Posted by: nagamurali | February 18, 2008

నేను డ్రైవింగు టెస్టు పాసయ్యానోచ్

తొమ్మిది నెలలు కష్టపడి, రెండు సార్లు ఫెయిలయ్యి, మూడో సారికి ఇవాళ పాసయ్యాను ఈ డ్రైవింగు టెస్టు. చాలా కాలం నుంచీ లండన్ లో ఉంటున్నా కారు కొనలేదు. బ్రహ్మచారి బతుక్కి కారు కూడా ఎందుకు అని. లండన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు బ్రహ్మాండంగా ఉంటుంది. కార్లో ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు తక్కువ. అదీగాక ట్రాఫిక్కూ, పార్కింగ్ కష్టాలూ ఎక్కువే. సెంట్రల్ లండన్ లో ట్రాఫిక్ తగ్గిద్దామని కొన్నేళ్ళ క్రితం కంజెషన్ చార్జ్ కూడా పెట్టారు. నేనసలే మహా బధ్ధకస్తుణ్ణి. ఎందుకొచ్చిన జంజాటం అని ఎప్పుడూ కారు కొందామని కూడా ఆలోచించలేదు. అలాగే ఇన్నేళ్ళూ నెట్టుకొచ్చినా రెండేళ్ళ క్రితం బెల్ ఫాస్ట్ లో నాలుగు నెల్లు ఉండేసరికి కారు ఎంత అవసరమో తెలిసొచ్చింది.

బ్రహ్మచర్యాశ్రమం వదిలేసి పూర్తిగా సంసారంలో పడ్డాకా, ఇండియా నుంచి కొన్నాళ్ళు మావాళ్ళని తీసుకొచ్చి ఇక్కడంతా చూపించాలని గట్టిగా కోరిక బయల్దేరింది. అప్పుడు డిసైడయ్యాను, ఇంక కారు కొనాలని. హైదరాబాదులో ఒక ఏడాది కారు తోలిన అనుభవం ఉందిగదా అని కొంచం ఉత్సాహపడి ఎంత లేదన్నా మూడు నెలల్లో లైసెన్సు సంపాదించెయ్యొచ్చు అనుకున్నాను. నాకు తెలుసు, లండన్ లో డ్రైవింగ్ టెస్టు పాసవ్వడమంటే అంత వీజీ కాదని. నా స్నేహితుడొకడు (నాకన్న చాలా డైనమిక్ లెండి) రెండు మూడేళ్ళ క్రితం ఉత్సాహపడి రెండు, మూడు సార్లు ప్రయత్నించి ఫెయిలై మళ్ళీ డ్రైవింగ్ టెస్టు జోలికి పోలేదు. అయినా ఏదోరకంగా దీని పని పట్టాలని డిసైడైపోయా.

           

ఓ మంచి డ్రైవింగు స్కూల్లో చేరా. మొదటిరోజు ఇన్ స్ట్రక్టర్ కి గొప్పగా చెప్పాను, నాకో ఏడాది కారు తోలిన అనుభవం ఉంది అని. అయితే ఇంకేం, డ్రైవ్ చెయ్యి చూస్తాను అన్నాడు. స్టార్టు చేసి, గేరేసి ముందుకు పోనిచ్చాను. ఆగాగు అన్నాడు, కంగారు పడిపోతూ. అలా అస్సలు చెయ్యకూడదు సుమీ అన్నాడు. కారు స్టార్టు చేసి ముందుకుపోనివ్వాలంటే పెద్ద ప్రొసీజరు ఉంటుంది ఇక్కడ. అద్దాలు చెక్ చేసుకోవాలి, స్టార్టు చెయ్యాలి, గేరు మార్చాలి, ఇండికేటరు వెయ్యాలి, కుడి పక్కకీ ఎడం పక్కకీ చూడాలి, బయల్దేరేముందు బ్లైండ్ స్పాట్సు చెక్ చెయ్యాలి, అల్లంత దూరంలో ఎవడున్నా ముందుకు కదలకూడదు, కారు సరిగ్గా కదులుతున్నప్పుడు కుడిపక్క బ్లైండు స్పాటుకేసి చూస్తూ ముందుకు పోనివ్వాలి, బాబోయ్ చాలా తతంగముంటుంది. అప్పటినుంచీ మొదలు నా కష్టాలు.

                

ఓ నెలరోజులు పోయాక థీరీ టెస్టు రాసేద్దామని మెటీరియల్ కొనుక్కొచ్చి, దానితోపాటు సాఫ్ట్ వేర్ కూడా కొన్నాను. సుమారు ఒక తొమ్మిది వందల ప్రశ్నలు ఉంటాయి. అందులోంచే ఇస్తారు. తొందరగా ఒక నెలలో పూర్తి చేసుకో, లేకపోతే మళ్ళీ ఈ టెస్టు కొంచం మార్చేసి ఇంకా కష్టంగా చేస్తున్నారుట అన్నాడు ఇన్ స్ట్రక్టరు. ఇందులో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే కాక విడియో ఎక్సర్ సైజులు కూడా ఉంటాయి. కారులో వెడుతుంటే ఎలా కనిపిస్తుందో అలా కెమెరాలు పెట్టి అనేక రకాల ట్రాఫిక్ కండిషన్సులో వీడియో తీస్తారు. ఆ వీడియోలు మనం చూస్తూ ఎక్కడైనా మనం ఎలర్టవ్వాల్సిన చోట ఠపీ ఠపీ మని మౌస్ పెట్టి క్లిక్ చేస్తూ ఉండాలి. మన రెస్పాన్సుల్ని బట్టి మార్కులు ఉంటాయి. ఒక రెండు వారాలు గట్టిగా ప్రాక్టీసు చేసుకుని మాక్ టెస్టులు అన్నీ పాసై మొత్తానికి అసలు పరీక్ష కూడా పాసైపోయాను.

              

ఇంకేముంది ఇంకొక్క నెలలో ప్రాక్టికల్ కూడా అయిపోతుందని ఆశ పడ్డాను. ఇందాక చెప్పలేదు కదూ, నా డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టరు పాకిస్తానీ. మాకిద్దరికీ స్నేహం బానే కుదిరింది. మెల్లి మెల్లిగా ఒక్కో స్కిల్లూ నేర్చుకుంటూ వచ్చాను. ఈ దేశంలో రౌండెబౌట్లు (ఇండియాలో సర్కిలు అంటాము) చాలా తలకాయ నొప్పి. ఇన్ స్ట్రక్టరు బొమ్మేసి రౌండెబౌట్లోకి ఎలా ఎంటరవ్వాలో, మళ్ళీ ఎలా బయటపడాలో చెప్పేసరికి బుర్ర తిరిగిపోయింది. పద్మవ్యూహంలోకి వెళ్ళిరావడానికి ఉన్నంత తతంగముంది అందులో. ఎన్నిసార్లు ప్రయత్నించానో, ఎన్ని సార్లు ఫెయిలయ్యానో. ఫెయిలవ్వడమంటే ఏదో ఒక అంశం మర్చిపోవడం. తప్పుగా ఎంటరవ్వడమో, సిగ్నలో, అద్దంలో చూడడమో మర్చిపోవడం వగైరా. చాలా సమయం పట్టింది రౌండెబౌట్లోంచి పోవడం నేర్చుకోడానికి.

                 

మీకు సింప్సన్స్ కార్టూన్ చూడడం అలవాటు ఉంటే అందులో ఒక ఎపిసోడ్లో సింప్సన్స్ కుటుంబం లండన్ వస్తారు. హోమర్ కారు డ్రైవ్ చేస్తూ రౌండెబోట్లోకి వెళ్తాడు. అందులోంచి బయటకు రాలేక రాత్రంతా గుండ్రంగా తిరుగుతూనే ఉంటాడు. అది గుర్తు వచ్చింది ఈ రౌండెబౌట్ నేర్చుకుంటుంటే. దాని తరవాత మెనూవర్లు. బే పార్కింగు, రివర్సు కారు పార్కింగు, రివర్సు రౌండ్ ఎ కార్నర్, ఇలా ఓ ఆరు మెనూవర్లు. అన్నింటికీ బొమ్మలేసి చూపించి మరీ పాఠం చెప్పేవాడు. ఏదో జామెట్రీ ఎక్సర్సైజులాగా కొలతలు లెక్కల ప్రకారం చెస్తేగానీ ఆ మెనూవర్లు కరెక్టుగా రావు. మొత్తానికి అవీ అయ్యాయనిపించాను. అప్పటికి అయిదు నెలలైపోయింది మొదలెట్టి.

               

ఆతరవాత మాక్ టెస్టులు. మూడు మాక్ టెస్టుల్లో ఒక్కటీ పాసవలేదు. ఇంకా ప్రాక్టీసు కావాలి అంటాడు. ఓ రోజు భలే తమాషా జరిగింది. డ్రైవింగు మొదలు పెట్టగానే ఇన్ స్ట్రక్టరు కబుర్లు మొదలెట్టాడు. నువ్వు హిందువా అని అడిగాడు. అవునన్నాను. నాకు కొన్ని సందేహాలున్నాయి, ఏమీ అనుకోవుగా అన్నాడు. పరవాలేదు అడుగు అన్నాను. మీరు ఆవుని ఎందుకు తినరు అన్నాడు? ఏదో చెప్పాను. ఆవు మూత్రం కూడా మీకు పవిత్రంట కదా అన్నాడు. మళ్ళా ఏదో చెప్పాను. ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగడం మొదలెట్టాడు. హిందూ మతం అర్ధం పర్ధం లేనిది అన్నాడు. క్రిస్టియానిటీ పరవాలేదన్నాడు. అన్నిటికన్నా ఇస్లాం గొప్పదన్నాడు. ఏమిట్రా ఇవాళ కొంచం తేడాగా వాగుతున్నాడు అనుకున్నాను. అయినా పట్టించుకోలేదు. చివరికి దేముడున్నాడా లేడా అన్న చర్చ మొదలుపెట్టాడు. ఏదో నాకు తోచింది చెప్తూ వచ్చాను. ఇస్లాం ప్రకారం మానవుల కర్తవ్యమేమిటో ఉపన్యాసం దంచాడు. నేనూ నాకు తోచిన ఫిలాసఫీ ఏదో చెప్పాను. చివరాఖరికి క్లాసు రెండు గంటలూ పూర్తయ్యాకా నన్ను అభినందించి ఇదొక పరిక్ష, కావాలని నీకు కోపం తెప్పించే విధంగా మాట్లాడాను, నీ డ్రైవింగేమైనా తేడా వస్తుందేమో చూద్దామని అన్నాడు. నేను కోపం తెచ్చుకోకుండా బాలెన్సుతోనే డ్రైవు చేశానుట. అదే విధంగా ఎప్పుడూ డ్రైవింగు చేస్తున్నప్పుడు ఎమోషనల్ గా ఫీలవకూడదు అని బోధ చేశాడు. తన వాగుడుకి సారీ కూడా చెప్పాడు. ఓర్నీ, ఇన్ని రకాలుగా ట్రెయినింగిస్తారా అని ఆశ్చర్యపోవడం నా వంతైంది.

               

చివరికి ఆరో నెల్లో టెస్టుకి వెడితే అడ్డంగా తన్నింది. రెండు నెల్లవరకూ మళ్ళీ ఈ ఛాయలకి రాకు అన్నారు. (టెస్టులో మైనర్, సీరియస్, డేంజరస్ అని మూడు రకాల తప్పులు ఉంటాయి. మైనర్ తప్పులు ఇరవై వరకూ సహిస్తారు. సీరియస్ గాని, డేంజరస్ గాని ఒక్క తప్పు వచ్చినా ఫెయిలైపోవడమే. డేంజరస్ తప్పు వస్తే మళ్ళీ రెండు నెల్లవరకూ టెస్టు తీసుకోడానికి లేదు.) రెండు నెల్లు మళ్ళీ గట్టిగా ప్రాక్టీసు చేశాను. రెండో సారి టెస్టు బ్రహ్మాండంగా చేశాను. కానీ ఒక చిన్న తప్పు వచ్చింది. అది సీరియస్ అని అనలేము, అయినా ఫెయిల్ చేశారు. అప్పుడు మా ఇన్ స్ట్రక్టర్ ఏమన్నాడంటే, ఇక్కడ తెల్లవాళ్ళు కొంత పక్షపాతం చూపిస్తారు, పరాయి దేశం వాళ్ళు అయితే చిన్న తప్పు కూడా సహించరు, అదే తెల్లవాడు అయితే ఇదే తప్పు చేసినా వదిలేస్తారు అన్నాడు. నిజమో, కాదో తెలియదుగానీ టెస్టు పాసవ్వడం ఎంత కష్టమైన వ్యవహారమో అప్పటికి పూర్తిగా తెలిసొచ్చింది.

                 

ఇంతవరకు నా జీవితం మొత్తంలో ఇంతగా దేనికీ నేను ట్రెయినింగ్ తీసుకోలేదు. ఇల్లాగనక నేను చదువులో కోచింగ్ తీసుకుని ఉంటే దున్నేసి ఉండేవాణ్ణి. ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందో! ఇంతవరకు నేను చదివిన చదువు మొత్తానికి కూడా అంత ఖర్చు కాలేదు. ఏమి చేస్తాం? రోట్లో తలపెట్టాకా తప్పుతుందా? మళ్ళీ ప్రాక్టీసు మొదలు. మొత్తానికి మళ్ళీ ఇంకో నెల గడిచాకా ఇవాళ టెస్టులో ఒక్క తప్పు కూడా లేకుండా పాసైపోయా. మన దేశంలో ఇక్కడి స్టాండర్డులో కనీసం ఒక పది శాతం మెయిన్ టెయిన్ చేసినా చాలా ప్రమాదాలు నివారించగలుగుతాము. బాధపడి ఏమి లాభం? అక్కడ కొద్దిగా టెస్టు పెడదామన్నా ఏదో రకంగా తప్పించుకోడానికి ప్రయత్నం చేస్తామే తప్ప అయ్యో మన మంచికోసమే కదా అనుకోం. ఇక్కడ మాత్రం చచ్చినట్టు తపస్సులాగా సాధన చేసి నేర్చుకుంటాము. మనమే మన వ్యవస్థని పాడుచేసుకుని మళ్ళీ మనమే కంప్లయింటు చేస్తుంటాము.

              

సరే, ఇంతకీ జోకేమిటంటే, ఈ డ్రైవింగ్ ప్రహసనంలో నాకు లైసెన్సు రాకుండానే మావాళ్ళు ఇండియా నుంచి ఇక్కడికి రావడం, కొన్ని నెలలు ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయి సరిగ్గా వారమైంది. అప్పుడుగానీ టెస్టు పాసవలేకపోయాను.
 


Responses

  1. ahaha,

    andukane nenu london raaledu.

    kalpana

  2. Naaga Murali gaaru,
    Chaala adbhutamgaa undi meeru vraasina vidhaanam.

    Nenu kooda poorvasramam lo okasaari fail ayi (CT, USA) aaru nela la taruvaatha malli vachche vaaram test ki veluthunna.

    “Sreeghrameva License praapthirastu” ani deevinchandi. :)

  3. ఫణికుమార్ గారూ, ఈసారి మీరు తప్పకుండా డ్రైవింగ్ టెస్టు పాసవ్వాలని గట్టిగా ఆశీర్వదిస్తున్నా. శీఘ్రమేవ చోదన పట్టక ప్రాప్తిరస్తు… :-)

  4. మీ ఈ అనుభవం ఇంక వేరే వారికి ఉపయోగపడుతుంది లేండి… మీరు చెప్పింది అక్షరాల నిజం… మన దేశంలో వున్న licence పరిక్ష అన్న correct ga attempt చేసిన బాగుంటుంది… చాలా వరకి 4 wheelers రాని వాళ్ళకి కూడా licence ఇచ్చేస్తారు… ఈ corruption ఎప్పుడు పోతుందో ఎమో… ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి…

  5. Nenu blogs chudatam chala rare. kani e roju antharmukham novel downloads kosam vetukutu e blog loki vachi padda. Blog le teliyani naku telugu blog dorikindi. Munigite gani teliyaledu sumi lothu. lead ichina work cheyyakunda anni chustu potunna. Nijam ga telugu basha ni tarimpachestunna meeranta abhinandaneeyulu suma.

  6. మురళి గారూ,
    మీరు లండన్ లో ఎక్కడ వుంటారు?
    నేను రెడింగ్ లో వుంటాను. లండన్ అప్పుడప్పుడూవస్తూనే వుంటాను.
    UK నుంచి మరో తెలుగు బ్లాగర్ని కలిసినందుకు సంతోషంగా వుంది.
    వెంకట్
    http://www.navatarangam.com


Leave a response

Your response:

Categories