Posted by: nagamurali | April 19, 2008

తామర తూడులతో కూర

నిన్న ఒకళ్ళింటికి భోజనానికి వెళ్ళాము. ఆయన కేరళీయుడు. ఆవిడ మలేసియాలో పుట్టి పెరిగిన తమిళావిడ. చాలా వంటకాలే చేశారు మాకోసం. రెండు రకాల పప్పులు, ఒక కూర, కారెట్-మామిడికాయ పచ్చడి, రసం, వడలు, పాయసం. అందులో కూర తిని చూసి అరటి కాయ కూరేమో, వెరైటీగా చేశారేమో అనుకున్నాను. మెత్తటి కూర ముక్కలు ఏదో గ్రేవీలో ఉన్నాయి. వాళ్ళే చెప్పారు. అది తామర తూడుల కూరట. చాలా ఆశ్చర్యం వేసింది. మలేసియా కూర అనుకుంటాను. అందులో గ్రేవీ కోసం ఏదో ఆ దేశపు పదార్థం పేరు చెప్పి అది ఇక్కడ దొరుకుతుంది, తామర తూడులు కూడా దొరుకుతాయి, ప్రయత్నం చెయ్యండి అని ఆవిడ చెప్పింది.

తామర తూడులు అనగానే ఒక్కసారి ప్రాచీన సాహిత్యం, అందులోనూ సంస్కృత సాహిత్యం మీదకి మనసు వెళ్ళిపోయింది. ‘వ్యాళం బాల మృణాల తంతుభి రసౌ రోద్ధుం సముజ్జృంభతే’ అని భర్తృహరి శ్లోకం. మూర్ఖుణ్ణి మంచి మాటలతో బుజ్జగించేవాడు తామర తూడులలోని దారాలతో ఏనుగుని కట్టెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడట. అలాగే ‘మృణాలీ మృద్వీనాం తవ భుజ లతానాం’ అని ఇంకో శ్లోకం గుర్తు వచ్చింది. కావ్య నాయికల భుజాల్ని తామర తూడులతో పోల్చడం కవి సాంప్రదాయం. శివుడి తల మీద చంద్రుణ్ణి తామర తూడులా సుకుమారంగా (మృణాల సూత్రాధిక సౌకుమార్యాం ) ఉన్నాడని వర్ణిస్తాడు కాళిదాసు.  అలాగే మేఘదూతంలో అంటాడు, కైలాసం దాకా ఎగురుకుంటూ పోయే హంసలకి దారి బత్తెం ఈ తామర తూడులేనట (ఆకైలాసాద్బిస కిసలయ చ్ఛేద పాథేయవన్త:). ఒకటా రెండా, ఎన్నెన్ని వర్ణనలు!! ఏ కావ్యంలోనైనా ప్రతీ పదీ ఇరవై శ్లోకాలకోసారైనా పద్మాల ప్రసక్తో, ఈ తామర తూళ్ళ ప్రసక్తో రాకుండా ఉండదు కదా.

  

ఆ కూర అంత మధురంగా ఉన్నదని చెప్పలేను గానీ, అది తింటున్నంతసేపూ వెనకటి యుగాల్లోకి వెళ్ళిపోయిన భావన కలిగింది. అయినా ఈ కావ్యాలూ శ్లోకాల ప్రసక్తి తెచ్చి ఆతిథేయులకి విసుగు తెప్పించకుండా నిశ్శబ్దంగానే కూర లాగించేశాను. తిని ఒక రోజు గడిచినా శరీరంలో తేడాలేమీ రాలేదు లెండి, ఇంతవరకు.  మరి మీకెవరికైనా కూడా దీని గురించి తెలిస్తే కొంచం చెప్పండేం!!


Responses

  1. :) బావుంది మీ తామరతూడోపాఖ్యానం

  2. అన్నట్టు తూడోపాఖ్యానం అని దుష్టసంధి వాడావని అనకండేం :P

  3. వే మృణాలాంకురశంకనంటెడు గుర్తు రాలేదూ?

  4. ఔరా భోజనము పెట్టిన వారికి కొంత కవితామృతము ధారపోయకుంటిరే .. :)

  5. రాఘవ గారూ, నెనర్లు.
    ఊకదంపుడు గారూ, నాకు తెలిసిన తెలుగు పద్యాలకన్నా సంస్కృత శ్లోకల సంఖ్యే ఎక్కువ అనుకుంటాను. అందుకే అన్నీ శ్లోకాలే గుర్తు వచ్చాయి.
    రాకేశ్వరా, కవితామృతం ధారపోసినా ఆస్వాదించే వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు తిన్నది చాలు ఇక దయ చెయ్యండి అనే అవకాశం ఉంది అని గ్రహించి ఏమీ మాట్లాడలేదు.

  6. నాగమురళి గారూ, కేరళ లో తామర తూళ్ళతో చేసే వడియాలు కూడా దొరుకుతాయి. మా ఇంట్లో మా నాన్న తరపున వారికి, ఎక్కడో కేరళ టచ్ వుంది. సో, మా ఇంట్లో కేరళ వంటకాలు చేసేది మా అమ్మ. అవియల్, తామర కళంగు వరువల్ (అంటే నేను పైన చెప్పిన వడియాలు), చేక్కై వరట్టి (పనస పళ్ళ జాం) , మురుంగ కాయ మొళగూటళ్ వగైరా…

    నాకు కాళిదాసు రాసిన మరో (బూతు) పోలిక (తామర తూళ్ళకు సంబంధించి) గుర్తొచ్చింది, కుమార సంభవం మొదటి సర్గ నుండీ.

    శ్లోకం పూర్తిగా గుర్తు లేదు…మొదటి, చివరి పాదాలు తప్ప..

    అన్యోన్యముత్పీడయదుత్పలాక్ష్యా
    ……..
    ……..
    మృణాళ సూత్రాంతరమప్యలభ్యం !!

    పార్వతి చనుగవ మధ్య తామర తూడు కూడా ప్రవేశించలేదట! (శివ శివా..అమంగళం ప్రతిహతమగుగాక)

  7. రవి గారూ, ఈ శ్లోకం పూర్తిగా నాకు తెలుసనుకోండి. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఎవరో ఈ శ్లోకాన్ని ఉదాహరించి బూతు అంటే, కొంచం ఆవేశంగానే ప్రతిస్పందించాను. ఇప్పుడంత ఆవేశమూ లేదు, బూతు కాదు అనగల ధైర్యమూ లేదు. నా అభిప్రాయమేమిటంటే, ఇప్పుడు మనకి సినిమాలు ఎలాగ ఎంటర్టయిన్మెంటో, అప్పట్లో కావ్యాలూ, నాటకాలూ అలా గొప్ప ఎంటర్టయిన్మెంటు వస్తువులు అయ్యి ఉంటాయి. ఇప్పటి సినిమాల్లో ఎంత బూతు (శృంగారం అందామా?) ఉన్నా, మనం దాన్ని ఎంటర్టయిన్మెంటులో భాగంగా ఎలా అంగీకరిస్తున్నామో, అదేవిధంగా అప్పటివాళ్ళు అటువంటి వర్ణనల్ని తమ సంస్కృతిలో భాగంగా అంగీకరించి ఉంటారు. మనకిమాత్రం ఇప్పుడు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి – అందులోనూ మరీ భక్తి కావ్యాల్లో కూడా ఇటువంటివి తగులుతుంటే. ప్రస్తుత తరానిది దృశ్య మాధ్యమం అయితే, నిన్న మొన్నటివరకూ పఠన/శ్రవణ మాధ్యమమే గతి కదా. ఏం చేస్తాం మరి. రాఘవేందర్రావు సినిమాల్ని గుర్తు తెచ్చుకుని, వాటికన్నా ఇవి తీసిపోయాయా అనుకుని నేను సర్దిచెప్పుకుని, నాకు నచ్చనివి వదిలేసి, నచ్చినవి మాత్రం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటాను.

    అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తాను. ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు తన భాగవత వ్యాఖ్యానం, పురంజనోపాఖ్యానంలో ఒక విషయం చెప్పారు. వ్యాసాది మహర్షులుగానీ, కాళిదాసాది మహానుభావులు గానీ పోషించింది శృంగార ఆభాసయే గానీ నిజంగా శృంగారం కాదని ఆయన అంటారు. అంటే శృంగారంలా కనిపిస్తుంది తప్ప తరచి చూస్తే అందులో ఉండేది శృంగారం కాదని ఆయన అభిప్రాయం. పురంజనోపాఖ్యానంలో పురంజనుడు తన భార్య భుజంపైనే తల ఉంచుకుని కాలం గడుపుతున్నడని ఒక వర్ణన. అసలు పురంజనోపాఖ్యానమే ఒక అర్థవాదం (allegory). దానిప్రకారం పురంజనుడంటే జీవుడు. అతని భార్య అంటే బుద్ధి. అతను తన సర్వ వ్యాపారాలకీ బుద్ధిమీదనే ఆధారపడుతున్నాడని అర్ధం. ఈ విధంగా తరచి చూస్తే ఋషులూ, ఋషితుల్యులైన కాళిదాసూ, భవభూతీ మొదలైనవారూ, అలాగే తాను రచించిన స్తోత్రాల్లో శంకరాచార్యులవారూ నిజంగా శృంగార వర్ణనలు చేయలేదనే అనిపిస్తుంది నాకు – చాలామటుకు. మొత్తంగా ఒక కావ్యం, లేక స్తోత్రం యొక్క మూడ్ ని బట్టి చూసినా, అర్ధాన్ని బట్టి చూసినా అసలా వర్ణనల్లో శృంగార భావమే కలగదు. కాళిదాసు చేసిన కొన్ని వర్ణనల్లో అయితే శృంగారం కేవలం ఆభాస మాత్రమే అని స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మేఘదూతంలో ఆమ్రకూట పర్వతం వర్ణన, గంభీరానదిని విరహిణి అయిన స్త్రీగా వర్ణించడమూ మొదలైనవి. ఆ వర్ణనలు చూస్తే కొంత హాస్యస్ఫోరకంగానూ, రసాత్మకంగానూ అనిపిస్తాయే తప్ప అసలు శృంగారమనే అనిపించదు. అయితే వాళ్ళు చేసిన అన్ని వర్ణనలూ అంతే అని చెప్పలేను.

    ఈ టాపిక్కు మీద చాలా చర్చలే జరిగినై. ముందే చెప్పినట్టు ఇప్పుడు మళ్ళా వాటిజోలికి పోయేంత ఆసక్తి లేదు. నచ్చితే చదువుకోడం, లేకపోతే వదిలెయ్యడం. అంతే.

  8. రవిగారు,
    శివ శివ అన్నారు బానేవుంది, కానీ అందులో అమంగళం ఎముటుందండీ, సర్వమంగళ సౌందర్యాన్ని ఆపాదమస్తకం కాళిదాసు మనకి రూపుకట్టించాడు:-) తెలుగు కుమారసంభవంలో, ఇదే సందర్భంలో, నన్నెచోడుడు ఒక అడుగు ముందేవేసాడు తామరతూడుని ఉపయోగించడంలో! నాగమురళిగారు బహుశా మరచారో(లేక మొహమాటపడ్డారో:-), తామరతూడుతో మరొక ప్రఖ్యాతమైన పోలిక అది. నేను విడమరచి చెప్తే ఈ కామెంటుని ఎడిట్ చెయ్యాల్సి వస్తుంది, పద్యంలో అయితే అందరికీ అర్థం కాదు కాబట్టి ఇదుగో ఆ పద్యం:
    ఉదరము పలుచదనంబున
    హృదయాంభోజాతనాళ మేర్పడి తన కొ
    ప్పొదవి వెలి దోచెనో యన
    సుదతికి నూగారుదీగె సుందరమయ్యెన్

    ఇంతకీ మన దేశంలో, సంస్కృతిలో, బ్రిటీషు నాగరికత పరిచయం కాకముందు, శృంగార వర్ణనలని (స్త్రీపురుషుల అంగాంగ వర్ణనలూ, ప్రేయసీప్రియుల లేదా భార్యాభర్త్ల సంభోగ వర్ణనలూ) బూతుగా (అంటే అశ్లీలంగా, అసభ్యంగా) పరిగణించేవారు కాదు. సాహిత్యంలోనే కాదు, సాంఘికంగా కూడా శృంగారపరమైన విషయాలు బాహాటంగా, మొహమాటం లేకుండానే మాట్లాడుకొనే వారు, అన్ని వర్గాల వారూను.

  9. నాగమురళి గారూ,

    మీరు, మన తోటి బ్లాగర్లు ఎలా ప్రతిస్పందిస్తారో అన్న భయంతో, నాకు నేను ఓ కవచం వేసుకోడానికి ఆ బూతు అన్న పదం వాడడం జరిగింది. ఇది ఓ రకంగా నా తప్పిదమే.

    చిన్నప్పటి ఓ చిన్న చిలిపి అనుభవం. ఆ శ్లోకం నేను 7 వ తరగతి చదివేటప్పుడనుకుంటా, మాకు సిలబస్ లో వుండేది (నేను ఓరియంటల్ స్కూల్ లో సంస్కృతం వెలగబెట్టాను లెండి). అప్పుడు మా అయ్య వార్లు, పార్వతి వర్ణన, సిలబస్ లో నుండీ తీసేసామని చెప్పారు (ఎందుకంటే, మాకు విడమర్చి చెప్పలేరు కదా). మా అయ్యవార్లు అన్నీ చెప్పి, ఇదెందుకు వదిలేసారు ? ఆ కుతూహలంతో నా లాంటి ఆకతాయిలం కొంతమంది అప్పట్లో, రీసెర్చి చేసి, ఈ పద్యాలు కొన్ని భట్టీ పట్టి, మల్లినాథ సూరి గారి వ్యాఖ్యానం (తెలుగు సేత) కొని అర్థం తెలుసుకోడానికి ప్రయత్నించాము. అప్పట్లో అర్థమయీ, అర్థమవకుండా..అలా ఉండేది. అందుకే ఆ శ్లోకం కొంత గుర్తుండి పోయింది…

    ఇంకో కొసమెరుపు ఏమంటే, 7 వ తరగతి పబ్లిక్ పరీక్షలో పార్వతి వర్ణన ప్రశ్నే ఇచ్చారు! సమాధానం రాసిన వాళ్ళు ఇద్దరు. నేను, నా లాంటి ఇంకో ఎదవ.

    నిజానికి నాకూ ఈ శృంగార వర్ణనలు చెప్పలేనంత ఇష్టం.
    అన్నమయ్య, జయదేవుడు, కాళిదాసు ఎవరైనా కానివ్వండి..

    కామేశ్వర రావు గారు, మీరు అంత అద్భుతమైన పద్యం చెప్పి, అర్థం చెప్పలేదు. :-) నాకూ అలాంటి ఏదో మూల భయమే.

    ఇక పోతే, ఈ మధ్య రాహుల్ సాంకృత్యాయన్ , తిరుమల రామచంద్ర గారి ప్రాకృత సాహిత్య పరిచయాలు చదివిన తర్వాత కాళిదాసు మీద గౌరవం కాస్త తగ్గింది. కాళిదాసు అనే వ్యక్తి మీద. ఆయన రచనల మీద కాదు.

    మీరు ఇలాంటి చర్చలు మానేసాను అన్నారు. తిరిగి కొనసాగిస్తే బావుంటుంది.

  10. రవి గారూ, బాగుంది. నేను మీరు చెప్పిన రచనలు చదవలేదు. ఒక వ్యక్తిగా కాళిదాసు గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. మీకు ఏ కారణాల చేత ఆయనమీద గౌరవం తగ్గిందో స్థూలంగా ఒక టపా రాస్తారా? నాకు తెలుసుకోవాలని చాలా ఆసక్తి గా ఉంది.

  11. కామేశ్వర రావు గారు: నాచన పద్యం లో సంఖ్యా దుస్సమత (cardinal inequality) వల్ల కొంత రసాభాస జరిగిందని అనిపిస్తుంది. ఎందుకో నాకు కాళిదాసు రాసిన “తన్మేఖలామధ్య మణేరివార్చి” అన్న పోలికే రమ్యంగా తోస్తోంది. మీరేమంటారు?

  12. వార్త్తిక్ గారు,

    పద్యం నన్నెచోడునిది, నాచనది కాదు. అందులో మీరన్న సంఖ్యా దుస్సమత ఎదీ నాకు కనపడలేదు. అక్కడ పోలిక చెప్పింది ఆకారంతో కదా. “అర్చిః” అన్నది కూడా ఏకవచనమే (కిరణము). అంత సన్నంగా (“తన్వీ”) ఉందన్నమాట!
    అయినా, నేనా పద్యాన్ని కాళిదాసు శ్లోకంతో పోల్చలేదు, తామరతూడుకి మరొక ప్రసిద్ధమైన పోలిక గురించి చెప్పానంతే.
    కేవలం నూగారుని తామరతూడుతో పోల్చి వదిలేస్తే అది సాధారణమే అవుతుంది. కానీ ఈ పద్యంలో ఉదరం గురించీ, హృదయం గురించీ కూడా వర్ణనించడం, అదీ ఈ పోలికకి చక్కగా అమరేటట్టు, ఇందులో నాకు నచ్చిన విశేషం.

  13. యాదృచ్ఛికంగా మీ టపా చదవడం తటస్థించింది. బావుంది.
    ఈ మధ్య ఒక సందర్భంలో కాళిదాసు ఏడు మాహాకావ్యాలు ఒకరి దగ్గర్నుంచి తీసుకొన్నా. కాని తెలుగు అర్ధం ఒక్కటే చదవి అర్థం చేసుకోగలుగుతున్నాను. సంస్కృతం 10 వ తరగతిలో వెలగబేట్టింది కాస్త చదవడానికే గాని, అర్థం చేస్కోవటానికి కాదన్నట్టుంది.. నాకు చదవాలని చాలా ఆశగా ఉంది. ఎలా మొదలుపెట్టాలో కాస్త సలహా ఎమైనా ఇవ్వగలరా?

  14. గోపాలకృష్ణ గారూ,

    నాకు ఇంటర్మీడియట్ లో ద్వితీయ భాషగా సంస్కృతం తీసుకునేవరకూ ఆ భాషతో అస్సలు పరిచయం లేదు. ఇంటరు, తరవాత డిగ్రీలో కూడా రెండేళ్ళు ద్వితీయభాషగా చదివాను. నాకు అంతకన్నా సంస్కృతంలో పాండిత్యమేమీ లేదు. అయితే మాకు పాఠాలు చెప్పిన టీచరు గారి పుణ్యమా అని ఈమాత్రం చదువుకోగల జ్ఞానం అబ్బింది.

    నా సలహా ఏమిటంటే, శ్లోకాలకి అన్వయక్రమమూ, ప్రతిపదార్థాలూ, విశేషాలూ ఉన్న పుస్తకాలు ఏవి దొరికినా సరే చదువుతూ ఉండండి. ఒకట్రెండు పుస్తకాలు చదివేసరికి మీరే కావ్యాలు చాలామటుకు అర్థం చేసుకోగలుగుతారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో ప్రాథమిక స్థాయి పుస్తకాలు చాలానే దొరుకుతున్నాయి. ఆసక్తి ఉంటే ప్రయత్నించి చూడండి. సంభాషణ సందేశ: అని ఒక అద్భుతమైన మాస పత్రిక కూడా వస్తోంది చాలాకాలంగా. వీలైతే అదీ చదవడానికి ప్రయత్నించండి.

    అంతే కాక ఎవరైనా సహాయం చెయ్యగల మిత్రులో, గురువులో దొరికితే ఇంక తిరుగే లేదు.

  15. ఏదో వెతుకుతూ ఇక్కడకు వచ్చాను. ఈ టపా చదివిన తర్వాత మళ్ళీ ఓ అనుమానం వచ్చింది. తామర “తూడు” అంటే తామర పువ్వు మధ్య ఉన్న ఓ సన్నటి దారప్పోగు కదా? మీరు చెప్పిన కూర తామర “కాడ” ల కూర అయి ఉంటుందని నా అనుమానం.

  16. రవి గారూ,

    మీ కామెంటు చూశాకా ఇప్పుడే ఒకసారి బ్రౌణ్యం చూశాను.

    తూడు (p. 0542) [ tūḍu ] tūḍu. [Tel.] n. The root of the lotus. తూడుతిండి a swan which is so called because it feeds on తూడులు . One species is called మెట్టతూటిపువ్వు .

    దీనినిబట్టి తూడు అంటే తామర పువ్వుల కాడ అనే అర్థం వస్తుంది అనుకుంటాను. నేను తిన్న కూర కాడల కూరే కానీ, దారాల కూర కాదు.

    మృణాళ సూత్రం అంటే మీరు చెప్పిన అర్థం వస్తుంది- తామర తూడులోని సన్నని దారము అని.

    మృణాళమన్నా కూడా తామర తూడు (కాడ) అనే అర్థం వస్తుంది.

    805 mRNAla n. (also m. g. %{ardharcA7di} ; and %{I} f. MBh. R. ; cf. Un2. i , 117 Sch.) `” liable to be crushed “‘ , the edible fibrous root of some kinds of lotus (f. according to some `” a smaller root “‘) , a lotus-fibre , fibre attached to the stalk of a water-lily MBh. Ka1v. &c. [830,1] ; n. the root of Andropogon Muricatus L.

    మీరు కూడా ఒకసారి రిఫర్ చేసి చూడండి.

  17. [...] దర్శనం చేసి, వస్తూ వస్తూ వీలయితే, ఈ తామర తూడోపాఖ్యానం అనుభూతిలో మునిగి రండి. ఆ తర్వాత [...]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.