఎప్పుడూ ఏడిచేవాణ్ణి కాదు లెండి). వాడికి చాలా బోరు కొడుతోంది అని మొహం చూస్తే తెలిసిపోయేది. నాకెంతో జాలి వేసేది. ఈ మధ్య విచారిస్తే ఆ కుర్రాడు చాలా ఇంప్రువ్ అయ్యాడని తెలిసింది. చిన్నప్పుడు కష్టపడినా, పెద్దయ్యాకా హాయిగా వేణువు వాయించుకుంటూ ఉంటే తప్పకుండా ఆ కుర్రవాడు చిన్నప్పుడు నేర్చుకున్నందుకు చాలా సంతోషిస్తాడని నాకు అనిపించింది. ఎటొచ్చీ చిన్నప్పుడు హిందీ వెలగబెట్టినా అందుకు సంతోషించే ఘడియలు నాకు మాత్రం ఇంతవరకూ రాలేదు.

కుంచం నిలువుగా కొలవడానికి లేకపోతే అడ్డంగా కొలిచినా కొన్ని గింజలు వస్తాయని సామెత. అదే విధంగా దృష్టి పెట్టి నేర్చుకోపోయినా హిందీ ముక్కలు నాకు బానే వంటపట్టేవి. మై ఆతా హూ, మై జాతా హూ అంటూ ఉండేవాడిని. ఏకాదశీ అచ్చా హై, ద్వాదశి బురా హై అని కూడా అనేవాణ్ణి. ప్రాథమిక పాఠాలు అన్నీ అయిపోయి మెల్లిగా భాష పాకంలో పడ్డం మొదలెట్టింది. గ్రామరంతా ఈ చెవిలో విని, ఆ చెవిలోంచి వదిలేసేవాణ్ణి. కథలూ గట్రా మాత్రం ఆసక్తిగా చదివేవాణ్ణి. సూఖే సంతరే, టోకరే కీ గవాహీ, గంగారామ్ కీ కహానీ, లగీ మిఠాయీ కడువా ఉన్ కో (ఇది ప్రచార సభ వాళ్ళ పాఠాల్లోది కాదు) ఇలాంటి కథలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. దోహాలు గట్రా చదివేవాణ్ణి. సుఖ్ మే సుమరిన్ సబ్ కరై, దుఖ్ మే కరై న కోయి ఇలాంటి దోహాలు కూడా ఒకటో రెండో ఇంకా గుర్తు ఉన్నాయి.

ఏదైనా ఒక ట్యూషన్ కో, స్కూలుకో వెళ్ళడం వల్ల అన్నిటికన్నా గొప్ప ప్రయోజనం ఏమిటంటే రకరకాల జనాల్తో సోషలైజ్ అవ్వడం. నాకన్నా పెద్ద కుర్రాళ్ళతో సరదాగా స్నేహాలయ్యేవి. వాళ్ళ దగ్గర బేవకూఫ్, కంబఖ్త్, మొదలైన పదాలు తెలిసేవి. ఇంకో పెద్ద బూతు మాట కూడా తెలిసింది, కానీ అర్థం మాకెవ్వరికీ తెలియదు. ఓసారి ఏమైందంటే, మా టీచరు గారు అరుగుమీద నిలబడి ఉన్నారు. ఎవరో సర్దార్జీ వచ్చి ‘అమ్మాజీ, కైసే హై’ అంటూ ఏదో మాట్లాడుతున్నాడు. ఈవిడ కూడా ఏదో చెప్పి లోపలికి వెళ్ళారు. అతనికి ఏదో ఇవ్వాలి కాబోలు. అతను బయట వెయిట్ చేస్తున్నాడు. అరుగు మీదకొచ్చి కిటికీలోంచి మమ్మల్ని పలకరించాడు. అప్పుడు లోపల నేను, పెద్ద కుర్రాడింకోడు మాత్రమే ఉన్నాము. ఆ సర్దార్జీ దగ్గర మా హిందీ పాండిత్యం ప్రదర్శిద్దామని మేము ఉత్సాహపడిపోయాం. నా ఫ్రెండు సర్దార్జీకి నన్ను చూపిస్తూ ‘యే బేవకూఫ్ హై’ అన్నాడు. నేను ఊరుకుంటానా, ‘యే — హై’ అన్నాను – అర్థం తెలీకపోయినా నాకు తెలిసిన అతి పెద్ద బూతు మాటని ఉపయోగించి. సర్దార్జీ కంగారు పడిపోయి ‘తప్పు, బాబూ, తప్పు. బూతు మాటా మాటాడకూడదు’ అని తెలుగులో చెప్పాడు. ఈలోగా మా టీచరుగారు లోపలినించి రావడం, మేము గప్ చుప్ గా కూర్చోడం జరిగిపోయింది.


Responses

  1. :)

  2. speaking Hindi

  3. i am only telugu speaking
    i want hindi writing and speaking


Leave a response

Your response:

Categories