Posted by: nagamurali | June 6, 2008

గ్రహాలు వక్రించడం

ఇదివరకు ఒకసారి నాకు పరిచయస్తురాలైన ఒక జ్యోతిష్కురాలితో ‘ఆఫీసులో మా చెడ్డ చికాగ్గా ఉంది ప్రస్తుతం’ అన్నాను. ‘ఇంకో రెండు వారాలు అంతేలే’ అంది. ‘ఎందుకని?’ అంటే, ‘మీ సాఫ్టువేరోళ్ళ దుంప తెగే కాలం ఇది, బుధుడు వక్రించాడుగా !!’ అంది. ఆవిడ చెప్పేది గోచారం (Transit) లో  బుధుడు వక్రించి ఉండగా కలిగే ఫలితాల గురించి. అప్పటినుంచీ బుధుడు వక్రించిన టైములో ఆఫీసులో ఎలా ఉంటుందో గమనిస్తూ వస్తున్నా. అన్నిసార్లూ అని చెప్పలేనుగానీ, ఒక్కోసారి మహా దరిద్రంగా ఉంటుంది. (సాఫ్టువేరు ప్రాజెక్టులు ఎలా నడుస్తాయో తెలియని అమాయకులు బుధుడు వక్రించనప్పుడు ప్రాజెక్టులు బానే నడుస్తాయి అనుకోవచ్చు. కానీ సాఫ్టువేరు జీవులందర్నీ బుధుడూ, శనీ కలిసి ఫుట్ బాల్ ఆడుతూ ఉంటారు అని పాపం బయటివాళ్ళకి ఎలా తెలుస్తుంది?)

ప్రస్తుతం బుధుడు మే 26 నుంచీ జూన్ 19 దాకా వక్రించి ఉన్నాడు. మేము ఓ నెలపాటు కష్టపడి చేసిన పని కూడా ఈ సమయంలో వక్రించింది. దాన్ని వచ్చే 19 లోగా సరిచెయ్యాలి.

వక్రించిన గ్రహాలు కొన్ని శుభఫలితాలు ఇస్తాయనీ, కొన్ని అశుభ ఫలితాలు ఇస్తాయనీ జ్యోతిషం చెప్తుంది. మిగతా గ్రహాల మాట ఎలా ఉన్నా బుధుడు వక్రించిన సమయం రాత కోతలకీ, అకౌంట్ల వ్యవహారాలకీ, బాంకులకీ, సాఫ్టువేరు వాళ్ళకీ, ఉత్తర ప్రత్యుత్తరాలద్వారా నడిపే వ్యవహారాలకీ (కమ్యూనికేషన్సు) మహా చికాకైన కాలం అని కొంతమంది జ్యోతిష్కులకి (ముఖ్యంగా పాశ్చాత్య జ్యోతిష్కులకి) గట్టి నమ్మకం. ఈ జ్యోతిషం సంగతులు నేను కేవలం సరదాకోసమే చెప్పినా, అసలు ఒక గ్రహం వక్రించడం అంటే ఏమిటి? గోచారం అంటే ఏమిటి? అన్నదాన్ని వివరిస్తాను.

గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణం పూర్తి చెయ్యడానికి వేర్వేరు గ్రహాలు వేర్వేరు కాలాలు తీసుకుంటాయి. ఉదాహరణకి: భూమి 365.25 రోజులు, బుధుడు 88 రోజులు, శుక్రుడు 225 రోజులు, కుజుడు 687 రోజులు ఇలాగ. ఇక్కడ రోజులు అంటే భూమియొక్క కాలప్రమాణం ప్రకారం చెప్పబడినవి అని గ్రహించాలి. భూదినాలు అన్నమాట.

అయితే ఈ గ్రహాల్ని భూమి నుంచి రోజులతరబడి పరిశీలిస్తే, భూమితో వాటి సాపేక్ష గమనాన్ని అనుసరించి అవి అన్నీ రాశిచక్రంలో నింపాదిగా ఒక రాశినుంచి మరొక రాశికి కదులుతున్నట్టు కనిపిస్తాయి. బుధుడూ, శుక్రుడూ రోజుకి ఒకటీ, ఒకటిన్నర డిగ్రీ చొప్పున రాశుల్లో కదుల్తున్నట్టు కనిపిస్తారు. చంద్రుడు అన్నిటికన్నా వేగంగా రోజుకి సుమారు పదమూడు డిగ్రీలదాకా రాశిచక్రంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఇలా రాశిచక్రంలో నిరంతరమూ గ్రహాలు సంచరించడాన్నే గోచారం లేక గ్రహ చారము అంటారు. ఇంగ్లీషులో Transit అంటారు.

ఇలా కదుల్తూ రాశిచక్రంలో మేషం నుంచి మీనం వరకూ ఒక ప్రదక్షిణ పూర్తిచెయ్యడానికి ఒక్కో గ్రహానికీ ఒక్కో విధమైన కాలం పడుతుంది. చంద్రుడు అందరికన్నా వేగంగా 28 రోజులకోసారి రాశిచక్రాన్ని చుట్టేస్తూ ఉంటాడు. బుధుడు సూర్యుడుకి బాగా దగ్గరగా ఉంటాడు కాబట్టి రాశిచక్రం మొత్తం ఒకసారి చుట్టి రావడానికి సుమారు ఏడాది పడుతుంది. శుక్రుడికి సుమారు 225 రోజులు. కుజుడికి 22 నెలలు. గురుడికి 12 సంవత్సరాలు. శనికి 30 సంవత్సరాలు. యురేనస్ 84 సంవత్సరాలు. నెప్ట్యూన్ 168 సంవత్సరాలు. అయితే మన పూర్వీకులకి యురేనస్, నెప్ట్యూన్ లు తెలియవు కాబట్టి శని మాత్రమే అన్నిటికన్నా మెల్లిగా తిరిగే గ్రహం అనుకుని ఆ గ్రహానికి శనైశ్చరుడు (మెల్లిగా నడిచేవాడు), ‘మందుడు’ అని పేర్లు పెట్టారు. శనై: అంటే మెల్లగా అని అర్థం. మందం అన్నా మెల్లగా అనే అర్థం.

శనై: అంటే ఒక శ్లోకం గుర్తు వస్తోంది, పంచతంత్రంలోది. ఒక పిసినారి నక్క అడవిలో పోతుంటే దానికో సీను కనిపించింది. ఒక వేటగాడు పెద్ద అడవిపంది మీద బాణం వేశాడు. ఆ పంది గిలగిలా తన్నుకుని, వేటగాడిమీదకి వచ్చిపడి, వాణ్ణి కోరలతో కుమ్మి చంపి, తనూ చచ్చిపోయింది. నక్క చూసేసరికి అడవిపందీ, వేటగాడూ శవాలై కనిపించారు. కొన్ని రోజులకి సరిపడా బ్రహ్మాండమైన భోజనం. అయితే ఆ నక్క ఎంత పిసినారిది అంటే, ముందస్తుగా ఈ శ్లోకం చెప్పిందిట -

శనై: శనైశ్చ భోక్తవ్యం, స్వయం విత్తముపార్జితం
రసాయనమివ ప్రాజ్ఞై: హేలయా న కదాచన ||

బుద్ధిమంతులు సంపాదించుకున్న సొమ్ముని ఔషధం సేవించినట్టుగా మెల్లి మెల్లిగా అనుభవించాలి. నిర్లక్ష్యంగా పాడుచేసుకోకూడదు.

ఇలా అనుకుని ఆ నక్క ఈ వేటగాడి వింటినారి ఏదో జంతువు నరంతో చేసి ఉన్నది. మొదట టిఫిన్ లాగా దీన్ని తిని, తరవాత మిగతావాటి సంగతి చూద్దాం అని ఆ వింటి నారిని కొరికింది. ఒక్కసారిగా వింటి బద్ద ఫెడీల్మని తగిలి తనూ గిల గిల తన్నుకుని చచ్చిపోయింది.

అంచేత శనై: అంటే మెల్లగా అని అర్ధం. అలాగే ‘మందం మందం నుదతి పవనశ్చానుకూలో యథా త్వాం’ అంటాడు కాళిదాసు మేఘదూతంలో. ‘మెల్లి మెల్లిగా అనుకూలంగా గాలి వేస్తోంది, శుభశకునం, ఇంక బయల్దేరు’ అని మేఘానికి యక్షుడు చెప్తాడు.

ఇక మరి గ్రహం వక్రించడం అంటే ఏమిటో చూద్దాం. జ్యోతిషంలో గ్రహాల గమనం అంతా భూమి నుంచి సాపేక్షంగా లెక్కగట్టేదే. రెండు రైళ్ళు పక్క పక్కన వెడుతున్నాయి అనుకోండి. మన రైల్లోంచి చూస్తే పక్కరైలు మనల్ని ఓవర్ టేక్ చేస్తోందనుకోండి. అది మెల్లిగా మనల్ని దాటి ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇంతలో హటాత్తుగా మన రైలుక్కూడా ఆవేశం వచ్చి వేగం పెంచుకుందనుకోండి. మనం కిటికీలోంచి చూస్తుంటే పక్క రైలు వేగం మెల్లిగా తగ్గిపోయి, కొన్ని సెకన్లు ఆగిపోయి, తరవాత వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా మన భూమినుంచి గమనిస్తూ ఉంటే మిగతా గ్రహాల విషయంలో కూడా అలాగే జరుగుతుంది.

సంవత్సరంలో కొన్నిసార్లు గ్రహాలు (సూర్యుడూ, చంద్రుడూ తప్ప మిగతా అన్ని గ్రహాలూ) కొన్నిరోజులపాటు రాశిచక్రంలో స్తంభించిపోయినట్టు కనిపిస్తాయి. తరవాత అంతవరకూ తిన్నగా ప్రయాణిస్తున్నవి కాస్తా, వెనక్కి వెళ్ళడం మొదలుపెడతాయి. అలా కొన్నిరోజులు వెనక్కి ప్రయాణించి, తరవాత మళ్ళీ స్తంభించిపోయి, మళ్ళా ముందుకు వెళ్ళడం మొదలుపెడతాయి. ఇలా గ్రహాలు వెనక్కి వెళ్తుంటే గ్రహం వక్రించింది అంటారు. ఇంగ్లీషులో తిన్నగా వెళ్ళడాన్ని Direct Motion, స్తంభించిపోవడాన్ని Stationary, వక్రించడాన్ని Retrograde Motion అని పిలుస్తారు. ఈ విషయం ఇంకా బాగా అర్ధం కావాలంటే ఇక్కడ నిమేషక చిత్రాల సహాయంతో వివరించారు: http://www.lasalle.edu/~smithsc/Astronomy/retrograd.html, http://www.astro.uiuc.edu/projects/data/Retrograde/.

సూర్య, చంద్రులు ఎప్పుడూ వక్రించరు. బుధుడు సంవత్సరంలో ఓ మూడు సార్లు వక్రిస్తాడు (సాఫ్టువేరోళ్ళ ఖర్మ కొద్దీ). వక్రించిన ప్రతి సారీ ఒక మూడు నాలుగు వారాలు వక్రగతిలో ఉంటాడు. శుక్రుడైతే రెండేళ్ళకోసారి వక్రించి ఒక రెండు నెలలు వక్ర గతిలో ఉంటాడు. కుజుడు కూడా ఒకట్రెండు సంవత్సరాలకోసారి వక్రించి రెండు, మూడు నెలలు వక్రగతిలో ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ ఏడాదిలో అయిదారు నెలలు వక్రగతిలోనే ఉంటాయి.

ఇంకొక్క విచిత్రమైన సంగతి. బుధగ్రహం మీద కొన్ని ప్రదేశాల నుంచి సూర్యుడు వక్రించడం చూడవచ్చునట. అంటే అక్కణ్ణించి చూస్తూ ఉంటే సూర్యుడు ఆకాశంలోకి ఉదయిస్తూ, హటాత్తుగా ఆగిపోతాడు. తరవాత మెల్లిగా వెనక్కి వెళ్ళిపోయి అస్తమించి, మళ్ళా ఉదయిస్తాడు. (ఇంకా వివరాల కోసం చూడండి: Orbit and Rotation section in http://en.wikipedia.org/wiki/Mercury_%28planet%29 . అది నిజంగా చూడగలిగితే భలే వింతగా ఉంటుంది కదూ…


Responses

  1. చక్కగా చెప్పారు. లంకెలు అందుకు తగ్గట్టే మరింత బాగున్నాయి.

  2. బావుంది. నేనేదో మీరు జోకుతారనుకున్నాను. కానీ.. పెద్ద డౌటు! బుధుడు సాఫ్టు వేరు వీరులకు exclusive నా ? మరి మాలాంటి ”ఇళ్లు-తయారు” చేసే వాళ్ళకి శని మాత్రమే వక్రిస్తూ ఉంటాడా ?

  3. వికటకవి గారూ, నెనర్లు.
    సుజాత గారూ, మీరు ఆర్కిటెక్టు అని తెలిసిపోయింది. ఈ టపాలో నేను రాసిన జ్యోతిష భాగాన్ని సీరియస్ గా తీసుకోనవసరం లేదు. బుధుడు సాఫ్ట్ వేర్ వాళ్ళకే ప్రత్యేకమేమీ కాదు. అందరి జాతకాల్లోనూ, అన్ని గ్రహాల ప్రభావమూ ఉంటుందని జ్యోతిషం అంటుంది. బుధుడి కారకత్వాల్లో సాఫ్ట్ వేర్ కూడా ఒకటి అని కొంతమంది జ్యోతిష్కుల అభిప్రాయం, అంతే.

  4. chakkagaa vivarimchaaru. subject lO peistaayiki vellina vaariki telustumdi satyamu. half knowledge tO mana saastriiya jgnaanaanni vimarshimchE vaariki idi teliyadu.

  5. entertaining and informative .. esply enjoyed the jackal story.

    కానీ నాకో డౌటు .. జ్యోతిషం ఫండాలు రాసిన కాలంలో ఎప్పుడో సాఫ్టువేరనేది ఒకటి పుడుతుంది, అందులో పన్చేసే వాళ్ళని బుధుడు నానా తిప్పలూ పెడతాడు అని ఎలా ఊహించారు అంటారూ?సుజాత గారు పైన తన వృత్తి గృహిణిత్వం (?) అని చెప్పినట్టున్నారు .. బహుశా కొంచెం వ్యంగ్యంగా

  6. మూఢనమ్మకాల్ని కూడా సరదాగా చెప్పడం మీకే చెల్లింది. ఎక్కడా “మాయా దర్పణం చూడరా ఢింభకా!” టైపు ఫీలింగ్ ఇవ్వకుండా, కొంత జ్ఞానాన్ని (?) అందించారు.

  7. దుర్గేశ్వర గారూ, మహేశ్ గారూ, నెనర్లు.

    కొత్తపాళీ గారూ, జ్యోతిష సూత్రాలు కనుగొన్న కాలంలో బుధుడి కారకత్వాల్లో సాఫ్ట్ వేర్ కూడా ఉంది అని రాయలేదు. అది నవీన ఆవిష్కరణ. జ్యోతిషంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే, (మత గ్రంథాల విషయంలో జరిగినట్టుగా) ఎప్పుడో చెప్పిన సూత్రాలకి అతుక్కుపోకుండా ఎవరికివాళ్ళు తమ అనుభవాల్నిబట్టి కొత్త ప్రతిపాదనలూ, కొత్త వ్యాఖ్యానాలూ చేయడం. ముఖ్యంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఇది మరీ ఎక్కువ. గ్రహాల కారకత్వాల్లో కొత్త విషయాలు ఎప్పటికప్పుడు చేరుస్తూ ఉంటారు. అలాగే కొత్త గ్రహాలు కనుక్కుంటే వాటికి కొత్త కారకత్వాలు కనిపెట్టి ఆపాదించడం కూడా చేస్తూ ఉంటారు. అయితే అది అంతా శాస్త్రీయమా కాదా అన్నది వేరే సంగతి. కానీ మత విషయాల్లోలా కాకుండా జ్యోతిషంలో ఆపారమైన స్వేచ్ఛ తీసుకుంటూ ఉంటారు (ఎక్కువశాతం మూఢంగా నమ్మేవాళ్ళూ ఉంటారు, కాదనను).

    అయితే సుజాతగారు గృహిణి అని ఆవిడిచ్చిన హింటుని బట్టి సరిగ్గా ఊహించలేకపోయాను. నాలాంటి వాడే ఒక రాజకుమారుడికి గురువుగారు జ్యోతిషం నేర్పాడుట. రాజ్యసభలో విద్యా పరిక్ష ఏర్పాటు చేశారు. మంత్రిగారు లేచి మూసిన గుప్పెట చూపించి అందులో ఏం ఉందో చెప్పమన్నారు. మనవాడు లెక్కలు వేసి చూస్తే అది గుండ్రంగా ఉండేది, గిర గిరా తిరిగే వస్తువు ఏదో అయి ఉండాలి అని సమాధానం వచ్చిందిట. మనవాడు మళ్ళా ఆలోచించకుండా ‘మీ చేతిలో ఉన్నది బండి చక్రం’ అని సమాధానం చెప్పాడుట. అందరూ గొల్లున నవ్వారుట. మంత్రిగారి చేతిలో ఉన్నది గడియారం. జ్యోతిషంలో కామన్ సెన్సు ఆవశ్యకత గురించి చెప్తూ ఈ కథ చెప్తారు.

  8. భలే చెప్పారు.కొన్ని రోజులుగా ఇక్కడ పని సరిగ్గా జరగక పోవడానికి కారణం ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది మాస్టారు :-)

    పన్చతంత్రం కథ బాగా చెప్పారు. పాత చందమామ లో అసమీక్శ కారిత్వం అని కథలు వచ్చేవి, వడ్డాది పాపయ్య గారి బొమ్మలతో. వాటిని గుర్తు చేసారు.

  9. వికటకవి శ్రీనివాస్‌గారన్నట్టు చెప్పిన విధానమూ, లంకెలూ రెండూ బాగున్నై.

  10. [...] గ్రహాలు వక్రించడం అంటే ఏమిటో నాగ మురళి చెప్తున్నారు. ఆలకించండి. [...]


Leave a response

Your response:

Categories