మా నాన్న తెలుగు లెక్చరరు కావడంతో నేను చిన్నప్పటినుంచే పెద్దయ్యాకా తెలుగు టీచరవ్వాలని కలలు కంటూ ఉండేవాణ్ణి. తెలుగు పద్యాలు గట్రా ఇష్టపడుతూ ఉండేవాణ్ణి. మా నాన్నగారి సహోద్యోగులు కొంతమంది వాళ్ళ పిల్లల్ని కాన్వెంటులకే పంపుతున్నా, ఆయనకి కాన్వెంటు చదువులు ఇష్టం ఉండకపోవడంచేత నన్ను మునిసిపల్ స్కూల్లో తెలుగు మీడియంలో పడేశారు. అక్కడ అయిదో క్లాసు వచ్చేంతవరకూ ఏబీసీడీలు కూడా చెప్పరు. నేను రెండో క్లాసుకి వచ్చాక మా అమ్మా, నాన్నా నన్ను కూచోబెట్టి నాచేత ఏబీసీడీలు దిద్దించడానికి బ్రహ్మ ప్రయత్నం చేశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు అంత చిన్నతనంలో కూడా నాకు ఊరంత తిక్క ఉండేది. చచ్చినా దిద్దేవాణ్ణి కాదు. మా అన్న కూడా తనవంతు ప్రయత్నం చేసేవాడు. ఇంగ్లీషు పాఠాల పుస్తకం తీసి ‘వాటీజ్ దిస్’ అంటే నేను ‘వంకాయ పుల్స్’ అనేవాణ్ణి. విసుగొచ్చి మా అమ్మా, నాన్నా ‘వీడు దుంపల బళ్ళో ఏకోపాధ్యాయుడు కావల్సిందే, వెధవ’ అని తిట్టుకునేవారు.
ఇంగ్లీషు నేర్చుకోడానికి నేను మరీ మొండికెత్తడం చూసి మా అమ్మ బెంగ పెట్టేసుకుంది. కానీ ఆవిడకి నా పల్సు బాగా తెలుసు. మంచి టీచరెవరైనా దొరికి, వాళ్ళు ‘అమ్మా, బాబూ, మా బంగారు తండ్రి కదూ’ అంటూ పాఠం చెప్తే మాత్రం నేను చక్కగా చదివేసేవాణ్ణి. అది కూడా మరీ అలుసు ఇస్తే మాత్రం పని జరిగేది కాదు. ఇంట్లో అలుసు ఎక్కువైపోయేగదా మొండికెత్తేసింది! టీచరు భయంలో పెట్టాలి. కానీ మెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనం చదువుతాం. అందులోనూ చిన్నప్పుడు ఆడ టీచర్లంటే మరీ బుద్ధిగా చదివేవాణ్ణిట. (చెప్పుకుంటే సిగ్గుచేటు.) అంచేత ఈ లక్షణాలన్నీ ఉన్న ఇంగ్లీషు టీచరు కోసం మా అమ్మ వెతకడం మొదలు పెట్టింది. ఆవిడ అదృష్టం పండి నేను మూడో క్లాసుకి రాంగానే మా పక్కవీధిలో ఇంకో లెక్చరరు గారింట్లో ఒకావిడ చాలామంది పిల్లలకి పాఠాలు చెప్తోందని తెలిసింది. ఆవిడ కాన్వెంటు టీచరు. ఆవిడ దగ్గరకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువమంది కాన్వెంటు పిల్లలే. వాళ్ళలో నా స్నేహితులు, అంటే మా నాన్నగారి సహోద్యోగుల పిల్లలు కూడా ఉన్నారు. అంచేత గొడవచెయ్యకుండానే శ్రద్ధగా ఆవిడ దగ్గరకి వెళ్ళేవాణ్ణి. మా అమ్మ నోచిన నోములు ఫలించి ఆ ట్యూషన్ టీచర్ గారిని నేను వరించడం, ఇంగ్లీషు ముక్కలు శ్రద్ధగా నేర్చుకోవడం, అయిదో తరగతికొచ్చేసరికి మిగతా కాన్వెంటు పిల్లల్తో సమానంగా ఇంగ్లీషులో పట్టు సాధించడం చూసి మా అమ్మ తెరిపిన పడింది.
నేను బాగా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా అమ్మా, నాన్న ఇంకో రెండు కుటుంబాలతో కలిసి పూరీ, కోణార్క్ చూసి వచ్చారుట. మావాళ్ళు పుట్టిపెరిగిన ఊళ్ళలోగానీ, మా ఊరిలో గాని బొత్తిగా హిందీ వాసన కూడా లేకపోవడంతో మావాళ్ళకి అసలు హిందీ ఒక్క ముక్క కూడా తెలియదు. పాపం వాళ్ళు పూరీలోనూ, కోణార్క్ లోనూ జనాలతో వేగలేక నానా అవస్థలూ పడాల్సి వచ్చింది. అయితే వాళ్ళతోపాటూ వచ్చిన మా కుటుంబ మిత్రుల్లో ఒకళ్ళకి యూనివర్శిటీ చదువులు చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళే ఒరిస్సా జనాలతో హిందీలో మాట్లాడుతూ మొత్తం అందరికీ కావలసిన ఏర్పాట్లన్నీ చూడాల్సి వచ్చింది. పాపం ఆ అనుభవంతో మనం ఊరు దాటితే ఎక్కడా పైసాకి మారం అని మా అమ్మకి భయం పట్టుకుంది. అంతేకాకుండా ఆవిడకి ముందు చూపెక్కువ. నేను అయిదో క్లాసుకొచ్చాక, ఈ వెధవ ఇప్పట్నించీ హిందీ నేర్చుకోకపోతే పెద్ద చదువులు చదివేటప్పుడో, ఉద్యోగాలు చేసేటప్పుడో ఆంధ్రా దాటితే చిల్లిగవ్వకి మారడు అని ఆలోచించి, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళ పరిక్షలు రాయించడానికి నన్ను ఇంకొక టీచరుగారి దగ్గరకి ట్యూషన్ కి పంపడం మొదలు పెట్టింది.
ఆరంభం ఆకర్షనీయంగానే ఉంది. చాలా మంది చెప్పుకోరుగానీ, ఆడ టిచర్ పై మనసుపడని మగ కుంకలెవరూ! మరీ ముఖ్యంగా స్కూల్లో ఐతే మరీనూ…
http://www.parnashaala.blogspot.com
By: కె.మహేష్ కుమార్ on June 23, 2008
at 1:00 pm
so nagamurali dhar. good work.
http://muralidharnamala.wordpress.com/
By: muralidharnamala on June 23, 2008
at 8:13 pm
Hey i am alsaga murali. good work. http://muralidharnamala.wordpress.com/
By: Naga Muralidhar on June 23, 2008
at 8:36 pm
మహేశ్ గారన్నట్టు, ప్రారంభమే చాలా సరదాగా వుంది. మిగతా భాగాలు కూడా లాగించండి.
మీరు ఇంగ్లీష్ టీచర్ని వరించింది మూడో తరగతిలో కాబట్టి ఏదైనా నేర్చుకోగలిగారు. మేము ఇంటర్ కోచ్చాక వరించి, వచ్చిన కాసిని ముక్కలూ మర్చిపోయాం.
By: చైతన్య క్రిష్ణ పాటూరు on June 25, 2008
at 6:34 am
మహేశ్ గారూ, నాగ మురళీధర్ గారూ, చైతన్య కృష్ణ గారూ, నెనర్లు. మీ కామెంట్లకి ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.
By: nagamurali on June 26, 2008
at 4:37 pm
hilarious
By: కొత్తపాళీ on July 3, 2008
at 4:24 pm
[...] పాఠశాలలో సంస్కృత పరిచయం పెద్దగా లేక, హిందీ ని వెలగబెట్టిన ఓ వ్యక్తి, కాళిదాసు కుమార సంభవం, మేఘ దూతం , [...]
By: పొద్దు » Blog Archive » నాగమురళి బ్లాగు - సమీక్ష on January 15, 2009
at 7:49 am