నా మీద ఒళ్ళు మండిపోయిన ఒక సందర్భంలో మా ఆవిడ నన్ను అడిగిన ప్రశ్న ఇది. గమ్మున జవాబు చెప్పలేకపోయాను. అసలా ప్రశ్న ఎందుకడిగిందంటే -
నాతో తెలుగు సినిమా చూడ్డం అంటే ఆవిడకి విసుగు. నేనసలు హాల్లో సినిమా చూసి చాలా ఏళ్ళయింది. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే హాలుకి వెళ్ళి తెలుగు సినిమా చూడకూడదని శపథం చేశాను. తరవాత పెళ్ళయ్యాకా మా ఆవిడతో కలిసి ఒకట్రెండు సినిమాలకి వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు ఏ తెలుగు సినిమా చూసినా ఇంటర్నెట్ లోనే. సినిమాలో పాటలు, ఫైట్లు, పనికిమాలిన చెత్త, దరిద్రపుగొట్టు లవ్ సీన్లు అన్నీ ఎత్తేసి (అంటే ముందుకు జరిపేసి) నచ్చితే కామెడీ సీన్లు మాత్రం చూసి సినిమా మొత్తం ఇరవై నిమిషాల్లో అవగొట్టేస్తాను. కొన్ని సినిమాలైతే అయిదు నిమిషాలు కూడా చూడకుండానే బండబూతులు తిట్టి ఆపేస్తాను. హిందీ సినిమాలు అసలు నాకు మొదట్నించీ పడవు. మా ఆవిడ మాత్రం అన్ని సినిమాలూ కనుబొమ్మలు చిట్లించుకుని ఇన్వాల్వయిపోయి యమా సీరియస్ గా చూస్తుంది. అలా చూస్తుంటే నేను ఏడిపిస్తానని కోపం. ఫలానా సినిమా ఎందుకు బాలేదు అని అడిగితే నేనిచ్చే ఉపన్యాసాలంటే ఇంకా కోపం.
అలా అని నేనసలు ఏ తెలుగు సినిమాలూ ఎంజాయ్ చెయ్యననుకుంటే పొరపాటే. ‘నరసింహా’ సినిమా నేను వీరలెవెల్లో ఎంజాయ్ చేశాను. ఇప్పటికీ ఆ సినిమా చూస్తూ నేను చేసే కామెడీ అంటే మా ఆవిడకి మహా ఇష్టం. అలాగే ఈ మధ్య ‘అతడు’ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేశాను (పాటలూ, రొమాన్సూ ఎత్తేసి). మనవాళ్ళ సినిమాల్లో (హిందీ అయినా సరే, తెలుగైనా సరే) నాకు నచ్చనిది ఏమిటంటే ‘కక్కుర్తి’ అనే దరిద్రపు గుణం. సొంత బుర్ర అనేది ఏ కొంచం ఉన్నా కూడా దాన్ని చంపేసి దరిద్రంగా, లేకిగా, నీచంగా, దేబిరిగొట్టుగా ‘బాబ్బాబు, ఏదో ఈ సీన్ ఇలా తీసేస్తున్నాను, కొంచం ఓపిక పట్టి నేను పెట్టిన డబ్బులు నాకొచ్చేట్టు చెయ్యండి చాలు’ అని నా కాళ్ళు పట్టుకుని ఆ నిర్మాతా, దర్శకుడూ బతిమాల్తున్నారేమో అనిపిస్తుంది.
ఇలా ఆలోచిస్తూ ఉంటే ఒకరకంగా నాక్కొంచం అహంకారమేమో అనిపిస్తూ ఉంటుంది కానీ – తొంభై తొమ్మిది శాతం కన్నా ఎక్కువ తెలుగు సినిమాలు చూడబోతే ‘నన్ను మరీ అంత ఎదవ అనుకున్నాడా ఈ డైరట్రు గాడు’ అనిపించేసి, అవమానం వేసేసి, అర్జంటుగా సినిమా ఆపెయ్యాలనిపిస్తుంది. కానీ తియ్యదల్చుకున్నది ఎంత చెత్తైనా కాస్త సిన్సియర్ గా, పద్ధతిగా తీస్తే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేసేస్తాను. ఉదాహరణకి ‘నరసింహా’ సినిమా. నా దృష్టిలో అది ఒక కామెడీ సినిమా. అసలు రజనీకాంత్ సినిమాలు జపాన్ లో బాగా ఆడుతున్నాయి అంటే, అవి మనకి సీరియస్ సినిమాలైనా వాళ్ళకి పరమ కామెడీగా అనిపిస్తాయి కాబట్టి వాళ్ళు చూస్తున్నారు అని నాకో ఘట్టి నమ్మకం.
ఆ సినిమాలో థీమ్ ‘మెగలోమానియా (Megalomania)’ అని నా అభిప్రాయం. అయితే ఆ ‘మేనియా’ని పచ్చిగా చూపించిన తీరు నాకు నచ్చింది. మంచి కామెడీగా అనిపిస్తుంది. కథా, గిథా ఏమీ ఉండదు. అన్ని సీన్లూ అదే మేనియాని తృప్తి పరచడంకోసం ఉంటాయి కాబట్టి నాలోని విమర్శకుణ్ణి నిద్రపుచ్చి సినిమాని ఎంజాయ్ చెయ్యగలుగుతా. అయితే చాలా తెలుగు సినిమాల్తో చిక్కేమిటంటే, కనీసం అధమంగా ఒక ఫీలింగుని పచ్చిగా ప్రదర్శించగల తెగువ కూడా వీళ్ళకి ఉండదు. అంతా కక్కుర్తి తాండవిస్తూ ఉంటుంది. అక్కడ కాపీ కొట్టీ, ఇక్కడ ఎరువు తెచ్చుకునీ – చాలా చీప్ గా లాగించేస్తారు. అలాగే ‘అతడు’ సినిమా కూడా నా ఉద్దేశ్యంలో మంచి కామెడీ సినిమా. ఆ కామెడీని కూడా ఒక పట్టుగా చూపించాడు. చాలు, ఎంజాయ్ చెయ్యడానికి.
జిమ్ కారీ సినిమాలు కొన్ని మా అవిడకి చూపించి, ‘చూశావా, వెకిలి చెయ్యడంలో కూడా ఒక శిఖరాన్ని వాడు చేరుకున్నాడు. మన వెధవలు కనీసం సిన్సియర్ గా వెకిలి కూడా చెయ్యలేరు’ అని తిడుతూ ఉంటాను. ఈ దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ‘లిటిల్ బ్రిటన్’ అని ఒక పరమ నీచమైన కామెడీ సిరీస్ ఒకటి వస్తోంది. అసలు అటువంటి కామెడీ ఉంటుంది అని సగటు భారతీయుడు (సగటు మనిషి) ఊహించడమే అసాధ్యం. అది ఇక్కడ సూపర్ డూపర్ హిట్టు. ఆఫీసుల్లో కూడా అందులో డైలాగులు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. అది చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు సిన్సియర్ గా, మొహమాటాలూ, కక్కుర్తులూ లేకుండా తాము చెయ్యదల్చుకున్నది చేస్తారు, కాబట్టే సక్సెస్ అవుతారు అని. అమెరికా మితృలకో శుభవార్త ఏమిటంటే, ఇదే సిరీస్ ని అమెరికన్ నేటివిటీలో తీసి ఒకట్రెండేళ్ళలో మీ దేశమ్మీద కూడా వదలబోతున్నారు కాబట్టి మీరు నిరాశ పడక్కర లేదు. ఇంకో అయిదారేళ్ళు పోయాకా దీన్లోని జోకులకి భ్రష్ట రూపాలు మనం తెలుగు సినిమాల్లో కూడా చూస్తాం. అప్పుడుగానీ కాస్తో కూస్తో సిగ్గూ, శరమూ, నాగరికతా మిగిలి ఉన్న భారతీయులందరూ దిగుల్తో మంచాలు పట్టి ‘పోరు’.
అలాగే ఒక నాలుగేళ్ళ క్రితం ఇక్కడ టీవీలో ప్రైమ్ టైములో ఒక సినిమా చూశాను. దాని పేరు తెలియదు. ఆ సినిమా థీమ్ ఏమిటంటే ‘అపాన వాయువు’ వదలడం. ఆ థీమ్ తో ఎన్ని రకాల ఊహలు చెయ్యవచ్చో, అన్ని రకాలూ వాడు తీసి సినిమా చూపించాడు. ఒక కుర్రాడు పాపం అటువంటి డిఫెక్టుతో పుడతాడు. అదే వాడికి వరమై వాడు దాన్ని ఉపయోగించి ఒక చిన్న ప్రయోగాత్మక విమానాన్ని నడుపుతాడు. అలాగే ఒక సంగీత కారుడికి అతి తారస్థాయిలోని స్వరం పలకడానికి సహాయపడతాడు. ఆఖరికి రాకెట్టు కూడా నడుపుతాడు. ఆ సినిమాని చూసినంతసేపూ నా కళ్ళని నేను నమ్మలేదు. ఇటువంటి ఊహలతో కూడా సినిమాలు తీశారా అని.
ఇంతకీ మా ఆవిడకి ఏం సమాధానం చెప్పాలా అని కొంచం తికమక పడ్డాను. మాయాబజారూ, మిస్సమ్మా లాంటివి చెప్పబోతే, పాతవాటి గురించి చెప్పడానికి వీల్లేదంది. ‘అతడు’, ఇంకా ఒకటో రెండో రవితేజా సినిమాలూ గట్రా ఎంజాయ్ చేశానుగా అంటే, ‘కామెడీ గా కాదు, సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి, నాలాగా కనుబొమ్మలు చిట్లించుకుని చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా?’ అంది.
ఆలోచించాను. ‘ఆ, దొరికింది. చాలా కాలమైంది చూసి అని కొన్నేళ్ళ క్రితం సాగర సంగమం సినిమా డవున్ లోడ్ చేసుకుని ఏడెనిమిది సార్లు చూశాను. (అప్పుడూ ఆవిడ ఇంకా ఈ దేశానికి రాలేదు). ఆ సినిమా పెర్ ఫెక్ట్ అని చెప్పనుగానీ, చూసిన మొదటి మూడు, నాలుగు సార్లూ కొన్ని సీన్లకి కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి’ అని చెప్పాను.
హమ్మయ్య, అయితే నువ్వూ మనిషివే’ అంది మా ఆవిడ తృప్తి పడి.
పచ్చినిజాలు చెప్పారు మాస్టారు.
By: RSG on May 27, 2008
at 5:04 pm
నిన్ను బాగా కదిలించిన తెలుగు సినిమా అసలేదైనా ఉందా?
ఇది మరీ అన్యాయం సార్, నేటి చాలా సినిమాలు కదలకుండా చూడగలిగితే ఒట్టు. అసలు కదిలించటమేం ఖర్మ, పరుగులు పెట్టిస్తేనో.
చంద్ర సిద్ధార్ధ, నీల కంఠ మరియు గుర్రం గణ్ణం రాజు సినిమాలు పర్లేదు. మిగిలినవన్నీ కదులుతూ చూడాల్సిందే..
మీరు గానీ పొరపాటున వొళ్ళు కాదు మనసు కదలాలి అంటున్నారా ఏమిటీ, ఛా ఊరుకోండి… అలాంటి బూతు మాటలు మాట్లాడితే నేటి తెలుగు సినిమా మిమ్మల్ని వెలేయగలదు జాగ్రత్త.
By: వికటకవి on May 27, 2008
at 5:08 pm
ఐనా కాలేజీరోజుల్లోనే తెలుగుసినిమాల మీద అంత క్లారిటీ వచ్చిందంటే… మీరు గ్రేట్… seriously…
By: RSG on May 27, 2008
at 5:14 pm
తెలుగులో కూడా మంచి సినిమాలు అప్పుడప్పుడూ వస్తూనే ఉన్నాయి. ఇన్వాల్వ్ అయిపోయి చూసే సినిమాలు కావాలంటే, ఈ మధ్య వచ్చిన ‘గమ్యం’ ఆ కోవలోకి వస్తుంది – చాలా మంచి సినిమా. మీకు బాగా నచ్చిన ‘అతడు’ మంచి వినోదాత్మక చిత్రం. ‘అనుకోకుండా ఒక రోజు’ చూస్తే స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. సెంటిమెంటు డోసు ఎక్కువైనా, ‘బొమ్మరిల్లు’ కూడా ఫరవాలేదు. స్క్రీన్ ప్లే పరంగా ‘మిస్టర్ మేధావి’ కూడా ఓకే. ఆ మధ్య వడ్డే నవీన్ ది ‘నా ఊపిరి’ అని వచ్చింది. బాగా ఆడలేదు కానీ మంచి సినిమా.
హిందీలో కూడా ఈ మధ్య మంచి సినిమాలొస్తున్నాయి: ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’, ‘తీన్ దీవారే’, ‘ఇక్బాల్’, ‘యు, మి ఔర్ హం’, ఇలాంటివి. హిందీ సినిమాల్లో విజువల్స్ చాలా బాగుంటున్నాయి కూడా. తెలుగు వాళ్లు ఇంకా ఆ స్థాయికి రాలేదు.
By: అబ్రకదబ్ర on May 27, 2008
at 5:21 pm
ఇది చదువుతుంటే మీరు సినిమాలని విమర్శించాలి అనే వుద్దేశం తోనే చూస్తున్నారనిపిస్తుంది. తెలుగు హిందీ లో చాలా చెత్త సినిమాలు వస్తున్నాయి కాదనను. కానీ కొన్ని మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. ‘ఆ నలుగురు ‘ , ఐతే , అనుకోకుండా ఒక రోజు, బొమ్మరిల్లు , ఆనంద్, గోదావరి లాంటివి కొన్ని.
మిరు చెప్పిన అతడు కూడా మంచి సినిమానే.. కానీ సినిమాని మీరు కేవలం విమర్శనాత్మక డృష్టి తోనే చూసినట్టున్నారు. అందుకే అంత చెత్తగా అనిపించి వుంటుంది.
ఇంకా హింది లో చక్దే ఇండియా, లగాన్, తారే జమీన్ పర్, లాంటి సినిమాలు కూడా వచ్చాయి.
ఇవేవీ మీకు నచ్చలేదంటే ఇక మీరు సినిమాలు ఇంటర్నెట్ లో కూడా చూడటం మానేయొచ్చేమో..
By: Niranjan Pulipati on May 27, 2008
at 7:11 pm
మీతో తొంభైయ్యైదు శాతం అంగీకరిస్తున్నాను. “కాస్తో కూస్తో సిగ్గూ, శరమూ, నాగరికతా మిగిలి ఉన్న” భారతీయులలో నేనూ ఒకణ్ణని అప్పుడప్పుడూ అనుకుంటూ వుంటాను. అంటే, నేనూ మార్గదర్శిలో చేరి ఒక మంచం కొనుక్కోవాలన్నమాట. మరో ఐదారేళ్ల తరువాత దిగులుతో మంచంపట్టి పోవాలంటే మార్గదర్శిలో చేరక తప్పదు కదా!
By: రానారె on May 27, 2008
at 9:20 pm
RSG గారూ, నెనర్లు.
వికటకవి గారూ, తెలుగు సినిమాలు మరో రకంగా కూడా మనల్ని కదిలిస్తాయి లెండి – కడుపులో….
అబ్రకదబ్రా గారూ, మీరు చెప్పిన సినిమాలు ఏవీ నేను ఇంతవరకూ చూడలేదు. కనీసం కొన్నైనా చూడాలనిపిస్తూంది మీరు చెప్పాకా. (నేను బాగా వెనకపడిన జీవిని లెండి.)
నిరంజన్ గారూ, మీరు చెప్పిన తెలుగు సినిమాలు ఏమీ చూడలేదు. కానీ తారే జమీన్ పర్, లగాన్ చూశాను. నాలోని విమర్శకుడు విజృంభించి చిరాకు తెప్పించాడు ఆ సినిమాలు చూస్తున్నంతసేపూ. తెలుగూ-హిందీ దూరదర్శన్ చానల్స్ గురించి ఒక సామెత చెప్పారు చిన్నప్పుడో టీవీ సమీక్షకులు – ‘పాటకి నేనూ, అందానికి మా అప్పా’ అని ఓ గాడిద అందిట, పక్కనున్న ఒంటెని చూపిస్తూ. మన తెలుగూ హిందీ సినిమాల తీరు కూడా అంతే అని నాకు అనిపిస్తుంది. సినిమాల విషయంలో నేను కొంచం తిక్కలోణ్ణే కావచ్చు. అయినా మరీ ఆర్ట్ సినిమాలు చూసే టైపు కూడా కాదు. ఒక సినిమా చూస్తే ఏదో ఒక అనుభూతి కలగాలనీ, ఆలోచింపజేయాలనీ కోరుకుంటాను. అది అత్యాశే కావచ్చు.
రానారే గారూ, మీరు నాతో అంతమటుకు ఏకీభవించినందుకు కొండంత బలం వచ్చినట్టైంది. నెనర్లు.
By: nagamurali on May 27, 2008
at 10:14 pm
భలే రాశారండి!మీతో 100% ఏకీభవిస్తున్నాను! మీరు చెప్పిన వెకిలి కామెడీ సిరీస్ లు హిందిలో బాగా క్లిక్ అవుతాయి. పైగా వాళ్ళే తెర వెనక డబ్బులుచ్చుకుని నవ్వేవాళ్ళని పెట్టుకుంటారు. అందువల్ల మనకు ఎక్కడ నవ్వాలో తెలుస్తుంది.
మంచి విశ్లేషణ! ఒక సినిమా చూస్తే మంచి అనుభూతి కలగాలని కోరుకోవడం మనమిచ్చిన డబ్బు కి కనీస గిట్టుబాటు కదా!
@అబ్రకదబ్ర
అవునండి, నా ఊపిరి సినిమా బాగుంది. హాలీవుడ్ నించి కథని కాపీ కొట్టారా అని అనుమానం కూడా వచ్చింది. నవీన్ కాకుండా ఇంకెవరైనా అయితే బాగా ఆడేదేమో!
By: సుజాత on May 28, 2008
at 1:39 am
మీరు మరీ విమర్శనాత్మకంగా చూస్తున్నారు. మీ విమర్శలు సరైనవే కావచ్చు, కానీ మరీ తెలుగులో మంచి సినిమాలే లేవు అనడం కరెక్ట్ కాదేమో. మన్మథుడు, సంతోషం, గమ్యం, శేఖర్ కమ్ముల సినిమాలు, గ్రహణం వగైరా వగైరా అడపా దడపా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం. సినిమా ఓ వ్యాపారం, మనం కాదనుకున్నా, అవుననుకున్నా. సినిమా రంగం మీద ఆధార పడి ఎంతో మంది బతుకుతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో కోట్లు ఖర్చు పెట్టి, గ్రహణం లాంటి సినిమా తీసి, ఎవరూ చూడకపోతే అక్కడ సినిమా రంగం మీద ఆధారపడి బతుకుతున్న వారి గతేం కాను ? తెలుగు సినిమా తీసేది, చూసేది మాస్ కోసమే., వాళ్ళకు కావలసినవన్నీ సినిమాలో చూపించాల్సిందే. తప్పదు.
పైన చెప్పిన సంగతి నాలో తెలుగు అభిమాని చెప్పింది. ఐతే నేనూ ఓ భీభత్స విమర్శకుణ్ణే. మా ఆవిడకూ నాతో బాటు సినిమా అంటే తెగ చిరాకు
. మీరైనా సాగర సంగమం సినిమాను ఒప్పుకున్నారు. నాకు ఎందుకో ఆ సినిమా అస్సలు నచ్చలేదు.
By: envravi on May 28, 2008
at 7:17 am
క్షమించాలి. పైని కామెంట్ కింద ఈ సంతకం మర్చాను.
రవి
http://blagaadistaa.blogspot.com/
By: envravi on May 28, 2008
at 7:19 am
క్షమించాలి. పై కామెంట్ నాది గా గుర్తించగలరు.
By: రవి on May 28, 2008
at 7:25 am
పై టపాలో నిరాశావాదం, వెకిలి ఎక్కువగా ఉంది. అందర్ని కించపరచి మాట్లాడి మీరు చాలా గొప్ప అని ఫీలవుతున్నారనిపిస్తుంది.
నెగిటివ్ ఆలోచనలు వదిలితే బాగుంటుందేమో. ఇక మీ బ్లాగు. మీ ఇష్టం.
By: రమేశ్ on May 28, 2008
at 12:12 pm
సుజాత గారూ, మీరూ నా అభిప్రాయాల్ని సపోర్టు చేసినందుకు చాలా సంతోషం కలిగింది. నెనర్లు.
రవి గారూ, నేను ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి సినిమాలు ఏమీ చూడలేదు. అది నా తప్పే అనుకుంటాను. సినిమా వ్యాపారమే కావచ్చు. అయితే అది చిత్త శుద్ధి లేకుండా చేసే వ్యాపారం. కాబట్టి తిట్టినా తప్పులేదు అని నా అభిప్రాయం.
ఒకళ్ళకి నచ్చిన సినిమా వేరొకళ్ళకి నచ్చకపోవడం సహజమే. అయితే అసలంటూ ఏదో ఒక పద్ధతి ప్రకారం తీస్తే కొంతమటుకు ఇన్వాల్వ్ అయి చూడొచ్చు. నచ్చకపోవడం వేరే సంగతి.
రమేశ్ గారూ, మీ కామెంటుకి ధన్యవాదాలు. ప్రస్తుత తెలుగు సినిమాల విషయంలో నేను నిరాశావాదిని. అధికశాతం తెలుగు సినిమాల మీద నాకు చాలా చులకనభావం కూడా. అయితే ‘నేను గొప్ప వాడిని’ అని చెప్పుకోడానికి అలా మాట్లాడడం లేదు. తెలుగు సినిమాలు తీసేవాళ్ళు ఒకళ్ళిద్దరైనా నా కామెంట్లు చదివి హర్టయితే నా జన్మ ధన్యమయినట్టే. వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి రాసినది కాదు కాబట్టి మీరు హర్టవ్వాల్సిన అవసరం లేదు. హర్టయితే సారీ.
By: nagamurali on May 28, 2008
at 12:29 pm
శేఖర్ కమ్ములవి ‘ఆనంద్’, ‘గోదావరి’ చూసి ఫర్వాలేదు బాగానే తీస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకా మంచివి ఆశించవచ్చు ఇతన్నుంచి అనుకున్నా. ‘హ్యాపీ డేస్’ చూశాక ఆ నమ్మకం పోయింది. కాలేజీ విద్యార్ధుల ఏకైక లక్ష్యం ప్రేమలో పడటమే అన్నట్లునంది ఆ సినిమా చూస్తుంటే. శేఖర్ నుంచి ఇది ఊహించలేదు నేను. స్క్రీన్ ప్లే అంతా అతుకుల బొంత. విజువల్స్ ఛండాలంగా ఉన్నాయి (అంత ఘోరంగా జూమ్స్ వాడేవాడిని క్రియేటివ్ డైరెక్టర్ అని ఎలా అంటాం?) నటీ నటుల అభినయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. డైలాగుల్లో పస లేదు (ప్రతి రెండో మాటా ‘ఏరా’, ‘పోవె’ అనే). ఈ సినిమా అంత పెద్ద హిట్ ఎలా అయిందో నాకెప్పటికీ అర్ధం కాదు. ఈ సంగతే అడిగితే వీరాభిమానులు నన్ను కొట్టినంత పని చేశారు!
Btw, నాగ మురళి గారూ, మీరు The 13th Floor చూసినట్లున్నారు? మీ బ్లాగ్ tag line చూసి ఊహించాను. చూస్తే మీకది బాగా నచ్చి ఉండాలి.
By: అబ్రకదబ్ర on May 28, 2008
at 2:28 pm
అబ్రకదబ్రా గారూ,
నేను ఇదివరకూ శేఖర్ కమ్ముల కొలీగ్ ని. ఒకట్రెండు సార్లు మాట్లాడినా అతనితో పెద్ద పరిచయం లేదు. కానీ అతనికి బాగా పరిచయస్తులతో నాకు బాగా పరిచయం ఉంది.
ఎందుకో నేనింతవరకూ ఒకటి కూడా అతని సినిమాలు చూడలేదు. అందరూ చాలా గొప్పగా చెప్తుంటే (మా ఇంట్లో వాళ్ళతో సహా) బాగా తీస్తున్నాడేమో అనుకున్నాను. ఒకసారి ఓపిక చేసుకుని అతని సినిమాలు చూడాలి. అయితే కొద్ది వారాల క్రితం స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు హాపీ డేస్ సినిమా పెట్టుకుని చూస్తున్నారు. అక్కడక్కడా కొన్ని సీన్లు చూశాను. ఏదో కాలేజీ డాక్యుమెంటరీ చూస్తున్నట్టు అనిపించింది. ఏమీ గొప్ప ఇంప్రెషన్ కలగలేదు. పూర్తిగా చూడకుండా అదే మాట అంటే జనం కొడతారేమో అని ఊరుకున్నా. డైలాగులూ అవీ చాలా చిరాకు తెప్పించాయి. అయితే ఈ రోజుల్లో డైలాగులు రియాలిటీకి దగ్గర్లో రాస్తున్నారు కాబట్టి భ్రష్టు పట్టిన భాష మళ్ళా బాగుపడుతుంది అనుకోడం కూడా తెలివి తక్కువే. ఒకళ్ళిద్దరు అన్నారు- వృక్షములు లేని చోట ఆముదం వృక్షమే మహా వృక్షం అయినట్టు శేఖర్ కమ్ముల సినిమాలు ఉన్నంతలో బెటర్ అని. మరి సినిమాలు చూస్తేగానీ అది నిజమో కాదో చెప్పలేను.
The 13th Floor సినిమా నేను చూడలేదండీ. నాకు ఫిలాసఫీ అంటే ఇష్టం కొద్దీ ఆ ట్యాగ్ లైన్ పెట్టుకున్నా, అంతే.
By: nagamurali on May 28, 2008
at 2:44 pm
13th Floor సినిమా మొదట్లో ఆ వాక్యం వస్తుంది. పూర్తిగా చూశాక సినిమాకి ఆ వాక్యానికి సంబంధమేమిటో తెలుస్తుంది. The Matrix ఛాయల్లో ఉండే సినిమా ఇది, కానీ Matrix కన్నా ఇదే బాగా నచ్చింది నాకు. చెప్పదలుచుకున్న విషయాన్ని special effects హంగామా ఏమీ లేకుండా సూటిగా, స్పష్టంగా చెప్పారు.
By: అబ్రకదబ్ర on May 28, 2008
at 4:37 pm
మీ ఉద్దేస్యంలో మంచి సినిమా అంటే ఏమిటి?మంచి కధ?మంచి కధ అంటే నీతులు చెప్పేస్తూ,నీతిగా బ్రతకాలని చూపించటమేనా?లేదా ఇప్పటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తూ తియ్యడమా?
ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ వెకిలి హస్యం,రక్తపాతం,శృతి మించిన శృంగారతో నిండిపోయిన మాట వాస్తవమే.కానీ సినిమా అన్నది వినోదం కోసం అని మర్చిపోకూడదు.లగాన్,తారే జమీన్ పర్ సినిమాలు చాలా చాలా గొప్పవని నేను అనను. కాని పనిగట్టుకుని విమర్శించేటంత ఏముంది అందులో.
దయచేసి మీ దృషిలో గొప్ప సినిమా మటే ఇదని ఒక్కటి చెప్పరూ.ప్లీజ్జ్జ్జ్జ్
By: radhika on May 28, 2008
at 5:03 pm
రాధిక గారూ, నేను ఇన్వాల్వ్ అయ్యి చూడగలిగే సినిమాలు ఈ మధ్య ఏమీ చూడలేదు అని అంటున్నాను. నా దురదృష్టం కొద్దీ ఈ మధ్య చూసినవన్నీ చెత్తే. మంచి సినిమాకి నా దగ్గర నిర్వచనం ఏమీ లేదు. కనీసం ఒక పద్ధతిలో ఉంటే దేన్నైనా ఎంజాయ్ చేస్తాను అని కూడా చెప్పాను (నరసింహా, అతడు అని రెండు పేర్లు కూడా చెప్పాను). అంతే కాకుండా టపాలో నేను చెప్పిన చెత్తలో కూడా క్వాలిటీనే చూస్తాను అని చెప్పాను. అయితే లగాన్, తారే జమీన్ పర్ సినిమాలు నాకు ఎందుకు నచ్చలేదు అంటే వాటిమీద కొంచం సమీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇప్పట్లో ఆ పని చెయ్యలేను. నాకు నచ్చిన సాగరసంగమం రవి గారికి నచ్చనట్టే ఆ రెండింటి గురించీ కూడా అనుకుని వదిలేద్దాం.
By: nagamurali on May 28, 2008
at 5:41 pm
ఈ మధ్య బాలకృష్ణ ‘ఒక్క మగాడు’ సినిమా చూశాను. ఎంత చెత్త సినిమా అయినా పూర్తిగా చూసే నేను దీన్ని సగంలోనే ఆపేశాను. చెత్త సినిమాకి నాకు ప్రస్తుతం తెలిసిన నిర్వచనం ఈ సినిమా (అంటే మరో చెత్త సినిమా చూసే దాకానే). బాలకృష్ణ ఇంట్లోవాళ్లెవరూ ఆయన సినిమాలు చూడరా అనిపించింది నాకది చూస్తుంటే. కనీసం వాళ్లన్నా చెప్పొచ్చు కదా ఆయన గెటప్పులు (ముఖ్యంగా విగ్గులు) ఎంత రోతగా ఉంటాయో.
Persuit of Happyness, Life Is Beautiful, Bella లాంటి సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నారు మనవాళ్లు? ఆ సినిమాల్లోలాగా ఎమోషన్స్ సరిగా చూపిస్తే మనవాళ్లు రుమాళ్లు తడిపేస్తూ చూసేస్తారు కదా. పెద్ద హీరోలున్నారంటే తొడలు కొట్టటం, ఫ్లాష్ బ్యాక్ లు విప్పటం; చిన్న హీరోలేమో కాలేజీ ప్రేమ కధలు. ఇవేనా ఎప్పుడూ? మంచి సినిమా తీస్తే మనవాళ్లు చూడరనటం తప్పు. చెత్త సినిమాలే నోరు మూసుకుని చూసే వాళ్లు మంచివెందుకు చూడరు? పైగా, సినిమా ఎలా తీసినా ఆడుతుందనే గ్యారంటీ ఎటూ లేదు కదా. అటువంటప్పుడు ఒక మంచి సినిమా తీశాననే తృప్తన్నా మిగులుతుంది కదా నిర్మాతకి.
By: అబ్రకదబ్ర on May 28, 2008
at 10:25 pm
అబ్రకదబ్రా గారూ, చాలా బాగా చెప్పారు. అందుకే తెలుగు సినిమాలు తీసేవాళ్ళు చిత్త శుద్ధి లేని వ్యాపారం చేస్తున్నారు అన్నాను. అరె, మనం కస్టమర్సుకోసం ఒక ప్రొడక్టు తయారు చేస్తున్నప్పుడు మినిమం క్వాలిటీ చెక్సు పెట్టుకోవద్దా? మరీ అంత పనికిమాలినవాళ్ళా కస్టమర్సు (తెలుగు ప్రేక్షకులు)? సినిమాల ద్వారా నీతి కథలు చెప్పక్కరలేదు, సమాజాన్ని మార్చెయ్యక్కరలేదు. ఎంటర్టయిన్మెంటు ఇవ్వదల్చుకున్నప్పుడు అదైనా సరిగ్గా ఇచ్చే ప్రయత్నం చెయ్యక్కరలేదా? అందుకే ఆ సినిమాలు చూసేటప్పుడు అంత కోపం వచ్చేది.
By: nagamurali on May 29, 2008
at 6:29 am
Fantastic!
అక్షర సత్యాలు చెప్పారు.
వ్యాఖ్యల్లో తెలుగు సినిమాని సమర్ధించడానికి ప్రయత్నం చేసిన వారందరూ అవే అరిగిపోయిన ముక్కలే మళ్ళీ మళ్ళీ పది గౌంతులతో చెప్పారు. మ్న్నామధ్య ఒక బ్లాగులో కూడా ఇళాంటీ చర్చే జరిగింది – అప్పుడూ ఇవే ముక్కలు చెప్పారు.
నూటికో కోటికో ఒక మంచి సినిమా ఉంది. కాదనడం లేదు. నాగమురళి, నేను, నాలాంటి మరి కొందరి బాధ మీకెందుకు అర్ధం కావడం లేదు? మా బాధని నాగమురళి కొంచెం క్లియర్ గానే చెప్పారు ఈ టపాలో .. లేకి సినిమా తియ్యాలనుకుంటే తియ్యి, దాన్నయినా విణొద భరితంగా తియ్యి – అనేదే మా గోల. ఈ మధ్య “వినోద భరితం” లేదా “సూపర్ హిట్” అని ముద్ర వేసుకున్న ఏ ఒక్క సినిమా చూసినా కనపడేది మీడియాక్రిటీ .. మొదణ్ణించీ చివరి వరకూ.
సూపర్ డూపర్ హిట్ అయిన పోకిరీ తీసుకోండి .. దాన్ని అంతకంటే బాగా తియ్యలేమా? అది యెంత చెత్త సినిమానో కావాలంటే ఒక PhD Thesis రాయొచ్చు.
Please get this point – good movie does not mean movie with message or showing poverty and suffering or anything like that. Good movie means good movie – enjoyable, consistent story, believable characters, told in an engaging and entertaining way .. if the director can actually use some creativity (not copy or “inspiration”) in the making of the movie, in the use of technical departments .. then .. that’s fine.
I look at the so called “comedy scenes” .. most of them leave me untouched .. I just keep wondering what is funny in that! నాకు డోకు కూడా రాదు!!
By: కొత్తపాళీ on May 29, 2008
at 2:23 pm
RAGGING ఎలా చేయాలో నేర్చు కోవాలని అనుకుంటున్నారా?? ఐతే చూడుడు .. HAPPY DAYS.
By: JALLIPALLIK KRISHNA RAO on May 29, 2008
at 3:17 pm
@అబ్రకదబ్ర .. “I think, therefore” .. is translated form of a latin expression famously attributed philosopher Decartes.
More info here.
http://en.wikipedia.org/wiki/Cogito_ergo_sum
By: కొత్తపాళీ on May 29, 2008
at 7:46 pm
asalu mamci cinema amaTea eamiTi?
By: radhika on May 30, 2008
at 12:32 am
తొక్కలో సినిమాల కోసం, కొత్తపాళీ, నాగ మురళి (నా అభిమాన బ్లాగర్లు) వంటి వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అనే విషయం నాకు హాస్యాస్పదంగా ఉంది. ఐతే, నా అభిప్రాయాలు ఎలాగైనా చెప్పాలి, చెప్పి తీరాలి. లేకపోత్తే నిద్ర పట్టదు
ఓ 2 విషయాలు. నా సినిమా హిట్ అవాలి, అవడం కోసం, కొద్దిగా రొమాన్సూ, వయలెన్సూ, ఇంకా చెప్పాలంటే, కాస్త లేకి తనం వాడుకుంటాను. ఇది ఓ పద్ధతి. మనం మన బ్లాగు హిట్ అవడం కోసం కొన్ని సార్లు కొన్ని అనవసర విషయాలు జోడిస్తాము …కనీసం నా వరకైనా ఇది నిజం.అలాంటిదే సినిమా మాధ్యమం కూడా.
2. కేవలం హిట్ అవడం రొమాన్సూ, వయలెన్సూ, ఆఖరుకు భక్తిని, చరిత్ర, ఓ ప్రదేశపు (సీమ) సంస్కృతి…దేన్నైనా వాడుకోవాలనుకోవడం.
2 వ క్యాటగిరీ వాళ్ళెవరూ అందరికీ తెలుసు. వాళ్ళని సపోర్ట్ చేయడం లేదు.
నా ఉద్దేశం ప్రకారం తెలుగు లో, త్రివిక్రం, పూరీ, కృష్ణ వంశీ, విజయ భాస్కర్, శెఖర్ కమ్ముల, యేలేటి వగైరా మొదటి వర్గం వారే. వాళ్ళకు నిబద్ధత లేదు అనడం కొంచెం తీవ్రమైన విమర్శ అనిపిస్తుంది. ఎందుకంటే నిరాక్షిన్యంగా తము చెప్పదల్చుకున్నది, అలాగే చెప్పలేరు…ఎవరూ చూడరు కాబట్టి.వాళ్ళు మనుషులే. ‘మాయా బజార్ ‘ లు మిస్సమ్మ లు ఎప్పుడొ ఓ సారే పుడతాయి మరి.
ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకో విషయం. నా సినిమా నలుగురు చూడాలి అన్న తాపత్రయం ఒకటి. నా సినిమాలు అద్భుతంగా కనిపించాలి అవార్డ్లు రావాలి అనే కక్కుర్తి కోసం నిబద్ధత లేకుండా (సినిమా కథ లోనూ, తను చెప్పదల్చుకున్న విషయంలోనూ) వచ్చిన సినిమాలనూ ఎలా హర్షించాలి?
నా ఉద్దేశంలో బ్లాక్, సాగర సంగమం ఈ కాటగిరీ యే. ఉదా : ఢిల్లీ లో ప్రముఖ డాన్సర్ల సరసన నాట్యం ప్రదర్శించాలి, పదుగురి మెప్పూ పొందాలి అనుకునే వ్యక్తి, అలాంటిదే ఓ చిన్న ఆశయం ఉన్న అమ్మాయి ని మరీ క్లాసుగా సంస్కృత పద్యం చెప్పి విమర్శిస్తాడు ఈ సినిమాలో. వీటి గురించి పేజీలు రాయచ్చు ఈ సినిమాకు సంబంధించి. దర్శకుడి నిబద్ధత ఎలా ఒప్పుకోవాలి? ఐతే ఇలాంటి సినిమాలు నచ్చుతాయి (నాకు మొదట నచ్చింది
, తర్వాత ఆలోచిస్తే ఎబ్బెట్టుగా అనిపించింది). ఓ మామూలు వినోదాత్మక సినిమా వస్తే మాత్రం ఒప్పుకోరు.
(తప్పుగా రాసుంటే ఏమనుకోకండి, ప్లీస్).
By: రవి on May 31, 2008
at 4:49 am
రవి గారూ, మీ కామెంటు చూసి చాలా సంతోషం కలిగింది. ఇందులో వ్యక్తిగతంగా తీసుకునే విషయం ఏమీ లేదండీ. మీరూ నిర్మొహమాటంగా వాదించవచ్చు. పైగా నేను చేసిన విమర్శ తప్పు అని తేలితే నాకన్నా ఆనందించేవాడు ఉండడు.
ఎవరు సినిమా తీసినా హిట్ కోసమే. దానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. తప్పకుండా రొమాన్సూ, లేకితనమూ, వయొలెన్సూ వాడుకోవచ్చు. నేను క్రమం తప్పకుండా తెలుగు సినిమాలు చూడడం చాలా తక్కువ. అందుచేత మీరు చెప్పిన దర్శకుల సినిమాలు కొన్ని చూసి ఉన్నా ఫలానా సినిమా ఫలానా దర్శకుడిది అని చెప్పగలిగేంత పరిచయం లేదు. వాళ్ళెవరికీ నిబద్ధత లేదు అనడం లేదు. వాళ్ళు సినిమాల్లో తియ్యదలచుకున్నవి అన్నీ నిర్దాక్షిణ్యంగా సిన్సియర్ గా తియ్యక్కరలేదు. అయితే కనీసం ఎంటర్టయిన్మెంటుని ఎంటర్టయిన్మెంటులాగా తియ్యకుండా తలనొప్పిలాగా తీస్తే మాత్రం ఎవరికైనా చిరాకు రాక తప్పదు. లేదు, వాళ్ళు అద్భుతమైన ఎంటర్టయిన్మెంటు సినిమాలు తీస్తున్నారు, నీకు అహంకారం కాబట్టి తలనొప్పిగా అనిపిస్తోంది అంటే నేను చెప్పగలిగేదేమీ లేదు. నాకు తలనొప్పి వస్తోంది ఇవి చూస్తే అని మళ్ళా ఇంకోసారి అనడం తప్ప.
వీళ్ళల్లో ఏ గొప్ప దర్శకులు తీశారో తెలియదు కానీ – కొత్తపాళీ గారు అన్నట్టు పోకిరీ నాకు అసలు ఏమీ నచ్చలేదు. ‘అతడు’ ని ఎంజాయ్ చెయ్యగలిగిన నేను పోకిరీ ఎంజాయ్ చెయ్యలేనా? ఒకటి రెండు సన్నివేశాలు విడిచిపెడితే సినిమా అసలు ఒక పద్ధతిగా, పట్టుగా లేదు. కామెడీ కూడా ఏమీ నవ్వు రాలేదు. అలాగే చాలా పెద్ద హిట్లు కదా అని కొన్ని వేరే సినిమాలు కూడా ట్రై చేశాను (పేర్లెందుకు లెండి, అనవసరంగా ఇతరులు ఆవేశపడతారు). ఒక గంట కూడా ఆ సినిమాలు చూసి ఉండను, అది కూడా ఎక్కడికక్కడ సీన్లన్నీ ఎత్తేస్తూ. అయినా చిరాకేసి చూడకుండానే వదిలేసా కొన్నింటిని. అసలది ఒక కథా? ఒక నటనా? ఒక కామెడీయా? ఒక ఎంటర్టయిన్మెంటా? అర్థం పర్థం నాకు అక్కరలేదు. నన్ను నేను ఒక పావుగంట మర్చిపోయి ఎంజాయ్ చెయ్యగలిగేది వాటిలో ఏమైనా ఉందా?? తెలుగు ప్రేక్షకులు బుర్రల్లేనివాళ్ళూ, వాళ్ళ మొహానా ఏ పేడ కొట్టినా పరవాలేదు అనుకోవడం కాకపోతే మరేమిటి?
మరి అవి అన్నీ హిట్లు అయ్యాయి కదా… ప్రజలంతా చూస్తున్నారు కదా… నీకే ఎందుకంత తిక్క? అందరూ పూజించే విషయాల్ని నువ్వెందుకు తిడతావు? అహంకారం కాకపోతే ఇది ఏమిటి? నువ్వేమైనా పెద్ద —-? ఇలాంటి ధోరణి నాకు బాగా పరిచయమే. రాజుగారు బట్టల్లేకుండా ఊరేగుతున్నారు. కానీ ఆయన దేవతా వస్త్రాలు ధరించారు అని మొత్తం రాజ్యమంతా సంబరాలు చేసుకుంటోంది. కొందరు నాలాంటి వెనకబడిన వెర్రివాళ్ళు మాత్రం రాజుగారు దిగంబరంగా ఊరేగుతున్నాడు బాబోయ్ అని మొత్తుకుంటే, వాళ్ళకి అహంకారం. నిజమేమిటంటే, అందరికీ తెలుసు రాజుగారికి బట్టల్లేవని. మిగతా అందరూ ఒప్పుకోగాలేనిది నా ప్రత్యేకత ఏమిటి ఒప్పుకోక అనే మనస్తత్వం. నేనూ చాలా విషయాల్లో దీనికి మినహాయింపేమీ కాదు. కానీ ఒక్కోడికి ఒక్కో విషయంలో జ్ఞానోదయం అవుతుంది. అంతే.
నేను దర్శక నిర్మాతల నిబద్ధత గురించి అడుగుతున్నాను అంటే, అర్ధవంతమైన కళాఖండాలు ఇమ్మని కాదు, కనీసం ప్రేక్షకుణ్ణి బుర్రలేని వెధవగా భావించకుండా సినిమా తీస్తే చాలు అని. ఈ మధ్య ఎక్కడో చదివాను. కొత్త దర్శకుల్లో కొంతమందికి ఒక ఫార్మ్యులా ఉందిట. అదేమిటంటే, కామెడీ సీను, సెంటిమెంటు సీను, రొమాన్సు సీను, వయొలెన్సు సీను ఇలా ఒకదాని తరవాత ఒక సీను ప్రతీ కొద్ది నిమిషాలకీ ఒకటి దొర్లిస్తూ ఉండాలిట. మొత్తం సినిమా అంతా అదే అల్లిక. కథని ఈ అల్లికలో చొప్పిస్తారట. ఆ మాట నేను మా ఆవిడకి చెప్పి ఆ దృష్టితో సినిమాలు చూడమన్నాను. తను చాలా ఆశ్చర్యపోయింది. ‘నిజమే సుమా, ఒక కామెడీ సీను వస్తుంటే తరవాత వయొలెన్సు సీను వస్తుంది అని ముందే ఎక్స్పెక్ట్ చేసి చూస్తే భలే తమాషాగా ఉంది. నా ఎక్స్పెక్టేషన్ చాలాసార్లు నిజమౌతోంది కూడా’ అని అంది.
మంచిదే, ఇటువంటివి వంద ఫార్మ్యులాలు పెట్టుకోమనండి. ఎన్ని ఫార్మ్యులాలు పెట్టుకున్నా బయటకి వచ్చేది అతుకుల బొంతా, తలకాయనొప్పీ అయితే మాత్రం తీసేవాళ్ళని తిట్టకుండా ఎలా ఉండగలం?
అయితే అన్ని సినిమాల్నీ ఇదే గాటన కట్టెయ్యలేము అని కూడా నేను ఒప్పుకుంటున్నాను. నచ్చడం, నచ్చకపోవడం, కథలో అర్ధం లేకపోవడం, నిబద్ధత లేకపోవడం ఇవన్నీ తరవాతి సంగతులు. కొత్తపాళీగారన్నట్టు అసలంటూ సినిమాలో ఒక బేసిక్ కన్సిస్టెన్సీ ఉంటే ఎటువంటి సినిమాకైనా పాసు మార్కులు వెయ్యచ్చు. ఈ విషయంలో ఆయన చేసిన విశ్లేషణే ఫైనల్ అని నేను అనుకుంటున్నాను.
ఇక మీరు చేసిన మరొక వాదన. అవార్డు రావాలి, లేదా పేరు రావాలి అనే కండూతితో పడే కక్కుర్తి. కక్కుర్తి ఏరకంగా పడినా కక్కుర్తే. కే.విశ్వనాథ్ కక్కుర్తి పడిన సినిమాలు కొన్ని నాకు తెలుసు. (పేర్లు చెప్పను. ఆవేశాలు వస్తాయి.) అయితే అటువంటి కక్కుర్తి పడిన సినిమాల్లో కూడా కక్కుర్తి కొన్ని పాయింట్లలోనే కనిపిస్తుంది తప్ప మొత్తం సినిమా అంతా విలయతాండవం చెయ్యదు. అటువంటి సినిమాల్లో కూడా కనీసం ఒక పావుగంట, అరగంట సేపు ఎంజాయ్ చెయ్యగలిగిన సరుకు ఏదో ఒకటి ఉంటుంది. ఆమాత్రం సరుకు కూడా లేని సినిమాలు నేడు తామర తంపరగా వస్తున్నాయి.
సాగర సంగమం సినిమాలో హీరో పడిన తాపత్రయమంతా పదుగురి మెప్పూ కోసమే అనడం అసంబద్ధం. మీరు బ్లాగులో రాసేవాటిలో అధికశాతం మీ ఆనందం కోసం రాసుకునేవి అని మీరే అన్నారు (కొన్ని విషయాల్లో ఇతరులకోసం కాంప్రమైజ్ అయినా). మన ఆనందం కోసం మనం చేసుకునేవాటిల్లో సాధారణంగా మనం కాంప్రమైజ్ అవ్వం, ఇతరులకి నచ్చకపోయినా. కళని తన ఆనందం కోసం అభ్యాసం చెయ్యడంలో గొప్ప అనుభూతి ఉన్నది. ఆ విషయంలో (ఆ సినిమాలో) కమల్ హసన్ నిబద్ధతని అద్భుతంగా చూపించారు. అయితే ఢిల్లీలో ప్రదర్శన ఇవ్వడం తాను సాధించిన విద్యకి ఒక సార్థకత కోసమే తప్ప పదిమంది కోసమూ కాదు. మీరు చాలా విషయాలు చదివారు. చాలా విషయాలు తెలుసు. అయితే మీరు బ్లాగులో అవన్నీ రాయడం ఎందుకు? పదిమంది మెప్పు కోసమూ కాదా? నా ఉద్దేశ్యంలో కాదు. మీ స్థాయికి చెందిన వాళ్ళతో మీ జ్ఞానాన్ని పంచుకోవడం, ఇతరుల కౌశలాన్ని చూసి మీరూ ఆనందించడం, మీ స్థాయి వ్యక్తులతో స్నేహాన్నీ, సాంగత్యాన్నీ సంపాదించుకోవడం జీవితానికి గొప్ప పరమార్థాన్ని ఇచ్చే విషయాలు.
ఏ శాస్త్రంలోనైనా, కళలోనైనా అంతిమంగా కలిగే సార్థకత – ఒక వ్యక్తిగా తన అస్తిత్వం కరిగిపోవడం. అటువంటి సార్థకతకీ, పేరుకోసం పాకులాడడానికీ నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉన్నది. సాగరసంగమంలో కమల్ హసన్ పడిన వేదన చౌకబారుది కాదు. అది తన జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసం పడిన వేదన. దానికీ, దీనికీ తేడాని మీరు అపార్థం చేసుకోవడం నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. నేను అనుకుంటూ ఉంటాను – నేను బ్లాగు రాయడానికి సార్థకత ఇటువంటి చర్చల్లో పాలుపంచుకోవడం అని. అయినా ఇవన్నీ వ్యక్తిగతమైన దృష్టికోణాలు. ఇతరులు వీటితో స్వేచ్ఛగా విభేదించవచ్చు.
సినిమాలనుంచి చాలా దూరమే వెళ్ళాను. అంతిమంగా నేను చెప్పేది ఒకటే. ప్రస్తుతం తెలుగు సినిమా దేవతా వస్త్రాల్ని ధరించి ఉన్నది. కొందరికైనా అది దిగంబరంగా ఉన్నది అని గొంతు చించుకునే హక్కు ఉన్నది. మిగతావాళ్ళు తమ మొహమాటాలు తామే వదిలిపెట్టి మెల్లిగా గొంతు కలుపుతారు.
By: nagamurali on May 31, 2008
at 9:28 am
[...] సినిమాల్ని తిడుతూ నేను రాసిన టపాకి ఇంతవరకూ ఎప్పుడూ రానంత స్పందన [...]
By: తెలుగు సినిమాల మీద చర్చ « Naga Murali’s Blog on May 31, 2008
at 12:55 pm
[...] తెలుగు సినిమాలపై నాగమురళి చేసిన ఈ వి… మంచి చర్చనే జరిపించింది. [...]
By: పొద్దు » Blog Archive » ‘మే’లిమి బ్లాగులు జాబులూ on June 1, 2008
at 9:16 am
ఆ కక్కుర్తి పాయింట్ నాకు తెగనచ్చింది.
By: కె.మహేష్ కుమార్ on June 23, 2008
at 1:09 pm
[...] సాల్మన్ రష్దీ గురించి ఓ వివరణా, తెలుగు సినిమాల మీద విసుర్లు, ….ఇన్ని ఒకే వ్యక్తి చేయగలడు, ఓ [...]
By: పొద్దు » Blog Archive » నాగమురళి బ్లాగు - సమీక్ష on January 15, 2009
at 5:38 am