Posted by: nagamurali | May 21, 2008

ప్రస్తుతం చదువుతున్న పుస్తకం – ది హ్యూమన్ టచ్

రచయిత: Michael Frayn

నాకేదైనా నచ్చిన పుస్తకం తగిల్తే గబ గబా చదివెయ్యడమే అలవాటు. బోరుకొట్టి మధ్యలో ఆపేసినవి కూడా కొన్ని ఉన్నాయి. కానీ ప్రస్తుతం చదువుతున్న పుస్తకం ఒక భిన్నమైన కేటగిరీలోకి వస్తుంది. నాకు అత్యద్భుతం అనిపించే పుస్తకాల్లో ఇదీ ఒకటి. కానీ దీన్ని తొందర తొందరగా చదవాలని లేదు. చదవలేకపోతున్నాను కూడా. అలాగని బోరుగానూ లేదు.

ఈ పుస్తకంలో ఏం ఉంది అంటే ఖచ్చితంగా చెప్పలేను. ఉన్నదంతా కేవలం ఒక తాత్త్విక చర్చ. రచయిత మనతో సంభాషిస్తున్నట్టుగా రాస్తాడు. పెద్ద కొత్త విషయాలు కూడా ఇందులో ఏమీ లేవు. కానీ కట్టిపడేసే చర్చ. శభాష్ అనిపించే చర్చ. స్పష్టాస్పష్టంగా మనసులో కదులుతూ ఉండే మన ఆలోచనల్నీ, సందేహాల్నీ మనం రాయగలిగేదానికన్నా ఎంతో బాగా ఎవరో రాసేస్తే, పూర్తిగా రూపుకట్టుకోని మన ప్రశ్నలకి స్పష్టమైన రూపాన్నిచ్చి తిరిగి మనకే సంధిస్తే కలిగే ఆశ్చర్యం – ఇదీ ఈ పుస్తకం చదువుతుంటే నాకు కలుగుతున్న అనుభూతి. చదవడం పూర్తి అయ్యాకా మళ్ళా ఒకసారి పుస్తకంలోని విషయాల్ని గురించి రాయడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా మీకు చదవాలనిపిస్తే ఒక మంచి సమీక్ష ఇక్కడ ఉంది చూడండి: http://www.timesonline.co.uk/tol/news/uk/science/article636337.ece

ఇంతవరకూ చదివిన భాగంలో నేను బాగా ఆస్వాదించినది రచయిత డిటర్మినిజాన్ని చెండాడిన తీరు. ఇక్కడ సరదా కోసం పుస్తకంలోంచి నవ్వు తెప్పించిన భోగట్టా ఒకటి ఇస్తున్నా -

UBOAMA – Universal Brotherhood of All Mankind Association

రచయిత న్యూస్ పేపర్లో కాలమిస్టుగా ఉన్న రోజుల్లో ఒక అభిమాని ఆయనకి పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేవాడు. అతనికి దైవదర్శనం లాంటిది ఏదో అయిందట. ఫలితంగా అతనొక తాత్త్విక దర్శన గ్రంథాన్నొకదాన్ని రాస్తూ ఉండేవాడు. పాత న్యూస్ పేపర్ల మార్జిన్ల లోనూ, బూడిదరంగు చిత్తు కాగితాల మీదా రాసిన ఆ గ్రంథంలోని భాగాల్ని పెద్ద పెద్ద పార్సెళ్ళుగా రచయిత అందుకుంటూ ఉండేవాడు. అవి చదివి తన అభిప్రాయం తెలియజెయ్యమని ఆ వ్యక్తి అభ్యర్థన. అంతే కాకుండా ఇంకా రెండు సహాయాలు కూడా అభ్యర్థించాడుట.

1. ఆ పుస్తకంలోని భాగాలు కొన్ని తన పాత ఇంట్లో అటక మీద మర్చిపోతే, కౌన్సిలు వాళ్ళు వాటిని దొంగిలించారు. కాబట్టి రచయిత తన పేరు ప్రతిష్ఠల్ని ఉపయోగించి ఆ భాగాల్ని తిరిగి సంపాదించాలి.
2. తాను Universal Brotherhood of All Mankind Association (UBOAMA) అనే సంస్థ/మతాన్ని స్థాపించి మానవాళి యావత్తునీ అందులోకి మార్చెయ్యదల్చుకున్నాడు, కాబట్టి యావత్తు మానవాళికీ సంస్థ వివరాలు తెలియజేసి, సభ్యత్వం నమోదు చేసుకోడానికి రచయిత తన సెక్రటరీల ద్వారా సహాయం అందించాలి.

పాపం రచయిత అతని బారినుంచి ఎలా తప్పించుకున్నాడో తెలియదు! నన్నడిగితే కౌన్సిలు వాళ్ళకి రికమెండు చేసి జంధ్యాల సినిమాలో లాగా సన్మానం చేసి ఒక ఏనుగుని బహుమతిగా ఇమ్మందును.


Leave a response

Your response:

Categories