ఈ పద్యాలు చాలామందికి తెలిసే ఉంటాయి. ఒక పండితుడు అత్తవారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తమలపాకులు వేసుకుంటున్నాడు. సున్నం కావాల్సి వచ్చింది. అప్పుడు మరదలిని పిలిచి ఇలా అన్నాడుట.
ఆలినొల్లకయున్నవా నమ్మ మగని
అందులో దాగియున్నవానక్క మగని
నమ్మినాతని చెరచిన దానమ్మ సవతి
సున్నమించుక తేగదే సుందరాంగి ||
ఆలినొల్లకయున్నవాడు = భార్యను స్వీకరించనివాడు (పెండ్లి చేసుకోనివాడు), భీష్ముడు
వాని అమ్మ = గంగ
ఆమె మగడు = సముద్రుడు
అందులోదాగియున్నవాడు = మైనాకుడు
వాని అక్క = పార్వతి
ఆమె మగడు = శివుడు
వానిని నమ్మినవాడు = రావణుడు
వాడిని చెరచినది (నాశనం చేసినది) = సీత
ఆమె అమ్మ = భూదేవి
ఆమె సవతి = ఆమె సవతి జ్యేష్ఠా దేవి
సున్నమించుక తేగదే సుందరాంగి = ఓ జ్యేష్ఠా (దరిద్రురాలా) కొంచం సున్నం తీసుకురా.
అలా బావగారు తన (అతి) తెలివి చూపితే, ఆ మరదలు సున్నం తీసుకొచ్చి ఏం సమాధానం చెప్పిందో చూడండి.
శతపత్రంబుల మిత్రుని
సుతు జంపినవాని బావ సూనుని మామన్
సతతము ధరియించునాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో ||
శతపత్రంబుల మిత్రుడు = పద్మములకు మిత్రుడు సూర్యుడు
వాని సుతుడు = కర్ణుడు
వానిని చంపినవాడు = అర్జునుడు
వాని బావ = కృష్ణుడు
వాని సూనుడు (కొడుకు) = మన్మథుడు
వాని మామ = చంద్రుడు (మన్మథుడి తల్లి లక్ష్మి, ఆమె సోదరుడు చంద్రుడు. కాబట్టి చంద్రుడు మన్మథుడికి మేనమామ అవుతాడు)
వానిని సతతము ధరియించువాడు = శివుడు
వాని సుతుడు = వినాయకుడు
వాని వాహనం = ఎలుక
దాని వైరి = పిల్లి
దాని వైరి = కుక్క
సున్నంబిదుగో = ఓ కుక్కా, ఇదిగో సున్నం.
అదీ కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే.
విని చాలాకాలమైంది. గుర్తుచేసి బోలెడు పుణ్యం మూటకట్టుకున్నారు
By: రాఘవ on January 4, 2008
at 1:52 pm
ఇంతకు ముందు చదివిందే…
మళ్ళీ గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
By: ప్రవీణ్ గార్లపాటి on January 4, 2008
at 2:30 pm
చాలా బావుంది. ఇన్ని లొసుగులు ఉన్న పద్యాలు కాబట్టి కూర్చుని సాగదీస్తే ఒక్కో పద్యానికి ఇంకో అర్ధం కూడా వస్తుందేమో – అంటే ఒకటి తిట్టినట్టు ఇంకోటి పొగిడినట్టు..
By: Giri on January 4, 2008
at 2:43 pm
పద్యాలతో తిట్టుకోవడం విన్నాను కానీ ఇదెప్పుడూ వినలేదు.. భలే ఉందండీ!
By: నిషిగంధ on January 4, 2008
at 2:52 pm
బాగున్నాయి. చూడబోతే, ఇద్దరూ ఉభయభాషా ప్రవీణుల్లా ఉన్నారు.. (పండిత భాష మరియు తిట్ల భాష)
By: వికటకవి on January 4, 2008
at 5:34 pm