Posted by: nagamurali | December 18, 2007

ముక్కస్య ముక్కానువాదాలు

మా ఇంట్లో ఉన్న మేఘదూతం తెలుగు అనువాదానికి ముందుమాట రాసింది జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు. ఆ అనువాదంలో టీక, ప్రతిపదార్థాలు ఉండవు. శ్లోకము, తెలుగులో భావము మాత్రమే ఉంటాయి. జరుక్ శాస్త్రిగారు అనువాదాలతో వచ్చే సమస్యలని వివరించారు ముందు మాటలో.

ఎంతగొప్పగా రాసినా మూలం మూలమే, దానిలోని అందాన్ని అనువాదంలో పూర్తిగా ప్రతిబింబించలేము. అందులోనూ కాళిదాసు అంటే మనకి ఉండే ప్రేమకొద్దీ ప్రతీదీ ప్రత్యేకంగానే అనిపిస్తుంది. ఆయన మేఘదూతంలో రాసినవి మందాక్రాంత వృత్తాలు. వాటి నడక అక్కడక్కడ విరుగుతూ మేఘ గతిని పోలి ఉంటుంది. పోనీ అవే వృత్తాలు, అవే మాటలు ఉపయోగించి తెలుగులో రాసినా ఇదిగో ఇలా అఘోరిస్తుందిగానీ ఆ అందం వస్తుందా, అంటూ సరదాగా ఆయన చేసిన అనువాదం ఇలా ఉంటుంది.

యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్ధఛ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ||

దీనికి ముక్కస్య ముక్కానువాదం:

యక్షుడ్ చేసెన్ జనకతనయా స్నాన పుణ్యోదకాల్లో
స్నిగ్ధఛ్ఛాయాతరుల వసతిన్ రామగిర్యాశ్రమాల్లో ||

 

అలాగే ఇంకో ఉదాహరణ. ఈ శ్లోకం చూడండి.

నపుంసకమితి ఙ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మన:
తత్తు తత్రైవ రమతే హతా: పాణినా వయం ||

మన: శబ్దం నపుంసకలింగం కదా అనుకుని దాన్ని (మనస్సుని) ప్రియురాలిదగ్గరకు పంపిస్తే, అది ఆమెతో రమిస్తూ అక్కడే ఉండిపోయింది. అయ్యో, పాణిని (సంస్కృత వ్యాకరణ కర్త) వల్ల మోసపోయాం కదా.

ఇదే శ్లోకం తెలుగులో జరుక్ శాస్త్రిగారు ఎలా రాశారో చూడండి-

నపుంసకమనే తలచి ప్రియకై పంపితిన్ మనం
బదీ అచ్చటనే ఏడ్చెన్; చచ్చాం పాణినిచేత మేం ||


Responses

  1. జరుక్ శాస్త్రి గారి మార్కు మరి .. :)

  2. మీ బ్లాగు చాలా బాగుంది..
    నేను కూడా ఎప్పటినుండో సంస్కృతం నేర్చుకనే ప్రయాసలో ఉన్నా… ఎదో అలా అలా సాగుతుంది. ప్రస్తుతం తాబాసు గారి దగ్గర నేర్చుకుంటున్నాను.
    సౌందర్యలహరి నా అంతటనేనే అర్థం చేసుకోవాలని నా ఆశ.

  3. నాగమురళి గారూ,
    ముక్కస్యముక్కానువాదాలన్నీ హాస్యాస్పదంగానే ఉండక్కరలేదు. ఇలాంటి అనువాదాల్లో సిధ్ధహస్తుడు శ్రీనాధుడు. హర్షనైషధాన్ని కొన్నిచోట్ల దాదాపు మక్కీకిమక్కీగా అనువదించాడు, మూల అర్థం చెడకుండా. ఉదాహరణకు ఈ పద్యం చూడండి:

    హర్ష నైషధం లోనిది:

    ఆశ్రాంత శృతిపాఠపూత రసనా విర్చూత భూరిస్తవా
    సాది బ్రహ్మముఖౌఘవిఘ్నిత నవస్వర్గ క్రియాకేళినా
    పూర్వం గాధిసుతేనసామి ఘటితా ముక్తాను మందాకినీ
    యత్ ప్రాసాదవల్లి స్వచ్చ దుకులాందోళైర ఖేలద్ద్దివి:

    దీనికి శృంగార నైషధం లో శ్రీనాధుని అనువాదం చూడండి:

    వేదాభ్యాస విశేష పూత రసనా విర్భూత భూరిస్తవా
    సాది బ్రహ్మముఖౌఘవిఘ్నిత నవస్వర్గ క్రియాకేళిచే
    ఆదిన్ గాధితనూజుచే సగము సేయంబడ్డ మిన్నేరు య
    త్ప్ప్రాసాద స్వచ్చ దుకూల కైతవమనన్ జాలంగనొప్పున్ బురిన్

    (చదివి చాలా కాలమయింది. ఎక్కడైనా తప్పులు దొర్లి ఉండవచ్చు).

    ముక్కస్యముక్కానువాదంలా ఉన్నా బావున్నట్టు లేదూ!


Leave a response

Your response:

Categories