కిరాతార్జునీయమ్ నోట్సు

రెండు వారాల క్రితం బెంగళూరు పుస్తక ప్రదర్శనలో ‘కిరాతార్జునీయమ్’ మూడు సర్గల వ్యాఖ్యానం ఉన్న పుస్తకం ఒకటి కొన్నాను. కిరాతార్జునీయమ్ ఇదివరకు నేను చదవలేదు. ఏదైనా కొత్త కావ్యం చదవాలంటే నాకిష్టమైన పద్ధతి ఒకటి ఉంది. ఒక్కో శ్లోకాన్నీ ఏదైనా నోట్ బుక్ లోకి కాపీ చేసుకోడం. ఆ శ్లోకానికి అర్థాలూ, వివరణా చదివాకా నాకు అర్థమైన కొత్త సంగతులూ, నచ్చిన విషయాలూ అన్నీ ఆ శ్లోకం కింద రాసుకోడం. కొన్నేళ్ళ క్రితం మాఘంలో పది సర్గలు ఇలాగే చదువుకుంటూ నోట్సు రాసుకున్నాను. రోజుకి పది శ్లోకాలు మాత్రమే చదివేవాణ్ణి. ఇప్పుడా నోట్సు ఎక్కడుందో తెలీదు. ఓసారి మా ఊరు వెళ్ళినప్పుడు ఇల్లంతా గాలించాలి. ఇప్పుడు కిరాతార్జునీయానికి మళ్ళీ నోట్ బుక్ ఎందుకు, బ్లాగుందిగా అనిపించింది. అందుకే ఓ కొత్త పేజీ ఓపెన్ చేసి, జర్నల్ లాగా రోజుకో శ్లోకం చదువుకుని నోట్స్ రాసుకుందామని మొదలుపెడుతున్నా.

సంస్కృత భాషలో నేనింకా పామరుణ్ణే కాబట్టి నేను రాసుకునే దాన్లో ఏమైనా తప్పులుండొచ్చు. పెద్దలెవరైనా సరి చేస్తే అంతకన్నా ఆనందం నాకు మరొకటి ఉండదు. మరొక సంగతి. వీలైనంతవరకూ శ్లోకమూ భావమూ తప్పకుండా రాస్తాను; విశేషాలు మాత్రం అన్నిటికీ రాయడం కుదరకపోవచ్చు. కొన్ని సెన్సారు చెయ్యాల్సిన శ్లోకాలుంటే భావం కూడా రాయను. క్షమించమని ప్రార్థన.

ఇదే పేజీలో ఒక్కో శ్లోకం పోస్టు చేద్దామంటే కుదరదనుకుంటా. అందుకే కొత్త బ్లాగ్ ఒకటి తెరిచాను.

http://kiratarjuniyam.wordpress.com/

Responses

  1. అవిఘ్నమస్తు! :-)

  2. మీ నోట్సు బావుంది. నేను ఇంకా సావకాశంగా చదవడం లేదు. ఇటువంటివి కాస్త మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు చదవాలి అన్న చాదస్తం ఉండటం చేత.

    మీరు చదివేప్పుడు ఓ శ్లోకం, దాని తాత్పర్యం ఇలా ఉంటుంది. – ఆ రాజు భవనం ముందు వచ్చిన అతిథుల తాలూకు మదగజాల స్రావంతో ఆ ప్రాంతం చిత్తడిగా మారింది. (ఎవ్వాని వాకిట నిభమదపంకంబు.. ఈ అర్థంలో). ఈ శ్లోకం కిరాతార్జునీయంలోనే ఉండాలన్నట్టు గుర్తు. ఆ శ్లోకం కనబడితే చెప్పండి.

    (అన్నట్టు దుర్యోధనుడి పాలన అద్భుతంగా ఉన్నట్టు ధర్మరాజుకు చెప్పగా, దానికి ఆయన చెప్పిన తిరుగు సమాధానం మరింత అద్భుతంగా ఉంటుందనీ, ఆ సమాధానంలో అర్థం గొప్పగా ఉంటం చేత, భారవికి అర్థ గౌరవమన్న ప్రశంసకు అర్థం చేకూరిందని ఒక వాదన. ఈ విషయంలో మీ భావనలు వ్రాయగలరు)

  3. శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలు.

    రవి గారూ, మీరన్న శ్లోకం లింకు ఇదిగో –
    http://kiratarjuniyam.wordpress.com/2009/12/13/i-16/

    కిరాతుడు ధర్మరాజుకి దుర్యోధనుడి పాలన అద్భుతంగా ఉందని చెప్పే ఘట్టం పూర్తయింది. ఇప్పుడు ద్రౌపది డైలాగులు అవుతున్నాయి. తర్వాత భీముడి మాటలు వస్తాయి. ధర్మరాజు మాటలు ఆ తర్వాత వస్తాయేమో. భారవి ’అర్థ గౌరవం’ గురించి ఇంతవరకూ నాకు పెద్ద గొప్ప అభిప్రాయం కలగలేదు. నిన్న రాసిన శ్లోకంలోనే ఆ మాట అనేశాను కూడా. మరి ధర్మరాజు మాటలు చదివాకా ఏమన్నా అభిప్రాయం మారుతుందేమో చూడాలి.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.