స్థూలంగా చెప్పాలంటే, తిథులు అంటే చంద్రుడి కళలు (Phases). వీటిల్లో అమావాస్య, పౌర్ణమి అంటే అందరికీ తెలుస్తుంది. భూమినుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఒకరికొకరు ఎదురెదురుగా (నూట ఎనభై డిగ్రీల దూరంలో) ఉంటే అది పూర్ణిమ. ఇద్దరూ కలిసి ఉంటే (ఒకే డిగ్రీలో ఉంటే) అది అమావాస్య.
చిన్నప్పుడు ఒకసారి మా ఫిజిక్సు టీచరొకాయన ఇంటికి వెళ్ళాను. వాళ్ళ డాబామీద కూర్చున్నాము. ఆయన అడిగారు, చంద్రుడు పగలు కనిపిస్తాడా అని. కనిపించడు అన్నాను. అలాగా, అయితే పైకి చూడు అన్నారు. అప్పుడు మధ్యాహ్నం ఏ మూడో అయి ఉంటుంది. పైన చక్కగా చంద్రుడు కనిపిస్తున్నాడు. అదేమిటి మరి, అని అడిగారు. నాకప్పుడు తిథుల గురించి కొంచం వివరంగా తెలుసుకోడానికి ఆయన వేసిన ప్రశ్న ద్వారా ఆసక్తి కలిగి, తరువాత మెల్లిగా అవగాహన కలిగింది.
అమావాస్యనాడు సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ఒకేచోట ఉన్నట్టుగా కనిపిస్తారు. ఆ రోజు ఇద్దరూ కలిసి ఉదయిస్తారు, కలిసి అస్తమిస్తారు. కాబట్టి ఆ రోజు అస్సలు చంద్రుడు కనిపించడు. అలాగే పున్నమినాడు సరిగ్గా ఎదురెదురుగా ఉంటారు కాబట్టి, సూర్యుడు అస్తమించేటప్పుడు చంద్రుడు ఉదయిస్తాడు. రాత్రంతా కనిపిస్తాడు. మళ్ళా తెల్లారేటప్పుడు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే, చంద్రుడు అస్తమిస్తూ ఉంటాడు. కావ్యాల్లో పున్నమినాడు జరిగే ఈ సూర్యాస్తమయ చంద్రోదయ వర్ణనలు చాలా ఎక్కువ.
అమావాస్య తరువాత నుంచీ చంద్రుడు ఆకాశంలో సూర్యుడికి దూరంగా జరుగుతూ ఉంటాడు. ఈ జరగడం సుమారు రోజుకి పన్నెండు డిగ్రీలు ఉంటుంది. సూర్యుడికీ, చంద్రుడికీ మధ్య ఉన్న దూరం ఒక పన్నెండు డిగ్రీలు మారితే ఒక తిథి మారినట్టు. కాబట్టి తిథి అంటే ఏమిటంటే, ఆకాశంలో సూర్యుడికీ, చంద్రుడికీ మధ్య కనిపించే దూరం ఒక పన్నెండు డిగ్రీలు పెరగడానికో/తగ్గడానికో పట్టే కాలం. అది ప్రతీ రోజూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి 20 గంటలే ఉండచ్చు. ఒక్కోసారి 22 గంటలో ఇంకా ఎక్కువో కూడా ఉండచ్చు.
అమావాస్య నుంచీ పున్నమి వరకూ వచ్చే తిథుల్ని శుక్ల పక్షం అంటారు. మళ్ళా పున్నమి నుంచీ అమావాస్య వరకూ వచ్చే తిథులు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం. శుక్ల పక్షపు తిథుల్నే శుధ్ధ తిథులని కూడా అంటారు. శుక్ల అంటే తెల్లని అని అర్ధం. కృష్ణ అంటే నల్లని అని అర్ధం. ఈ తిథుల్ని తెల్లటివీ, నల్లటివీ అని ఎందుకు పిలుస్తారో ఒకసారి ఆలోచిద్దాం.
అమావాస్య తరువాత నుంచీ (అంటే శుక్లపక్షంలో) చంద్రుడు వృధ్ధి పొందుతాడు. పున్నమి తరువాత నుంచీ తరిగిపోతూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. అమావాస్య రోజున సూర్యుడూ చంద్రుడూ ఒకేసారి ఉదయిస్తారని చెప్పుకున్నాం కదా. అమావాస్య తరువాత నుంచీ చంద్రుడు సూర్యుడికన్నా ఆలస్యంగా ఉదయించి, సూర్యుడి కన్నా ఆలస్యంగా అస్తమించడం ప్రారంభిస్తాడు. కాబట్టి శుక్ల తదియనాడో, చవితినాడో సూర్యాస్తమయం తరువాత ఆకాశంలోకి చూస్తే చంద్రుడు పడమటి దిక్కున ఇంకొద్ది గంటల్లో అస్తమించడానికి సిధ్ధంగా కనిపిస్తాడు. శుక్ల అష్టమినాడో, నవమినాడో, సూర్యాస్తమయం కాగానే చూస్తే చంద్రుడు ఇంచుమించుగా నడినెత్తిన కనిపిస్తాడు. అంటే మధ్యాహ్నమే ఉదయించి అప్పుడే నడినెత్తికి చేరుకున్నాడన్నమాట. పున్నమికి దగ్గరయ్యేకొద్దీ సూర్యాస్తమయానికి కొంచం ముందుగా తూర్పువేపు కనిపిస్తాడు. సరిగ్గా పున్నమినాడు పడమటన సూర్యుడు అస్తమించే సమయంలోనే తూర్పున ఉదయిస్తూ కనపడతాడు. దీన్నిబట్టి మనకి తెలిసేదేమిటంటే, శుక్లపక్షంలో మొదటి రెండు రోజులు వదిలేసినా, మిగతా రోజుల్లో సూర్యాస్తమయం కాగానే వెన్నెల ఉంటుందని. కాబట్టి శుక్లపక్షంలో సామాన్యంగా సూర్యాస్తమయం నుంచీ కనీసం జనాలు రాత్రి పడుకునే సమయం వరకూ వెన్నెల వెలుగు ఉంటుంది. కాబట్టే వాటిల్ని తెల్లని రాత్రులు (శుక్ల పక్షం) అన్నారు.
మరి కృష్ణ పక్షంలో సరిగ్గా దీనికి విరుద్ధంగా జరుగుతుంది. పున్నమి మరునాటి నుంచీ చంద్రుడు సూర్యాస్తమయం తరవాత ఆలస్యంగా ఉదయించి సూర్యోదయం తరవాత అస్తమించడం ప్రారంభిస్తాడు. పున్నమి తరవాత రెండు మూడు రోజులు గడిచాకా సూర్యాస్తమయం అయిన వెంటనే ఆకాశంలోకి చూడండి. చంద్రుడు కనపడడు. సామాన్యంగా కృష్ణపక్షంలో సూర్యాస్తమయం నుంచీ, కనీసం జనాలు పడుకునే సమయం వరకూ చంద్రుడు కనిపించడు. కాబట్టి అవి చీకటి రాత్రులు.
అలాగే కృష్ణపక్షంలో సూర్యోదయం అయ్యే సమయంలో ఆకాశంలోకి చూస్తే చంద్రుడు కనిపిస్తాడు. నీరసంగా – నైట్ డ్యూటీ చేసి అలిసిపోయినవాడిలాగా ఉంటాడు. కృష్ణపక్షం తొలి రోజుల్లో అయితే పడమటివేపు కనిపిస్తాడు. ఏ అష్టమినాడో, నవమినాడో చూస్తే, నడినెత్తిన కనిపిస్తాడు. మెల్లిగా అమావాస్య దగ్గరపడేకొద్దీ చిక్కిపోతూ తూర్పువేపు కనిపిస్తాడు. పున్నమికి బాగా దగ్గర్లో (త్రయోదశి, చతుర్దశి) అసలు కనిపించనే కనిపించడు. ఎందుకంటే సూర్యుడికి బాగా దగ్గర్లో ఉంటాడు. మళ్ళా అమావాస్య వచ్చేసరికి సూర్యుడూ, చంద్రుడూ ఒకేచోటికి వచ్చేస్తారు.
ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ జాగర్తగా గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైనా సరే ఆకాశంలోకి చూసి, చంద్రుడు కనిపిస్తే, ఏ సమయంలో ఏ దిక్కున కనిపించాడో దాన్నిబట్టి అది ఏ పక్షమో, సుమారుగా తిథి ఏమిటో చెప్పెయ్యవచ్చు. మీరింకా రాత్రిళ్ళు చంద్రుడూ, నక్షత్రాలు కనిపించే ఊళ్ళల్లో నివసిస్తుంటే సరదాగా అభ్యాసం చేసి చూడండి. నేను మొదట్లో చెప్పాను కదా, ఫిజిక్సు మాస్టారి డాబా మీదనుంచి మధ్యాహ్నం మూడు గంటలకి చూస్తే నడినెత్తిన చంద్రుడు కనిపించాడని. అంటే అది శుక్ల పక్షం అన్నమాట. ఏ షష్ఠో, సప్తమో అయి ఉండాలి.
సంస్కృతంలో అంకెల్నే తిథులకి పేర్లుగా వాడతారు. ఒకటో రోజు, రెండో రోజు అని తెలుగులో అంటే ఎలాగో, సంస్కృతంలో పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి అంటే అలాగన్నమాట. ఇప్పుడీ తిథుల్ని ఒక పట్టికలో వేసి ఆయా తిథుల్లో సూర్యుడికీ, చంద్రుడికీ ఎన్ని డిగ్రీల దూరం ఉంటుందో చూద్దాం.
శుక్లపక్షం
పాడ్యమి - 0 – 12
విదియ - 12 – 24
తదియ - 24 – 36
చవితి - 36 – 48
పంచమి - 48 – 60
షష్ఠి - 60 – 72
సప్తమి - 72 – 84
అష్టమి - 84 – 96
నవమి - 96 – 108
దశమి - 108 – 120
ఏకాదశి- 120 – 132
ద్వాదశి- 132 – 144
త్రయోదశి-144 – 156
చతుర్దశి- 156 – 168
పున్నమి-168 – 180
కృష్ణపక్షం
పాడ్యమి – 180 – 168
విదియ 168 – 156
తదియ - 156 – 144
చవితి - 144 – 132
పంచమి – 132 – 120
షష్ఠి - 120 – 108
సప్తమి - 108 – 96
అష్టమి - 96 – 84
నవమి - 84 – 72
దశమి - 72 – 60
ఏకాదశి - 60 – 48
ద్వాదశి- 48 – 36
త్రయోదశి- 36 – 24
చతుర్దశి- 24 – 12
అమావాస్య-12 – 0
కాబట్టి ఈ రోజు శుద్ధ పంచమి అని ఎవరన్నా అంటే, ఆ రోజు సూర్యుడికీ చంద్రుడికీ నలభై ఎనిమిది నుంచి అరవై డిగ్రీల దూరం ఉంటుంది అని అర్ధం. ఈ తిథి ఎప్పుడు ప్రారంభమౌతుందో, ఎప్పుడు అంతమౌతుందో తెలుసుకోవాలంటే తెలుగు కాలెండరో, పంచాంగమో చూడాలి. చాలామటుకు క్యాలెండర్లలో తిథులు పూర్తి అయ్యే సమయం ఇస్తారు. కాలెందరు చూస్తే ‘పంచమి ప. 1.33’ అని ఉన్నదనుకోండి. అంటే, ఈ రోజు పగలు 1.33 కి పంచమి పూర్తవుతోందని అర్ధం. మరి ఈ తిథి ఎప్పుడు మొదలైంది? దాని ముందు తిథి పూర్తి అయినప్పుడు. అంతకు ముందురోజు తిథి చూస్తే, చవితి ప. 3.52 అని ఉంటే, ముందురోజు మధ్యాహ్నం 3.52 కి పంచమి మొదలై, ఈరోజు మధ్యాహ్నం 1.33 కి ముగుస్తోందని అర్ధం. అంటే ముందురోజు సరిగ్గా 3.52 కి సూర్య చంద్రుల మధ్య దూరం 48 డిగ్రీలు, ఇవాళ మధ్యాహ్నం 1.33 కి సరిగ్గా 60 డిగ్రీలు ఉందని అర్ధం.
అయితే మన తెలుగు కాలెండర్లలో పంచాంగకర్తల లెక్కలు ఒకళ్ళకీ మరొకళ్ళకీ మారుతుంటాయి. అందుకని వేర్వేరు పంచాంగ కర్తలు గుణించిన కేలండర్లలో ఈ సమయాలు కొద్దిగా తేడాగా ఉంటాయి. ఒక పదిహేను ఇరవైనిముషాల తేడాలు కనిపిస్తాయి సాధారణంగా.
మరో సంగతి. ఏ రోజు సూర్యోదయకాలంలో ఏ తిథి ఉన్నదో, ఆ రోజుని ఆ తిథిగానే పరిగణించాలని సాంప్రదాయం. అంటే ఈ రోజు పొద్దున్న పదిగంటలకి చవితి పూర్తయ్యి పంచమి వచ్చినా, ఈ రోజు సూర్యోదయ సమయంలో చవితి ఉంది కాబట్టి చవితి ఇవాళే అని భావించాలి. అయితే కొన్ని కొన్నిసార్లు, సూర్యోదయం అయిన అరగంటకే ఒక తిథి వెళ్ళిపోయి కొత్త తిథి వచ్చేస్తుంది. మళ్ళా మర్నాడు సూర్యోదయం అయ్యేలోపే ఈ తిథి కాస్తా వెళ్ళిపోతుంది కూడాను. కాబట్టి ఆ నెల్లో ఆ తిథి లేనట్టేనా అంటే, మరికొంత మంది మతం ప్రకారం ఒక రోజులో ఎక్కువ సమయం ఏ తిథి ఉన్నదో ఆ రోజుని ఆ తిథిగానే పరిగణించాలి. మనకి ప్రతి ఏడాదీ, ఉగాదో, వినాయక చవితో, రామ నవమో ఇలా వివాదాస్పదమౌతూనే ఉంటుంది. పండితులకి ఏకాభిప్రాయం కుదరదు. గవర్నమెంటువాళ్ళకి సెలవు ఎప్పుడు ఇవ్వాలో తెలియదు. మనకి పండగ ఎప్పుడు చేసుకోవాలో తెలియదు.
ఇంకో ముఖ్యమైన సంగతి. ఈ తిథులు మన కాలెండర్లలో మన దేశం టైము ప్రకారం గుణించి ఉంటాయి. మరి అమెరికాలోనో వేరే దేశంలోనో ఉంటే తిథులు ఎలా తెలుస్తాయి అని కొందరికి సందేహం రావచ్చు. తిథులంటే సూర్య చంద్రుల మధ్య సాపేక్షంగా ఉండే దూరాన్ని(Relative Distance) బట్టి లెక్క పెట్టేవి కాబట్టి దేశాల్ని బట్టి తిథి పరిమాణం మారిపోదు. మన కాలెండర్లలో ఇచ్చిన సమయాల్ని వేరే దేశం టైమ్ జోన్ లోకి మార్చుకుంటే చాలు. ఉదాహరణ: ఇండియాలో ఇవాళ పంచమి 1.33 కి ముగుస్తుంటే, లండన్ లో ఉదయం 8.03 కి ముగుస్తుంది. లండన్ ఇండియాకన్నా అయిదున్నర గంటలు వెనక్కి ఉంటుంది. కాబట్టి ఆ టైముని తీసేస్తే చాలు. కరక్టుగా తిథుల సమయాలు వచ్చేస్తాయి. కానీ చిక్కేమిటంటే, ప్రదేశాన్నిబట్టి సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలు మారిపోతాయి. కాబట్టి ఏ రోజు ఏ తిథి ఉంది అన్న గొడవ ఇంకొంచం క్లిష్టమైపోతుంది. మనం ఉన్న ప్రదేశానికి సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలు సంపాదించి ఏ తిథో నిర్ణయించుకోవాలి.
జ్యోతిశ్శాస్త్రం ప్రకారం ఈ తిథుల్లో కొన్ని మంచివీ, చెడ్డవీ ఉంటాయి. అయితే నేను ఆ చర్చలోకి వెళ్ళదలచుకోలేదు. నాకు బాగా తెలియదు కూడా.
ఈ వ్యాసం అస్సలు అర్ధం కాకపోతే తెలియజెయ్యండి. బొమ్మలూ అవీ పెట్టి మళ్ళా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ ఎంత తొందర్లో మళ్ళా రాయగలనో చెప్పలేను. వేరే ఏమైనా సందేహాలున్నా చెప్పండి. నాకు తెలిసినంత వరకూ సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
Nagamurali garu,
Thank you for the informative essay. You have answered all of my important questions. I truly appreciate your quick response.
Sincerely,
Rajasankar Kasinadhuni
By: rajasankar kaisnadhuni on March 10, 2008
at 11:07 pm
చాలా బావుంది నాగమురళిగారూ ..
అందుకే కాబోలి శ్రీ్శ్రీ అన్ణాడు .. బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను అని !
By: కొత్తపాళీ on March 11, 2008
at 12:37 am
అర్థం అయింది.
By: chavakiran on March 11, 2008
at 4:32 am
అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా రాశారు.
By: సుగాత్రి on March 11, 2008
at 5:31 am
బాగా చెప్పరండీ. అర్థం అయ్యింది.
By: రవి on March 11, 2008
at 1:29 pm
క్లిష్టమైన విషయాలను సరళంగా వివరించారు. “తిథులంటే సూర్య చంద్రుల మధ్య సాపేక్షంగా ఉండే దూరాన్ని(Relative Distance) బట్టి లెక్క పెట్టేవి” అన్నారు. ఇక్కడ సాపేక్ష దూరం అనకుండా సాపేక్ష కోణం అని ఉంటే బాగుండేదేమో.
మీరు చెప్పిన విషయాలను ఒక నిమేషక చిత్రం(animated image) ద్వారా Keith’s Moon Page లో చూపించారు.
మీరు చెప్పిన వివరణ అర్థం అయిందని అనిపించిన వెంటనే చప్పున ఉదయించిన ప్రశ్న: అమావాస్య నాడు చంద్రుడు, సూర్యుడు ఒకే దిశలో (సున్న డిగ్రీల సాపేక్ష కోణంలో) కలిసి ఉంటే మరి ప్రతి అమావాస్య నాడు ఒక సూర్య గ్రహణం ఎందుకు ఏర్పడదు? అలాగే ప్రతి పున్నమ నాడు సూర్య చంద్రులు 180° లలో ఉంటే ప్రతి నెలా ఒక చంద్ర గ్రహణం ఎందుకు జరగదు? భూచంద్ర కక్ష్యల గురించి కొన్నికొత్త పాఠాలు నేర్చుకొంటేగాని ఈ సందేహనివృత్తి కాలేదు.
By: వార్త్తిక్ on March 12, 2008
at 1:10 pm
వార్తిక్ గారూ, మీ కామెంటు చూసి చాలా ఆనందం కలిగింది. నిజమే, సాపేక్ష కోణం అంటే బాగుండేది.
నేను వ్యాసంలో తిథుల గురించి చాలా పరిమితంగానే చెప్పదలచుకున్నాను కనుక గ్రహణాల ప్రసక్తి తేలేదు. మీరిచ్చిన లంకె చాలా ఉపయోగకరమైనది. చాలా కృతఙ్ఞతలు.
By: nagamurali on March 12, 2008
at 2:58 pm
తిథులను గురించి అద్భుతంగా,అర్థమయ్యే విధంగ వివరించినందుకు చాలా సంతొషంగా ఉంది.
వ్యాఖ్యల ద్వారా కూడా కొత్త తెలుగు పదాలు తెలుసుకున్నాను.
కృతఙ్ఞతలు.
By: విజయలక్ష్మి on April 3, 2008
at 9:40 am
మైసూరులో వున్నన్నాళ్లూ నేను తిథులు బాగా గమనించేవాడిని. అప్పుడప్పుడు చంద్రుడు ఏ రాశిలో వున్నాడో కూడా గమనించేవాడిని.
రాత్రి డాబా మీద మంచం వేసుకొని నక్షత్రాలు చూసేవాడిని.
బెంగుళూరులో దాని మదరు కాలుష్యం ఎక్కువై ఒక్క నచత్తరం కూడా కనిపించదు.
By: రాకేశ్వర రావు on May 19, 2008
at 6:24 pm
నాగ మురలిగారు చాల బాగ వివరించి చెప్పారు ఛాల చాల ధన్యవాదాలు జ్యోతిష్యం ముఖ్యమైన సమాచారని మరికొంత అందిస్తారని అశిస్తిన్నాను;
సుబ్రమణ్యం నాయుడు
By: Subramanyam Naidu on September 1, 2008
at 6:05 pm
Saapeksha konam( relative angle) correct. At the same time , some one asked why we cannot see the solar eclipse on every Amavasya. The answer is simple. The relative angle mentioned above is measured in 2 dimensional view only. In reality there is a variation in third dimension, because Sun in different plane and moon is also in different plane from the plane we are watching the Moon and sun together . If all these planes get aligned , we see Total Solar eclipse, which happens once or twice in an year.
By: pokala sreekanth on March 7, 2009
at 10:27 am
chala baga varnincharu
By: janaki on June 1, 2009
at 10:17 am
నాగ మురళి గారు, మీకు నెనర్లు.
తిథి గురించి చాల చోట్ల వెతికాను. సూర్యుడు కి చందమామకి మధ్య12 డిగ్రీలు పెరగడము ఏంటి? భూమి కదా సూర్యుడు చుట్టూ తిరిగేది? అని అనుకున్నాను.
మీరు వ్రాసింది చదివాక నాకు బాగా అర్థం అయింది.
By: Aravind on August 23, 2009
at 2:05 pm
అలాగే నాకు తెలిసింది చెబుదాము అని అనుకుంటున్నాను.
సూర్యుడు వల్ల ఎప్పుడైనా చందమామ సగ భాగం మీదే వెలుగు ఉంటాది. అమావాస్య నాడు మనం చీకటి సగ భాగాన్ని చూస్తున్నాము అన్నమాట.
కాని చంద్ర గ్రహణం నాడు అసలు చంద్రుడు మీద వెలుగు అనేదే ఉండదూ. ఎందుకంటే ఆ సగ భాగం మీద కూడా వెలుగు పడకుండా భూమి అడ్డుగా ఉన్నాది కనుక.
By: Aravind on August 23, 2009
at 2:11 pm
మీకు సంస్కృత పరిజ్ఞానం ఉంది కనుక మీకు వీలైనంతలో మన బ్లాగర్లకు ఉండే పురాణేతిహాసాల మీది సందేహాలను అంటే ధర్మసూక్ష్మాలను తీర్చగలరని భావిస్తున్నాను. అంటే రామాయణ, భారతాల నుంచి చిన్న చిన్న వ్యాసాలను ధర్మపరంగా విపులీకరించగలరని నా ఆశ. వీలుంటే కృష్ణ గారి “పిల్లకాకి” బ్లాగ్ చూడండి. అందులో నేను కొన్నింటికి సమాధానాలు వ్రాసాను.
By: శ్రీవాసుకి on April 8, 2010
at 1:35 pm
very nice mari rasulu kosam emi ayena telusa
By: ganesh kumar on April 7, 2011
at 6:56 am
Modata……Meeku Shirassu vanchi Namaskaristunnamu chaaala excellent ga cheparu asalu thithulu? ante emiti? inka shukla n krishna pakshalu untayani kuda chaala mandiki telyadu really chala chala clear ga vivarincharu mee site chusina tharuvatha nenu meee abhimani ga maripoyanu
inkaa meeru kotha kotha vishyalu kuda update chestu undalani korukuntunnanu
Narsimha
Hyderabad
By: Narsimha on May 27, 2011
at 9:45 am
thank you sir to gave valuable information,it’s very clear.
By: sampath on June 24, 2011
at 6:37 pm
BAGUNDI
By: SEKHAR on July 16, 2011
at 9:01 am
నారికేళం వంటి విషయాన్ని కదళీ ఫలం గా ఈ వ్యాసం మార్చింది.
By: ఎం.బి.తిలక్ on October 17, 2011
at 7:37 pm
Nagamurali garu Namaskaram
chaala nice ga chepparu inka manchi vi mariyu chedu thithula gurinchi kuda chepte chala baguntundandi plz vati gurinchi kuda dayachesi cheppandi
Naveena
Hyd.
By: P.Naveena on April 9, 2012
at 4:55 am
childrens and adults ki chala clear ga undrstand avuthundi, chala baga explain chesaru. Because, present days lo evariki veeti meeda knowledge undatam ledu, mee narration chadivaka clarity vasthundi andariki. Thank you
By: Maheswari Rajeev on April 21, 2012
at 2:56 pm