Posted by: nagamurali | May 31, 2008

తెలుగు సినిమాల మీద చర్చ

 

తెలుగు సినిమాల్ని తిడుతూ నేను రాసిన టపాకి ఇంతవరకూ ఎప్పుడూ రానంత స్పందన వచ్చింది. మిత్రులు రవిగారి కామెంటుకి కొంచం ఆవేశంగా నేను రాసిన స్పందన నిడివి చూస్తే ఒక స్వతంత్రమైన టపాకి సరిపడినంత ఉంది. కాబట్టి దాన్ని కూడా ఒక స్వతంత్రమైన టపా గా విడుదల చేసేస్తున్నా…

——-

రవి గారూ, మీ కామెంటు చూసి చాలా సంతోషం కలిగింది. ఇందులో వ్యక్తిగతంగా తీసుకునే విషయం ఏమీ లేదండీ. మీరూ నిర్మొహమాటంగా వాదించవచ్చు. పైగా నేను చేసిన విమర్శ తప్పు అని తేలితే నాకన్నా ఆనందించేవాడు ఉండడు.

ఎవరు సినిమా తీసినా హిట్ కోసమే. దానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. తప్పకుండా రొమాన్సూ, లేకితనమూ, వయొలెన్సూ వాడుకోవచ్చు. నేను క్రమం తప్పకుండా తెలుగు సినిమాలు చూడడం చాలా తక్కువ. అందుచేత మీరు చెప్పిన దర్శకుల సినిమాలు కొన్ని చూసి ఉన్నా ఫలానా సినిమా ఫలానా దర్శకుడిది అని చెప్పగలిగేంత పరిచయం లేదు. వాళ్ళెవరికీ నిబద్ధత లేదు అనడం లేదు. వాళ్ళు సినిమాల్లో తియ్యదలచుకున్నవి అన్నీ నిర్దాక్షిణ్యంగా సిన్సియర్ గా తియ్యక్కరలేదు. అయితే కనీసం ఎంటర్టయిన్మెంటుని ఎంటర్టయిన్మెంటులాగా తియ్యకుండా తలనొప్పిలాగా తీస్తే మాత్రం ఎవరికైనా చిరాకు రాక తప్పదు. లేదు, వాళ్ళు అద్భుతమైన ఎంటర్టయిన్మెంటు సినిమాలు తీస్తున్నారు, నీకు అహంకారం కాబట్టి తలనొప్పిగా అనిపిస్తోంది అంటే నేను చెప్పగలిగేదేమీ లేదు. నాకు తలనొప్పి వస్తోంది ఇవి చూస్తే అని మళ్ళా ఇంకోసారి అనడం తప్ప.

వీళ్ళల్లో ఏ గొప్ప దర్శకులు తీశారో తెలియదు కానీ – కొత్తపాళీ గారు అన్నట్టు పోకిరీ నాకు అసలు ఏమీ నచ్చలేదు. ‘అతడు’ ని ఎంజాయ్ చెయ్యగలిగిన నేను పోకిరీ ఎంజాయ్ చెయ్యలేనా? ఒకటి రెండు సన్నివేశాలు విడిచిపెడితే సినిమా అసలు ఒక పద్ధతిగా, పట్టుగా లేదు. కామెడీ కూడా ఏమీ నవ్వు రాలేదు. అలాగే చాలా పెద్ద హిట్లు కదా అని కొన్ని వేరే సినిమాలు కూడా ట్రై చేశాను (పేర్లెందుకు లెండి, అనవసరంగా ఇతరులు ఆవేశపడతారు). ఒక గంట కూడా ఆ సినిమాలు చూసి ఉండను, అది కూడా ఎక్కడికక్కడ సీన్లన్నీ ఎత్తేస్తూ. అయినా చిరాకేసి చూడకుండానే వదిలేసా కొన్నింటిని. అసలది ఒక కథా? ఒక నటనా? ఒక కామెడీయా? ఒక ఎంటర్టయిన్మెంటా? అర్థం పర్థం నాకు అక్కరలేదు. నన్ను నేను ఒక పావుగంట మర్చిపోయి ఎంజాయ్ చెయ్యగలిగేది వాటిలో ఏమైనా ఉందా?? తెలుగు ప్రేక్షకులు బుర్రల్లేనివాళ్ళూ, వాళ్ళ మొహానా ఏ పేడ కొట్టినా పరవాలేదు అనుకోవడం కాకపోతే మరేమిటి?

మరి అవి అన్నీ హిట్లు అయ్యాయి కదా… ప్రజలంతా చూస్తున్నారు కదా… నీకే ఎందుకంత తిక్క? అందరూ పూజించే విషయాల్ని నువ్వెందుకు తిడతావు? అహంకారం కాకపోతే ఇది ఏమిటి? నువ్వేమైనా పెద్ద —-? ఇలాంటి ధోరణి నాకు బాగా పరిచయమే. రాజుగారు బట్టల్లేకుండా ఊరేగుతున్నారు. కానీ ఆయన దేవతా వస్త్రాలు ధరించారు అని మొత్తం రాజ్యమంతా సంబరాలు చేసుకుంటోంది. కొందరు నాలాంటి వెనకబడిన వెర్రివాళ్ళు మాత్రం రాజుగారు దిగంబరంగా ఊరేగుతున్నాడు బాబోయ్ అని మొత్తుకుంటే, వాళ్ళకి అహంకారం. నిజమేమిటంటే, అందరికీ తెలుసు రాజుగారికి బట్టల్లేవని. మిగతా అందరూ ఒప్పుకోగాలేనిది నా ప్రత్యేకత ఏమిటి ఒప్పుకోక అనే మనస్తత్వం. నేనూ చాలా విషయాల్లో దీనికి మినహాయింపేమీ కాదు. కానీ ఒక్కోడికి ఒక్కో విషయంలో జ్ఞానోదయం అవుతుంది. అంతే.

నేను దర్శక నిర్మాతల నిబద్ధత గురించి అడుగుతున్నాను అంటే, అర్ధవంతమైన కళాఖండాలు ఇమ్మని కాదు, కనీసం ప్రేక్షకుణ్ణి బుర్రలేని వెధవగా భావించకుండా సినిమా తీస్తే చాలు అని. ఈ మధ్య ఎక్కడో చదివాను. కొత్త దర్శకుల్లో కొంతమందికి ఒక ఫార్మ్యులా ఉందిట. అదేమిటంటే, కామెడీ సీను, సెంటిమెంటు సీను, రొమాన్సు సీను, వయొలెన్సు సీను ఇలా ఒకదాని తరవాత ఒక సీను ప్రతీ కొద్ది నిమిషాలకీ ఒకటి దొర్లిస్తూ ఉండాలిట.  మొత్తం సినిమా అంతా అదే అల్లిక. కథని ఈ అల్లికలో చొప్పిస్తారట. ఆ మాట నేను మా ఆవిడకి చెప్పి ఆ దృష్టితో సినిమాలు చూడమన్నాను. తను చాలా ఆశ్చర్యపోయింది. ‘నిజమే సుమా, ఒక కామెడీ సీను వస్తుంటే తరవాత వయొలెన్సు సీను వస్తుంది అని ముందే ఎక్స్పెక్ట్ చేసి చూస్తే భలే తమాషాగా ఉంది. నా ఎక్స్పెక్టేషన్ చాలాసార్లు నిజమౌతోంది కూడా’ అని అంది.

మంచిదే, ఇటువంటివి వంద ఫార్మ్యులాలు పెట్టుకోమనండి. ఎన్ని ఫార్మ్యులాలు పెట్టుకున్నా బయటకి వచ్చేది అతుకుల బొంతా, తలకాయనొప్పీ అయితే మాత్రం తీసేవాళ్ళని తిట్టకుండా ఎలా ఉండగలం?

అయితే అన్ని సినిమాల్నీ ఇదే గాటన కట్టెయ్యలేము అని కూడా నేను ఒప్పుకుంటున్నాను. నచ్చడం, నచ్చకపోవడం, కథలో అర్ధం లేకపోవడం, నిబద్ధత లేకపోవడం ఇవన్నీ తరవాతి సంగతులు. కొత్తపాళీగారన్నట్టు అసలంటూ సినిమాలో ఒక బేసిక్ కన్సిస్టెన్సీ ఉంటే ఎటువంటి సినిమాకైనా పాసు మార్కులు వెయ్యచ్చు. ఈ విషయంలో ఆయన చేసిన విశ్లేషణే ఫైనల్ అని నేను అనుకుంటున్నాను.

ఇక మీరు చేసిన మరొక వాదన. అవార్డు రావాలి, లేదా పేరు రావాలి అనే కండూతితో పడే కక్కుర్తి. కక్కుర్తి ఏరకంగా పడినా కక్కుర్తే. కే.విశ్వనాథ్ కక్కుర్తి పడిన సినిమాలు కొన్ని నాకు తెలుసు. (పేర్లు చెప్పను. ఆవేశాలు వస్తాయి.) అయితే అటువంటి కక్కుర్తి పడిన సినిమాల్లో కూడా కక్కుర్తి కొన్ని పాయింట్లలోనే కనిపిస్తుంది తప్ప మొత్తం సినిమా అంతా విలయతాండవం చెయ్యదు. అటువంటి సినిమాల్లో కూడా కనీసం ఒక పావుగంట, అరగంట సేపు ఎంజాయ్ చెయ్యగలిగిన సరుకు ఏదో ఒకటి ఉంటుంది. ఆమాత్రం సరుకు కూడా లేని సినిమాలు నేడు తామర తంపరగా వస్తున్నాయి.

సాగర సంగమం సినిమాలో హీరో పడిన తాపత్రయమంతా పదుగురి మెప్పూ కోసమే అనడం అసంబద్ధం. మీరు బ్లాగులో రాసేవాటిలో అధికశాతం మీ ఆనందం కోసం రాసుకునేవి అని మీరే అన్నారు (కొన్ని విషయాల్లో ఇతరులకోసం కాంప్రమైజ్ అయినా). మన ఆనందం కోసం మనం చేసుకునేవాటిల్లో సాధారణంగా మనం కాంప్రమైజ్ అవ్వం, ఇతరులకి నచ్చకపోయినా. కళని తన ఆనందం కోసం అభ్యాసం చెయ్యడంలో గొప్ప అనుభూతి ఉన్నది. ఆ విషయంలో (ఆ సినిమాలో) కమల్ హసన్ నిబద్ధతని  అద్భుతంగా చూపించారు. అయితే ఢిల్లీలో ప్రదర్శన ఇవ్వడం తాను సాధించిన విద్యకి ఒక సార్థకత కోసమే తప్ప పదిమంది కోసమూ కాదు. మీరు చాలా విషయాలు చదివారు. చాలా విషయాలు తెలుసు. అయితే మీరు బ్లాగులో అవన్నీ రాయడం ఎందుకు? పదిమంది మెప్పు కోసమూ కాదా? నా ఉద్దేశ్యంలో కాదు. మీ స్థాయికి చెందిన వాళ్ళతో మీ జ్ఞానాన్ని పంచుకోవడం, ఇతరుల కౌశలాన్ని చూసి మీరూ ఆనందించడం, మీ స్థాయి వ్యక్తులతో స్నేహాన్నీ, సాంగత్యాన్నీ సంపాదించుకోవడం జీవితానికి గొప్ప పరమార్థాన్ని ఇచ్చే విషయాలు.

ఏ శాస్త్రంలోనైనా, కళలోనైనా అంతిమంగా కలిగే సార్థకత – ఒక వ్యక్తిగా తన అస్తిత్వం కరిగిపోవడం. అటువంటి సార్థకతకీ, పేరుకోసం పాకులాడడానికీ నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉన్నది. సాగరసంగమంలో కమల్ హసన్ పడిన వేదన చౌకబారుది కాదు. అది తన జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసం పడిన వేదన. దానికీ, దీనికీ తేడాని మీరు అపార్థం చేసుకోవడం నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. నేను అనుకుంటూ ఉంటాను – నేను బ్లాగు రాయడానికి సార్థకత ఇటువంటి చర్చల్లో పాలుపంచుకోవడం అని. అయినా ఇవన్నీ వ్యక్తిగతమైన దృష్టికోణాలు. ఇతరులు వీటితో స్వేచ్ఛగా విభేదించవచ్చు.

సినిమాలనుంచి చాలా దూరమే వెళ్ళాను. అంతిమంగా నేను చెప్పేది ఒకటే. ప్రస్తుతం తెలుగు సినిమా దేవతా వస్త్రాల్ని ధరించి ఉన్నది. కొందరికైనా అది దిగంబరంగా ఉన్నది అని గొంతు చించుకునే హక్కు ఉన్నది. మిగతావాళ్ళు తమ మొహమాటాలు తామే వదిలిపెట్టి మెల్లిగా గొంతు కలుపుతారు.

 

 

 

 


Responses

  1. పోకిరి విషయంలో మీ కామెంట్స్ తో నేనేకీభవిస్తాను. మహేష్ బాబు నటనతో సహా ఏవీ బాగోలేవు అందులో (కెమెరా వంక అసలెప్పుడూ చూడకుండా ఎటో దొంగ చూపులు చూడటమనేదే నటన అని మహేష్ నేర్చుకున్నట్లున్నాడు ఈ సినిమాతో) ఇలియానా గురించి చర్చ కూడా అనవసరం. అనవసరమైన వయొలెన్స్, నవ్వు రాని కామెడీ, అందరూ ముందే ఊహించేసే పిచ్చి ట్విస్ట్ ఒకటి…. ఈ సినిమా అంత పెద్ద హిట్ కావటం విచిత్రం.

  2. బాబోయ్, చాలా దూరం వచ్చారు. నిబద్ధత, కన్సిస్టెన్సీ వీటి గురించి చర్చ వదిలేద్దాం.

    పోకిరి సినిమా గురించి. నా ఉద్దేశ్యంలో ఈ సినిమా కు జనాదరణ వయొలెన్సో,పిచ్చి కామెడీయో, ఇలియానా నో, అర్థం లేని చివర ట్విస్టో కాదు. (ఇలియానా కోసం కొంతమంది వచ్చి ఉండవచ్చు, ఐతే, ఇలియానా నటించిన ఫ్లాపు సినిమాలు ఉన్నాయి). నా ఉద్దేశ్యంలో ఇదో అబ్స్ట్రాక్ట్ సినిమా. థియేటర్ ఆర్ట్, బ్రెక్ట్ థియరీ, అబ్స్ట్రాక్షన్ వీటి చర్చ ప్రస్తుతానికి వద్దు. ఐతే, అందరికీ నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అని వంచన చేసుకోవడం లేదు. దీన్ని మీరు నమ్ముతారనే ఆశిస్తాను.

    కళకు సార్థకత వ్యక్తి అస్థిత్వం కరిగిపోవడం. ఆ స్థాయి లో తపించే వ్యక్తి కి స్వార్థం అనే పరిధిని దాటి వెళతాడు.

    విశ్వకవి ఓ గొప్ప చిత్రకారుడు కూడా. ఒక్కో సారి ఆయన చిత్రాలు గీస్తూనే, ఆకలిదప్పులు మర్చిపోయి రోజుల తరబడి తన గదిలో గడిపే వాడట. అలాంటిదే గీతాంజలి రచన కూడా.

    ఆ రచనను తర్వాత ‘ప్రచురింపబడింది ‘. ప్రచురింపబడాలి అని ఆశయంతో రవీంద్రుడు గీతాంజలిని రచించి ఉండడు.

    ఆశయం వేరు, కళలో తాదాత్మ్యత చెందడం వేరు అని నేననుకుంటున్నాను.

    అలానే కళను స్వప్రయోజనం కోసం వాడుకోవడం వేరు, కళ ద్వారా తన సాటి మనుషులతో తనను అనుసంధానించుకోవడం వేరు. సరిగ్గా ఈ కోణంలోనే రాహుల్ సాంకృత్యాయన్ మహా పండితుడు, కాళిదాసును, అశ్వఘోషుడినీ పరిశీలించారు.

    సాగర సంగమం కు సంబంధించి మీరు చెప్పిన విషయం కాస్త సబబుగా ఉన్నప్పటికీ, చాలా విషయాలు అసంబద్ధంగానే అనిపిస్తున్నాయి నాకు. దీని గురించి చర్చించే ఓపిక లేదు.:-)

    ఇక నా బ్లాగు కు సంబంధించి మీరు ఙ్ఞానం, కౌశలం వాంటి పదాలు వాడారు. సరే అలానే ఫిక్స్ అవుతాను. :-)

  3. రవి గారూ, ధన్యవాదాలు. మనకి ఇంచుమించుగా ఏకాభిప్రాయం కుదిరినట్టే అని అనిపిస్తోంది మీ వ్యాఖ్య చూశాకా. తెలుగు సినిమాని ఇంక వదిలేద్దాం.

    మీరు చెప్పిన ఈ క్రింది విషయాలు అన్నీ ఒప్పుకుంటున్నాను:
    కళకి సార్థకత వ్యక్తి అస్తిత్వం కరిగిపోవడం. ఆ స్థాయిలో తపించే వ్యక్తి స్వార్థాన్ని దాటతాడు.
    ఆశయం వేరు, కళలో తాదాత్మ్యత చెందడం వేరు.
    కళని స్వప్రయోజనం కోసం వాడుకోవడం వేరు. కళద్వారా సాటి మనుషులతో అనుసంధానించుకోవడం వేరు.

    సాగర సంగమంలో కొన్ని అసంబద్ధమైన విషయాలు ఉన్నాయని నేనూ అనుకుంటున్నాను. అయితే అది ఒక బలహీనుడైన, డిప్రెషన్ కి గురి అయిన వ్యక్తి కథ అని నా భావన. అతను కళలో పూర్తిగా తాదాత్మ్యం చెందగలిగి, రవీంద్రనాథ్ టాగూర్ విషయంలో మీరు చెప్పినట్టుగా ఒక యోగస్థితికి చేరగలిగిన వ్యక్తి కాడు. సామాన్యుడు. ఈ సినిమా గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇంతగా మనచేత ఆలోచింపచెయ్యగలిగింది అంటే అది చాలా విజయవంతమైనట్టే…

    కాళిదాసు గురించి మీ భావన కొద్దిగా నాకు అర్ధమైంది మీ వ్యాఖ్య చూశాకా. అయినా ఇంకొంచం వివరంగా మీ బ్లాగులో రాస్తే ఆనందిస్తాను. (మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. కాళిదాసు గురించి మీరు ఏమి రాసినా ఆయనమీద నా గౌరవం ఏమీ తగ్గదు.) అలాగే ఆబ్స్ట్రాక్ట్ సినిమా గురించి కూడా రాయండి వీలైతే.

    మన చర్చకీ, కొత్తపాళీగారు జీవిత పరమార్థం గురించి అడిగినదానికీ కొద్దిగా సంబంధం ఉందేమో అనిపిస్తూంది. ఏమంటారు?

  4. ఈ చర్చ టాపిక్ ఓ వేస్ట్ అయినప్పటికీ చాలా రంజుగా సాగింది. తోటి బ్లాగర్లు ఎవరైనా ఈ చర్చ లో పాలు పంచుకుని ఉంటే ఇంకాస్త బావుండేదేమో.

    కాళిదాసు మీదా, ఆయన రచనల మీద నాకూ ఎంత మాత్రం అగౌరవం లేదు. అలా అగౌరవం పెంచుకోవడం కేవలం అహంభావమే అవుతుంది.

    ఐతే చరిత్ర, చరిత్రలో దొర్లిన అపశృతులు, తదనంతర కవుల మీద కాళిదాసు ఒరవడి, ఇలాంటి విషయాలను పరిగణనలో తీసుకుంటే, కొన్ని విషయాలను నిస్పాక్షికంగా చర్చించాల్సి వస్తుంది.

    ఇక దీని మీద బ్లాగు రాయాలంటే, ఋగ్వేదం మొదలుకుని, బుద్ధ బోధ, సంస్కృత ప్రాకృతాల మీద చర్చ, వీటన్నిటి మీద కూలంకషంగా రాయాలి. దీనికి ఎంతో సమాచారం కావాలి.పైగా ఏ మాత్రం కాస్త అటు ఇటు అయినా తప్పుడు అభిప్రాయాలకు వచ్చే అవకాశం ఉంది.

    పైగా నా సంస్కృత భాషాభినివేశం అంతంత మాత్రం. నేను కాళిదాసు మీద రాయడం ఏమిటి అనే ప్రశ్న నాకే వస్తుంది.

    ఇవన్నీ పక్కనుంచితే, నాకున్న బలహీనతలు. నేను ప్రయత్నించి రాసిన ఏ టపా కూడా నాకు నచ్చలేదు. వూరికే అలా ఓ అరగంట అనుకోకుండా రాస్తేనే ఓ ఆనందం.

    ఇక కొత్త పాళీ జీవిత పరమార్థం చర్చ గురించి. ఇలాంటి విషయాలు ఇంటలెక్చువల్ గా అసర్ట్ చేయగలిగినవి కావు అని నా ఉద్దేశ్యం.
    Ultimate truth has to be seen or realized by individuals, not to be propagated.

    జిడ్డు కృష్ణ మూర్తి గారికి నేనో పెద్ద పంఖాని. :-)


Leave a response

Your response:

Categories